సబ్ ఫీచర్

‘దండన’ పేరిట శిక్షలు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులు చేసే చిన్న తప్పులకు సైతం పెద్దశిక్షలు వేయడం తరచుగా మనం గమనిస్తున్నాం. విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, హోం వర్క్ చేయలేదని, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఫీజులు సకాలంలో చెల్లించలేదని, టై బెల్టు, షూ, యూనిఫాం లాంటివి ధరించలేదనే చిన్న చిన్న విషయాలకు కూడా ఉపాధ్యాయులు అనవసరంగా ఆవేశపడి విద్యార్థులను అమానవీయంగా శిక్షిస్తున్నారు. ఎండలో నిలబెట్టడం, బెత్తంతో కొట్టడం, బట్టలు ఊడదీసి నిలబెట్టడం, గోడ కుర్చీ వేయించడం, మోకాళ్ళపై కూర్చోబెట్టడం లాంటి ‘శిక్ష’లు విధిస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు విద్యార్థులకు ‘దండన’ పేరిట శిక్షలు వేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పిల్లలను దండించాల్సిన సందర్భాలలో ఉపాధ్యాయులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులు చేసిన తప్పులకు కారణాలను వెతకాలి. వాటికి పరిష్కార మార్గాలను అనే్వషించాలి. విద్యార్థి తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి. అప్పటికీ విద్యార్థులు తమ తప్పులను సరిదిద్దుకోలేకపోతే ఉపాధ్యాయులు ముందుగా వారిని హెచ్చరించాలి. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులను, సంరక్షకులను సంప్రదించి తగు జాగ్రత్తలను తీసుకోమని చెప్పాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రధానోపాధ్యాయులకో, విద్యాశాఖ అధికారులకో ఫిర్యాదుచేయాలి కానీ విద్యార్థులను కఠిన దండనలకు, శిక్షలకు గురిచేయకూడదు.
ఉపాధ్యాయులు తొందరపడి విద్యార్థులను శారీరకంగా హింసించడం దుర్మార్గమైనది, చట్టవిరుద్ధమైనది. ఉపాధ్యాయులు తాము విద్యార్థులను అదుపులో ఉంచడం కోసమే దండించామని చెబుతుంటారు. అందులో నిజమెంత? క్రమశిక్షణలో ఏకైక ఉద్దేశం ఏమిటంటే మనకు కావలసిన ప్రవర్తనను విద్యార్థులకు నేర్పడం. వారు తమ అనుచిత ప్రవర్తనను గుర్తించుకొనేలా, సరైన మార్గంలో పయనించేలా చేయాలి. ఇది దండనల ద్వారా సాధ్యమవుతుందా? అన్న విషయాన్ని టీచర్లు, పాఠశాల నిర్వాహకులు బేరీజు వేసుకోవాలి.
ఉపాధ్యాయులు ఏమీ చేయకూడదని ఎవరూ చెప్పరు. అయితే, పిల్లల్ని కొట్టడం, గుంజీళ్లు తీయించడం, గోడ కుర్చీ వేయించడం, చెంప దెబ్బలు వేయించడం, పరిగెత్తించడం, ఎండలో నిలబెట్టడం, జుట్టుపట్టి లాగడం, కర్రతో లేదా ఇతర వస్తువులతో కొట్టడం వంటి పనులన్నీ శారీరక దండన కిందకు వస్తాయి. విద్యార్థులను శారీరక దండనలకు గురిచేయకూడదు. అదే విధంగా పిల్లలను మానసికంగా హింసించడం అంటే వారిని అందరి ఎదుట తిట్టడం, కించపరచడం, ఆటలలో, పాటలలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వకపోవడం, తరగతి గది నుంచి ఇంటికి పంపించి వేయడం, తల్లిదండ్రులను రప్పించి వారి ముందు తిట్టడం, ఇతరులతో పోల్చడం, అవమానించడం, తరగతి గదిలోకి అనుమతించకపోవడం, చీదరించుకోవటం, పేర్లుపెట్టడం, తల్లిదండ్రులు చేసే పనిని, కులాన్ని అపహాస్యం చేయడం, ఆరోగ్య స్థితిని, శారీరక స్థితిని చూసి వెక్కిరించడం, గేటుముందు నిలబెట్టడం, అంగ వైకల్యాన్ని వెక్కిరించడం ఇలాంటివన్నీ మానసిక దండన కిందకు వస్తాయి. ఇలాంటి పనులకు ఉపాధ్యాయులు ఎన్నడూ చేయకూడదు. కుల, మత, భాష, రంగు, జాతి, లింగ, ప్రాంతం మొదలైన వాటిలో తేడా చూపడాన్ని వివక్షగా చెప్పవచ్చు.
ప్రస్తుత పరిస్థితులలో పాఠశాలల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు సైతం గురవుతున్నారు. బాలురపైనా పలురకాల వేధింపులు చూస్తున్నాము. విద్యార్థులను ఎటువంటి వివక్షకు, లైంగిక వేధింపులకు గురిచేయకూడదు. ఉపాధ్యాయులు విద్యార్థులను దండనలకు గురిచేయడంలో కారణాలు విశే్లషిస్తే పని ఒత్తిడి, పాఠశాల యాజమాన్యం లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని చేరుకోవడంలో ఆందోళన, విద్యార్థులపై తల్లిదండ్రులు ఆకాంక్షలు పెరిగిపోవడం తదనుగుణంగా విద్యార్థి స్థాయిని గమనించకుండా విద్యార్థిని ఒత్తిడికి గురిచేయడం నేడు సర్వసాధారణమైంది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలు నేడు అనుసరిస్తున్న వ్యాపార ధోరణులు, ఉపాధ్యాయులలో తగిన శిక్షణ లేకపోవడం, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం, టీచర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడం, సరైన అధ్యయనం చేయకుండా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయలేక దండించడం, ఉపాధ్యాయులలో ఉన్న అసహనం ఇవన్నీ కారణమవుతున్నాయి.
చట్టాలు ఏం చెబుతున్నాయి...?
ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం-2009 సెక్షన్ 17 ప్రకారం శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నేరం. ఏ బాలుడు, బాలిక కూడా శారీరక శిక్షలకు, మానసిక వేధింపులకు గురికాకూడదు. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉద్యోగ నియమాల ప్రకారం ఉపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలకు గురవుతారు. దండిస్తేనే చదువు వస్తుందని నమ్మడం, తమకు అలాగే చదువు వచ్చింది కాబట్టి తాము బోధించే వారికి కూడా అలాగే బోధించడం సరైనదని భావించడం అనేది ఒక అపోహ. భయపెట్టినప్పుడు మాత్రమే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని భావించడం లాంటి విశ్వాసాలను ఉపాధ్యాయులు విడనాడాలి.
పిల్లలు బాగా చదవాలని కోరికతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని ఒత్తిడికి గురిచేయడం వల్ల ప్రతికూల స్వభావం ఏర్పడుతుందే తప్ప ఆశించిన ఫలితాలు నెరవేరవు. దండన అనేది మనం ఏమి ఆశించి విధిస్తున్నాం? దండనకు, అభ్యసనానికి మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలి. పిల్లల్లో అభ్యసనం అనేది వారికి కల్పించిన బోధనాభ్యసన ప్రక్రియలు, కల్పించిన అవకాశాలు, నైపుణ్యాలు, ఆసక్తులు, వైఖరులు మొదలైన వాటినిబట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లలను నియంత్రించడం ద్వారా, దండనల ద్వారా అభ్యసనం సాధ్యం కాదు. భయపూరిత వాతావరణంలో అభ్యసనం జరగదు. పిల్లల్లో ఆశించిన అభ్యసనం, సామర్థ్యాలు రాకపోతే అందుకు కారణాలను అనే్వషించి, పరిష్కార మార్గాలను అనే్వషించి అమలు చేయాలి. అందుకు విరుద్ధంగా విద్యార్థుల స్వేచ్ఛను హరించడం, వారిని దండనలకు గురిచేయడం ఎంతమాత్రం తగదు. పిల్లల స్వభావానికి వ్యతిరేకమైన విధానాలను అవలంబించకుండా ఇంట్లోనూ, పాఠశాలలోను పిల్లల స్వభావాన్ని అర్థం చేసుకొని బాల్యాన్ని ఒక నిర్మాణాత్మక దశగా గుర్తించాలి. భయ రహిత వాతావరణాన్ని కల్పించాలి. అటువంటి సందర్భాలలో మాత్రమే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. ఎలాంటి దండనలు,వివక్షలు లేకుండా ఉండటం, విద్యార్థుల భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశాలు కల్పించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, ఒత్తిడి లేకుండా లక్ష్యాలను సాధించడం వంటివి భయరహిత వాతావరణంలోనే సాధ్యమవుతుంది. అటువంటి భయరహిత వాతావరణానికి, విద్యార్థుల స్వేచ్ఛా వ్యక్తీకరణకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు పాటుపడాలి.

-వాసిలి సురేష్ 94946 15360