సబ్ ఫీచర్

బోధనే సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూర్ ‘వందేమాతరం స్కూల్’లోని పిల్లలను పరిశీలిస్తూ, వారి చదువుల పద్ధతిని చూస్తూ నేను వారితో తిరిగేవాణ్ణి. ఇచ్చిన లెక్కల సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారో చూసేవాణ్ణి. లెక్కల స్టెప్స్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే- వారి నుంచి జవాబు వచ్చేది కాదు.
లెక్క చేస్తున్నపుడు ఫలానా విధంగా సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పే అలవాటు, శాస్ర్తియమైన కోణం ఆ పిల్లల్లో కనిపించలేదు. దానికి కారణం వారి మెదడులో ఆ సమస్యకు పరిష్కారం లేదు. అంటే ఆ సమస్య పరిష్కారానికి ముందుగా ప్లాన్ లేదు. అందుకే ఆ సమస్యకు పరిష్కారం ఈ విధంగా చేస్తున్నామని చెప్పలేకపోతున్నారు. ఎప్పుడైనా ఒక సమస్యను పూరించే ముందు విద్యార్థి తన మైండ్‌లో ఓ పథకం వేసుకుంటాడు. అపుడు మాత్రమే- ఎందుకు ఆ స్టెప్ వేస్తున్నాడో చెబుతాడు.
ఆలోచనకు, కాగితంపైన చేస్తున్నదానికి పొంతన ఉంటే ఆ విద్యార్థికి సబ్జెక్టు వచ్చినట్లు. ఒక లెక్క ఇచ్చి, ఆ పిల్లల మధ్య ఎందుకు తిరుగుతున్నానంటే- వారు రాసేదానికి కారణం చెప్పాలి. బహుశా ఆ విద్యార్థికి సమాధానం రావచ్చును. మొదటి స్టెప్‌కు, రెండో స్టెప్‌కు సంబంధం చెప్పాలి. ప్రాసెస్ తెలవకుండా పిల్లలు సమాధానం తీసుకువస్తే అలాంటి దశ- ప్రాథమిక పునాది, జ్ఞానం లేకుండా లెక్కలు చేయటం అవుతుంది. టీచర్ బోర్డుమీద లెక్క చేసిన పద్ధతిని అనుకరించవచ్చును. అది ఆ లెక్క వరకు పనికివస్తుంది కానీ ఆ విద్యార్థికి లెర్నింగ్ ప్రాసెస్ మాత్రం కనపడదు. ఇక్కడ సమస్య ఏమిటంటే- టీచర్ ఫలితం మాత్రం చూడడు. విద్యార్థి ఏ పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించాడో చూస్తాడు.
ఒక్కొక్కసారి విద్యార్థి భయంతో కూడా టీచర్‌కు చెప్పకపోవచ్చును. అందుకు కావాల్సిన వాతావరణం తరగతి గది ఏర్పరచాలి. విద్యార్థి తన ఆలోచనను ధైర్యంగా చెప్పాలి. మొదటి స్టెప్‌కు, రెండో స్టెప్‌కు సంబంధాన్ని చెప్పాలి. ఆ సమస్యను పూరించటానికి ఏ సమాధానం కావాలో దాన్ని కూడా చూడాలి. అలాంటి విశే్లషణా శక్తి వుంటే ఏ లెక్క అయినా విద్యార్థి సులభంగా చేయగలుగుతాడు. అందుకే పిల్లలకు టీచర్ లెక్క ఇచ్చి సమాధానంతో సంతృప్తిపడకుండా, వాటి పరిష్కారాలను ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. పిల్లల ఆలోచనలను సైతం తెలుసుకోవాలి.
* లెక్క చేయడానికి ఏ సమాచారం కావాలో తెలియాలి.
* ఆ సమాచారం లేకుండా లెక్కను ఎలా సాధించారు? దాన్ని కనుక్కునేందుకు ఏ స్టెప్స్ ఎలా వేశారు?
* విద్యార్థి ఆలోచనా విధానానికి ఓ క్రమం చెప్పాలి.
ఇలాంటి విషయాలపై విద్యార్థిని పరిశీలించాలి. విద్యార్థి ఆలోచనలు బైటకు చెప్పే దశకు తీసుకురావాలి. లెక్క చేసే ప్రాసెస్ వారికి అర్థం కావాలి.
* విద్యార్థి భయం లేకుండా ఉండాలి.
* లెక్కను విశే్లషణ చేయటం
* ప్రతి స్టెప్‌కు సంబంధాలను అవగాహనతో అర్థం చేసుకోవాలి.
వీటిని చెప్పగలిగినప్పుడే విద్యార్థికి అవగాహన ఉన్నట్లుగా ఉపాధ్యాయుడు గుర్తించగలుగుతాడు. అపుడు మాత్రమే విద్యార్థులకు లెర్నింగ్ (సాధన) జరిగినట్లు అవుతుంది. ఇది తరగతి గదిలో జరగాలి. మారుమూల గ్రామాల్లో చదివే విద్యార్థులు తాము చేసే లెక్కలకు పరిష్కారం చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసం కలిగించాలి.
21వ శతాబ్దంలో ప్రపంచం గతినే మార్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రతిక్షణం కొత్త ఆవిష్కరణలను మనం చూస్తున్నాం. అన్ని రంగాలను కూడా ఇవి ప్రభావితం చేస్తున్నాయి. టెక్నలజీ వలన సంపద ఎంత ఉత్పత్తి అవుతున్నదో జ్ఞానం కూడా అంతే ఉత్పత్తి అవుతున్నది. సంపద ఉత్పత్తి పరిణామాలను దీర్ఘంగా ఆలోచించకపోవడం వలన అంతరాలు పెరిగాయి. అవి ఎన్నో సంక్షోభాలకు కారణభూతమవుతున్నాయి. ఏ క్షణాన ఏ దేశంలో ఏ ఘటన జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. దానికన్నా ఎక్కువ ప్రమాదకరమైనది విద్యారంగంలో వచ్చే మార్పులు. గ్రామీణ విద్యకు, పట్టణ విద్యకు ఎంత తేడా వుందో అభివృద్ధి చెందిన దేశాల విద్యకు వెనుకబడ్డ దేశాల విద్యకు అంతటి తారతమ్యం వుంది. ఒకవైపున ప్రపంచీకరణ, రెండో వైపున అంతరాలు పెరగటం నిస్పృహ నిరాశలకు దారితీయవచ్చును. విద్యారంగంలో అంతరాలను పూరించడానికి పాలనా రంగం తక్షణ చర్యలు తీసుకోకపోతే అది దేనికి దారితీయవచ్చునో ఊహించలేం.
పశ్చిమంలో వున్న చిన్న దేశాల్లో విద్యా ప్రమాణాలను చూశాను. అదేమాదిరిగా మన పల్లెల్లో వున్న విద్యా ప్రమాణాలు కూడా చూశాను. ఈ అంతరాలకు కారణమేమిటన్నది నా మెదడును తొలుస్తూనే వున్నది. విద్యార్థి జ్ఞాన సముపార్జనలో ఆలోచనే ప్రధానమైంది. ఆలోచనే భావనకు మూలం. ఆలోచనే అభిప్రాయానికి ప్రధానం. ఆలోచనే పథకాలకు కూడా ప్రధానం. ఈ ఆలోచనను బహిర్గతం చేసే మార్గాలను మనం కనుక్కుంటేనే విద్యార్థి మెదడులో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు మనం కనుక్కునే మార్గాలను ఆలోచిస్తేనే విద్యారంగం సరైన మార్గంలో పయనించే అవకాశం వుంటుంది. ఉపాధ్యాయుని ప్రతిమాట, విద్యార్థి ఆలోచనల్లో ఎన్నో తరంగాలను సృష్టిస్తూ వుంటుంది. కానీ, ఉపాధ్యాయుడు పిల్లల ఆలోచనలకు బైట వున్న మనిషి. పిల్లల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకపోతే కష్టం. బోధనకు, సాధనకు మధ్య అగాధం ఏర్పడుతుంది.
పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నపుడు- కోచ్‌తో వారికి సఖ్యత ఉన్నందునే పిల్లలు ఆటల్లో ఎంతగానో రాణిస్తున్నారు. తరగతి గదిలో అలాంటి సఖ్యత అనుకున్నంతగా తేవటంలో వైఫల్యం కనిపిస్తుంది. ఈనాడు ఉపాధ్యయుడు విద్యార్థులతో కలిసి ఈదాలి. ఇద్దరి మధ్యన తగిన సామరస్యం, భయం లేని పరిస్థితి వుంటేనే అనుమానాస్పదమైన వాతవారణాన్ని తొలగించి జ్ఞానతృష్ణను పెంచగలుగుతాం. విద్యార్థి ఉపాధ్యాయునికి తన అనుమానాలను, తనలో జరిగే పరిణామాలను చెప్పే పరిస్థితి కల్పించాలి. ఇప్పటివరకు ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను విద్యార్థి వింటున్నాడు. ఆ విద్యార్థి నోరు తెరిపిస్తేనే అందులోంచి ఆలోచనలు బైటకు వస్తాయి.
సాధన (లెర్నింగ్) ఎందుకంటే అది ఆలోచనల పుట్టుక. సాధనతో ఆలోచన, ఆలోచనతో మార్పు రావాలి. అంటే తరగతి గదిలో ఏ భావనలు ఎలా ఏర్పడ్డాయి? ఆ భావనలు తాము ముందుకు పోవడానికి ఏ రకంగా ఉపయోగపడతాయి? అంటూ ఒక సమస్యను పరిష్కరించేటపుడు విద్యార్థి ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలను కాగితంమీద పెడుతున్నాడు. కాగితంమీద పెట్టిన ఆలోచనను బయటకు వ్యక్తం చేయడానికి సిద్ధపడటం లేదు. అనగా తనలో ఏర్పడినటువంటి పరిణామాన్ని అతనిలో వుండే ఏదో ఒక శక్తి నిరోధిస్తున్నది. ఆ విద్యార్థి వేసే ప్రతి అడుగుకు ఉన్న కారణాన్ని చెప్పే ధైర్యాన్ని ముందుగా కలిగించాలి. అంటే విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవలసి వుంది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రశ్నలు ఉత్పన్నం కావటానికి కారణమవుతుంది. ఆ ప్రశే్న టీచింగ్‌కు ఇంధనం కావాలి. ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకంలో చదువుకొచ్చిన విషయాన్ని చెప్పటం టీచింగ్ కాదు. ఆ విద్యార్థి వౌనం టీచర్ల బోధనను వన్ వే ట్రాఫిక్‌గా మార్చుతుంది. ఈ రెండింటి సమన్వయమే విద్యార్థి ఆలోచనను బహిర్గతం చేస్తుంది. విద్యార్థి ఆలోచనతో తగిన బోధన జరుగుతుంది. కాబట్టి పథక రచన చేయటం మొదలవుతుంది. అపుడే విద్యార్థి జ్ఞాన సముపార్జనలోకి దిగుతాడు. దీంతో తరగతి గది కళకళలాడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంపద పంపిణీ ఎంత ప్రధానమో విద్యార్జనలో విద్యార్థి సాధన కూడా అంతే ముఖ్యం.

-చుక్కా రామయ్య