సబ్ ఫీచర్

విలువల్ని పెంచేదే అసలైన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీలోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే నిజమైన విద్య. మానవత్వమనే పుస్తకాన్ని
మించిన పుస్తకం ఏముంటుంది?’
- మహాత్మా గాంధీ
మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, మూర్తిమత్వాన్ని పెంపొందించేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, విలువలను పెంచేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును సంపూర్ణంగా వికసించేటట్లు చేసేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది విద్య అని తరచుగా మనం చెప్పు కుంట న్నాం. విద్యాసంస్థల్లో ఏడాది పొడవునా బోధించిన విద్య ద్వారా ఎంతో కొంత విద్యా లక్ష్యాలు సాధిం చగలమని ఆశిస్తుంటే, పరీక్షల సమయంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి పిల్లల్ని సంసిద్ధులుగా చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి నిర్మాణం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మరి అలాంటపుడు వేలకోట్ల రూపాయలతో నడుస్తున్న పాఠశాలలు ఏం సాధి స్తున్నట్లు? నేటి సమాజంలో టీవీ, సినిమాల వల్లనైతేనేమి, యాంత్రిక జీవితం వల్లనైతేనేమి అనేక సామాజిక రుగ్మలతో సమాజం నిండి ఉంది. విద్యార్థులు క్షణి కావేశానికి గురై తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాము. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువత అనర్థాలకు బలికావలసిందేనా? విద్యా విధా నంలో మార్పులు, ప్రయోగాలు చేసి విద్యార్థులను మనం బలి తీసుకుంటున్నామా? ఆంగ్లమాధ్యమం, కార్పొరేట్ చదువుల వల్ల నేటి విద్యార్థి నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురౌతున్నాడు. మానసిక బలహీనత, న్యూనతాభావం కూడా మరికొన్ని కారణాలు. స్థాయికి మించి తల్లితండ్రుల ఆకాంక్షలు, అవి తీర్చలేక పిల్లల వ్యధలు దాదాపు ప్రతి ఇంట్లో మనం చూస్తున్నదే.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో పిల్లలు తప్పు చేయడానికి అవకాశం తక్కువ. ఒక వేళ తప్పు జరిగినా పెద్దలు సరిదిద్దే వాళ్లు. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు బలంగా ఉన్న కాలంలో సామాజిక రుగ్మతలు తక్కువగా ఉండేవి. కానీ, నేటి యాంత్రిక జీవనంలో ప్రక్కవారితో కూడా కనీస సంబంధాలు లేని స్థితిలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలను హాస్టళ్లలో ఉంచడం, మార్కుల టార్గెట్ పెట్టడం వంటి పరిస్థితులు విద్యార్థుల కారణాలుగా భావించాలి. పిల్లలు హాస్టల్‌లో, వృద్ధులు ఆశ్రమాల్లో ఉంటే- ఇక అనుబంధాల గురించి చెప్పేదెవరు?
యాంత్రిక జీవనంతో పిల్లలు సహజత్వాన్ని కోల్పోయి మానసిక బలహీనులవుతారు. సోషల్ మీడియా బాగా పెరిగి పోయి పక్క వారితో సైతం ఆత్మీయంగా మాట్లాడలేక పోతున్నారు. సినిమాలలో,సోషల్ మీడి యాలో వచ్చే హింస, అశ్లీలత పిల్లల మనసులపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. టీవీలలో వచ్చే అర్థం పర్థం లేని సీరియల్స్, బూతు కార్యక్రమాలు పిల్లల లేత మనసుల ఎదుగుదలపై ఎంతో అనర్థాన్ని కలిగిస్తున్నాయి . పెరిగిపోతున్న ఫ్యాషన్ వికృత పోకడల వల్ల చినిగిన డ్రెస్సులు, పొట్టి నిక్కర్లు, బిగుతైన బట్టల వల్ల మనిషి వ్యక్తిత్వం కొరవడుతుంది. మనకు అవసరం ఉన్నా, లేకపొయినా ఆధునికత పేరుతో అనవసర హంగామా చేయడం, చింపిరి జుట్టు, సగం కొట్టించుకున్న గుండు.. ఇవే ఈనాటి యువతరం పాటించే సూత్రాలు. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక పోవడం, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, సగం సగం తెలిసిన వారితో ముచ్చటించడం... ఇలాంటి పరిస్థితిలో ఉన్నత విద్యలు చదివి పట్టాలు ఎన్ని పొందినా, వారిలో విలువలు నశించి వికృతంగా ప్రవర్తించడం. సహనం కోల్పోయ రకరకాల అఘాయిత్యాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
సమాజానికి, తల్లితండ్రులకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. ఈ మధ్య కాలంలో విద్య విలువని మనం భూమి విలువ తోనో, స్టాక్ ఎక్స్ఛేంజ్ షేర్ల తో వ్యాపారం చేసే విధంగానో బేరీజు వేస్తున్నాం. మంచి ఉద్యోగం తెచ్చిపెట్టే విద్యనే మనం ప్రోత్సహిస్తున్నాము. విలువలు అభివృద్ధి చెందే విధానం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇరుకు గదుల్లో, ఐదారు అంతస్తుల బిల్దింగులలో విద్యార్థుల పుస్తకాలతో కుస్తీలు పడుతుంటే, ఆటలంటే కంప్యూటర్ ముందు కూర్చొని కాలక్షేపం చేయడం అనుకుంటే విద్య విలువ తెలుస్తుందని ఆశించలేం.
మనిషిలోని నైపుణ్యాన్ని వెలికి తీయడమే విద్య పని. చరిత్ర ఆరంభం నుంచి విద్య వికసిస్తూ, ఎన్నో విభాగాలు గా విస్తరిస్తోంది. సమాజం అభివృద్ధి ప్రజల విద్యా వివేకాలపై ఆధారపడి ఉంటుంది. విద్య వెలుగునిస్తుంది. విద్య వివేకాన్నిస్తుంది. దీనిని భారతీయ సమాజం ఆదినుండి గుర్తించినది, తొలినాళ్ళనుండి విద్యకు చక్కని ప్రాముఖ్యత ఉన్నది. పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొంది, సమాజానికి తమ వంతు సహాయం చేయడం. విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివాళ్లతో సమానమని భావించేవాళళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు. విద్య అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, ఫ్రాణ స్నేహితునిలా ఆదరిస్తుంది. కీర్తిని సంపాదిస్తుంది, కష్టాలు తొలగి స్తుంది, స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నాగరి కునిగా మారుస్తుంది. కనుకనే విద్యను కల్పవృక్షంగా మనం భావిస్తాం.
బ్రిటీషు వారి కాలంలో భారత దేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ముఖ్యముగా రెండు మార్పులు మనం చెప్పుకోవాలి ఒకటి అప్ప టివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యావ్యవస్థ మతప్రధానమైనదిగానే ఉండేది. అయితే హిందూ మతం, బౌద్ధ మతం లేదా ముస్లిం మతం. కానీ బ్రిటీషు వారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, వేదాలు చదవడం మానేసి ప్రజలు సైన్సు మొదలగున్నవి చదవడం మొదలుపెట్టినారు. ఇక రెండవ ముఖ్యమైన మార్పు ఇంగ్లీషు భాషలో విద్యా బోధన, అప్పటివరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యంగా సంస్కృతంలో లేదా అరబిక్ లేదా ఉర్దూలలో జరిగే విద్యా బోధన ఇంగ్లీషుభాషలోనికి మారింది. పాలకుల ఆర్థిక సహాయం కేవలం ఇంగ్లీషు బోధించే పాఠశాలలకే లభించేది. దాంతో ఇంగ్లీషుకు ప్రాముఖ్యత పెరిగింది. బ్రిటీషు వారు విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలకు ప్రయ త్నించారు. కానీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు. దీనికి కారణం పరిశీలిస్తే మొదటిది వారికి తర్జుమా చేయడానికి , సంధానకర్తలుగా ఉండడానికి, వారికి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే చదువుకునే అవకాశం ఇవ్వగా, రెండవది వారు పాటించిన జల్లెడ పద్ధతి, దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెబితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారని భావించడం జరిగినది. కానీ అది ఆచరణలో వైఫల్యంగా మిగిలింది. ఈ పరిస్థితుల నుండి మన విధ్యా విదానాన్ని మనమే తయారు చేసుకునే దశకు వచ్చినా, వారు వదిలి వెళ్ళిన వాసనలను మనం కడిగి పారేయ్యలేక పోతున్నాము. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా మనం ఇంకా ఆ జాఢ్యం నుంచి బయటకు రాలేక పోతున్నాము.
పిల్లలకు చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాస విద్యను బోధించాలి. తద్వారా విద్యార్థులు ఊహాలోకంలో కాకుండా నిజ జీవితంలో జీవిస్తారు. భ్రమలకు లోను కారు. విపరీత పరిణామాలు చోటుచేసుకోవు. ప్రతిదానికి ఆలోచించి పరిష్కరించే నేర్పు, సమయస్ఫూర్తి, సంద ర్భోచిత నిర్ణయాలు అలవడతాయి. శ్రమను ఆయుధంగా చేసుకోవాలని, నిరంతరసాధన, పట్టుదల, కార్యదీక్షతో ముందుకెళ్లాలని చెపుతూనే ఈ స్పృహ లేకపోతే అపజయం పాలవుతామని తెలియజేయాల్సి ఉంటుంది. పిల్లల్లో బలహీనతలను తగ్గించకపోతే పెద్దవారైన తర్వాత జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక బలహీనులయ్యే ప్రమాదముంది. అంచెలంచెలుగా చేయవలసిన కృషి, అనుభవాలు, జ్ఞాపకాలు, మహానుభావుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో జోడించడం ద్వారా వి ద్యార్థులకు మరింత ప్రయోజనముంటుంది. కోపాన్ని జయించడం, వివిధ మానసిక సంఘర్షణలు, భావావేశాల నుండి బయటపడడాన్ని నేర్పాలి. పరస్పర సహకారం, ప్రేమ, ఆత్మీయత, త్యాగం, జాలి, కరుణ మొదలగు మానవతా విలువలను పెంచే విధంగా కృషి చేయాలి.
భావోద్వేగాలకు బదులు మానవత్వంతో ఆలోచించే ప్రశాంత పరిస్థితులు పాఠశాలల్లోను, సమాజంలోను నెలకొనాలి. తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే , ఇరుగు పొరుగువారితో కష్టసుఖాలలో పాలుపంచుకునే మహోన్నత సంస్కారం చిన్ననాటి నుండే ప్రతివ్యక్తిలో అలవడాలి. ఇందుకు సామాజిక చైతన్య కార్యక్రమాలు, మానసిక విశే్లషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా విద్యార్థులకనుగుణంగా వ్యక్తిత్వ వికాస విద్య ప్రణాళికను రూపకల్పన చేయించి ప్రతి పాఠశాలలో తప్పకుండా అమలు పరచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దారి తప్పుతున్న యువతను సక్రమ మార్గంలో పెట్టె భాద్యత కేవలం ప్రభుత్వానిదే కాదు. ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు సమాజం, కుటుంబాలు తమ వంతు బాధ్య తతో యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించాలి. ఇవి సాధ్యమైనపుడే విద్యకు సార్థకత ఉంటుంది.

-కాళంరాజు వేణుగోపాల్ 81062 04412