సబ్ ఫీచర్

‘రైతుబంధు’ కొందరికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభానికి అనేక చారిత్రక కారణాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు 30కి పైగా హామీలిచ్చి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో రైతు రుణమాఫీ, రైతుబంధు లాంటివి ప్రధానమైనవి. రైతుబంధు పథకం ఆచరణలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ పథకం ఉద్దేశం రైతులకు ఉచితంగా సాలీనా ఎకరానికి 8వేల రూపాయల చొప్పున (ప్రస్తుతం 10వేలు) వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. అయితే, ఈ పథకం క్షేత్రస్థాయిలో రైతులకు చేయూతనివ్వకుండా ఆచరణలో భూస్వామ్య వర్గానికే లబ్ధి చేకూర్చుతోంది. వాస్తవ సాగుదారులైన లక్షలాది కౌలుదారులకు ఎలాంటి లబ్ధి చేకూర్చటం లేదన్న విషయాన్ని రైతుల ఆత్మహత్యలే రుజువుచేస్తున్నాయి.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతుబంధు పథకాలను అమలు జరిపాక కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయంటే- ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఈ పరిశీలనకు ముందు రాష్ట్రంలో సాగుకు అనువుగాఉన్న భూమి ఎంత? వాస్తవంగా సాగవుతున్నది ఎంత? సాగుకు అనువుగా ఉన్న భూమి రైతుల మధ్య ఏ విధంగా విభజించబడి ఉంది? అన్న విషయాలను విశే్లషించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రచురించే గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర భూవిస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు. ఇది రమారమి 2కోట్ల 77 లక్షల ఎకరాలకు సమానం. ఇందులో ప్రభుత్వ అటవీ భూమి, చెరువులు, కుంటలు, కాల్వలు, రైల్వేలు, రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆట స్థలాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఆసుపత్రులు మొదలగు వాటి కింద ఉన్న మొత్తం భూమి 84 లక్షల ఎకరాలు. ఇవిపోగా నగరాలు, గ్రామాలు, రియల్ ఎస్టేట్ విస్తరించి ఉన్న భూమి 24 లక్షల ఎకరాలు. వివాదాలున్న భూములు 17 లక్షల 80వేల ఎకరాలు. రైతులవద్ద ఉన్న వ్యవసాయేతర భూములు 11 లక్షల 95వేల ఎకరాలు. ఎలాంటి వివాదాలులేని సాగుకు అనువైన భూమి కోటి 43 లక్షల ఎకరాలు. ఈ భూమిని సాగుచేస్తున్న రైతుల సంఖ్య 58 లక్షల 33వేలు. కోటి 43 లక్షల ఎకరాల భూమిపై 58 లక్షల 33వేల మంది రైతుల భూయాజమాన్యం ఏవిధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.
సాగుకు అనువుగా ఉన్న భూమి కోటి 43 లక్షల ఎకరాలు. సాగు విస్తీర్ణం ఏటా ఒకేలా ఉండదు. అది వర్షాలపై ఆధారపడుతుంది. మంచిగా వర్షాలు కురిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. లేకుంటే తగ్గుతుంది. సాగు విస్తీర్ణం గరిష్టంగా నమోదైంది కోటి 10 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే సాగుకు అనువుగా ఉండి పంట వేయని భూమి ఏటా 33 లక్షల ఎకరాలకు పైగానే ఉంటుంది. ఈ భూమికి సాలీనా అందుతున్న రైతుబంధు ఆర్థిక సహాయం 3,300 కోట్లకు పైగానే ఉంటుంది. పంట పెట్టిన వారికి, పెట్టని వారికి సమానంగా ఆర్థిక సహాయం అందించటం ఎంతవరకు సమంజసం? సాగు కాని భూమిపై రైతులకు సహాయం ఎందుకో ప్రభుత్వమే వివరించాలి. సాగుకు అనువైనప్పటికీ సాగుచేయని ఈ భూస్వాములంతా 25 ఎకరాలకు పైగా భూకమతాలు కలిగివున్న వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగస్థులు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్న బడా భూస్వాములు.
తెలంగాణలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది. వీరికి అందుతున్న ఆర్థిక సహాయం రూ.415 కోట్లు. రెండెకరాల లోపు భూమి వున్న వ్యవసాయదారుల సంఖ్య 24 లక్షలు. వీరికి అందుతున్న ఆర్థిక సహాయం 1,292 కోట్లు. సాగు చేయని భూమికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం 3,300 కోట్లు. మరి ఇంత మొత్తం ఎక్కడికిపోతోంది? ఆ సాయం ఎవరు తీసుకుంటున్నారు?
రాష్ట్ర జనాభాలో 55 శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. 80 శాతం పైగా రైతులు అర ఎకరం నుండి ఐదు ఎకరాలలోపు భూకమతాలు కలిగివున్నవారే. దాదాపుగా వీళ్లంతా దళితులు, వెనుకబడిన కులాలకు సంబంధించినవారు. 80 శాతం మేరకు వ్యవసాయ కుటుంబాలు రుణాల ఊబిలో కూరుకుపోయినట్లు అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒక్కో కుటుంబం సగటు అప్పు లక్ష రూపాయలకు పైగానే ఉంటుంది. వీళ్లంతా చిన్న, సన్నకారు రైతులే. ఒకటి, రెండు గుంటల భూకమతాలు కలిగిన దళిత కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి. వీరికి అందుతున్న సహాయం వంద, రెండువందల రూపాయలు మాత్రమే. ‘ఎంతగా భూమి ఉన్న భూస్వామి అయితే అంతగా ఆర్థిక సహాయమ’నే విధానం మారాలి. సాయం అందించే తీరు భూకమతాలు కలిగివున్న దళిత, బీసీ రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఎవరిదైనా రైతులకు మేలుచేసే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. రైతులలోకూడా సన్న, చిన్నకారు రైతులు, భూస్వాములుంటారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంలో సింహభాగం అందాల్సింది సన్న, చిన్నకారు రైతులకే. ఎక్కువ మందికి తక్కువ, తక్కువమందికి ఎక్కువ ఆర్థిక సహాయం అనే ప్రభుత్వ విధానాన్ని మార్చుకుని ‘ఎక్కువమందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ ఆర్థిక సహాయమ’నే విధానాన్ని అవలంబించాలి.
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న లక్షలాది వాస్తవ సాగుదారులకు ఈ ‘రైతుబంధు’ను వర్తింపచేయకుండా సాగుకు ఏమాత్రం పెట్టుబడిపెట్టని వ్యాపారవేత్తలు, ఉద్యోగులకు, ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనం కట్టబెడుతోంది. సాగుతో ఎలాంటి సంబంధం లేని వీరికి కేవలం భూమిపట్టా ఆధారంగా ఎకరానికి పది వేల రూపాయలు పంచుతున్నది. ఇది ఎంతవరకు సమంజసం? చాలా గ్రామాల్లో 30నుండి 40శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. కౌలురైతుల్లో ఐదు సంవత్సరాలకు పైగా సాగుచేస్తున్న వారు 80 శాతం మంది ఉన్నారు. కాగా, 7 లక్షల ఎకరాల పోడుభూమి సాగుచేస్తున్న ఆదివాసీ రైతులకు పట్టాలు, చెక్కులు ఇవ్వలేదు. లక్షలాది ఎకరాల సాదాబైనమాలపై భూమి పొందినవారికి, అసైన్డ్ భూమి పొందినవారికి కూడా రైతుబంధు అందడం లేదు. లక్షన్నర ఎకరాల వరకు ఉన్న దేవాలయ, వక్ఫ్‌బోర్డు భూములను సాగుచేస్తున్న పేద రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. దాదాపు 40 శాతం మంది అర్హులైన కౌలు రైతులకు రైతుబంధు సహాయం అందడం అందుటలేదు. రైతుల ఆత్మహత్యల్లో 75 శాతం పైగా జరుగుతున్నవి కౌలు రైతులవే అన్న విషయాన్ని పలు అధ్యాయనాలు తెలియజేస్తున్నవి. కౌలు చేస్తున్న సాగుదారులను గుర్తించటానికి 2011లో ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. అదే- ‘2011 భూఅధీకృత సాగుదారుల చట్టం’. దీని ప్రకారం ప్రతి కౌలురైతుకు గుర్తింపుకార్డు ఇవ్వాలి. తద్వారా వీరంతా రుణాలకు అర్హులవుతారు. 15 లక్షల మంది కౌలు రైతులుండగా 2015-16లో ప్రభుత్వం కేవలం 44వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులిచ్చింది. దీంతో ప్రభుత్వం కౌలు రైతుల పట్ల ఎంతటి చిన్నచూపు చూస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ‘సమగ్ర భూప్రక్షాళన’ పిదప పాస్ పుస్తకాలలో, చెక్కుల ముద్రణలో జరిగిన పొరపాట్లు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ముద్రించిన పాస్ పుస్తకాలు 49,94,937 అయితే అందులో తప్పులు దొర్లినవి 7,38,058. అత్యధికంగా తప్పులు దొర్లిన మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డాగూడూరు, మోత్కూర్. పంపిణీ చేసిన పాస్‌బుక్కులు 42,64,511. వివిధ కారణాలతో పట్టాదారులు గైర్‌హాజరైనవి 1,76,696. వీళ్లంతా ఎన్‌ఆర్‌ఐలు, వివిధ రాష్ట్రాలలో స్థిరపడినవారు. ఇప్పటికీ 3లక్షల మంది పైగా రైతులకు ఎలాంటి పాస్‌బుక్కులు, చెక్కులు అందలేదు. వీటన్నింటికి బాధ్యులు రెవెన్యూ సిబ్బంది కాదా? మొదటి దఫా ‘రైతుబంధు’ సహాయాన్ని రైతులందరికీ అందించకుండానే రెండవ దఫా అందించడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు.
అసలు రైతు అంటే ఎవరు? భూయజమాని రైతా? లేక సాగుచేసెడివాడా? భూయజమానే రైతు అనే విధానానికి స్వస్తిపలికి ‘రైతుబంధు’ను సాగుదార్లందరికీ వర్తింపచేయాలి. మరోసారి భూములన్నింటినీ సర్వేచేసి హద్దులు పెట్టాలి. ఎక్కెడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించాలి. రుణమాఫీ, రైతుబంధు పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సమగ్ర అధ్యయనం జరిపించే నిమిత్తం వ్యవసాయ రంగ, రెవెన్యూ సిబ్బందికి చెందిన నిపుణులతో కమిటీని వేసి వారి సూచనలు, సలహాల ప్రకారం ఈ పథకాన్ని హేతుబద్ధీకరించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించే ఫలితాలు కనిపిస్తాయి.
*
క్ర. భూ విస్తీర్ణం పట్టాదారులు రైతుల్లో వీరి శాతం
1 ఒక ఎకరం లోపు 18 లక్షలు 30.8 శాతం
2 1 నుండి 2 ఎకరాల మధ్య 24 లక్షలు 41.9 శాతం
3 2- 5 ఎకరాల లోపు 11 లక్షలు 18.8 శాతం
4 5-10 ఎకరాల లోపు 4.4 లక్షలు 7.5 శాతం
5 10-25 ఎకరాల లోపు 94,000 1.6 శాతం
6 25-50 ఎకరాల లోపు 6,488 0.1శాతం
7 50 ఎకరాల పైన 298 0.0005 శాతం
**

-ప్రొ. జి.లక్ష్మణ్ 98491 36104