సబ్ ఫీచర్

ఓటర్లలో చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సేవ్ ది డెమొక్రసీ’అని అరవాల్సినది అధికార రాజకీయ పార్టీయో, ప్రతిపక్షమో కాదు, ఎన్నో ఆశలతో నాయకులను ఎన్నుకొని అధికారం కట్టబెట్టే ప్రజలు. ఏదో ఒక రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యం విలువలు, వలువలు దిగజార్చుకుంటూనే వుంది. ప్రతిపక్షం అంటే అధికార దాహంతో గొంతు చించుకునేది కాదు. రేపు అధికారం కట్టబెడితే చేసిన పోరాటాలకు కట్టుబడి వుండేదని గుర్తించుకోవాలి. అధికారపక్షాలు.. ప్రతిపక్షాలు ‘నేతిబీరకాయలో నెయ్యంత’ చందంగా నడుస్తున్నాయి. ఐదేళ్ళపాటు ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున గొంతెత్తాల్సిన ప్రతిపక్షాలు అడ్డుఆపులేకుండా,మాట్లాడడం నేటి రాజకీయ నాయకుల నైజంగా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల రాజకీయం మరీ దారుణంగా (మునుపెన్నడూ చూడని విధంగా) తయారయ్యింది. ‘వార్ వన్‌సైడైపోయందన్నట్లు’ ఎత్తుగడలు వేస్తూ ప్రతిపక్షాల వాయిస్‌ని నొక్కేసి (కొనేసి) కలిపేసుకుంటున్నాయి. తెలంగాణాలో ప్రతిపక్షంగా వుండి క్లీన్ స్వీప్‌కి చేరువైపోతున్న తెలుగుదేశం ‘సేవ్ ది డెమొక్రసీ’అంటూనే ఆంధ్రాలో ప్రతిపక్షాన్ని ‘షేవ్’చేసేయడం విడ్డూరం!! రెండింటికి చెడ్డ రేవడిగా వైయస్సార్‌సిపి తెలంగాణా ఉనికికి తిలోదకాలిచ్చి ఆంధ్రాపై అరవడం మరో విచిత్రం. ఉద్యమపార్టీ అంటూనే ప్రతిపక్ష ఉనికిలేకుండా చేసేయడం తె.రా.స చెబుతున్న రాజనీతి. ప్రజాస్వామ్యంలో బాధ్యతగల ప్రతిపక్షం లేకపోతే అధికారపక్ష అహంకార ధోరణికి అడ్డుకట్టవేసేది ఎవరు? ఇంత ఆలోచించే పనిలో నాయకులు ఎవరు లేరన్నది అక్షర సత్యం.
రష్యా, లిబియా వంటి దేశాల్లో ఒకటిరెండు పార్టీలే రాజకీయాలను శాసించే స్థితి. జింబాబ్వే వంటి దేశంలో ఐతే ఏకచ్ఛత్రాధిపత్యమే. ఒక రాజకీయ పార్టీ అనేకమార్లు అధికారం కైవశం చేసుకుందంటే దానికి ప్రజాదరణ మెండుగా వుందని కాదు, ఎన్నుకోవడానికి మరో ఆప్షన్ లేకపోవడమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని కల్పించాలన్నదే ఈనాటి రాజకీయ పార్టీల ఎత్తుగడ. అయితే ఇది ఎంతవరకు సాధ్యం?! పొరుగునున్న తమిళనాడులో ఐదేళ్ళకొకసారి పార్టీని మార్చే సంప్రదాయం వుంది. అలాంటిచోట కూడా యిప్పుడు త్రిముఖ పోరు మొదలైంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పుట్టుకకు బ్రేకువేసే పరిస్థితులు లేవు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత దారుణంగా (ఉదారంగా) ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసినప్పటికి రేపు ఎన్నికల ప్రకటన వచ్చేసరికి రాజకీయ ఉద్యోగంకోసం ‘కప్పదాట్లు’ తప్పదుగాక తప్పదు.
అసలు యింత జరుగుతుంటే రాజ్యాంగంలో పొందుపరచుకున్న ‘పార్టీ ఫిరాయింపుల చట్టం’ ఏమైనట్లు?! ఎందుకంటే దానిని సైతం మార్చగల సమర్ధులు రాజకీయ నాయకులు. పార్టీ నాయకులను కొనుగోలు చేయడం నేటి స్టయిల్. ఈ పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఓటరుకు చిల్లిగవ్వకూడ దక్కదు. ఓటేస్తే వెయ్యండి లేకపోతే లేదు, అనే పరిస్థితి దాపురిస్తుంది. ఓటర్లు ప్రలోభాలకు లొంగుతారు కాబట్టే యువ ఓటర్ల సంఖ్య పెరిగినా ‘తాయిలాలు’ ఆశ చూపడంలో పార్టీలు వెనుకంజ వేయడం లేదు. రాబోయే ఎన్నికల ఖర్చును సైతం ముందు ఏడాది బడ్జెట్‌లో ఎడ్జెస్ట్ చేసేసుకుంటున్నాయి.
అధికారంలో వుండే పార్టీలకు కులతత్వం.. మతతత్వం అంటగట్టే విధానానికి కూడా స్వస్తి పలకాల్సిన అవసరం వుంది. ‘విభజించు పాలించు’ (అవి)నీతి సూత్రాన్ని అనుసరించే ప్రతిపక్షాలకు ఓటర్లు మేమంతా ఒక్కటేనన్న సమైక్య గళాన్ని వినిపించే రోజులూ రావాలి. ఓటర్లలో ఆలోచనశక్తి పెరగనంత కాలం ఓటింగ్ శాతం ఎంతకు పడిపోయినా రాజకీయాలు నడపగలిగే పవర్ పార్టీలకు వుంటూనే వుంటుంది. చైతన్యవంతమైన ఓటర్లు వున్ననాడే ‘సేవ్ ది డెమొక్రసీ’ సాధ్యపడుతుంది.

- బాసు