సబ్ ఫీచర్

అపర ధన్వంతరి ‘ఎల్లాప్రగడ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీదరికంలో పుట్టి అకుంఠిత దీక్షతో భీమవరం నుండి బోస్టన్ చేరి జీవితాన్ని వైద్య పరిశోధనలకు అంకితం చేసిన తెలుగుబిడ్డ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎన్నో వ్యాధులకు దివ్యమైన ఔషధాలను కనిపెట్టిన అపర ధన్వంతరి ఆయన. 1895 జనవరి 12న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన జన్మించారు. తండ్రి జగన్నాథం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తూ ముందుగానే పదవీ విరమణ చేయడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. ఇలాంటి ఆర్థిక పరిస్థితిలో సుబ్బారావు తరచుగా పాఠశాలకు వెళ్లలేకపోయేవారు. కాశీలో తీర్థయాత్రికులకు అరటిపండ్లు అమ్మితే లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఎవరో చెబితే విని 13 ఏళ్ల వయసులో బంధువుల కుర్రాడితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించారు. తల్లి ఆ విషయం పసిగట్టి ఆ ప్రయత్నాన్ని విరమింపజేసింది. 1911లో మెట్రిక్యులేషన్ పరీక్షలో సుబ్బారావు రెండుసార్లు ఫెయిల్ అయ్యారు. తల్లి మాత్రం పట్టువిడవకుండా ఎంతో కష్టపడి మద్రాసులోని హిందూ స్కూలుకు ఆయనను పంపింది. 1913లో తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కుర్రాడి చదువుఆగిపోకూడదని తల్లి తన పుస్తెలతాడును విక్రయించి డబ్బును సమకూర్చింది. ఈ సంఘటనతో చలించిపోయిన సుబ్బారావు తన జీవితంలో ఎన్నడూ పరీక్ష తప్పలేదు.
గణితంలో డిస్టింక్షన్ సాధించడంతో ఆ అంశంలో ‘ఆనర్స్’ చేయమని అందరూ ప్రోత్సహించినా సుబ్బారావు మాత్రం కాలేజీలో చేరాడు. సన్యాసిగా మారి రామకృష్ణా మిషన్‌లో వైద్యసేవలు అందించాలనేది ఆయన ఆశయం. కానీ అందుకు తల్లి అనుమతి ఇవ్వలేదు. సుబ్బారావుకు హఠాత్తుగా ‘స్ప్రూ’ వ్యాధి (ఆహార నాళాలలో పుండు) బారిన పడ్డాడు. ఆ కాలంలో ఈ వ్యాధి వచ్చినట్లయితే బతకడమే కష్టం అనేవారు. సుబ్బారావు ఆయుర్వేద మందుల తో ఎలాగో ఒకలా ఆ వ్యాధి నుండి బయటపడ్డారు. 1919 మే 10న 12 ఏళ్ల కస్తూరి శేషగిరితో సుబ్బారావుకు వివాహమైంది.
స్వదేశంపై ఉన్న మమకారంతో విదేశీ దుస్తులను బహిష్కరించి ఖద్దరుతో కాలేజీకి వెళితే శే్వత జాతీయుడైన సర్జన్ సుబ్బారావుపై మండిపడేవాడు. అన్నిట్లో మంచి మార్కులతో పాసైనప్పటికీ సర్జరీలో మాత్రం బొటాబోటీ మార్కులు వేశారు. దీంతో ఎంబీబీఎస్ డిగ్రీ కాకుండా అంతకన్నా తక్కువదైన ఎల్.ఎం.ఎస్ సర్ట్ఫికెట్‌ను ప్రదానం చేశారు. ఆ కాలంలో పైచదువులకి బ్రిటన్ వెళ్లాలన్న భావన భారతీయుల్లో ఉండేది. బ్రిటన్ వాళ్లంటే నచ్చని సుబ్బారావు అమెరికా వెళ్లాలని భావించారు. ఇందుకోసం హార్వర్డ్ మెడికల్ కాలేజీకి ఆయన లేఖ రాయడంతో సానుకూల స్పందన వచ్చింది. కానీ చేతిలో డబ్బులు లేవు. వారంరోజుల తేడాతో తన ఇద్దరు సోదరులు ‘స్ఫ్రూ’ వ్యాధితో మరణించడంతో సుబ్బారావు మనసును తీవ్రంగా కలచివేశాయి. ఎలా అయినా ఈ వ్యాధికి మందు కనుగొనాలనే పట్టుదల ఆయనలో పెరిగింది.
కాకినాడలోని ఓ సంస్థ ఆదుకోవడంతో 1923 సెప్టెంబర్‌లో అమెరికాకు ప్రయాణమయ్యారు. భీమవరం నుంచి బోస్టన్ వెళ్లిన సుబ్బారావు మళ్లీ భారతావనిపై అడుగుపెట్టలేదు. నిరంతరం వైద్య పరిశోధనలోనే ఉండి ఎల్లలు సైతం మర్చిపోయారు. భార్య శేషగిరి మగబిడ్డను ప్రసవించగా ‘స్ప్రూ’ వ్యాధి కారణంగా ప్రాణం నిలవలేదు. ఆ తర్వాత సుబ్బారావు ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. అమెరికాలో అడుగుపెట్టే సరికి తన దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. దీంతో సుబ్బారావు బోస్టన్‌లోని ఒక ఆస్పత్రిలో పారిశుధ్య పనులను చేసేందుకు సైతం వెనుకాడలేదు. రాత్రంతా ఆస్పత్రిలో పనిచేస్తూ, పగలంతా కాలేజీలో చదువుతూ ఎదిగిన వ్యక్తి ఆయన. ప్రతిభతో ప్రొఫెసర్ల మెప్పు పొందుతూ స్కాలర్‌షిప్ సాధిస్తూ పరిశోధనలను సాగించారు. డాక్టర్ ‘్ఫస్కే’ సహాయంతో శరీర కణాలలోని భాస్వరాన్ని సరిగ్గా, తేలిగ్గా నిర్ధారణ చేసే ‘‘రేపిడ్ కెలరోమెట్రిక్ మెథడ్’’ను ఆవిష్కరించి 1924లో తొలిసారిగా ప్రపంచానికి ఆయన పరిచయమయ్యారు. ఇదే ‘్ఫస్కే సుబ్బారావు’ పద్ధతిగా పేరొందింది. ఆ తరువాత శరీరంలోని కండరాల శక్తికి మూల పదార్థం ‘అడినోసిస్ ట్రై ఫాస్పేట్’ అని నిర్ధారించి జీవరాశి భౌతిక ప్రక్రియలను నిర్ణయించేది ఇదేనని వెల్లడించారు. దీంతో 1922లో నోబుల్ బహుమతి పొందిన శాస్తవ్రేత్తల పరిశోధనల ఫలితాలు సైతం తప్పని రుజువైంది. అయినా ఆయనకు నోబెల్ బహుమతి రాలేదు.
తన పరిశోధనలో అతి ముఖ్యమైనది ‘స్ప్రూ’ వ్యాధిని అరికట్టే ఫోలిక్ యాసిడ్ విటమిన్‌ను కనుగొనడం. ‘బోదకాలు’, ‘ఇసినోఫిలియా’ల వంటి వ్యాధులకు ఉపయోగపడే ‘హైట్రాజెన్’, క్షయవ్యాధి నివారణగా పేర్కొనే ‘ఇనోనెక్’తో పాటు కలరా, టైఫాయిడ్, ప్లేగు, అతిసార వంటి వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ‘టెట్రాసైక్లిన్’ యాంటీ బయోటిక్‌తోపాటు పిల్లల్లో బ్లడ్‌కాన్సర్‌ను అరికట్టే ‘మెథాట్రెక్సేట్’, ‘అరియోమైసిన్’ వంటి ఔషధాలు సుబ్బారావు పరిశోధనల ఫలితాలే. ఎన్నో పరిశోధనలు చేసినా అవార్డుల కోసం ఆయన ఏనాడు ఆరాటపడలేదు. ‘లేడర్లే’ సంస్థ సుబ్బారావును తమ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన జీవితంలో చివరి క్షణం వరకూ ఆ సంస్థలోనే కొనసాగి ఎన్నో పరిశోధనలు చేశారు. కొన్ని యాంటీ బయోటిక్‌లకు ‘సుబ్బా మైసిన్’ ‘సుబ్బరోమైసిన్’ అని లేడర్లే సంస్థ పేర్లు పెట్టుకుంది. 1948 ఆగస్టు 9న గుండెపోటుతో సుబ్బారావు కన్నుమూశారు. అమెరికా పత్రికలు ఆయనను ఎంతగానో కీర్తిస్తే, భారతీయ పత్రికలు మాత్రం తగిన గౌరవం ఇవ్వలేదు.

-జి.శ్రీలత రమేశ్