సబ్ ఫీచర్

కాపుల రిజర్వేషన్‌కు రెండు పరిష్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత జనవరి 31న బిసి రిజర్వేషన్లకోసం తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో నమోదైన కేసులపై ముద్రగడ ఫిబ్రవరి 5న ఆమరణ దీక్షకు దిగగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చర్చలకు వచ్చిన మంత్రుల బృందం అరెస్టులేవీ ఉండవనే హామీ ఇచ్చి దీక్ష విరపింప చేసింది. అయితే ఆ హామీని బుట్టదాఖలు చేసి తాజాగా అరెస్టులకు పోలీసులు సిద్ధపడడంతో ఈనెల ఏడున ముద్రగడ మరోసారి ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. అరెస్ట్‌చేసిన 13 మందిని వెంటనే విడుదల చేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్. చివరికి 14 రోజుల ముద్రగడ దీక్ష ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి తుని ఘటనలో అరెస్ట్‌చేసిన 13 మందిని విడుదల చేయడంతో ముద్రగడ ఆమరణ దీక్ష విరమించారు. అయితే తునిలో జరిగిన విధ్వంసాన్ని వ్యతిరేకించిన కాపులు కూడా ముద్రగడ దీక్షని సమర్ధిస్తూ రిజర్వేషన్ ఉద్యమానికి కొనసాగింపుగానే చూస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాలను చూస్తే బలమైన సామాజిక వర్గమైన కాపులకు అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు. సంఖ్యాబలంతో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్నా, వారిలో ఉన్న అనైక్యతని తమకి అనుగుణంగా కొన్నివర్గాలు మలుచుకుంటున్నాయని కాపు నాయకులే చెపుతున్నారు. కాపుల్ని సంతృప్తిపరచడానికి ఆ వర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులకు మంత్రి పదవులు ఇవ్వడం, వారి సంక్షేమానికి ఓ వంద కోట్లు ఇస్తున్నామని ప్రకటించడం తప్ప తెదేపాకూడా కాపులకు చేసిందేమీ లేదు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలికంగా ఏదో ఒకటి చేసి అరెస్ట్‌చేసిన వారిని విడుదల చేయాలని దీక్ష చేస్తున్న ముద్రగడను దీక్ష విరమింపచేశారు. కానీ సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఎన్నికల సందర్భంగా కాపులకు కల్పిస్తామన్న రిజర్వేషన్ సౌకర్యం హామీ విషయంలో ఆ హామీని నెరవేర్చే బాధ్యత మాత్రం చంద్రబాబు ప్రభుత్వంపైనే ఉందనేది స్పష్టం.
నిజానికి 1910నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రారంభమై ‘మాన్‌టగు-చెమ్స్‌ఫోర్డ్ రిఫామ్స్ అండ్ రిపోర్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కొనసాగి, 1953 అక్టోబర్ 1వరకు కాపు, బలిజ, ఒంటరి మిగిలిన 20 ఉప కులాలకు సెపరేట్ లిస్టుగా (ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో), తెలంగాణలో (స్టేట్ ఆఫ్ హైదరాబాద్) మరొక సెపరేట్ లిస్టుగా కాపులకు రిజర్వేషన్లు కొనసాగాయి. అయితే 1956 తెలుగు ప్రజలకు ఆనాటి పరిస్థితుల్లో పండుగ కాగా, కాపు ప్రజలకు విషాదాన్ని మిగిల్చింది. విడదీసి పాలించే సూత్రాన్ని అమలుచేసారు. 1956లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ విధమైన కమిషన్, కమిటీ సిఫార్సులు లేకుండానే కోస్తా కాపు, బలిజ, ఒంటరి, తెలగ గాజుల బలిజలను రిజర్వేషన్ల జాబితానుండి తప్పించారు. కొసమెరుపుగా కోస్తా కాపులనుండి తూర్పు కాపులను, తెలంగాణలో మున్నూరు కాపులకు మాత్రం రిజర్వేషన్లు కొనసాగించేలా కుట్ర పన్ని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే కులస్థుల్ని, కొన్ని ప్రాంతాల్లో ఓసిలుగాను, మరికొన్ని ప్రాంతాల్లో బిసిలుగాను గుర్తించారు. ఆ తరువాత కాపులు చేసిన అనేక పోరాటాల ఫలితంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994లో జీవో నెం.30 విడుదల చేసి కాపులకు రిజర్వేషన్లు కల్పించారు. ఆ జీవోని హైకోర్టు సమర్ధించినా దానిని అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఆ జీవోని వ్యతిరేకిస్తూ బిసి సంఘాలు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు వేసాయి. అయినాకూడా 1994-95లో ఇచ్చిన హైకోర్టు తీర్పుని అమలుచేయాలని జనవరి 5, 2007న శ్రీమతి జస్టిస్ రోహిణి నేతృత్వంలో తీర్పు వెలువడింది. దురదృష్టవశాత్తు ఆ తీర్పుని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అదే ఇప్పుడు ఇంచుమించు రాష్ట్ర జనాభాలో 27% పైగా ఉన్న కాపుల ఆగ్రహానికి కారణంగా మారింది.
అసలు కాపులకు కావాల్సింది రిజర్వేషన్లా? బిసిలలో చేర్చడమా? అన్నది ఇప్పుడు అందరిముందు ఉన్న అసలు ప్రశ్న. రాష్ట్ర జనాభాలో 27% పైబడి ఉన్న కాపుల్ని ఎ,బి,సి,డి విభాగాల్లో ఎక్కడ ఉంచాలో కూడా ఈనాటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. నిజానికి కాపులకు కావాల్సింది రిజర్వేషనే్ల కానీ, బిసిల్లో కాపుల్ని చేర్చాలనే అర్ధరహితమైన వాదనలు కాదనేది కొందరి కాపు నాయకుల వాదన. ఈనాటికైనా కొంతమంది కాపు నాయకులు కోరుతున్నట్లు కాపుల్ని బిసిలలో చేర్చమనే వాదనని వదలి, ముస్లిం సోదరులకు వర్గీకరించిన విధంగా ఇ కేటగిరీ వలె ఎఫ్ కేటగిరిని ప్రత్యేకంగా కాపు కులస్తులకు కేటాయించే విధంగా ప్రయత్నించాలని వారు వాదిస్తున్నారు. జనాభా, దామాషా ప్రాతిపదికన తమకు దక్కాల్సిన రిజర్వేషన్లను ప్రత్యేకంగా సాధించుకోవాలని వారు కోరుతున్నారు.
అయితే కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో సంబంధం లేకుండా తక్షణం చేయగలిగే రెండు పరిష్కారాలున్నాయి. రిజర్వేషన్లతో వచ్చే లాభాలు వీటిద్వారా వెంటనే కాపులకు సమకూరుతాయి. అవి 1. కాపులలోని పేదలకు ప్రభుత్వం ముందుగా అన్ని పోటీ పరీక్షల్లో అదనంగా 10 మార్కులు కలపాలి. 2. పేదలకు కాపు విద్యార్థులు తమకు నచ్చిన ఏ ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌లలో అయినా నాణ్యమైన విద్య పొందేందుకు అయ్యే ఖర్చును కేజీ నుండి పీజీ వరకూ ప్రభుత్వమే భరించాలి. ముందు ఇవి ఏర్పాటుచేసి ఆ తరువాత రిజర్వేషన్ల పేరుతో ఎన్ని నాటకాలు ఆడినా కాపులకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, క్షత్రియ తదితర అగ్ర కులాల్లో రిజర్వేషన్ సౌకర్యం లేదని బాధపడుతున్నవారు కూడా కోరితే ఆయా కులాలలోని పేద విద్యార్థులకు ఈ వెసులుబాటు కల్పించొచ్చు. ఈ పరిష్కారాన్ని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ సమస్యపై ఒక మార్గం చూపించగలుగుతుంది కూడా.

- కూసంపూడి శ్రీనివాస్