సబ్ ఫీచర్

ప్రజలందరి పవిత్ర గ్రంథం.. రాజ్యాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వతంత్ర, సమానత్వ, సోదరత్వ సూత్రాల సమన్వయ రూపమైన సాంఘిక ప్రజాస్వామ్యం పునాది కాకుంటే రాజకీయ స్వాతంత్య్రం నిలబడదు. మత విషయంలో భక్తి అనేది ఆత్మవిముక్తికి ఒక మార్గం కావచ్చు. కానీ రాజకీయాల్లో భక్తి లేదా వీరపూజ దివాలా కోరుతనానికి, తద్వారా ఏర్పడే నియంతృత్వానికి దారి అవుతుంది. సాంఘిక, ఆర్థిక లక్ష్యాలను సాధించటానికి మనం రాజ్యాంగానికి కట్టుబడి వుండాలి...’
... ఇది రాజ్యాంగ నిర్మాణ శిల్పి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1949 నవంబరు 25న రాజ్యాంగ నిర్మాణ సభలో చేసిన హెచ్చరిక. దేశ విభజనానంతరం 299 మంది సభ్యుల రాజ్యాంగ నిర్మాణ శాసనసభకు డా.రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1948 నవంబరు 15 నుండి ఒక సంవత్సరం పాటు అంశాల వారీగా ముసాయిదాపై చర్చ జరిగింది. సర్ బి.యన్.రావు మొదటి ముసాయిదాను రూపొందించారు. 2,473 సవరణలపై రాజ్యాంగ శాసనసభ చర్చించింది. రాజ్యాంగ సభ 11సార్లు సమావేశమై అంబేద్కర్ సారథ్యంలో దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల 17రోజులలో భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఆరంభంలో రాజ్యాంగం 22 భాగాలతో, 9 వివరాల పట్టికలతో (షెడ్యూళ్లు), 395 అకరణాలతో ఏర్పడింది. ఇది 2006 నాటికి 94 రాజ్యాంగ సవరణలు, వివరణలతోకూడిన 26 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 444 అధికరణలతో ఉంది. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ప్రధాన భారత రాజ్యాంగ లక్ష్యం ప్రవేశికలో పొందుపరచబడి వుంది.
భారత రాజ్యాంగ వౌలిక స్వరూపమంతటినీ మన రా జ్యాంగ నిర్మాతలు ‘సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ’గా సూత్రీకరించారు. ప్రభుత్వానికి వున్న అధికారాలన్నీ ప్రజలు సంక్రమింపచేయటం ద్వారా వచ్చినవే కనుక ప్రజలే అధి శాసనకర్తలు. ‘్భరత ప్రజలమైన మేము’-అన్న పదబంధం అందుకే రాజ్యాంగమంతటికీ తలమానికం. దేశ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన సర్వసత్తాకత కలిగి వుండటం సార్వభౌమికం. గణమంటే సమూహం. తంత్రమంటే వశంలో వుండటం. గణతంత్ర వ్యవస్థ అంటే ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అజమాయిషీలో నడుపబడే వ్యవస్థ లేదా రాజ్యం. అదే గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యం.
రాజ్యాంగం కంటే రాజ్యాంగ విధేయత అత్యంత కీలకమైనదని చెప్పేవారు అంబేద్కర్. ఆర్టికల్ 51/ఎ లోనూ రాజ్యాంగానికి లోబడి ఉండటం పౌరుని ప్రాథమిక విధులలో మొదటిది అన్న ఆదేశం వుంది. ఖురాన్, బైబిల్, భగవద్గీత వంటి పవిత్ర మతగ్రంథాలను అసంఖ్యాక భారతీయులు ఔదలదాల్చి ఆరాధిస్తున్న విధంగానే రాజ్యాంగాన్ని భారత పౌరులందరూ విధిగా అంగీకరించాలన్న నిబంధన వుంది. అయితే, ఇపుడు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన నైతికత తలెత్తుతోంది. కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయ సందర్శనం అంశంలో- సుప్రీం కోర్టు తీర్పుపై మత విశ్వాసం సంఘర్షణ ఒక ఉదాహరణ. భారతదేశ ఐక్యత, సమగ్రతను రాజ్యాంగమే కాపాడగలదు. రాజ్యాంగ విలువలను అంగీకారం, సహనంతో పౌర సంబంధిత అంశాలు ఏమైనా ఔదల దాల్చవలసిన అగత్యం తప్పదు. గనుక రాజకీయ పార్టీలు అప్రమత్తతతో వ్యవహరించవలసి వుంది.
భారత రాజ్యాంగంలో ‘సెక్యులర్, ఫెడరల్, సోషలిస్టు’ పదాలు చేర్చటానికి ప్రొ.కేటీ షా 1948 నవంబరు 15న చేసిన ప్రతిపాదన ‘వీటో’ అయింది. డా.అంబేద్కర్ రాజ్యంగంలో పొందుపరిచిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, సోషలిజం చోదకశక్తిగా వున్నందున ప్రత్యేకంగా ఆ పదాలు అవసరం లేదని భావించారు. కాని సరళీకృత విధానాలు, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రాథమిక అవకాశాలలో అసమానతలు పెంచిపోషిస్తున్నాయి. రాజ్యాంగం ఆర్టికిల్-1లో ఆ పదాలు అవసరం లేదని భారత ప్రజలే సాంఘిక, ఆర్థిక అంశాలను సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకొనే సత్తా రాజ్యాంగానికి వుందని అంబేద్కర్ అభిప్రాయపడి ఆ పదాలు చేర్చటానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా వుండగా 42వ రాజ్యాంగ సవరణ 3-1-1977 నుంచి భారత రాజ్యాంగ అవతారికలో చేరటం జరిగింది. చిట్టచివరి రాజ్యాంగ సవరణ 2006నాటికి 164వ అధికరణానికి సంబంధించిన 94వ సవరణ. అది ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో జరిగిన సంక్షేమశాఖను ప్రత్యేకించడానికి జరిగినది. భారతదేశపు పౌరులందరి జీవన సంక్షేమానికి వర్తించే రాజ్యాంగం ఒక ధర్మశాస్త్రం. హృదయంతో అధ్యయనం చేసి పవిత్ర గ్రంథంగా దీన్ని ఆరాధించాలి. 1949 నవంబరు 26 నుండి ప్రస్తుత గణతంత్ర దినోత్సవం వరకు భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రసాదించే సామాజిక విప్లవాన్ని శాంతియుతంగా సాధించే దిశలో అత్యున్నత న్యాయస్థానాలు న్యాయం అందిస్తున్నాయి. అదే ప్రజాస్వామ్య పరిరక్షణకు శిరోధార్యం.

-జయసూర్య సెల్- 9440664610