సబ్ ఫీచర్

విలువల బాటలో జీవనయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం మనకే విలువలని ఆపాదించుకుంటున్నాం. ఎదుటి మనుషులకి, వస్తువులకి, ఆఖరికి కాలానికి కూడా విలువనివ్వడంలేదు. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేనికీ విలువ తగ్గదు. దానివల్ల నష్టపోయేది మనమే!
ఇక మనిషి విలువ- మనం ఎందుకూ పనికిరారనుకున్న మనుషులే మనకి అత్యవసర ప్రమాద పరిస్థితిలో దిక్కుతోచకుండా వున్నప్పుడు మనకు అక్కరకు రావచ్చు. మనం ఏదీ ముందుగా చెప్పలేం! అందుకే ఎదుటివారిని చిన్నచూపు చూడకుండా మనిషిని మనిషిగా చూసి మన మానవత్వాన్ని నిరూపించుకోవాలి.
అంతస్థులని బట్టి మనుషులకి విలువలివ్వకుండా అంతఃకరణలకి విలువ ఇవ్వడం అలవరచుకోవాలి. వారి అంతఃకరణ ఎలాంటిదో మనకేం తెలుసు? అనుకుంటే పొరపాటే! మన అంతఃకరణ పరిశుద్ధంగా వున్నపుడు ఎదుటివారిలోని మంచితనం ప్రస్ఫుటవౌతుంది. అలా కాక మనం ఒకవేళ పొరపడినా అందువల్ల మనకి పోయేదేమీ లేదు. అవతలివారిలోని చెడు బుద్ధే బయల్పడుతుంది. మనం మంచిగా వుంటే అవతలివారూ మారే అవకాశం వుంటుంది.
కులాలని బట్టి, మతాలని బట్టి, మనుషులకి విలువలనివ్వడం సమంజసం కాదు. పుట్టినప్పుడు ఎవరూ వాటిని తెలుసుకుని పుట్టరు. పోయేటప్పుడు ఆ స్పృహ వుండదు. మధ్యలో వచ్చేవాటికి అంత విలువ నివ్వాల్సిన అవసరం లేదు.
అలాగే వస్తువుల విలువ, నీటి విలువ, చెట్ల విలువ తెలుసుకుని ప్రవర్తించాలి. చెత్త పడుతుందని, చాకిరీ అని చెట్లని కొట్టించేసి ఆ స్థలంలో ఓ గది కట్టించి అద్దెలకిస్తే ఆ అద్దెల డబ్బు వృధా అవుతుందే కాని, ఎండవేడిని తట్టుకునేందుకు నీడ, చల్లదనం, ఆక్సిజను దొరకదు.
నీరు వున్నప్పుడు నీటి విలువ తెలుసుకోలేక వృధా చేస్తూ పోతే వేసవిలో నీటి కోసం అగచాట్లు పడాలి. వున్నవాళ్ళు నీటిని డబ్బుతో కొనుక్కుని కాలం గడపగలరు. లేనివాళ్ళు దొరికిన మురికినీళ్ళైనా తాగి అనారోగ్యాల పాలవుతారు.
కాగితాలు కొందరు వాడేసినవి నలిపేసి చింపేసి చెత్త బుట్టలలో పడేస్తారు. అవి కూడా జాగ్రత్త చేసి పేపర్లతోపాటుగా పాత పేపర్లు కొనే వాళ్ళకి ఇస్తే వాళ్ళ వాటికి డబ్బు ఇవ్వకపోయినా వాటిని రీసైక్లింగ్ (తిరిగి పేపర్ల తయారీ సంస్థల)కి ఇస్తారు.
కాగితాల తయారీ కోసం ఎన్నో చెట్లని కొట్టాల్సి వస్తోంది. అందుకు రైల్వే వారు కూడా రిజర్వేషన్ టిక్కెట్లు ప్రింటౌట్లు తీసి కాగితం వృధా చెయ్యకుండా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా టిక్కెట్లు చూస్తున్నారు. అటువంటప్పుడు మనమెందుకు కాగితాలు వృధాగా చింపిపడెయ్యాలి?
ఆఖరికి చీపురుపుల్లని తీసుకున్నా దాని విలువ దానిదే! ఆ పుల్లలు కలిపి కట్టకడితేనే ఇల్లు వాకిలి శుభ్రపరిచేది. ఒక్కొక్క పుల్లా ఊడిపోతూంటే పోతేపోయిందిలే, ఒక్క పుల్లేగా అనుకుంటూ పారేస్తే కడకు చీపురు మిగలదు. డబ్బు విషయం ఇక చెప్పక్కర్లేదు. కొందరు తినడానికి, ఒకరికి పెట్టడానికి మంచి బట్ట కట్టడానికీ కూడా ఖర్చుపెట్టడానికి ఇష్టపడరు. వీరినే పిసినారులంటారు.
పొదుపనేది కొంతవరకూ వుండడం చాలా మంచిది. కొందరు బీరువాలనిండా బట్టలున్నా మళ్లీ కొత్తరకాలు మార్కెట్‌లోకి వచ్చాయంటే కొనేస్తూంటారు. అలాగే ఎన్నో వస్తువులు. అవసరమా కాదా అని కూడా ఆలోచించకుండా కొనేస్తూంటారు. ‘ఒస్! అయిదువేలేగా! పదివేలేగా!’ అంటూ వున్నప్పుడు తెగ ఖర్చుపెడతారు. కాలమహిమవల్ల పరిస్థితులు తలక్రిందులైతే ఇక తట్టుకోలేకపోతారు. అప్పుడంత అనవసర ఖర్చులు చెయ్యకపోతే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని ఆలస్యంగా తెలుసుకున్నా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే అవుతుంది. ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు. లేనప్పుడే దాని విలువ తెలిసేది.
ఆ మాటకొస్తే భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరి విలువ ఉన్నప్పుడు తెలియదు. దూరమైనప్పుడే తెలిసి అలమటిస్తారు. అప్పుడు ప్రయోజనముండదు. అందుకే వారు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకుని వారిని ఆదరించడం, సంతోషపెట్టడం, కనీసం విసుక్కోకుండా వుండడం మంచిది.
అంతటా వున్నది ఆ పరమాత్మే! అందరిలో వున్నది ఆ దేవదేవుడే! అని గ్రహించి నొప్పింపక, తానొవ్వక చేతనైన సహా యం నలుగురికీ చేస్తూ కరిగిపోయే కాలం విలు వ తెలుసుకుని వృధా చెయ్యకుండా కర్తవ్య నిర్వహణ చేస్తూ కాలం గడుపుతూ జన్మ ధన్యం చేసుకోవాలి. చేసుకుందాం!
***

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- ఆర్.ఎస్.హైమవతి