సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

179. నిండుకుండ తొణకదు. ఆత్మానుభవము గలవాని యొద్ద వాచాలత యుండదు. ఐనపక్షమున నారదాదుల మాట యేమందురా? నిజమే. నారదుడు, శుకదేవుడు మొదలగు కొందరు సమాధి స్థితిని బొందినవెనుక తమ మహోన్నత స్థితి నుండి ఎంతయో క్రిందికి దిగి కృపాపూర్ణులై లోకమునకు బోధించినారు.
180. ముక్తులు లోకమున నిరు తెఱగులుగా గాన్పించుచున్నారు. తత్త్వజ్ఞానము పొందిన వెనుక శాంతముగా, నిశ్శబ్దముగానుండి, ఇతరులను గూర్చిన మాటయే తలపెట్టక బ్రహ్మానందమును తామే అనుభవించువారు కొందరు. జ్ఞాన లాభమును పొంది, దానినంతయు తమ యొద్దనే దాచుకొనుటలో ఆనందమును గానక, పరులనుద్దేశించి, ‘రండు మాతో తత్త్వానందము ననుభవింపుడు’ అని యెలుగెత్తి చాటువారు మరికొందరు.
181. పువ్వు వికసించి దాని పరిమళము పిల్లగాడ్పులవలన నలుదిక్కులందును వ్యాపింపగనే తేనెటీగలు తమంత తామే దాని యొద్దకు వచ్చును. మిఠాయల నుంచిన తావునకు చీమలు తామంతతామే వచ్చి చేరును. తేనెటీగనుగాని చీమనుగాని ఎవ్వరును పిలువనక్కరలేదు. అదేవిధముగా నరుడు పవిత్ర హృదయుడై సిద్ధుడైనపుడు అతని సుశీల సౌరభము ఎల్లెడలను వ్యాపింప, ముముక్షువు లెల్లరును సహజముగనే వానిచే ఆకర్షింపబడుదురు. తన మాటలను వినువారి కోసము వెదకులాడుచు అతడు తిరుగాడనక్కరలేదు.
182. మిఠాయి, లేక పంచదార పడినచోటికి చీమలు తమంతతామే వచ్చి చేరును. పంచదార వగుటకై ప్రయత్నింపుము, అనగా ఆత్మజ్ఞానమాధుర్యమును పొంద యత్నింపుము; అవును భక్తులను చీమలు తమంతతామే నీ కడకు వచ్చును. భగవదాదేశము లేకుండ నీవు బోధలు చేయ మొదలిడితివా, ఆ బోధలు నిస్సారములై, కొఱగానివై యుండును, వానినెవ్వరును చెవియొగ్గి వినరు. భక్తిచే గాని, మఱియే యితర సాధనచేగాని ముందు భగవంతుని పొందవలయును. అపుడు వారి యాదేశమును పొంది యెల్లడలను బోధలను ఉపన్యాసములను జేయవచ్చును. ఇదియే భగవంతునివలన శక్తిసామర్థ్యములను బొందు మార్గము. అటు పిమ్మట ఆచార్యుని బాధ్యతలను వహించుటకును వానిని సక్రమముగా నిర్వహించుటకును ఎవ్వడైనను శక్తిమంతుడగును.
183. మంట మండునప్పుడు మిడుతలు వచ్చిపడును, అవి యెక్కడినుండి వచ్చునో యెవ్వరికిని తెలియదు. మిడుతల బిలుచుటకై నిప్పు పరుగిడునా? ముక్తపురుషులు చేయు బోధన ఇటువంటిది, పరులను బిలుచుటకై వారు తిరుగులాడరు. కాని వందల కొలది, వేల కొలది జనులు వారి బోధనలను బొందగోరుచు తమంతతామే వారికడకు వత్తురు- వారెక్కడినుండి వచ్చి చేరుదురో ఎవ్వరికిని తెలియదు.
184. నిజమైన బోధన యెట్టిదో తెలియునా? పరులకు బోధించుటకు బదులు నిరంతరము భగవానుని భజించునెడల అదియే కావలసినంత బోధన. సంసార బంధమునుండి విముక్తుడగుటకై ప్రయత్నించువాడెవడో వాడే నిజమైన బోధకుడు. నల్దిక్కులనుండియు వందలకొలది జనులు వచ్చి ముక్తునికడ చేరి వాని యుపదేశమును బొందుటకై ఆతురపడుచుందురు. గులాబి మొగ్గ వికసింపగనే తేనెటీగలు, పిలువకయే, కోరకయే నలువైపులనుండియు వచ్చి మూగును.
185. పెద్ద వర్తకుని ధాన్యపు గొట్టునుండి కొనవచ్చిన వారికి ధాన్యము నొకడు గొలుచుచునే యుండును. వాని వెనుకనుండి ధాన్యము తెంపులేకుండ వచ్చిపడుచుండును. చిల్లర వర్తకుని రాశియో, శీఘ్రముగా తఱిగిపోవును. అదే విధముగ భగవద్భక్తుని హృదయమున సత్సంకల్పములను సద్భావనములను నిరంతరము భగవంతుడే తోపించుచుండును. అందువలన నవనవోనే్మషమైన భావములకు వానికెన్నడును లోపము కలుగదు. కాని పుస్తకములను బట్టుకొని ప్రాకులాడు పండితులు చిల్లర వర్తకులను బోలుదురు. ఆశయములకును భావములకును వారి కెప్పటికప్పుడు లోపము గలుగుచునే యుండును.
186. పురమున వాయుదీపములు వివిధ భాగములలో ఒకచోట ఎక్కువగను మఱియొకచోట తక్కువగను ప్రకాశించుచుండును. కాని దీపమునకు ప్రాణమగు వాయువు మాత్రము అన్నిటికిని సామాన్యమగు ఒకే యంత్రమునుండి వచ్చును. వివిధ దేశ కాలములందలి నిజమైన మత బోధకులందఱును ఈ వాయుదీపములవంటివారు. నిరంతరము వీరియందుండి వెలువడు ఆత్మతేజమునకు ఆధారభూతుడైనవాడు ఒకే పరమేశ్వరుడు.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి