సబ్ ఫీచర్

ఈవీఎంల ‘ట్యాంపరింగ్’ దుమారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలామంది నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ పై పదే పదే మాట్లాడుతున్నారు. ఈ విషయమై ప్రస్తుతం పెద్ద దుమారమే చెలరేగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా చాలామంది రాజకీయ నాయకులు ఈవీఎంలను విశ్వసించడం లేదు. వాటి నిర్వహణ, వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఈవీఎంల ద్వారా అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు ఊతం ఇచ్చాయి. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూరప్ విభాగం ఇటీవల లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షుజా కాలిఫోర్నియా నుంచి లైవ్ వీడియో ద్వారా మాట్లాడారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలను కొందరు ట్యాంపరింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీల్లో ఇలా అక్రమాలు జరిగినట్లు వివరించారు. ఈ అవకతవకల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బిజెపీ గెలిచిందని చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆయన ఆరోపించారు. 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు, ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్- ఛత్తీస్‌గఢ్- రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అయితే, తమ బృందం ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం వల్ల ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలైందన్నారు. కాగా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో, కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలకు తావులేదని భారత ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కానేకాదని వివరణ ఇచ్చింది. ఈవీఎం అనేది ఓట్లను నమోదుచేసే యంత్రం మాత్రమేనని, దానిని ఎవరూ నియంత్రించలేరని (ప్రోగ్రామ్ చేయలేరని) ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన పలు శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు ఎన్ని జరుగుతున్నాయో అంతకుమించి వాటిని దుర్వినియోగం చేసేవారు కూడా తయారవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగిస్తున్నారో పరిశీలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమేమీ కాదని అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు. 20 దేశాలలో మాత్రమే వినియోగిస్తున్నారు. టెక్నాలజీని ప్రమోట్ చేసే చంద్రబాబు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారంటే కాస్త ఆలోచించవలసిన విషయమే. ప్రజాస్వామ్యాన్ని యంత్రాలపై ఆధారపడేలా చేయడం సమంజసం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించాలని టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడతామని వీరు స్పష్టం చేశారు. దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్‌తో పోలింగ్ నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఛాలెంజ్ విసిరారు. ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బ్యాలెట్‌లనే వినియోగించాలని జాతీయ స్థాయిలో 22 బీజేపీయేతర పార్టీల ప్రతినిధులు త్వరలో ఎన్నికల సంఘాన్ని కలిసి కోరనున్నారు. ఈవీఎంలపై ఇన్ని అనుమానాలు, ఇంత దుమారం రేగుతున్న సమయంలో ఎన్నికల సంఘం బాధ్యత మరింత పెరుగుతోంది. ఈవీఎంలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నందున ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బ్యాలెట్ల అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలించాలి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలనే వినియోగించినా తగిన జాగ్రత్తలు, గట్టి భద్రతా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎన్నికల సంఘంపై ఉంది.

-శిరందాసు నాగార్జున 94402 22914