సబ్ ఫీచర్

ఫిన్లాండ్‌లో టీచర్‌కే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచమంతా నేడు ఫిన్లాండ్ దేశం వైపు చూస్తోంది. అక్కడి ప్రగతి రహస్యం ఆ దేశ ప్రజలల్లోనే ఉంది. పిల్లలు, ఉపాధ్యాయుల్లోనే ఆ రహస్యం దాగి ఉన్నది. ఉపాధ్యాయ వృత్తికిచ్చిన గౌరవం, సామాజిక స్థాయి, ఉపాధ్యాయులకు ఆ వృత్తిపైన అంకిత భావం, ఉపాధ్యాయుణ్ణి ఎంపిక చేసే పద్ధతి ఇవే ఫిన్లాండ్ ప్రగతికి కారణాలు. దీనికితోడు ఆ దేశంలో ఉండే సంప్రదాయాలు, ఆచారాలు కూడా తోడ్పడినాయి. వధూవరులు ఇద్దరూ అక్షరాస్యులైతేనే వివాహానికి అర్హులు. ఆ దేశంలో చదువుకూడా గృహస్థులు కావటానికి ఒక నిబంధన.
ఆ దేశంలో ఉపాధ్యాయులపై అపారమైన నమ్మకం ఉంది. స్కూళ్లపై ఎలాంటి ఇన్స్‌పెక్షన్లు ఉండవు. ఉపాధ్యాయులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. వృత్తిపరమైన స్వతంత్రత ఉంటుంది. ఉపాధ్యాయులు తాము పనిచేసే స్కూళ్లకు సంబంధించిన ‘కరిక్యులమ్’ను నిర్ణయిస్తారు. అన్ని స్కూళ్లకు ప్రభుత్వమే నిధులను అందజేస్తుంది. ఆ దేశంలోని మీడియా ప్రతి ఏడాది ఒక పోల్‌ను నిర్వహిస్తుంది. మీకు ఇష్టమైన వృత్తి ఏది? అని వృత్తిపరమైన పోల్ నిర్వహిస్తే ఉపాధ్యాయ వృత్తిపైనే ఆ దేశ ప్రజలు తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు. ఎలాంటి భార్య కావాలంటే ఉపాధ్యాయవృత్తిలో ఉన్న వారిపైనే యువకులు మొగ్గు చూపుతారు. ఆడవాళ్లకు ఎలాంటి భర్త కావాలంటే డాక్టరన్నా, టీచర్ అన్నా కావాలని వారు చెబుతారు. ఆ దేశంలో ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు కోరుకుంటున్నారని ఎవరిని అడిగినా- ‘మా రక్తంలోనే ఉపాధ్యాయ వృత్తిపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. మా ముందుతరాల వారంతా ఉపాధ్యాయ వృత్తివారే..’ అని చెబుతారు. దానే్న ‘ఫెడగారికల్ లవ్’ అంటారు. బోధనపై ప్రేమే దానికి కారణం.
అక్కడ ఉపాధ్యాయుల ఎంపిక చాలా పకడ్బందీగా జరుగుతుంది. అది రెండు దశలలో ఉంటుంది. ప్రతి సంవత్సరం మే మాసం లోగా 8 విశ్వవిద్యాలయాలు కలిసి ఉపాధ్యాయ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సిలబస్‌ను ఆ విశ్వవిద్యాలయాలే నిర్ణయిస్తాయి. విద్యార్థులలో మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచటానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? సామాజిక అంశాలపై ఉపాధ్యాయులకు ఉండాల్సిన అవగాహన ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉపాధ్యాయ పరీక్ష అర్హతకు సంబంధించినవే. రెండో దశ పరీక్ష ఎంపికకు సంబంధించింది. అభ్యర్థి విద్యాప్రగతి, స్పోర్ట్స్ యాక్టివిటీ, ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీ వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. చివరగా తరగతి గదిలో పాఠం చెప్పిస్తారు. ఇలా ప్రతి దశలో ఉపాధ్యాయ అభ్యర్థులను పరిశీలించి నియామకం చేస్తారు. ఇదే మాదిరి నియామకాలు సింగపూర్, సౌత్ కొరియాలో జరుగుతాయి. టీచర్ రిక్రూట్‌మెంట్‌లో సంబంధిత ఉపాధ్యాయుణ్ణి ఎంపిక చేయటమే ప్రధానం. ఆ దేశంలో ఉపాధ్యాయుడికున్న గౌరవం ఇది.
పరివర్తనే లక్ష్యంగా...
ప్రతి దేశంలో విద్య అనగా ఏమిటిది? దాని లక్ష్యం ఏమిటిది? అన్న ప్ర శ్నలు చర్చకు వచ్చాయి. ఆనాడున్న పరిస్థితులనుబట్టి దేశ అవసరాలనుబట్టి ఒక్కొక్క మహానీయుడు ఒక్కొక్క విధంగా చర్చించారు, నిర్వచించారు. కానీ, ఎవరు కూడా జీవనోపాధి కోసం మాత్రమే చదువు అని నిర్వచించలేదు. అమెరికాలో జఫర్‌సన్ కావొచ్చును. భారతదేశంలో జవహర్‌లాల్ నెహ్రూ కావొచ్చును, బ్రెజిల్ ఉన్న ఫాల్‌ఫెర్రి కావొచ్చును. బ్రెజిల్‌లోని ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్టం చేయటానికే చదువు అన్నారు. విద్యాలయాలు రాజకీయ క్షేత్రాలు అన్నారు. ప్రజలను రాజకీయంగా చైతన్యపరచటమే విద్య లక్ష్యం అన్నారు. చదువు ద్వారా ప్రజలకు సున్నితంగా రాజకీయ చైతన్యం కలిగించగలగాలి. దానికోసం ఫెర్రీ ‘‘పీడిత ప్రజలకు బోధన’ అనే పుస్తకం రాశారు. పీడిత ప్రజలకు పాలనా వ్యవస్థ ద్వారా ఏ విధంగా పాత్రధారి చేయాలో చెప్పాడు. విద్య ద్వారా సున్నితమైన చైతన్యం ఎలా కలిగించాలో సూచించాడు.
చదువు జీవిత లక్ష్యంపై భరోసా కలిగించటమే. అది లేకుంటే మనిషిలో పెనుగులాట రాదు. రేపటి గురించి ఏం చేయాలన్న ఆతృత మొదలుకావాలి. అందుకు చదువు సాధన కావాలి. చదువుద్వారా విద్యార్థిలో పెనుగులాట లేకుంటే- దేశం నిస్తేజంగా ఉంటుంది. రేపటి గురించి నమ్మకం ఉంటేనే ఆలోచిస్తాడు. ఉమ్మడి పోరాటాలకు సిద్ధపడతాడు. ప్రస్తుత సుఖాన్ని రేపటి కోసం త్యాగం చేస్తాడు. చదువు లక్ష్యం సమాజాన్ని మానవీకరణ చేయటమే. ప్రజల జీవనాన్ని నిన్నటికన్నా మెరుగైనదిగా తీర్చిదిద్దటమే. ప్రజల అవసరాలను కనుక్కోవటం, రేపటి అవసరాలను గురించి ఆలోచించటం అనగా చదువుకు దార్శనికత లేకుంటే సమాజంలో చైతన్యమే ఉండదు. చదువు ఎందుకు? అనే ప్రశ్నకు భవిష్యత్తుపైన భరోసా కలిగించటమే. అనగా వచ్చే తరానికి తనకన్నా మెరుగైన జీవితం ఉండాలని ఆకాంక్షించాలి. దాని కోసం పెనుగులాడటం జరగాలి. అందుకు కావల్సిన నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. వచ్చేతరం కోసం కృషిచేయాలి. అందుకే కావల్సిన అవసరాల గురించి శోధించాలి. ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసి లాటిన్ అమెరికాను మేలుకొలపాలి. భవిష్యత్ నిర్మాణానికి చదువును ఉద్యమంగా మార్చుకున్నారు. అందుకే ఫెర్రీని విప్లవాత్మక విద్యావేత్త అంటారు. ఇలాంటి ఎంతోమంది మహానీయుల తపస్సు ఫలించి విద్యారంగం నిర్మితమైంది. దానిలో ఒక పాత్రధారి అవుతున్నందుకు ప్రతి ఉపాధ్యాయుడు గర్వించాలి. ఉపాధ్యాయ వృత్తి పొట్టపోసుకోవటానికి కాదు. జాతికి భవిష్యత్తుపై నమ్మకం ఉత్సాహం కలిగించటానికి రేపటి కోసమై ఇవ్వాల్టి సుఖాల్ని త్యాగం చేసే లక్షణం కలిగి ఉండాలి. అప్పుడే సమాజ పరివర్తనకు స్కూళ్లు సాధనాలుగా మారుతాయి. పాఠశాల లక్ష్యం పరివర్తన కలిగించడం.
అక్షరం ఏం చేస్తుందంటే?
అక్షరం ఇతరుల కనపడని దానిని చూపిస్తుంది. ఈ పరిజ్ఞానమే మనిషికి అదనపుజ్ఞానాన్ని ప్రసాదించింది. ఇతరులకు వినపడని అనాథల ఆవేదనను వినిపిస్తుంది. మనిషిని ఇతర ప్రాణుల కన్నా విశిష్టమైనదిగా చెక్కుతుంది. ఈ జ్ఞానం సమాజం ఇచ్చిన శక్తి. సమాజానికి ఆ జ్ఞానాన్ని తిరిగి ఇచ్చినవారే మానవత్వం గల వారు అని ఫెర్రీ అంటాడు. చెరుకు తోటల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రమను చూస్తే వారికి దోపిడీ నుంచి విముక్తిచేసే శక్తి అక్షరం ఇచ్చింది. దానే్న మనం రీడింగ్ అంటాం. చదవటం మీ పరిధిని పెంచింది. ఇతరుల చేతి నుంచి జారుతున్న అక్షరాలు మీదగ్గరికి ఎలా వచ్చాయో జ్ఞప్తికి తెచ్చుకోండి. మనిషికి రాత రాయటం నేర్పింది అక్షరం మెదడు నుంచి జారి చేతిగుండా వచ్చి అది రైటింగ్‌గా మారింది. రాయటం లేకపోతే నీకు కనపడని దృశ్యాల నాదం వినపడేదా? చదవటం, రాయటం అన్నవి మనిషిని చెక్కుతాయి. ఇది సమాజం ఇచ్చిన నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని ప్రజలందరిలో కల్గించటానికి చేసే కృషే వయోజన విద్య. వయోజన విద్యాకేంద్రాలు బడులు కావు, ఇవి ఆశ్రమాలు. కొత్త సంకల్పంతో మనిషి సన్నద్ధుడవుతున్నాడు కాబట్టే పేద ప్రజల సంకెళ్లు తెంపబడుతున్నాయి.
వయోజన కేంద్రాలతో ఫెర్రీ లాటిన్ అమెరికాలో కొత్త సైన్యాన్ని సృష్టించగలిగాడు. చూపులేని వారికి దృష్టికల్గిస్తే ఏ మార్పు వస్తుందో వయోజన కేంద్రాలు అలాంటి మార్పుకు కారణభూతమయ్యాయి. ఆఫ్రికాలోని ప్రజలు అక్షరాస్యతలో వెనుకపడిపోవటం వల్లనే కదా వారు అమెరికాలో శతాబ్దకాలం బానిసలుగా బతికారు. పత్తి పండించారు. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పెద్దదిగా చేశారు. అక్షరాలు నేర్చుకుని విద్యావంతులు తిరుగుబాటు చేయటం వల్లనే సమత్వానికి కారణభూతమైంది కదా! కాబట్టి మనకు దక్షిణాఫ్రికాలోని కార్మికులే ఆదర్శం అని ఫెర్రీ ఉద్బోధించాడు. ఈ మాదిరిగా రీడింగ్, రైటింగ్‌లను ప్రచారం చేసి ఫెర్రీ సామాజిక కార్యకర్తగా మారాడు. అక్షరం ఎందుకు? అనే దానికి సమాధానంగా ‘పీడిత ప్రజల బోధన’ (ఫెడగాటి ఆఫ్ ఆప్రెస్‌డ్) అనే పుస్తకం రాశాడు. లాటిన్ అమెరికన్ దేశాలలో సముద్రాలు ఈది వలసలు పోయే జాతిని ఆపాడు. తమ దేశంలోనే నిర్మాతలుగా మార్చగలిగాడు. అక్కడి నుంచే ఎంతోమంది ఫెడరల్ క్యాస్ట్రోలుగా తయారయ్యారు. అర్జెంటైనాలో చేగువేరా తయారయ్యాడు. అప్రెస్‌డ్ ఆఫ్ హోప్ (పీడిత ప్రజల ఆశలు)అనే పుస్తకాన్ని ఫెర్రీ రాశాడు. ఒక ఉపాధ్యాయుడు ఏం సాధింగలడో చూపించాడు. పాఠశాలలు లాటిన్ అమెరికా దేశాల భవిష్యత్ నిర్ణేతలుగా మారాయి. అందుకే ప్రఖ్యాత విద్యావేత్త కొఠారి తరగతి గదిలోనే దేశ భవిష్యత్తుకు రూపకల్పన జరుగుతుందన్నారు.

-చుక్కా రామయ్య