సబ్ ఫీచర్

నిరుద్యోగ నిర్మూలన పగటి కలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో అతి ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఇటీవల జరిగిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 2017-18లో దేశంలో 6.1 శాతంగా నిరుద్యోగం వున్నదని, గత 45 ఏళ్ళలో ఇది ఈ స్థాయికి చేరడం మొదటిసారి అని తేటతెల్లమైంది. 2011-12లో 2.2 శాతం ఉన్న నిరుద్యోగిత 2017-18నాటికి 6.1 శాతానికి చేరుకున్నదంటే కారణం పాలక పక్షాల నిర్లక్ష్యమే అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 17.4 శాతం నిరుద్యోగిత ఉంటే, పట్టణాలలో అది 18.7 శాతంగా నమోదయ్యింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగిత అధికమవుతోందంటే- ఇందుకు కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ఉపాధి కల్పనకు పాటుపడకుండా, అరకొర ఉద్యోగాలు కల్పించడమే. ప్రస్తుత దుస్థితికి నేతల వైఖరి, ప్రభుత్వాల విధానాలే హేతువులు.
దేశం ముందుకు సాగాలంటే అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి. ఉత్పాదకశక్తిని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతే అభివృద్ధికి ఆటంకం ఏర్పడక తప్పదు. దేశ జనాభాలో సగానికి పైగా యువతీ యువకులు వున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరికొందరు తాత్కాలికంగా ప్రైవేటు రంగాలలో చిన్న చిన్న కొలువులు చేస్తున్నారు. ధనిక రాష్టమ్రని తెరాస నేతలు చెప్పుకొనే తెలంగాణలో సైతం నిరుద్యోగ సమస్య విలయ తాండవం చేస్తోంది. తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడానికి, రాష్ట్ర ఆవిర్భావానికి యువత త్యాగాలే కారణం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముందుండి, ఉద్యమం ఆకాంక్షను నెరవేస్తున్న సమయంలో ఆ పార్టీ నేతలు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో ముందుకు సాగడం వల్లే ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం ఏర్పడి అయిదేళ్లు కావస్తున్నా నిరుద్యోగ నిర్మూలన దిశగా సరైన ప్రణాళికలను అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నది.
గత దశాబ్దకాలంలో తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో నియామకాలు జరగకపోవడం ఒక్కేత్తయితే, నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా అరకొరగా ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చారు. అవి కూడా ఏవో లోపాలున్నాయనే సాకుతో కోర్టు పరిధిలో మూలుగుతూ వున్నాయి. ఒకప్పుడు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినా- ఎలాంటి సాంకేతిక లోపాలు జరగలేదు. న్యాయస్థానం వద్దకు పోవడం అరుదుగా ఉండేది. కానీ నేడు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా న్యాయపరమైన వివాదాలు ఎదురవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రతి సంవత్సరం డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత చదువులు పూర్తిచేస్తూ ఎంతోమంది విద్యార్థులు బయటికి వస్తూనే వుంటారు. ఒకప్పుడు కనీసం 10 శాతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంటే, ఇటీవలి 5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలకు అర్హతలు కలిగినా సరే నిరుద్యోగుల జాబితాలో చేరిపోతున్నారు.
ముఖ్యంగా గ్రామీణ యువత అప్పులు చేసి పట్టణాలకు వలసపోయి శిక్షణ తీసుకుంటూ గత 5 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, అరకొరగా వచ్చిన ఖాళీలకు వేలాదిమంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితి నిరుద్యోగిత తీవ్రతను తెలియజేస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. కానీ, ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసి చదువులు పూర్తిచేసిన నిరుద్యోగులను ఏ విధంగానైనా ప్రభుత్వం ఆదుకోవాలి. వీరికి ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగ భద్రత కల్పించాలి. బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి వ్యాపార రంగంలో శిక్షణ ఇప్పించాలి. ఇలా చేస్తే కొంతమందికైనా ఉపాధి దక్కుతుంది.
పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, కూరగాయల పెంపకం, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న కాంట్రాక్టు పనులు, చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలిస్తూ కొంతమేరకు నిరుద్యోగ సమస్యను తగ్గించాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చదువుకొన్న వారందరూ మంచి భవిష్యత్ కోసం వివిధ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతూ కూర్చున్నారు. వీరందరికీ ఎలాగూ ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలు, యువతను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యే విధంగా కృషిచేయాలి. జనాభాలో 50 శాతానికి మించి ఉన్న యువతకు పని కల్పించినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది. వీరి భవిష్యత్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యువతకు ఇప్పుడు కావాల్సింది వయోపరిమితి పెంచడం కాదు. ఏదో ఒక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించి, దేశ ప్రగతికి దారితీసే విధంగా కృషిచేయాల్సిన అవసరం ఉన్నది. మేధావులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గం చూపి, దేశ భవిష్యత్‌ను కాపాడాల్సి ఉంది. పాలక వర్గాలు, రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయానికి తగిన హామీ ఇవ్వాలి. ఓట్ల కోసం రాజకీయం చేసి, సమస్యను పరిష్కరించకపోతే నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆత్మాభిమానం అడ్డువచ్చి చిన్న చిన్న పనులు చేయలేక, ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులకు భారమవుతూ, ఎవరిని నిందించాలో ఏమి చేయాలో తోచక- ఎంతోమంది నిరుద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగానికి సంబంధించి గణాంకాలలో ఎలాంటి మార్పులు లేకుంటే అది పాలక వర్గాల వైఫల్యంగానే ప్రజలు భావించాలి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి సమగ్ర విధానాలను అమలు చేయాలి.

-డా. పోలం సైదులు 94419 30361