సబ్ ఫీచర్

సినిమా శివుడు శీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలో చూసే కన్ను, అర్థం చేసుకునే హృదయం వుంటే ప్రతిదీ అందమైనదే! ప్రతి పులుగు, పుట్ర, చెట్టు ఆనందతాండవం చేసేవే. సహజంగా ప్రతి ప్రాణిలో నృత్యం దాగివుంటుంది. అది వెలికితీసినప్పుడే కళవుతుంది. అతను కళాకారుడవుతాడు. అటువంటి కళాకారుల్లో ఎన్నదగిన నృత్య దర్శకుడు డాక్టర్ శ్రీను. పరిశ్రమ దృష్టిలో శీను మాస్టర్. ఒకప్పటి తెలుగు సినిమా టైటిల్స్‌లో ‘నృత్యం: హీరాలాల్’ అన్న పేరు చూసిన గుర్తు చాలామందికే ఉండొచ్చు. ఆయన ప్రియ శిష్యుడే ఈ శ్రీను. 80వ దశకంలోకి పడిన ఆయన వెయ్యి చిత్రాల మైలురాయి దాటారు. అందుకే హార్వర్డ్ బైబిల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ‘వెనె్నల’ ఆయనను కలిసినపుడు అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ -ఎన్నో విషయాలు ముచ్చటించారు.

డాన్‌లో అమితాబ్ బచ్చన్ కిళ్లీ పాట ఎంత పాపులరో మీకు తెలుసు. అపుడు అమితాబ్ వయస్సు 37ఏళ్లు. అదే సినిమాని యుగంధర్‌గా రూపొందిస్తే, ఆ చిత్రంలో ‘ఓరబ్బా వేసుకున్నా కిళ్లీ’ పాటకు నృత్యం చేసే సమయానికి ఎన్టీఆర్‌కు 55ఏళ్ళు. అమితాబ్ సన్నగా వుంటే, ఎన్టీఆర్ భారీకాయంతో వుండేవారు. అయినా అమితాబ్‌కన్నా ఎన్టీఆర్ ఏమీ తక్కువ డ్యాన్స్ చేయలేదు. ఎన్టీఆర్‌లో ఎనర్జీ అలాంటిది. డాన్సులు నేను వందశాతం కంపోజ్ చేస్తే, ఎన్టీఆర్ 150 శాతం కెమెరాముందు చేసేవారు. యుగంధర్‌లో ‘నాకోసమే మీరొచ్చారు, మీ కోసమే నేనొచ్చాను’ పాటలో పులి మాస్క్ పెట్టి
ఎన్టీఆర్‌తో రూపొందించిన పాట హైలెట్. ఆయన నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కేవలం డాన్సుల
గురించే మాట్లాడుతున్నా, అంతే!

ఆదోని వాస్తవ్యుడు శ్రీను మాస్టర్. తల్లిదండ్రులు నారాయణప్ప, లక్ష్మీదేవమ్మ. హైస్కూల్ చదువుతో 1956లో బావగారైన హీరాలాల్ మాస్టర్ వద్దకుచేరాడు. డ్యాన్స్ మాస్టర్ కావాలన్న సంకల్పం లేకున్నా తన అక్క వెంబడి షూటింగ్‌లకు వెళ్లేవాడు. ఇంట్లో అప్పుడప్పుడూ డాన్సులు కంపోజ్ చేస్తున్న బావనుచూసి ఇంటి చావిట్లో తనకు తోచినవిధంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. అది గమనించిన హీరాలాల్ మాస్టర్ శీనులో ఓ నృత్య దర్శకుడిని చూశారు. శ్రీను మాస్టర్ తొలుత ఢిల్లీ రవీంద్రభారతిలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి గురుసుందర్ ప్రసాద్ వద్ద కథక్ అభ్యసించారు. తరువాత విశ్వంగురు వద్ద కథాకళి సాధన చేశారు. సినిమా నృత్యాలను బావ హీరాలాల్ వద్ద ప్రాక్టీస్ చేశారు.
**
బంకమట్టి, ఎర్రటి ఎండ, పొగలురేగే ఇసుకలో నృత్యం ప్రాక్టీసు చేసిన ఆయన తన శిష్యుడికీ అలాగే తర్ఫీదునిచ్చారు. జైపూర్ మహారాజు దర్బార్‌లో నృత్యాలు చేసే సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన హీరాలాల్, దక్షిణ భారతదేశంలో రూపొందించే అద్భుతమైన చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించి పేరెన్నికగన్నారు. అనార్కలి చిత్రం నుంచి అనేక చిత్రాలకు అక్కినేని నాగేశ్వరరావుకు నృత్య దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ, ప్రసాద్, జగపతి సంస్థలలో తమిళ, హిందీ చిత్రాలన్నింటికీ ఆయనే నృత్యదర్శకుడు. వంజికోటై వాలిబన్ చిత్రంలో వైజయంతిమాల, పద్మినిల సంవాదన నృత్యం ఆయనకు గొప్ప పేరు తెచ్చింది. అదే చిత్రాన్ని తెలుగులో విజయకోట వీరుడుగా అనువదించారు. ఈ చిత్రానికే శ్రీను మాస్టర్ తొలిసారి డ్యాన్స్ అసిస్టెంట్ అయ్యాడు. ఆ రోజుల్లో నృత్య దర్శకుడు అంటే ఒక చిత్రానికి ఒకరే ఉండేవారు. ఉత్తమపుత్రన్ (తెలుగులో వీరప్రతాప్) చిత్రంలో శివాజీ గణేశన్ హీరోగా, విలన్‌గా నటించారు. ఆ సినిమాలో ‘యారడీ నీ మోహిని’ పాటకు శివాజీ చేసిన నృత్యాలకు ప్రేక్షకులు శివాలెత్తిపోయారు. శివాజీ మూమెంట్స్‌కు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ నృత్యాలు ఎలా చేశారని ఇప్పటికీ హీరో, డ్యాన్స్ డైరెక్టర్ అయిన కమలహాసన్ ఆశ్చర్యంగా చూస్తూనే వుంటాడు. ఈ విషయానే్న శివాజీ గణేశ్‌ను కమలహాసన్ అడిగితే, అదంతా హీరాలాల్ గొప్పదనం అనేశారాయన. సువర్ణసుందరి హిందీలో రూపొందించగా, ఆయనే నృత్య దర్శకుడిగా చేశారు. జిస్ దేశ్ మే గంగా బెహతీహై, గంగా జమున వంటి చిత్రాలకు, రాజ్‌కపూర్ అనేక చిత్రాలకు ఆయనే నృత్యదర్శకులు. గంగా జమున చిత్రంలో దిలీప్‌కుమార్ చేత తొలిసారిగా చివరిసారిగా నృత్యం చేయించిన ఘనత ఆయనది. వైజయంతిమాల నృత్యం చేస్తే అందరూ చూసేశారని, ఇపుడు దిలీప్‌కుమార్ చేస్తే సరికొత్తగా ఉండి ప్రేక్షకులు చూస్తారని ఒప్పించి ఆయనచేత నృత్యాలు చేయించారు. ఆ చిత్రానికి ఆ పాట షూటింగ్‌లో దిలీప్‌కుమార్‌కు అన్నీ తానై నృత్యం నేర్పించాడు శ్రీను మాస్టర్.
1969లో నిర్మాత డూండి రూపొందించిన నేనేంటే నేనే చిత్రంతో డాన్సు మాస్టర్‌గా శ్రీను అరంగేట్రం చేశాడు. కృష్ణ, కాంచన జంటగా నటించిన చిత్రంలో నృత్యాలకు మంచి పేరొచ్చింది. తరువాత మహాబలుడు, భక్తకన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగపురుషుడు, యుగంధర్ చిత్రాలకు శ్రీను మాస్టర్ పేరు పరిశ్రమలో మార్మోగింది. 1975లో కె బాపయ్య దర్శకత్వంలో రూపొందించిన ఎదురులేని మనిషి చిత్రం ఎన్టీఆర్ సరికొత్త నృత్యాలకు తెరతీసింది. ఆ చిత్రంలో కసిగా వుందా? కసికసిగా వుందా?/ కృష్ణా ముకుందా మురారి/ దెబ్బ తగిలిందా నొప్పిగా వుందా.. లాంటి ఆత్రేయ పాటలకు శ్రీను మాస్టర్ డ్యాన్స్ కంపోజ్‌తో థియేటర్లలో ఆడియన్స్ గంగవెర్రులెత్తారు. ముఖ్యంగా ఎన్టీఆర్- వాణిశ్రీల సరికొత్త నృత్యాలకు ఆనాటినుంచే కొత్త ఒరవడి వచ్చింది. ఎదురులేని మనిషి చిత్రంలో సరికొత్త అభినివేశంతో కంపోజ్ చేసిన డ్యాన్స్‌లు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చటం తన జన్మ ధన్యమంటాడు శీను మాస్టర్. తన గురువు హీరాలాల్ దిలీప్‌కుమార్‌ను ఎలా ఒప్పించి నృత్యం చేయించారో, అలా తాను ఎదురులేని మనిషి చిత్రం కోసం ఎన్టీఆర్‌ను ఒప్పించానంటారు. తాను కంపోజ్ చేసిన ప్రతి స్టెప్‌నూ ఎన్టీఆర్ ఓ తపస్సుగా భావించి చేశారని, అది ప్రేక్షకులకు నచ్చడం తన పూర్వజన్మ సుకృతమని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత వచ్చిన అడవిరాముడు, వేటగాడు తదితర చిత్రాల్లో ఎన్టీఆర్ నృత్యాల వెల్లువ సాగిందని, అది తనతోనే ప్రారంభం కావడం మరింత ఆనందాన్నిస్తుందని అంటారు.
నేను చేసిన చిత్రాల్లో హీరోయిన్లను ఒకింత ఇబ్బందిపెట్టేవాడిని. ముఖ్యంగా ఎదురులేని మనిషిలో వాణిశ్రీ ఎన్టీఆర్‌తో నృత్యాలు చేసేప్పుడు ఇబ్బందిపడ్డారు. ‘కృష్ణా ముకుందా మురారి’ పాటను హోగెన్‌కల్‌లో చిత్రీకరించాం. ఆమె పైటను ఆయన మెడకు చుట్టేసి నృత్యం చేయించా. జయప్రద యమగోలలో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. వీళ్లందరూ తిట్టుకుంటే ననే్న తిట్టుకోవాలి. అగ్నిపూలు చిత్రం కోసం ‘ప్రియుడా పరాకా ప్రియతమా పరాకా’ స్నేక్‌డాన్స్ షూటింగ్‌కు 12 రోజుల కాల్షీట్లు తీసుకున్నా. మూడు రోజులు రిహార్సిల్స్ చేసి ఆరు రోజుల్లోనే పాటను పూర్తిచేశాం. ఆ పాటకోసం దాదాపు ఆరు డ్రస్సులు కుట్టించాం. రోజుకొక డ్రెస్ చిరిగిపోయేది. అలాగే ముందడుగు, హిందీలో రూపొందించిన మక్సద్ చిత్రాల్లో క్లైమాక్స్ పాటలో శ్రీదేవి, జయప్రద డ్యాన్స్‌లకు మంచి పేరొచ్చింది.
ఏజెంట్ గోపీలో జయమాలినితో బాత్‌టబ్ నృత్యం, పట్నవాసంలో ఆమెతోనే చేసిన లోదుస్తుల నృత్యం పేరుతెచ్చాయి. ఏదైనా సరే సిట్యుయేషన్ పరంగానే నృత్యాలు కంపోజ్ చేసేవాడిని. చుట్టాలున్నారు జాగ్రత్తలో కృష్ణ చేసిన అప్పనా తనా మనా, ఏకలవ్య చిత్రంలో మోగింది ఢమరుకం సెమీ క్లాసికల్ పాటను అద్భుతంగా చేశారు. అలాగే తోడుదొంగలు చిరంజీవి- కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి’ పాటకు మంచి పేరొచ్చింది. భక్తకన్నప్పలో డ్రమ్స్ డాన్సు బాపు దర్శకత్వంలో వచ్చింది.
ముఖ్యంగా రీమేక్ చిత్రాలకు పాటలు కంపోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. చంద్రమోహన్‌తో రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రంలో ‘చిలకుంది చిలకా’ పాట రిషికపూర్ చేసిన ‘పరదా హై పరదా’ పాటకు ఏంతగ్గింది. అదేవిధంగా నటీనటుల సహకారం లేనిదే ఏమీ చేయలేం. కన్నడలో రాజ్‌కుమార్‌తో తప్ప దాదాపు అందరి హీరోలతో చేశా. భానుప్రియతో స్వర్ణకమలంలో ‘శివపూజకు చివురించిన సిరిసిరిమవ్వ’ పాటకు నంది అవార్డు రావడం ఆనందాన్నిచ్చింది. అదేవిధంగా శ్రీరామరాజ్యంలో ‘జగదానంద కారకా’ నంది అవార్డుతెచ్చింది. ఆ పాటలో చిన్నపిల్లలతో చేయించడం చాలా కష్టమైంది. అప్పట్లో లవకుశ చిత్రాన్ని ఎలా చేశారో అనిపించింది. చిన్నపిల్లలతో చేసేటప్పుడు లిప్‌మూవ్‌మెంట్ వుంటే లెగ్ మూవ్‌మెంట్ పోతుంది. లెగ్ మూవ్‌మెంట్ వుంటే లిప్ మూవ్‌మెంట్ పోతుంది. ఈవిషయంలో అక్కినేని నాగేశ్వరరావు పిల్లలతో తీస్తున్నావు, చాలా జాగ్రత్తగా తీయాలి అని చెప్పడంతో మరింత అలెర్ట్ అవ్వాల్సి వచ్చింది.
బిల్లా- రంగ చిత్రంలో చిరంజీవితో చేసిన నా పేరే బిల్లా/ రావేమే పిల్లా పాటతోపాటుగా, ఇంటిగుట్టులో ఆయన చేసిన నృత్యాలకు మంచి పేరొచ్చింది. చిరంజీవి బాడీలోనే ఓ ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. కృష్ణ తొలి చిత్రానికి నేను డాన్స్ అసిస్టెంట్. పద్మాలయ సంస్థ 1970లో ప్రారంభిస్తే నేనే డాన్సు డైరెక్టర్‌ని. సింహాసనం చిత్రానికి, ఆయన వందో చిత్రం, 200వ చిత్రాలతోపాటుగా దాదాపు 80శాతం చిత్రాలకు నృత్య దర్శకత్వం చేశాను. కృష్ణంరాజు, బాలకృష్ణ, రంగనాథ్, నరేష్, మోహన్‌బాబు, నరసింహరాజు, జయప్రద, శ్రీదేవి, జ్యోతిలక్ష్మి, జయమాలిని తదితర ఎందరో నటీనటులతో నృత్యాలు చేయించాను. హిందీ, తమిళంలో అందరి హీరో హీరోయిన్లతో నృత్యాలు చేయించా. దాదాపు 50ఏళ్లు డాన్సుమాస్టర్‌గా కొనసాగడం సామాన్య విషయం కాదు. డ్యాన్స్ మాస్టర్‌గా తృప్తిచెందానని ఎప్పుడూ అనుకోను. కళ అనేది ఎండ్‌లెస్. మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. ఏ హీరో బాణీకి తగ్గట్టుగా అలా చేయించే ప్రయత్నమే చేసేవాడిని. జనం ఇలా కావాలని ఎప్పుడూ అడగరు. మనం ఇచ్చింది బావుంటే చూస్తారు, లేదంటే చూడరు, అంతే. మాయాబజార్ కావాలని కెవి రెడ్డిని ఎవరైనా అడిగారా? కెఎస్‌ఆర్ దాస్, పి చంద్రశేఖర్‌రెడ్డి, బి గోపాల్, రేలంగి నరసింహారావు, పి సాంబశివరావు లాంటి లెజండరీ డైరెక్టర్లు చేసిన వందశాతం చిత్రాల్లో 80 శాతం చిత్రాలు నృత్య దర్శకత్వం చేశాను. రాధాగోపాలం చిత్రానికి నంది అవార్డు, విహా శివరంజని, భరతముని, నిమాయిఘోష్ లాంటి అవార్డులు వరించడం ఆనందాన్నిస్తుంది.

-సరయు శేఖర్