సబ్ ఫీచర్

పదునెక్కిన ప్రచారాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొబ్బరికాయతో మొదలెట్టి గుమ్మడికాయతో ముగించటం -షూటింగ్ సెంటిమెంట్. ఫస్ట్‌లుక్ చూపించి ప్రీరిలీజ్ వరకూ వెంటాడటం ప్రమోషన్స్ ట్రెండ్. ఒకప్పుడు ఇది పబ్లిసిటీ. ఇప్పుడు ప్రమోషన్స్. అంటే ప్రచారం చేయడం మానేసి, మెదళ్లపై రుద్దడం మొదలెట్టారన్న మాట. వ్యాపారకోణంలో చచ్చినట్టు అనుసరించాల్సిన సినిమా ఫార్మాట్ ఇది. భిన్నంగా వెళ్తే..? వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కువ శాతం మాడు పగిలిపోవడం ఖాయం. అందుకే -ప్రచారం ఎంత గొప్పదైతే ఫలితం అంత గట్టిగా ఉంటుందన్న నమ్మకాలు నిదానంగా నాటుకుపోయాయి.

ఓ స్టార్ దర్శకుడు బడా నిర్మాతను ఒప్పించి స్టార్ హీరోతో సినిమా మొదలెట్టాడంటే చాలు -మొదలవుతుంది ప్రమోషన్ పర్వం. ఒకరికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండానే -విషయం లీకవుతుంది. మీడియాలో వార్తవుతుంది. అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపేముందు శాస్తవ్రేత్తలు నిర్వహించే కౌంట్‌డౌన్ మాదిరి -ముహూర్తం రోజుకు మూడు రోజుల ముందే కౌంట్‌డౌన్ స్టార్టవుతుంది. కొబ్బరికాయ కొట్టడమే తరువాయి -ప్రాజెక్టు గొప్పల్ని గొప్పగా చెబుతూ ఆడియన్స్‌కు గాలం వేయడం ఆరంభమవుతుంది. ఎంత వీలైతే అంత ఎక్కువ పబ్లిసిటీ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతారు. ఫలానాచోట భారీ సెట్టింగ్స్ వేశామని, సెట్ మొత్తం గ్రామీణ నేపథ్యాన్ని తలపిస్తోందని మరోసారి, పౌరాణికాలో జానపదాలో, చారిత్రకాలో అయితే అక్కడ యుద్ధవాతావరణమే కనిపిస్తోందన్న ముచ్చట్లూ ఆటోమేటిక్‌గా బయటకు వస్తుంటాయి. మీడియాలో వార్తలవుతుంటాయి. ఫలానా దర్శకుడు ఫలానా సన్నివేశం కోసం ఫలానా దేశానికెళ్లి అక్కడి ఇండస్ట్రీలోని గొప్ప దర్శకులు, టెక్నీషియన్స్‌ని కలిసాడన్న సబ్ ప్లాట్‌లూ వినిపిస్తుంటాయి. ఇవన్నీ ఆ సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాటలు ఫలానా స్టూడియోలో రీరికార్డింగ్ అవుతోందని, స్టార్ హీరోనో హీరోయినో డబ్బింగ్ మొదలెట్టేశారని, పేరెన్నికగన్న ఎడిటర్ కూర్పు మొదలెట్టాడని, మిక్సింగ్ అవుతోందని ఒకసారి, సీజీ చివరికొచ్చిందని మరోసారి వార్తలు వెలువడుతూనే ఉంటాయి. తొలిషాట్ మొదలునుంచి శుభం కార్డు పడేవరకూ రీళ్లురీళ్లుగా ప్రాజెక్టు విశేషాలు జనాలకు చేరాల్సిందే. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, కాస్త అటూ ఇటుగా అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లోనూ కనిపిస్తోన్న దృశ్యమే.
ఒక్కోసారి ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లకముందే -సినిమా క్రేజ్ పెంచే ముచ్చట్లు అనధికారికంగా వెలువడుతుంటాయి. ఇదో స్టయిల్. మల్టీస్టారర్ కనుక హీరోల డేట్స్ కుదరడం లేదని, చివరిక్షణంలో క్లైమాక్స్‌లో మార్పులు జరుగుతున్నాయని, కథకు తగినట్టో హీరోతో కెమిస్ట్రీ పండించగల హీరోయిన్లు దొరకడం లేదని.. ఈ కథను నాలుగేళ్ల తరువాత చేస్తే మంచిదన్న ఉద్దేశంతో ప్రాజెక్టును సైలెంట్ చేసేశామని.. ఇలా చిత్రసీమలో విచిత్రమైన సంగతులు బయటికొస్తుంటాయి. ఇదంతా కావాలని చేస్తున్న పబ్లిసిటీ స్టంటా? అంటే అవునని చెప్పలేం. అలాగని ఇది పబ్లిసిటీ కాదనీ అనలేం. భారీగా అంచనాలు పెరిగిన సినిమా కోసం ఆడియన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారన్న గాసిప్పులూ ఎవరూ పుట్టించాల్సిన అవసరం లేకుండానే పుట్టేస్తుంటాయి. ఇక సినిమా సెట్స్‌మీద ఉండగానే -సెకెండ్ ఫేజ్ ఆఫ్ ప్రమోషన్ మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎలా షెడ్యూల్స్ చేయదలచుకున్నారో -కథనాలు వెలువడుతుంటాయి. అలా మొదలయ్యే ప్రమోషన్ -షూటింగ్ దగ్గర పడిందని ఒకసారి, దాదాపుగా పూరె్తైందని మరోసారి, పోస్ట్ ప్రొడక్షన్స్‌కు వెళ్తున్నామని ఇంకోసారి ఒకే సినిమా కథనాలు మీడియాలో వస్తూనే ఉంటాయి. ఇవికాక ‘లుక్కు’లు, టీజర్లు, వీడియో లిరికల్ పాటలు, ట్రెయిలర్లు, ఆడియో ఫంక్షన్లు, ప్రీరిలీజ్‌లు.. ఓహ్ చెప్పలేనన్ని యాక్టివిటీస్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఒకచోట జరుగుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరోచోట నిర్వహిస్తారు. చవరికొచ్చేసరికి -ఆ చిత్రంలోని టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులు, స్టార్ ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు. ఇవికాకుండా సాంకేతికంగా వాట్సాప్‌లు, ట్విట్టర్‌లు, యూట్యూబ్‌లతో ఆన్‌లైన్ వైరల్స్. మిలియన్ల కొద్దీ లైకులు, టన్నులకొద్దీ కామెంట్లు.. ఇదీ ఒక సినిమా ప్రచార పటాటోపం. ఈ తతంగమంతా పెద్ద సినిమాలకే పరిమితం అనుకుంటే -రీలుమీద కాలేసినట్టే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు -చిన్న సినిమాకైనా మొత్తం వ్యవహారం కామన్. కాకపోతే ఇంటెన్సిటీలో తేడాలు ఉండొచ్చు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమే అయినా -ప్రమోషన్స్ వీకైతే ఫలితం రివర్సేనన్నది ఇండస్ట్రీ ఎరిగిన సత్యం. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే వౌత్‌టాక్‌తో హిట్టయిన సినిమాలున్నట్టే -కేవలం ప్రమోషన్స్‌తోనే ఫలితాన్ని అందుకున్న చిత్రాలూ ఉంటాయి. వాటి సంఖ్యా, వీటి సంఖ్యా బహుకొద్ది మాత్రమే అయినా -పబ్లిసిటీ మాత్రం కామన్.
హీరోల విషయానికొస్తే ఫలానా సినిమా ఫేమ్ అని, మాస్ ఓరియంటెడ్ కథ చేస్తున్నాడని, యువకులకు ఉత్తేజాన్నిచ్చే ప్రయోగాత్మక కథ అంటూ కథనాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. హీరోయిన్‌ల విషయంలో -మిస్ పెర్ఫెక్ట్ స్మైల్, మిస్ పెర్ఫెక్ట్ స్ట్రక్చర్, బ్యూటీ కంటెస్టెంట్.. పొరుగు రాష్ట్రంలో టాప్ హీరోయిన్.. ఇలా వినిపిస్తూనే ఉంటాయి. అక్కడ తీసిన ఏదేనా చిత్రం విజయం సాధించిందంటే -ఆ క్రెడిట్ మొత్తం ఇక్కడి ప్రాజెక్టుకు వాడేసుకోవడం పరిపాటి. హిట్టు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, కంటెంట్ ఇలా వాడేయడమే టార్గెట్‌గా పబ్లిసిటీ నడిచిపోతుంది. నిర్మాతల విషయాన్ని పక్కన పెట్టలేం. గతంలో వచ్చిన ఫలానా సినిమాకు సంబంధించి ఎక్కడా ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కాలేదు, దర్శకుడి అభిరుచికి తగ్గకుండా తోడ్పాటు అందించాడులాంటి చమత్కారాలు వినిపిస్తుండటం మామూలే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో -ప్రచారం సినిమాకు కొత్త ఆక్సిజన్ లాంటిది. సినిమా గెలిచి నిలవాలంటే పబ్లిసిటీ, ప్రమోషన్స్ తప్పవు.
బయోపిక్‌లు కావొచ్చు, చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు కావొచ్చు, థ్రిల్లర్లు, హారర్లు.. ఇలా అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా మొదలుకూడా పెట్టకుండానే విపరీతమైన ప్రచారానికి తీసుకొస్తున్నారు.
ఇక చిన్నా, పెద్ద చిత్రాలే కాదు, అనువాద చిత్రాలూ రీమేక్‌లు సైతం ప్రచారపర్వంలో ఏమాత్రం తగ్గడం లేదు. పక్క రాష్ట్రాల్లో స్టార్ హోదా ఎంజాయ్ చేస్తున్న నటులు చేస్తున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడానికి -చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో ఇప్పటికే రజనీకాంత్ ఒక రేంజ్‌లోవుంటే, సూర్య, కార్తి, ధనుష్‌లాంటి హీరోలు సైతం ఇక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకు భారీ ప్రచారం ఉపయోగపడటం లేదని అనలేం. అలాగే ఇటీవలి కాలంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌లాంటి సీనియర్లు సైతం తెలుగు ఆడియన్స్‌కు ఇలాంటి ప్రచారంతోనే ఒకింత దగ్గరయ్యారని అనకుండా ఉండలేం. భారీగా థియేటర్లలో విడుదల చేయడం, తొలిరోజు షోస్ కలెక్షన్లతోనే ప్రాజెక్టును చక్కబెట్టుకునే ప్రయత్నంలో నిర్మాతలు ప్రచారానికి ఎక్కడా తగ్గడం లేదు.
కొసమెరుపు: పెద్దదైనా చిన్నదైనా సినిమా బడ్జెట్‌లో 40శాతం ప్రచార ఘట్టానిదే అంటే అతిశయోక్తి కాదు. సినిమా హిట్టూ ఫట్టూ మాత్రం ప్రచారంపైనే ఆధారపడి ఉందనీ అనలేం, లేదనీ గట్టిగా చెప్పలేం.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431