సబ్ ఫీచర్

ఈ ‘పద్మా’లతో మావోలకు కనువిప్పు కలిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిస్వార్థంగా సమాజసేవ చేసిన చాలామంది సామాన్యులు, అతి సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. బయ టి ప్రపంచానికి తెలియకుండా, ప్రచారానికి దూరంగా ‘అజ్ఞాతం’గా పనిచేస్తూన్న అసాధారణ సామాన్యుల సేవానిరతిని గుర్తించి, గౌరవించడం గొప్ప విషయం. ఒక కొత్త ఒరవడి పద్మ అవార్డుల విషయంలో ఈమధ్య ప్రారంభమైంది.
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజసేవకు అంకితమవుతూ పనిచేయడం ఈ నేల నేర్పిన పాఠం. తరతరాలుగా ఈ విధానం మన సమాజంలో వస్తోంది. నిస్వార్థంగా, నిరపేక్షంగా పరోపకార బుద్ధితో పనిచేసే సంస్కృతి ఈ దేశం మూలాల్లో ఉంది. దాని కొనసాగింపుగా కృషిచేసిన అనేకమంది ఆణిముత్యాల్లాంటి మహిళలు, మగవారు తమతమ రంగాల్లో విశేష సేవలందించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారి సేవలకు గౌరవం దక్కింది, తగిన గుర్తింపు లభించింది.
ఒడిశాలో పుట్టి పెరిగి, ఝార్ఖండ్ వ్యక్తిని పెళ్లిచేసుకుని వన సంరక్షణ సమితిని ఏర్పాటుచేసి అడవికి అండగా నిలబడి, చెట్లను తన కన్న బిడ్డల్లా సాకిన జమునా తుడు గాని, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన కమలా పూజారి సేంద్రీయ వ్యవసాయం, దేశీయ వంగడాలను సంరక్షించుకుంటూ ఇతరులకు తన జ్ఞానాన్ని పంచుతూ కొత్త చరిత్ర లిఖించడం గాని, తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన అరవై ఏళ్ళ మధురై చిన్నపిళ్ళై పొదుపు ఉద్యమంతో మహిళా సాధికారతకు పాటుపడటం గాని- ఏ విప్లవానికి తక్కువ? ఇలా తమతమ ప్రాంతాల్లో తమ స్థాయికి మించిన పద్ధతిలో విప్లవం తీసుకొచ్చి పది మందికీ వీరు స్ఫూర్తిగా నిలిచారు.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపు కార్యకర్తలు (ఇప్పటి మావోలు) సైతం ఇలానే ఆయా ప్రాంతాల్లో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు నడుం కట్టారు. నక్సల్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య బతికున్న సమయంలో దండకారణ్యంలోకి కార్యకర్తలు కదిలారు. దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఆదుకోవాలన్న లక్ష్యంతో బీడీ ఆకులకు, వెదురు మోపులకు కాంట్రాక్టర్ల నుంచి సరైన ధర ఇప్పించే ఆలోచనలతో వీరు అడుగువేశారు. ఆదివాసీలకు సేవచేసి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు తూటాల్లాంటి పాటలను వెంటపెట్టుకుని వెళ్ళారు. వర్తమానంలో పద్మశ్రీ అవార్డులు అందుకున్న సమాజ సేవకుల మాదిరి కదిలిన కార్యకర్తల కడుపులో ‘రాజ్యాధికారం’ అనే స్వార్థం గూడుకట్టుకుని ఉన్నా, దాన్ని బయటకు వెంటనే వ్యక్తం చేయక ‘కపటం’తో ఆ కార్యకర్తలు కదిలారు. ఈ కీలకమైన విషయాన్ని మభ్యపుచ్చి పోరాడటంతో వారిలో నిజాయితీ లోపించింది. కపటం బుసబుస పొంగడంతో సేవ పేర సాయుధ దళాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘పద్మ’ అవార్డు గ్రహీతల కడుపులో కాపట్యం లేదు.. స్వార్థం లేదు, మసిబూసి మారేడుకాయ జేసే వ్యూహం-ఎత్తుగడలు లేవు, ద్వైదీభావం అసలే లేదు ఉన్నదల్లా నిస్వార్ధం... నిష్కల్మషం... నిరపక్షత... త్యాగం... దీనికి పూర్తి భిన్నంగా మావోయిస్టు కార్యకర్తల కార్యక్రమాలు కొనసాగాయి, కొనసాగుతూ ఉన్నాయి. విచిత్రమేమిటంటే తాము ఆదివాసీల కోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తూ అరణ్యాలలో ఉంటూ పనిచేస్తున్నామని మైదాన ప్రాంతాల, పట్టణ ప్రాంతాల ప్రజల- మద్దతుదారుల మనసులు ‘దోచుకునేందుకు’ పడరాని పాట్లు ఇంకా పడుతూనే ఉన్నారు.
తమది త్యాగం కాదని, స్వార్థమని, రాజ్యాధికార లౌక్యంతో చేపట్టిన ఓ ఎత్తుగడని, కడుపులో ‘కపటం’ పెట్టుకుని పనిచేస్తున్నామని బయట ప్రపంచానికి తెలియకుండా సిద్ధాంతం ముసుగు కప్పుకుని పనిచేయడం ఏ విధమైన నిజాయితీ అనిపించుకుంటుంది? పద్మ అవార్డుగ్రహీతల నిస్వార్థ- నిజాయితీ, సేవాతత్పరత, మానవీయ కోణం మావోయిస్టు కార్యకర్తల్లో కాగడాపెట్టి వెతికినా కనిపించదు. అలాంటప్పుడు ఎవరివల్ల ఈ సమాజానికి, మానవాళికి ప్రయోజనం కలుగుతోంది..? నిజాయితీతో నిస్వార్థంగా, తమ శక్తియుక్తిని పరోపకారం కోసం ఖర్చుచేస్తున్న వారివల్లనే అని నిస్సందేహంగా అర్థమవుతోంది.
నాలుగు దశాబ్దాల క్రితం దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు చెప్పిన మాటలు.. పాడిన పాటలు.. ఇచ్చిన నినాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈలోగా రెండు-మూడు కొత్త తరాలు వచ్చాయి. వారి ఆలోచనలు-అభిప్రాయాలు, స్పందనలు, నాలుగు దశాబ్దాల క్రితపు తమ తాతముత్తాతల మాదిరిగా లేవు. వారి చుట్టూఉన్న ప్రపంచం పూర్తిగా మారింది. ఆ మారిన ప్రపంచాన్ని మావోయిస్టు కార్యకర్తలు- దళ సభ్యులు- నాయకులు ఇపుడు పట్టించుకోవడం లేదు. పాత పద్ధతికే కట్టుబడి కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
పద్మ అవార్డు గ్రహీతలు మాత్రం వర్తమాన పరిస్థితులకు స్పందిస్తూ, అవసరమైన జ్ఞానాన్ని ప్రజలకు సేవరూపంలో బట్వాడా చేస్తున్నారు. దాంతో మావోయిస్టులకు, పద్మ అవార్డు గ్రహీతలకు హస్తిమశకాంతరం కనిపిస్తోంది. పద్మ అవార్డు గ్రహీతల్లో కొందరు నిరక్షరాస్యులు.. పెద్దగా చదువుకోనివారున్నారు. అయినా వారు భారతదేశ మూలాలను సమర్ధవంతంగా అర్థం చేసుకుని తరతరాలుగా వస్తున్న సేవా దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు. సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్ళకుండా, నిజాయితీతో సమస్యల పరిష్కారానికి తమదైన పద్ధతిలో పనిచేస్తున్నారు. వేలాది మంది ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. మావోయిస్టులు మాత్రం తమ మాట వినని, తమ మార్గానికి అడ్డుగా ఉన్నారని భావిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తున్నారు. ఆదివాసీలన్న కనికరం- కరుణ లేకుండా కత్తులు దూస్తున్నారు. నెత్తుటి ఏరులు పారిస్తున్నారు. ఈ వ్యవహారంతో భారతీయత కనిపిస్తోందా? భారతీయ ఆత్మ ఆవిష్కృతమవుతోందా? తరతరాల నుంచి వస్తున్న పరోపకారం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న మానవీయ కోణం కనిపిస్తోందా? కేవలం ‘రాజ్యాధికారం యావ’మాత్రమే గాఢంగా కనిపిస్తోంది. మరి ఇది కాపట్యమే కదా? సేవ కాదు కదా? స్వార్థమే కదా? నాలుగు దశాబ్దాల క్రితం దండకారణ్యంలో అడుగిడినప్పుడు నమ్మబలికిన కూలి, అటవీ ఉత్పత్తుల రేట్లు పెంపుదల కోసం ‘సంఘం’ పెడదామని ఆహ్వానించిన వైనం అలాగే కొనసాగుతోందా? ఆ సంఘం కాస్త సాయుధ పటాలంగా రూపొందించి రక్తం కళ్ళజూస్తూ, రాజ్యాధికారం కలలుకంటూ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, అంతర్జాతీయ పరిస్థితులను ఆదివాసీలకు వివరిస్తూ ‘క్లాసు పీకితే’ ఏమిటి ప్రయోజనం? ఆదివాసీల జ్ఞానస్థాయి ఏమిటి?... వారి ఉత్పత్తి సామర్థ్యం ఏమిటి?... వారి విద్యాబుద్ధులేమిటి?... బయటి ప్రపంచంతో వారి పరిచయం ఏపాటిది? అన్న విషయాలను విస్మరించి పరాయి దేశాలకు చెందిన కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్, వ్లాదిమిర్ లెనిన్, స్టాలిన్, మావోల బోధనలు.. వారి ఆర్థిక- రాజకీయ సూత్రాలు అడవిబిడ్డల ముందు వల్లెవేస్తే విప్లవం విజృంభిస్తుందా?
మానవ స్వభావాన్ని, జ్ఞాన సంచయాన్ని, ప్రపంచ గతిని అర్థం చేసుకునే సమర్ధతను, అసలు మనిషి ఆకాంక్షలను- అతని చుట్టూ తిరుగుతున్న ‘‘మార్పు’’నకు స్పందించే గుణాన్ని, వైనాన్ని సరైన వెలుతురులో అంచనా వేయలేనితనంతో వంద యాభై ఏళ్ళ క్రితపు నినాదాలతో ఆకర్షించి మెజీషియన్ తన టోపీలోనుంచి పావురాన్ని లేదా కుందేలును తీసినట్టు మావోలు సోషలిజాన్ని తెద్దామనుకోవడం ఎంతటి విడ్డూరం, విచిత్రం. వారి ప్రయాణమంతా కపట బుద్ధితో కొనసాగుతోంది. కడుపులో ఒకటి పెట్టుకుని, నాలుకతో మరొకటి మాట్లాడే వైఖరిని వారు అవలంబించినంత కాలం వారు విజయం సాధించలేరు. అతి సాధారణ ప్రజలు సైతం ఈ కాపట్యాన్ని సులువుగా పసిగట్టగలరు. ఎంత మభ్యపుచ్చినా ఎప్పుడో అప్పుడు కడుపులో దాచుకున్న కపట ప్రేమ బయటపడుతుంది. అప్పుడు వాళ్లు అభాసుపాలుకావడం ఖాయం.
రాజ్యాధికారంతోనే సర్వసమస్యలు పరిష్కారమవుతాయని భావించి ఛత్తీస్‌గఢ్‌లో తిష్టవేసిన మావోయిస్టుల ఆలోచనలు సరికావని ఆ రాష్ట్రానికి చెందిన పద్మ అవార్డు అందుకోనున్న తీజన్ బాయ్ తన జీవిత ఆచరణతో నిరూపించారు. అలాగే ఒడిశాలో మందు పాతరలతో మావోయిస్టులు రెచ్చిపోతున్న తీరుకు భిన్నంగా ఆ రాష్ట్రానికి చెందిన కమలా పూజారి సేంద్రీయ వ్యవసాయ విప్లవం తీసుకొచ్చారు. ప్రపంచాన్ని అధ్యయనం చేశామని చెప్పుకునే మావోల కన్నా ఇలాంటి నిరక్షరాస్యులు కోటి రెట్లు మెరుగని తమకుతాము నిరూపించారు. అలాంటి వారందరికి నీరాజనాలు పలకడం మనందరి బాధ్యత!

చిత్రాలు.. కమల *జమున

-వుప్పల నరసింహం 99857 81799