సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాపంచికుల పురాణ వైరాగ్యాదులు, వారి భక్తిరీతులు
210. లౌకికులు ఐహిక ఫలములనాశించి పుణ్యకార్యములను దానధర్మములను ఎన్నిటినో చేయుదురుగాక,- ఆపదలు, దుఃఖము, దారిద్య్రము వారిని సమీపించినంతనే ఆ పుణ్యచింత, ఆ దానపరత, అంతయు ఎగిరిపోవును. దినమంతయు ‘‘రాధాకృష్ణా! రాధాకృష్ణా!’’యని పలుకు చిలుకవంటివారు లౌకికులు. ఆ చిలుకను పిల్లి పట్టుకొనినంతనే భగవన్నామమును మఱచి యది కీచుకీచమనును. కాబట్టి మీకు నేను జెప్పునదేమనగా, అటువంటివారికి ధర్మబోధనలను తత్త్వబోధనలను జేయుట నిష్ప్రయోజనము. మీరెన్ని యుపదేశములను జేసినను లౌకికులు ఐహిక చింత విడువరు.
211. ఉక్కు చుట్టలతో అమర్పబడిన దిండుపై గూర్చుండునప్పుడది యణగును, కాని బరువుతొలగగనే ఎప్పటి యాకృతి దాల్చును. లౌకికుల విషయముకూడ నిట్టిదే. వారు పురాణశ్రవణము చేయుచున్నంతసేపు ధర్మబుద్ధితో నిండియుందురు. కాని నిత్యకృత్యములలో బ్రవేశింపగనే ఆ ధార్మిక చింతను ఉత్తమాశయములను అన్నిటిని మఱచి యెప్పటివలెనే నీచ కార్యములకు పాల్పడుదురు. ఎప్పటిమేలప్పటికే!
212. కొలిమిలో కాలుచున్నంతసేపు ఇనుము ఎఱ్ఱనై చండ్ర నిప్పువలె గాన్పించును; కాని అందుండి తీసివేసిన పిమ్మట నల్లబడును. అటులనే లౌకికులు దేవాలయమునగాని, సాధుసాంగత్యమునగాని ఉన్నంతసేపు భక్తిపరవశులుగ గాన్పింతురు; కాని యా సాంగత్యము తొలగినంతనే ఆ భక్తిపారవశ్యము అడుగంటును.
213. ఈగ అసహ్యకరమైన పుండుపై వ్రాలును; మఱల దేవుని కర్పణచేయు నైవేద్యముపైని వ్రాలును. అట్లే లౌకికుని మనస్సు ఒక సమయమున పారమార్థిక గోష్ఠిలో రమించును. మఱుక్షణముననే కామినీ కాంచనముల దగుల్కొనును. (చూ.217, 224)
214. ప్రాపంచికుని మనస్సు పేడ కుప్పలోని పురుగువంటిది. అది యెప్పుడును పేడలోనే కాలము గడపుచు, అందే యుండగోరును. కర్మము జాలత ఎవ్వరైనను దానిని ఆ మలిన స్థలమునుండి తీసి తామరపువ్వునందుంచిన యెడల ఆ పువ్వుయొక్క కమ్మని వాసన భరింపలేక చచ్చిపోవును. అటులనే లౌకికుడు తుచ్ఛమగు లోక వ్యవహారములను, చింతలను, వాంఛలను విడిచి నిమిషమైనను మనజాలడు.
215. భగవంతునిగూర్చి లౌకిక జనుల భావనలెట్లుండునో తెలియునా? తమలోతామాడుకొను పసిపిల్లల ప్రలాపములను బోలును. ఒక్కొక్కప్పుడు వారు, ‘‘దేవునితోడు!’’అని ఒట్టుపెట్టుకొందురు. ఇంటిలో వారి పెద్దవాండ్రు ఒట్టుపెట్టుకొనుచుండగా చూచి వీరును దానిని నేర్చుకొందురు. లేదా, విలాసపురుషుడొకడు ‘షోకుగా’వేషము వేసికొని, పూల తోటలో మహాచిద్విలాసముగా ఈలలు వేయుచు, చేతి కఱ్ఱను త్రిప్పుచు విహరించునపుడు ఆతడు ఏ పూవునో పుణికి, ‘‘ఆహా! భగవంతుడెంత చక్కని పూవు సృష్టించినాడు!’’అని మనసు దేనిమీదనో పెట్టుకొని పలికినట్లుండును. ఎఱ్ఱగా కాలిన యినుముపై చిలుకరింపబడిన నీటిబొట్టువలె వాని మనోభావము క్షణికము. కావున భగవంతుని కోసము మీరు పరితపింపవలయును. ఆ యమృత సాగరమున గుభాలున దుమికి మునుగవలయును.
లౌకికులు - పారమార్థిక సాధనలు
216. కాపువాడొకడు దినమంతయు చెఱకుతోటకు నీరు పెట్టుచుండెను. తన పనియైన పిమ్మట చూచుసరికి తోటలోనికి ఒక చుక్కయైనను నీరు ఎక్కలేదు. నీరంతయు పెద్ద పెద్ద ఎలుక కన్నములగుండా క్రిందికి పోయియుండెను. ధనము, కీర్తి మొదలగువానికోసం గొంతెమ్మ కోరికలను అంతరంగమున బెట్టుకొని భగవంతునారాధించు భక్తుని విషయము కూడనిట్టిదే. నిత్యము అతడు ప్రార్థనలు సల్పుచున్నను ఎట్టి అభివృద్ధిని బొందకుండును. కారణమేమన, మనసులో బెట్టుకొనిన రుూ వాంఛలను ఎలుక కన్నముల ద్వారా అతని భక్తి సాధనలన్నియు గంగపాలగుచున్నవి. యావజ్జీవము సాధన చేసి యాతడు తుదకు ‘రెడ్డి వచ్చె మొదలాడుము’ అన్నట్లు ఎప్పటివలెనే లౌకికుడై యుండును.
217. ధ్యానించునపుడు మనస్సు చలించుచుండుటకు కారణమేమి? ఒకప్పుడు ఈగ మిఠాయి దుకాణములోనున్న మిఠాయి మీద వ్రాలును. కాని పాకివాడు అశుద్ధుపుదట్ట తీసికొని ఆ త్రోవను రాగానే మిఠాయిలను విడిచి అశుద్ధముపైని వ్రాలును. కాని తేనెటీగ యెప్పుడును పూలమీదనే వ్రాలునుగాని అశుద్ధ వస్తువుల వెంటబడదు. లౌకిక జనులకు ఈ రుూగవలె ఒక్కొక్కప్పుడు భగవద్భక్తియను మిఠాయి యందు రుచి గలుగుచుండును. కాని యది క్షణికము. తుచ్ఛ విషయములందు వారికిగల సహజమైన రాగము వెంటనే ఐహిక చింతయను అశుద్ధముమీదికి వారి మనుస్సను లాగుచుండును. మహనీయులగు పరమహంసలో, సదా ఆత్మసంయోగానందమును- భగవత్ప్రేమానందమున - ఓలలాడుచుందురు.
218. దయ్యముపట్టినవానిపై మంత్రించిన ఆవాలను జల్లి మాంత్రికులు ఉచ్చాటన చేయుదురు. కాని దయ్యము ఆవాలలోనే ప్రవేశించిన యెడల వానివలన దయ్యమెటుల పోగలదు? దేనితో భగవంతుని ధ్యానింతురో అట్టి నీ మనస్సే లౌకిక వాంఛలచే కళంకితమైయున్న యెడల అట్టి క్షుద్రసాధనముతో నీ ధ్యానాదులను జయప్రదముగ నెట్లు సాగింపగలవు?
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి