సబ్ ఫీచర్

రైతులకు ఊరట కొంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు 6 వేల రూపాయలను మూడు విడతలుగా చెల్లించాలన్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సహాయం రైతులకు ఎంతోకొంత ఊరట కలిగించనున్నది. ఈమధ్య కాలంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పోటీపడి రైతులకు రాయితీలు, ఆర్థిక సహకారాలు అందించటంలో ముందుకు దూసుకెళుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం కిసాన్’ పథకాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎన్నికల గారడీగా విమర్శిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ నేతలైతే ఏకంగా తమ రైతుబంధు పథకాన్ని ఎన్డీఏ సర్కారు కాపీ కొట్టిందని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాలలో అటు కేంద్ర ప్రభుత్వ పాలకులు, ఇటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు రైతులకు సమయానుకూలంగా రాయితీల రూపంలో కొన్ని పథకాలు, నేరుగా ఆర్థిక సహాయం అందేలా మరికొన్ని పథకాలు తీసుకొచ్చారు. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ తాను దీర్ఘకాలిక వ్యూహంతో ఏర్పాటు చేసిన పంచవర్ష ప్రణాళికల్లో- మొదటి ప్రణాళికా కాలాన్ని పూర్తిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతాంగ శ్రేయస్సుకు కేటాయించారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ ‘జై జవాన్- జై కిసాన్’ నినాదాన్ని దేశవ్యాప్తంగా హోరెత్తించారు. అప్పటి ప్రధానమంత్రి విశ్వనాథప్రతాప్ సింగ్ 1989 ఎన్నికల సమయంలో తమ జనతాదళ్ పార్టీ మ్యానిఫెస్టోలో- అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను 10వేల రూపాయల వరకు రద్దుచేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన ప్రధానిగా కొనసాగిన కేవలం ఏడాదిన్నర కాలంలో ఆ హామీని నెరవేర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001-2003 మధ్య వరుసగా వచ్చిన కరవు పరిస్థితుల నేపథ్యంలో- చాలీచాలని విద్యుత్, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి ఇతరత్రా కారణాలతో అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పట్లో విద్యుత్ బకాయిలను వసూలు చేయడానికి అధికారులు రైతులపై నాన్ బెయిలబుల్ కేసులతో వేధించిన సందర్భాలు సైతం వున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, పెండింగ్ విద్యుత్ బిల్లులు రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలను నెరవేర్చారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రైతుల బాకీలనే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకున్న బాకీలు కూడా అధికారులు, వడ్డీవ్యాపారులు రైతులను వేధించకుండా వసూలు చేయాలని ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సరాసరిన 10వేల రూపాయల వరకు రైతుల బాకీలను రద్దు చేసింది. సకాలంలో బ్యాంకులకు బకాయిలు చెల్లించిన రైతుల జాబితాలను సేకరించి వారి అకౌంట్లలోకి నేరుగా 4వేల నుంచి 5వేల వరకు డిపాజిట్ చేసింది. ఈ చర్య రెండవసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా ఉపయోగపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల సమయంలో ఇటు టీఆర్‌ఎస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీలు తమ తమ మ్యానిఫెస్టోల్లో- తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఋణాలను రద్దుచేస్తామని ప్రకటించారు. ఒక్కసారిగా కాకుండా మూడు సంవత్సరాల కాల పరిమితితో విడతలవారీగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుల ఋణాలను చాలావరకు రద్దుచేశాయి. టీఆర్‌ఎస్ ప్ర భుత్వం సరిగ్గా తెలంగాణ శాసనసభ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని రైతుబంధు పథకం పేరుతో ప్రతి రైతుకు ఎకరానికి 8వేల చొ ప్పున ఏడాదిలో రెండు విడతలుగా చెల్లించే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఊరిలో, వాడలో జాతరలా రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం ద్వారానే కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాగలిగారని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైం ది. ఇదే సమయంలో సన్న, చిన్నకారు రైతులకు, కౌలురైతులకు మాత్రమే ఈ సహాయం చేస్తే బాగుంటుందని అనేకమంది సూచించినప్పటికీ కేసీఆర్ పట్టించుకోకుండా కౌలు రైతులను దూరంగాపెట్టి అన్నివర్గాల రైతులకు పంపిణీ చేశారు. చివరకు ఎన్‌ఆర్‌ఐలకు కూడా రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ జరిగింది. మరీ అతిగా పంపిణీ జరిగిందనే విమర్శలు వచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం రాజకీయంగా మరింత గట్టి పునాది వేసుకొన్నారు.
ఇదే తరహా పథకాన్ని పశ్చిమబెంగాల్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకొచ్చారని మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరోసారి ఈ తరహా పథకాన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కౌలు రైతులను కూడా సహాయం అందేలా చర్యలు తీసుకొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో రైతులకు వర్తించేలా తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకంలో 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే సాయం అందేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఇది చాలావరకు శుభపరిణామమేనని చెప్పవచ్చు. ఏది ఏమైనా నేడు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవసాయ రంగం చుట్టూ తిరుగుతుండడానికి కారణం- రైతులలో వచ్చిన చైతన్యమేనని చెప్పవచ్చు. ఇలా రాయితీలు, ఆర్థిక సా యం ఇచ్చుకుంటూ పోవడం కన్నా రైతులను స్వయం ఉత్పాదక శక్తులుగా మార్చడానికి అవకాశాలు లేవా? అని అనేకమంది విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి దళారీ వ్యవస్థను దూరం చేసి, రైతులకు కావలసిన ఎరువులు, ఇతరత్రా పనిముట్లు సరైన విధంగా సమకూర్చాలి. రైతులు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను, ప్రకృతి పరమైన సమస్యలను దూరం చేస్తే ఇలా తాయిలాలు ఇవ్వనక్కర్లేదు. ఉచిత పథకాల కోసం ఎదురుచూడకుండా రైతులు ఆత్మగౌరవంతో బతకాలి.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212