సబ్ ఫీచర్

ఓ.. ఓ.. పార్వతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా నలుపు తెలుపుదే కావొచ్చు. కానీ, గుర్తు చేసుకున్నపుడు గుర్తించలేనన్ని రంగులు మనసు చుట్టూ వలయాలవుతాయ. పాత చిత్రాల గొప్పతనం అలాంటిది.
అప్పటి నటులూ అలాంటివాళ్లే. వెతికి పటుకుంటే ఆ మణిపూసలు ఇప్పుడూ ఎక్కడోకచోట దొరుకుతున్నాయ. వాటిని కదిలిస్తే ఎన్నో సంగతులు చెబుతుంటాయ. జ్ఞాపకాల దొంతర్లను రీళ్లురీళ్లుగా కళ్లముందు కదలాడిస్తాయ. ఆ ముచ్చట్లు వినేకొద్దీ వినాలనిపిస్తుంది. ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటే బావుంటుందనిపిస్తుంది. అలాంటి ముచ్చట్ల కోసం ఈవారం అనూరాధను కలిసింది వెనె్నల.

దేవదాసు.
తెలుగు చిత్రసీమ సగర్వంగా చెప్పుకోదగ్గ చిత్రం. ఎన్నాళ్లకూ ఎనే్నళ్లకూ వనె్నతగ్గని కథారాజం. దేవదాసు అనగానే -అక్కినేని గుర్తుకొస్తాడు. సావిత్రి జ్ఞాపకమొస్తుంది. చిన్నప్పటి దేవద, చిన్నప్పటి పార్వతి కదలాడతారు. కథ మొత్తం రీళ్లురీళ్లుగా -బ్లాక్ అండ్ వైట్ బ్రెయిన్ స్క్రీన్‌మీద కదిలిపోతుంటుంది. సినిమాలోని పాత్రలేకాదు, కథను ముందుకు నడిపించే కుక్కపిల్ల.. మందుగ్లాసు.. చెట్టుపుట్టలు.. వెనె్నల రాత్రులు.. ఓహ్ ఎన్నని చెప్పాలి. వీటన్నింటినీ ఒక్కమాటలో చెప్పాల్సివస్తే.. -దేవదాసు.
***
ఈ గొప్ప జ్ఞాపకాన్ని వాళ్ల మనసుతో మన మెదడుకు రుచిచూపించే వాళ్లు దాదాపుగా కనుమరుగైపోయారు. టెక్నికల్ విభాగంలోనో, ప్రాధాన్యతలేని పాత్రలుగా కనిపించినోళ్లనో పక్కనపెడితే -దేవదాసు ముచ్చట్లను అచ్చంగా చెప్పగలిగే వాళ్లు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఒకరు -సావిత్రి స్నేహితురాలి పాత్ర పోషించిన సీత. రెండు చిన్నప్పటి పార్వతి పాత్ర పోషించిన అనూరాధ.
చిన్ననాటి పార్వతి చిట్టిపొట్టి కబుర్లు, గడుసు అభినయం మర్చిపోయేది కాదు. చిన్న దేవదాసును ‘తేలెనులే నీ బడాయి’ అని ఆటపట్టిస్తూ.. పొట్టిపావడా, ముడివేసిన జాకెట్టుతో బుట్టబొమ్మలాంటి బాల బంగారం కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. చిన్నప్పటి పార్వతి పాత్ర తరువాత -కొన్ని చిత్రాల్లో బాలనటి పాత్రలు చేసినా -దేవదాసే తన గుర్తింపు అంటున్నారు అలనాటి బాలనటి అనూరాధ. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అల్లికలు, ముగ్గులు, టైలరింగ్, పలురకాల పూసల బొమ్మలు తయారుచేస్తూ కాలం గడుపుతున్నారామె. తనకు అవసరమయ్యే ఆయుర్వేదం మందులను తానే తయారు చేసుకోగల వైద్యురాలు కూడా. తల్లి తమిళం, తండ్రి తెలుగు కావడంతో -రెండు భాషలు అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం అనూరాధది. గతం పదిలమైన జ్ఞాపకంగా కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్న అనూరాధ -‘వెనె్నల ముచ్చట్లు’ ఈవారం.
మూడేళ్ల పాపగా ‘సహవాసం’ చిత్రంతో కెమెరా ముందుకొచ్చాను. మీర్జాపురం రాజావారు సి కృష్ణవేణి నేతృత్వంలో రూపొందించిన ఆ చిత్రంలో -మూడేళ్ల పాపను పైనుంచి కిందికి విసిరివేసే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో -నాకు భయంతో జ్వరం వచ్చేసిందట. అలా మొదలైంది నా అభినయం. అమ్మ లక్ష్మమ్మ హెయిర్ డ్రెస్సెర్‌గా ఇండస్ట్రీలోనే పనిచేశారు. కానె్వంట్ చదువుకుంటున్న టైంలో -అప్పటి ద్రోహి హీరో కోన ప్రభాకర్‌రావు ద్వారా దేవదాసు చిత్రంలో చిన్నప్పటి పార్వతి పాత్రకు అవకాశమొచ్చింది. వరుసకు పెదనాన్న అయన నిర్మాత డిఎల్ నారాయణ అందుకు కారణం.
దేవదాసు ముచ్చట్లు ఎప్పటికీ నాగుండె గదిలో పదిలం. దర్శకుడు వేదాంతం రాఘవయ్య ప్రతి సన్నివేశానికీ ‘అమ్మడూ! ఇలారా.. ఇలా నడువు.. ఇలా ఆడు.. ఇలా చేయి పైకెత్తి నిలబడు.. ఇలా కూర్చో’ అంటూ ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా చెప్పి చేయించేవారు. నన్నొక బిడ్డలా చూశారు. షూటింగ్‌లో అక్కినేని నాగేశ్వరరావు నన్ను ‘చిపా’ అని సంబోధించేవారు. ఎందుకో నాకు నచ్చేది కాదు. ఉడుకుమోతుతనంతో ఏడుపొచ్చేది. ఒక్కసారి కాదు, ప్రతిసారీ కనిపించిన వెంటనే ‘ఏయ్ చిపా, వచ్చావా?’ అంటూ ఆటపట్టించేవారు. నేనూ ఏడ్చేసేదాన్ని. ఒక్కోసారి కోపం వచ్చేసేది. అలాంటి సందర్భాల్లో ఎస్వీ రంగారావు దగ్గరకు తీసుకుని ‘ఎందుకలా ఉడుక్కుంటావ్. నినే్నమన్నారని’ అంటూ సముదాయించేవారు. కన్నతండ్రిలా ఆయన ఓదార్పు నాకు ఆనందాన్నిచ్చేది. సావిత్రి అయితే నాకోసం ప్రతిరోజూ స్వీట్లు తెచ్చేది. ఎక్కడ పార్టీలైనా నన్ను వెంటబెట్టుకుని వెళ్లేది. ఆమెతో కలిసి పాండీబజార్‌లోని రాజకుమారి థియేటర్‌లో అనేక వేడుకలకు వెళ్లేదాన్ని. షూటింగ్ అంతా పూర్తయ్యాక ఓరోజు నాగేశ్వరరావు మళ్లీ ‘చిపా’ అని పిలవడంతో ఏడ్చేశాను. అపుడు ఆయన దగ్గరకు తీసుకుని ‘చిపా’ అంటే ‘చిన్నప్పటి పార్వతి’ అని అంటూ అనునయించారు. ‘చిపా’కు అంతరార్థం తెలిసిన తరువాత మనసు తేలికపడింది. ఆనందంగా నవ్వేశాను. ఈ విషయాలు గుర్తుకొచ్చినపుడు మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. ఎస్వీఆర్ ఎప్పుడూ ‘అనూ.. అనూ’ అని సంబోధించేవారు. షూటింగ్ అంటే ఒకే సెట్టింగ్‌లో తీయడంవల్ల నటీ నటులంతా కలిసేవారు. అప్పటికి వాళ్ల గొప్పతనం తెలీని పసి వయసు నాది. దేవదాసు షూటింగ్‌లో చిన్నప్పటి దేవదగా నటించిన సుధాకర్ బాగా ఆట పట్టించేవాడు. షూటింగ్ విరామంలో ‘పద.. స్టూడియో మొత్తం తిరిగొద్దాం. అక్కడ గార్డెన్‌లో ఆడుకుందాం’ అంటూ అల్లరి చేసేవాడు. నేను మాత్రం వెళ్లేదాన్ని కాదు. తరువాత సావిత్రి నటించిన ‘మేనరికం’ చిత్రంలో ఎస్ వరలక్ష్మి కూతురిగా నటించాను. ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కంలో పిల్లలతో ఓ గ్రూప్‌డాన్స్ బాలే వుంది. అందులో జట్టుకు నటి శారద నాయకత్వం వహిస్తే, నేనో గ్రూపుకి నాయకత్వం వహించి పాటను చేశాం. ఘంటసాల స్వయంగా నిర్మించిన స్వంత ఊరు చిత్రంలో రాజసులోచన కూతురిగా నటించాను. ఆ చిత్రమంతా విజయా స్టూడియో కొబ్బరిచెట్ల గార్డెన్‌లోనే చిత్రీకరించినట్టు బాగా గుర్తు. మా గోపిలో జమున కూతురిగా నటించా. బాలానందంలో సభ్యత్వం ఉండటంతో చిన్నప్పుడే వచ్చీరాని మాటలతో పద్యాలు చెప్పేదాన్నట. మేనరికం చిత్రంలో బడికెళ్లడానికి ఇష్టపడని పాప పాత్ర పోషించాను. అందులో చేయి కోసుకుని బడికి వెళ్లనని మారాం చేసే పాత్రను నిజ జీవితంలోనూ అమ్మదగ్గర ప్రయోగించేదాన్నట.
1970లో చెన్నైలో పెళ్లైంది. సినిమా పరిశ్రమకు సంబంధించినవారు చాలామంది పెళ్లికి హాజరవ్వడం ఆనందాన్నిచ్చిన విషయం. హిందీ, తెలుగు సబ్జెక్టులలో భాషాప్రవీణ చదివాను. కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. అనేక పాటల్లో కోరస్‌గానూ గాత్రాన్ని అందించా. షావుకారు జానకి ప్లేబ్యాక్ పాడమని ప్రోత్సహించేవారు. అయితే పెళ్లయ్యాక ఇంట్లో ఇబ్బందుల వల్ల కుటుంబానికే పరిమితమయ్యాను. అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నోరోజులు అయినట్టుగా అనిపించదు. నా చిన్నప్పుడు నాగేశ్వరరావు, సావిత్రి, రామారావు, సూర్యకాంతం, కెఆర్ విజయ ఇళ్లకు వెళ్లి అల్లరి చేసేదాన్ని. సూర్యకాంతం నన్ను బిడ్డలా ఆదరించేవారు. ఆమె వండిన పదార్థాలన్నీ తినందే ఒప్పుకునేవారు కాదు. నేను అన్నీ తినలేను అని మారం చేసినా, వదిలేవారు కాదు. బాపు కథానాయిక సంగీత నాకు మంచి స్నేహితురాలు.
ఇప్పటి సినిమాలు నచ్చవు. హీరోయిన్లు ఒక్కరిలోనూ సరైన ఫీచర్స్ కనిపించటం లేదు. సౌందర్యను ఇష్టపడేదాన్ని. అప్పటి సినిమా కథకు, ఇప్పటి కథకు యోజనాల వ్యత్యాసం. కథానాయికల డ్రెస్సుల్లోనే కాదు, మొరాలిటీలోనూ అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం కనిపిస్తోంది. మనసుకు సంబంధించిన ప్రేమను శరీరానికి సంబంధించిన అంశంగా చిత్రీకరిస్తున్నారు. మా తరంవాళ్లకు జీర్ణించుకోడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.
**
భర్త గతించారు. ఇద్దరు ఆడపిల్లలు ఎవరి జీవితాలు వారు వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నా. సినీ పరిశ్రమ నుండి అలనాటి నటీనటులకు ఇస్తున్న ప్రోత్సాహాలేవీ నాకు అందలేదు. కనీసం వృద్ధ కళాకారులకు అందిస్తోన్న సహకారం అందినా బావుండేది అనిపిస్తుంటుంది. ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలో తెలీక నిస్సహాయంగా ఉండిపోతున్నా. అనేక చిత్రాల్లో నటించినా ఇప్పటికీ దేవదాసు చిత్రం టీవీలో వస్తే -నేనేనా అని సంబరం కలుగుతుంది. అప్పటి దర్శక సాంకేతిక నిపుణుల ఎంత గొప్పవారోనని మనసు తేలికపడుతుంటుంది.

-సరయు శేఖర్, 9676247000