సబ్ ఫీచర్

రాజ్యాంగ భద్రత లేక సన్నగిల్లిన ‘సహకారం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో అనేక వ్యవస్థలకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ వస్తున్నారు. ఈమధ్యనే ఓబీసీ కమిషన్‌కు సైతం రాజ్యాంగ భద్రత కల్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జాతిపిత మహాత్మా గాంధీ ‘గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం’ అన్నారు. గ్రామాల స్వయంశక్తికి పంచాయతీల పాలక వర్గాలతోపాటు, ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాల తోడ్పాటు వుండాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అనేక మంది పాలకులు సహకార సంఘాల అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించారు. గ్రామ పంచాయతీల పాలకవార్గలతోపాటు, సహకార సంఘాల పాలక వర్గాలకు అడపా దడపా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. చట్టసభల్లో ప్రజాప్రతినిధుల ఎన్నిక తరహాలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు కూడా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరగాలని 1989లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకువచ్చారు. దానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు.
నేటికీ సహకార సంఘాలకు సకాలంలో ఎన్నికలను నిర్వహించే పద్ధతిని తీసుకురాలేదు. సహకార వ్యవస్థ వ్యవసాయ రంగానికి అనుబంధంగా వ్యవహరిస్తున్నదే తప్ప ప్రత్యేకంగా సహకార శాఖకు కేంద్రంలో గానీ, రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రాధాన్యత లేదు. సహకార రంగానికి రాజ్యాంగ భద్రత కల్పిస్తే స్వయం ప్రతిపత్తి ఏర్పడుతుంది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే సహకార సంఘాల చట్టం 1905లో వచ్చినప్పటికీ ఈ చట్టం వ్యవసాయ చట్టానికి అనుబంధంగా రాణిస్తున్నదే తప్ప స్వయం ప్రకాశం కాలేకపోతున్నది. ‘బహుళార్థ సహకార సంఘాల చట్టం-2002’కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలో సహకార సంఘాలు, సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఇదే విధంగా ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా సహకార చట్టాలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్ణీత కాలవ్యవధి లేనట్టే నేడు సహకార సంఘాలకు కూడా ఎన్నికలు సకాలంలో జరగడం లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987లో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈ పాలక వర్గాలకు ఐదేళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పాలక వర్గాలను రద్దుచేసి మూడేళ్ల కాల పరిమితితో కొత్త సహకార చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ తరువాత సహకార సంఘాలకు 1992లో ఎన్నికలు జరిగాయి. 1995లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఐదేళ్ల కాలపరిమితి పద్ధతిని తీసుకువచ్చారు. తొమ్మిది సంవత్సరాల వరకు పాత పాలకవర్గాలే కొనసాగాయి. 2006లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మరోసారి ఎన్నికలు జరిగాయి. ఏడేళ్ల అనంతరం 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో సహకార సంఘాలకు కాలపరిమితి ముగిసినప్పటికీ నేటికీ ఎన్నికలు జరుగలేదు. తెలంగాణలో రెండు పర్యాయాలు ఆరునెలలకు ఒకసారి పాత పాలకవర్గాలనే కొనసాగిస్తూ ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని దాదాపు సన్నాహాలు పూర్తి చేశారు. మళ్లీ ఆరునెలల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సహకార ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. అనేక రాష్ట్రాలలో ఇదే విధమైన పరిస్థితి కొనసాగుతోంది. పంచాయతీ రాజ్ తరహాలో సహకార వ్యవస్థకు కూడా రాజ్యాంగ భద్రత కల్పిస్తే- సహకార సంఘాల ద్వారా పేద రైతులు ఆర్థికంగా చైతన్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు