సబ్ ఫీచర్

క్షీణదశలో మావోల ఉద్యమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మిలటరీ ఇన్‌చార్జి సట్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ సుధాకరణ్ అతని భార్య నీలిమతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆయన తలపై ఝార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయలను, నీలిమపై రూ.25 లక్షలు రివార్డులుగా ప్రకటించింది. వీరిద్దరి లొంగుబాటుతో ఆ పార్టీ క్షీణ దశ మరింత వేగవంతమైంది. పార్టీపై సుధాకర్ గుప్పించిన విమర్శలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మావోయిస్టుల తూర్పు ప్రాంతీయ బ్యూరోలోకి వచ్చే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలలో సుధాకర్ కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగాయి. ఆ బ్యూరో పర్యవేక్షకునిగా ఝార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో గెరిల్లా దళాలను చురుగ్గా నడిపించి పెద్దఎత్తున ధ్వంస రచనకు పాల్పడ్డాడు. ఆ రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళమైన ‘జాగ్వార్’కు, ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా గెరిల్లాలు విరుచుకుపడ్డారు. దాంతో సుధాకర్ పేరు ఆ రాష్ట్రంలో మారుమోగింది. అందుకే ప్రభుత్వం ఆయన తలకు కోటి రూపాయల వెలకట్టింది.
దాదాపు సంవత్సరం క్రితం ఆ రాష్ట్రంలో మరో కీలక మావోయిస్టు నాయకుడు అరవింద్‌జీ గుండెపోటుతో మరణించాడు. అతని తలపై సైతం ప్రభుత్వం గతంలో కోటి రూపాయలు ప్రకటించింది. ఆ రకంగా ఇద్దరు ప్రముఖ మావోయిస్టు నాయకులు ఝార్ఖండ్ నుంచి తప్పుకున్నారు. మావోయిస్టు ఉద్యమ క్షీణ దశను ఇది బలంగా సూచిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే రాష్ట్రానికి చెందిన కుందన్ పహాన్ అనే వ్యక్తి మావోయిజం ముసుగులో అనేకానేక దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ‘ఝార్ఖండ్ వీరప్పన్’గా కూడా అతనిని పిలిచేవారు. అతను ఓ బ్యాంక్‌కు చెందిన వ్యాన్ నుంచి రూ.5 కోట్లు అపహరించాడు. ఝార్ఖండ్ నిఘా అధికారి ఫ్రాన్సిస్ ఇందీవర్‌ను నిర్దాక్షిణ్యంగా హత్యచేశాడు. ఇలాంటివి 128 కేసులు అతనిపై నమోదయ్యాయి. ఇతను దాదాపు రెండు సంవత్సరాల క్రితం అక్కడి ప్రభుత్వానికి లొంగిపోయాడు. దినేష్ యాదవ్ అనే మరో కరడుగట్టిన మావోయిస్టు కూడా లొంగిపోయాడు.
రైళ్లు పట్టాలు తప్పేలా చేసిన మావోయిస్టులు అక్కడ అనేక మంది కనిపిస్తారు. వీరిలో చాలామందిని పోలీసులు అరెస్టుచేశారు. వారిలో చందన్ అనే మావోయిస్టు నాయకుడు ప్రముఖుడు. ఇట్లా అరెస్టులు, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, తూటాలు, మందుపాతరలు పెద్దఎత్తున పట్టుపడుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన ఎం-16 అనే రైఫిల్ మావోల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా మావోయిస్టు ఉద్యమ క్షీణ దశను పట్టి చూపుతోంది.
గత సంవత్సరం చివరలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న తన భార్యతో లొంగిపోయిన సంగతి తెలిసిందే! మరో మావోయిస్టు జంట పురుషోత్తం-వినోదిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయింది. అంతకుముందు రామన్న-పద్మ అనే సీనియర్ మావోయిస్టు జంట అరెస్టు అయింది. మావోయిస్టు నాయకుడు కాళిదాసు, శ్రీరాములు శ్రీనివాస్ లాంటివారు ఎందరో అరెస్టయ్యారు. రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడు, మావోయిస్టు అనుబంధ సంస్థలు నడిపే జి.ఎన్.సాయిబాబాకు జీవితఖైదు శిక్షపడింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారన్న కేసులో విప్లవకవి వరవరరావుతోపాటు మరో నలుగురు అనుబంధ సంఘాల్లో క్రీయాశీలకంగా పనిచేసే వారిప్పుడు వివిధ జైళ్ళలో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ మావోయిస్టుల ఉద్యమ క్షీణదశను సూచిస్తున్నాయి. చాలారోజుల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు లంకా పాపిరెడ్డి ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. మావోల అధికార ప్రతినిధిగా పనిచేసిన పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన ప్రసాద్ సైతం గతంలో లొంగిపోయాడు. ఇలా వందలాది మంది ముఖ్యులు ఉద్యమానికి దూరమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
అరెస్టులు, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతోపాటు మావోయిస్టు నాయకత్వం వయోభారంతో కుంగిపోతోంది. ఇవన్నీ ఆ ఉద్యమ క్షీణ దశకు చిహ్నాలు. మేకపోతు గాంభీర్యంతో ఎక్కడ పోరాటం ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుందని కొంతమందిని ఆకర్షించేందుకు వీరు ఇంకా ఆరాటపడుతున్నారు. గత సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 130 మంది మావోయిస్టులు మరణించారు. అటు గడ్చిరోలి, ఇటు బీజాపూర్, ఒడిశాలో అనేకమంది గెరిల్లాలు (ఆదివాసీ యువతీ యువకులు) మరణించారు. మావోయిస్టు పార్టీకి నూతన ప్రధాన కార్యదర్శిగా నంబాళ్ల కేశవరావు ఎన్నికైన అనంతరం తొలిసారి గత నెల 31న ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపు ఘోరంగా విఫలమైంది. దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అంటే ఏమిటి అర్థం? ఇది ఉద్యమ క్షీణ దశ అని చెప్పుకోక తప్పదు.
తాజాగా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ చాలాకాలం పనిచేసిన ఝార్ఖండ్‌లోనే మావోయిస్టు గ్రూపులు మూడున్నాయి. వీరిలోవీరే కాల్చి చంపుకునే సంస్కృతి చాలాకాలంగా కొనసాగుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) మావోయిస్టుకు చెందిన ఐదుగురు గెరిల్లాలు భారత్ బంద్‌కు ముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. బల్బీర్ మహతో అనే మావోయిస్టు లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ రెండు సంఘటనల్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పోలీసులకు లభ్యమయ్యాయి. మావోయిస్టు ఉద్యమక్షీణతకు లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లతోబాటు గ్రూపు తగాదాలు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ తగాదాల కారణంగా వీరిపై జనంలో విశ్వసనీయత పోయింది. ఏ గ్రూపు చెప్పేది సిద్ధాంతం.. ఏ ముఠా చేసేది దొమీ, దోపిడీ అని తెలియక తలలు పట్టుకునే పరిస్థితి దాపురించింది.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన ఒగ్గు సట్వాజీ అలియాస్ సుధాకర్ 1984లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. మావోల మిలటరీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ మూడున్నర దశాబ్దాలలో ప్రపంచం ఏ తీరున మారిందో పరిశీలించేందుకు మావోయిస్టులు ఆసక్తి చూపకపోవడం కూడా వారి క్షీణ దశకు మరో కారణం. దేశంలో ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ జరగక ముందు నాటి పరిస్థితికి, నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు, డిజిటల్ విప్లవ ఫలితాలు సమాజమంతటా పరచుకుని చిక్కనవుతున్న సందర్భానికి గల వ్యత్యాసాన్ని మావోయిస్టులు పట్టించుకోక పోవడమూ వారి క్షీణదశకు ఇంకో కారణం. పిడివాదంతో చెలిమిచేసే వారికివేమీ పట్టవు. గుడ్డెద్దు చేల్లోపడ్డ చందంగా నూతన ప్రజాస్వామిక విప్లవం పేర ఆర్థిక వనరులను- మానవ వనరులను నిర్వీర్యం చేస్తున్నారు. వారు చెప్పే నూతన ప్రజాస్వామిక విప్లవం వర్తమానంలో పనికిమాలినదని మావో మనవడే పలుమార్లు ప్రకటించారు. ఇలాంటి విషయాలు మావో మనవడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగిత జ్ఞానమున్న, హేతుబద్ధంగా, తర్కబుద్ధితో ఆలోచించే ఏ మనిషైనా అదే విషయం చెబుతాడు. కాని అవేమీ మావోయిస్టుల చెవికెక్కక పోవడం దారుణాతిదారుణం.
జినుగు నరసింహారెడ్డి, సుధాకర్, పాపిరెడ్డి, ప్రసాద్ లాంటివారు సాధించిందేమిటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కొంతకాలం ఆశావహ ఆలోచనలను ‘అరెస్టు’ చేయడం, అభివృద్ధికి అడ్డుపడటం, కాలం చెల్లిన సిద్ధాంతాలను పునశ్చరణ చేయడం తప్ప ఒరిగిందేమిటి? హళ్ళికి హళ్ళి- సున్నకు సున్నా మాత్రమే! మరోపక్క సమాజంలో తోటివారు అన్నిరంగాలలో దూసుకుపోతున్నారు. ఈ విషయాన్ని మావోలు తప్ప మిగతావారందరూ గమనిస్తున్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు, కొత్త తరాలు తమ జ్ఞాన చక్షువులతో సమకాలీన సమాజంతో కలిసి నడుస్తున్నాయి. తమదైన ‘ముద్ర’ను కనబరుస్తున్నాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన కొత్తతరాలు ఆకాశమే హద్దుగా తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. ఇది కదా అందరు కోరుకోవలసింది? దీన్ని విస్మరించి ప్రత్యామ్నాయం పేర, జనతన సర్కారు బలోపేతం పేర మందుపాతరలు పేల్చడం, రైలుపట్టాలు ధ్వంసం చేయడం వల్ల డిజిటల్ ఎకానమీ కూలిపోతుందా? ఈ మాత్రం పరిశీలన లేకపోతే ఎలా ‘కామ్రేడ్స్’? అవమానకరంగా ఉద్యమం పూర్తిగా క్షీణించక ముందే నాయకత్వం మేల్కొంటే మంచిది!

-వుప్పల నరసింహం 99857 81799