సబ్ ఫీచర్

పెంపకంలో బాధ్యతే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల బర్కత్‌పురాలో మధులిక అనే మైనర్ బాలికపై కొబ్బరిబోండాం కత్తితో ప్రేమోన్మాది భరత్ దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. జూన్ 2018లో జనం రద్దీగా వుండే కరీంనగర్ జిల్లా కలెక్టర్ సమీపంలో ఒక యువతిని కిరాతకంగా నీచంగా గొంతు కోసి చంపేశాడు ఒక దుర్మార్గుడు. ఇదేనా మన సంస్కృతి. యువత ఇలాంటి వికృత జేష్టలకు దిగజారడానికి వారిలోని మానసిక స్థితి సరిగా లేకపోవడం, యువత పాశ్చాత్య సంస్కృతికి, జల్సాలకు బానిసలుగా మారిపోతున్నారు. ఇంత కర్కోటకంగా, క్రూరమైన మనస్తత్వానికి యువత ఎదగడానికి తల్లిదండ్రుల అతిగారాబమే కారణం. బాల్యదశ నుండి విలువలను, బాధ్యతను నేర్పించకపోవడం కూడా ఒక కారణమే. దీనిని అదుపు చేయల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ, శిక్షలు విధిస్తున్నప్పటికీ యువతలో మార్పు రాలేకపోతోంది. సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అమ్మాయి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. యువతా నీ మానవత్వం ఎక్కడికి పోయింది? ఇంత కిరాతకమైన దాడి చేయడానికి నీ మనసెలా ఒప్పుకుంది. ఇలాంటి దాడులకు పాల్పడినవారిని ఏం చేయాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలు గొంతుచించుకొని అరుస్తున్నాయి. ఆడపిల్లలు సమాజంలో బయట తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్న ప్రేమోన్మాదులను ఏం చేయాలి? పాఠశాలలో, కళాశాలలో నైతిక విలువల ప్రాధాన్యత ఎందుకు తగ్గుతోంది? మానవ సంబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి?
శ్రద్ధ తగ్గుతోంది
సమాజంలో ప్రతి ఒక్కరి జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నా అనే కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, భార్యా పిల్లలకంటే వస్తువులపై మోజును పెంచుకుంటున్నారు. పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ వహించడంలేదు. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పేవారు కరువయ్యారు. పిల్లలు తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మల దగ్గర గడిపే సమయం చాలా తక్కువైంది. ఎక్కువ సమయాన్ని సెల్‌ఫోన్‌ల వినియోగానికే కేటాయిస్తున్నారు. యుక్త వయసు రాగానే చదువుల పేరుతో పట్టణాలకు వలస వెళ్లి స్నేహితులతో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటున్న వీరు సోషల్ మీడియా ప్రభావంతో చెడుదారుల్లో పయనిస్తున్నారు. లైంగిక చర్యలకు ఉసిగొల్పబడుతున్నారు. దీనితో మానసిక స్థితి గతి తప్పడం మూలంగా ఏ విధంగానైనా తను కోరుకున్న వ్యక్తిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోయి ఎలాగైనా సరే దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా జరగని పక్షంలో నాకు దక్కనిది ఇతరులకు దక్కకూడదు అనే ఆలోచనతో అంతమొందించడానికి సిద్ధమవుతున్నారు. యువతి తనను ప్రేమించడంలేదని యువకులు ఆసిడ్‌లతో, కత్తులతో దారుణమైన దాడులకు ఎగబడుతున్నారు.
మానవత్వం మంటకలుస్తోంది. మానవ సంబంధాలపట్ల విలువలు తగ్గుతున్నాయి. ప్రేమ యొక్క అర్థాన్ని నేటి యువత మార్చేస్తున్నారు. ప్రేమ అంటే ఎదుటివారిని సంతోషంగా ఉంచడం, వారి ఇష్టాయిష్టాలకు గౌరవాన్ని ఇవ్వడం. ప్రేమించకపోవడం నేరమా? ప్రేమించలేదనే అక్కసుతో కత్తులతో పొడిచి చంపేస్తున్నారు. ప్రేమ అనే మాయను సృష్టించుకొని ఉన్మాదిగా మారుతున్న యువతను సన్మార్గంలో నడిపించాలి.
ప్రేమోన్మాదం తగ్గాలంటే..
- యువత సన్మార్గంలో పెరిగే విధంగా విద్యా విధానంలో మార్పు రావాలి.
- పిల్లలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
- ప్రతిరోజూ పిల్లలతో గడిపే సమయాన్ని కచ్చితంగా కేటాయించుకోవాలి. వీలయినంతవరకు సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలు సందర్శించాలి.
- యుక్తవయసు పిల్లల యొక్క స్నేహితులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి.
- పిల్లలు దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్, సైకాలజిస్ట్‌ల సహాయాన్ని తీసుకోవాలి.
- సమాజంలో ప్రస్తుతం మంచికంటే చెడు తక్కువ సమయంలో అతి తొందరగా యువకులు ఆకర్షణకు లోనవుతున్నారు.
- ఇంటర్నెట్‌తో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని గుర్తించాలి.
- ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి.
- యువతకు స్నేహం ప్రేమకు మధ్య వ్యత్యాసం వివరించాలి.
ఒక్క నిమిషం..
జీవితమనేది మనొక్కరిదే కాదు, మనల్ని కని పెంచి, పోషిస్తున్న అమ్మా నాన్నలది కూడా. మనమీద మనకెంత హక్కుందో తల్లిదండ్రులకూ అంతే హక్కుంది. యుక్తవయసులో విపరీత ఆలోచనలకు లోనవడం సహజం. అయితే నిరంతరం మన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆగి, ఆలోచించి అందులోని మంచి చెడులను సరిచేసుకుంటూ వెళ్లాలే కాని హత్యలు, ఉన్మాద చర్యలకు పాల్పడి దిగజారిపోకూడదు.
మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి. సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఏ పరిస్థితుల్లో వున్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరుగవలసిన పనులు అవే జరుగుతాయి. మనల్ని అపహాస్యం చేసినవారిని సవాలు చేస్తూ పైకి.. పైపైకి ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. నీవు ఏదైతే కోరుకున్నావో అదే నీ దరికి చేరుతుంది.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321