సబ్ ఫీచర్

సోషల్ నెట్‌వర్కులో ఫేక్ పోస్టులెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక సమాజంలో సోషల్ నెట్‌వర్క్స్ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వాడకం ఏమేరలో ఉన్నదో వేరే చెప్పనక్కరలేదు, ఇది జగమెరిగిన నగ్నసత్యం. పాఠశాల వయసులోనే విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద మారాంచేసి స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు.
యువత మాటకొస్తే స్మార్ట్ఫోన్ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. చిన్న-పెద్ద, అక్షరాస్యుడు-నిరక్షరాస్యుడు, ధనిక-పేద అనే తేడాలేకుండా రోజులో అత్యధిక సమయాన్ని ఫోన్లతో గడుపుతున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏదైనా మంచికోసం ఉపయోగంచుకుంటే అనేక లాభాలుంటాయి. కానీ ఏదో సరదానిమిత్తమో, అనవసర విషయాలకు ఉపయోగించుకుంటే చిక్కులు తప్పవు. మొన్న ఆత్మాహుతి ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల సంఘటనకు సంబంధించిన విషయాలు చక్కర్లుగొడుతున్న సమయంలో, ఎన్నడో మహారాష్టల్రో మన జవానులు ఉగ్రవాదిని పట్టుకున్న వీడియోను, హైద్రాబాదులో ఇప్పుడు జరిగినదిగా చిత్రీకరించి అప్‌లోడ్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారి లక్షల మందిని చేరుకొని ఒకింత భయాందోళనలకు గురిచేసింది. కావాలనో, అవగాహన రాహిత్యంవల్లనో ఇలాంటి పనులకు నోచుకోకూడదు.
ఈమధ్య ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి విషయానికి ఫోన్లపై ఆధారపడుతుంటారు కనీసం వార్తలు చూడాలనుకున్న, దినపత్రికలు చదవాలన్నా ఫోన్లోనే, వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్, వివిధ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ సోషల్ నెట్‌వర్కులో వైరల్‌గా మారుతాయి. ఇది మంచి పరిణామమే ఏదైనా పని నిమిత్తంలో, మరే ఇతర కారణాలవల్లనో ఆదమరిస్తే సోషల్ నెట్‌వర్క్స్ ద్వారా గ్రహిస్తుంటారు. కానీ గతంలోని నోటిఫికేషన్స్, పాత మార్గదర్శకాలను నేటివన్నట్లుగా అప్‌లోడ్ చేయడం, షేర్‌చేయడం, లైక్‌లు, కామెంట్స్ చేయడం లాంటివి సగటు మనిషిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారం వలన అన్నీ అర్హతలున్నా కూడా అవకాశాలను కోల్పోతుంటారు. కావున మనం ఏ విషయాన్నైనా పోస్ట్‌చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు జాగ్రత్తతో పరిశీలించి, నిజనిర్ధారణ చేసుకున్న తర్వాతనే తమ కార్యకలాపాలను కొనసాగించాలి.
వివిధరకాల ఫొటోలను, సెల్ఫీలను, వీడియోలను పోస్ట్‌చేస్తూ, తన ఫాలోవర్స్‌కు తలనొప్పిగా మారుతున్నారు. వివిధ జాతీయ పండుగల సమయంలో తమ ఎల్లలుదాటిన దేశభక్తిని ప్రదర్శిస్తుంటారు అనవసరపు పోస్టులలో కామెంట్స్ పెడుతూ చికాకులు కొనితెచ్చుకుంటారు. ఈమధ్యన ఏదో దేవుళ్లపై వార్తలు వ్రాసి, దీనిని పది మందికి పంపండి మంచి జరుగుతుంది, లేకపోతే కీడు శంకిస్తుందంటూ తెలివిలేని పోస్టులు ఇతరులకు ఇబ్బందిగా మారుతుంటాయి.
ఇంకొంతమంది తమ అవగాహన రాహిత్యంవలనో, తెలిసోతెలియక అశ్లీల చిత్రాలను, దృశ్యాలను సైతం షేర్‌చేస్తూ, చాలా ఇబ్బందికరంగా మారుతుంటారు, నేడు నర్సరీ చదివే పిల్లలు సైతం, తమ తల్లిదండ్రుల ఫోన్లతో గేములు ఆడుతూ, యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ, ఫోన్‌ను ఆపరేటింగ్ చేయడంలో దిట్టలుగా మారుతున్న సందర్భం, అలాంటప్పుడు మనకు ఎవరైనా అసభ్యకరమైన దృశ్యాలు పంపితే పిల్లలు చూసే ప్రమాదం పొంచి ఉన్నది. అందుకే ఫోన్ ఉపయోగించే ముందుజాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. కొన్ని సున్నితమైన అంశాలను ఎవరన్నా పంపిన, వాటితో మన అభిప్రాయాలను పంచుకోవడం లాంటివి చేస్తూ కటకటాలలో ఊసలు లెక్కపెడుతున్నారు.
మతాలకు, దేశాలకు చెందిన జాతీయ జెండాలను కించపర్చవద్దు. ఇంకొంతమంది వారు పొద్దున లేచినప్పటినుంచి రాత్రిపడుకునే వరకు చేసిన అన్ని కార్యకలాపాలను ఫొటోలతోసహా ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఇతరులకు కొంత అసహనాన్ని కలిగిస్తూ వుంటారు. అలాగే నేడు ఎన్నో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ, పోస్టులు పంపుతూ నరకం చూపిస్తుంటారు.
మారుతున్న కాలంలో పెరుగుతున్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధివలన ప్రతిఒక్కరు స్మార్ట్ఫోన్లు వాడుతూ, విభిన్న యాప్‌లను వినియోగిస్తూ రోజులో ఎక్కువ సమయం ఫోన్‌తో గడుపుతూ తమ విలువైన సమయాన్ని వృథాచేసుకోవడమే గాకుండా ఇతరులను సైతం ఇక్కట్లపాలు చేస్తుంటారు. ఏదైనాసరే అవసరమైనంతవరకు వాడుకొని, నలుగురికి ఒకింత జ్ఞానమిచ్చేలా, ఆలోచింపజేసేలా వుండే పోస్టులను పెట్టాలి.
సమాజంలో ఎన్నోరకాల సమస్యలు తాండవం చేస్తున్నాయి, వాటినెలా రూపుమాపాలి? ప్రభుత్వం ఏంచేస్తే బాగుంటుంది? విషయం పట్ల అంతగా జ్ఞానం లేనివారిని చైతన్య బర్చడానికో, ప్రభుత్వ పనితీరు, సలహాలకు సంబంధించిన వాటిని పోస్ట్‌చేసిన నలుగురికి ఉపయోగబడుతుందేమో. సమాజంలో ఎక్కడైనా అసమానత కల్పించిన, అవినీతి జరిగినా, పక్షపాత ధోరణి అవలంభించిన సాక్ష్యాలతోకూడిన సమాచారాన్ని పోస్ట్‌చేసిన సమాజాభివృద్ధికి దోహదబడిన వారవుతారు.అలాగే ఏవైనా వ్యాపారాలు ప్రారంభించిన మీ యొక్క నాణ్యతను పలువురికి తెలిసే విధంగా ఉపయోగించుకోండి. జ్ఞానవంతులు అయితే విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. రోజురోజుకు మానవీయ విలువలు మంటగారుతున్నాయి, మన విలువలు, సంస్కృతీ, ఆచార సాంప్రదాయాలు నీరుగారుతున్నాయి. వాటిని కాపాడటానికి మీ పోస్టులు ఉపయోగపడాలి. ప్రభుత్వానికి చెందిన క్రైమ్ విభాగం కూడా తమ దృష్టిని కేంద్రీకరించి, పలు విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తగిన చర్యలు తీసుకుంటుంది, కావున నేటి యువత ఎవరైతే ఎక్కువ సమయాన్ని సోషల్ నెట్‌వర్క్‌లో గడుపుతున్నారో తగిన జాగ్రత్తలు వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రత్యేకంగా వ్యక్తిగత వివరాలను ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్‌కు సంబంధించిన వివరాలను పోస్ట్‌చేసినచో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కావున జాగ్రత్తతో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి అనవసర విషయాలజోలికి వెళ్లకుండా తమ దృష్టిని అభివృద్ధికై కేటాయించాల్సిన అవసరం వున్నది. సమయం చాలా విలువైనది, గడిచిన సమయాన్ని పొందలేమన్నది అందరికీ తెలిసిందే. చేతులుకాలాక ఆకులు చుట్టుకుంటే ఎలాంటి ఉపయోగముండదు. కావున ఎంతో జాగ్రత్తవహించి, ఎలాంటి ముప్పును కొనితెచ్చుకోకూడదని ఆశిద్దాం.

- డా. పోలం సైదులు 94419 30301