సబ్ ఫీచర్

కశ్మీర్ కల్లోలం.. పాలకుల పాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీర్ అనగానే ఉగ్రవాదుల అరాచకాలు.. సైనికులకు, ముష్కరులకు మధ్య హోరాహోరీ కాల్పు లు.. అనే విషయాలు దశాబ్దాలుగా మనకు అనుభవం. ఉగ్రవాదుల ఉన్మాదానికి తాజాగా పుల్వామాలో జరిగిన దాడి తార్కాణం. స్వతంత్ర భారతానికి ఏడు దశాబ్దాల కాలం గడిచినా.. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడానికి మన పాలకుల వైఫల్యాలే కారణాలుగా పేర్కొనాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మత రాజకీయాల ప్రాతిపదికపై పాకిస్తాన్ ఆవిర్భవించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న సంతోషం కూడా పంచుకోకుండానే పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలు అనుక్షణం ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఈ సమస్య రాచపుండులా పెరిగి పెద్దది కాకుండా వుండాలంటే... మొక్క దశలోనే అణచివేయాలని నాటి కేంద్ర హోంశాఖ మంత్రి వల్లభభాయ్ పటేల్ భావించారు. అప్పుడు దేశంలో కొంతమంది సంస్థానాధీశులు దేశంలో విలీనం కాకుండా తిరుగుబాటు ధోరణి ప్రదర్శించగా వారిని పటేల్ అణచివేశారు. ఇందులో భారీ ఆపరేషన్- హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేయడం. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను కేంద్రం లొంగదీసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వెంటనే పటేల్ కశ్మీర్ మీద దృష్టి సారించారు. అయితే నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పటేల్‌కు స్వేచ్ఛ ఇవ్వకపోవడంతోపాటు కొన్ని రోజులు కశ్మీర్ సమస్యను ప్రధానికున్న విచక్షణాధికారంతో వాయిదా వేయించారు. ఇందులో రెండు కోణాలను అనేకమంది అనుమానించారు. కాశ్మీర్ నెహ్రూ పూర్వీకుల కుటుంబం కావడం, వీరి కుటుంబానికి షేక్ అబ్దుల్లా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు వుండడంతో అతని సలహామేరకు ఈ సమస్యను నెహ్రూ నానుస్తూ వచ్చారనేది ఒక ఆరోపణ. దేశంలో అనేక రాజ్యాలను విలీనం చేసినట్లుగా కశ్మీరు సమస్యను కూడా పరిష్కరిస్తే ఆ పేరు పూర్తిగా పటేల్‌కు దక్కుతుందనే అసూయతో నెహ్రూ స్వేచ్ఛ ఇవ్వలేదనేది రెండో ఆరోపణ.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే భారత్‌కు సంబంధించిన కశ్మీర్‌లో పాకిస్తాన్ ఇంచుమించు 30 శాతం కబ్జా చేసిందనేది జగమెరిగిన సత్యం. తరువాత అప్పటి పెద్దల ఒప్పందంలో భాగం దేశమంతా ఒక రకమైన రాజ్యాంగం అమలులో వుంటే... జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచీ ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఎలాగూ కొనసాగుతూనే వున్నది. ఆర్టికల్ 370 ప్రకారం ఇక్కడ ఆరు సంవత్సరాలకొకసారి అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నాయి. ఇక్కడి ప్రజలకు పలు రకాల రాయితీలున్నాయి. దీంతోపాటు 35ఎ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ చట్టం గురించి బయటి ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ చట్టం ప్రాధాన్యత ఏమంటే.. ఇతర ప్రాంతాల వారు కశ్మీర్ భూభాగంలో ఆస్తులు కొనడానికి వీలులేదు. రాజ్యాంగబద్ధంగా ఇక్కడి ప్రజలకు రకరకాల ప్రోత్సాహకాలు, సౌకర్యాలు వున్నప్పటికీ అవి అసలైన పేద ప్రజలకు వెళ్లడం లేదు. తద్వారా ఇక్కడి పేదరికాన్ని, యువతలో వున్న నిరాశ నిస్పృహను ఉగ్రవాదులు సొమ్ముచేసుకుంటున్నారు.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రెండు, మూడు కుటుంబాల మధ్యనే రాష్ట్ర సార్వభౌమాధికారం దోబూచులాట ఆడుతున్నది. మొదట షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా పనిచేశారు. తరువాత ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, అనంతరం ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమధ్యకాలంలో ముఫ్తీ మహమ్మద్ కొన్ని రోజులు, తర్వాత ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఈ రెండు కుటుంబాల మధ్య జమ్మూ కశ్మీర్ రాజకీయం దశాబ్దాలుగా ముడిపడి వుంది. కాంగ్రెస్ తరఫున గులామ్‌నబీ ఆజాద్ గతంలో రెండు సంవత్సరాలు సీఎంగా పనిచేసినప్పటికీ అతని రాజకీయ జీవితమంతా బయట ప్రాంతాలలోనే గడిచింది. కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేయడంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడి హోదాలో అనేక రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. బయటి రాష్ట్రాల ప్రజలకు ఇతడు ‘జాదూ’గా పనిచేస్తున్నప్పటికీ స్వంత రాష్ట్రంలో సమస్యను చక్కదిద్దడంలో విఫలమయ్యారు. కశ్మీర్‌లో తరచూ ప్రభుత్వాలు అస్థిరత్వానికి లోనుకావడం, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ రాష్టప్రతి పాలన విధించడం ఆనవాయితీగా మారింది. నేడు కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలో ఉండగా రాష్టప్రతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉగ్రవాదుల దుశ్చర్యలు నిత్యకృత్యంగా మారాయి. రాష్టప్రతి పాలనలోనూ ఈ దాడులు భారీగా జరుగుతుండడం గమనార్హం. ఇంతవరకు కశ్మీర్ రాష్ట్రానికి హిందూ మతానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. రాష్ట్ర జనాభాలో హిందువులు 35% వున్నప్పటికీ లౌకిక రాజ్యాంగంలో భాగంగా ఈ సామాజిక వర్గం నుంచి ఒకటి రెండుసార్లైనా హిందువులకు ఆ పీఠం దక్కవలసి వుంది. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు స్వలాభం కోసం కశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచుతున్నారు.
వాస్తవానికి అక్కడి సామాన్యులలో హిందూ, ముస్లిం అనే భేదాభిప్రాయాలు లేవు. అవిద్య, పేదరికం, అమాయకత్వంలతో కొట్టుమిట్టాడుతున్న యువతను తీవ్రవాదులు టార్గెట్‌గా భావించి వారిని మానసికంగా సంసిద్ధులను చేసి హింసాత్మక దాడులకు పురిగొల్పే అస్త్రాలుగానే కాకుండా ఆత్మాహుతి దళాలుగానూ మారుస్తున్నారు. పుల్వామాలో జరిగిన దాడులను యావత్ భారత సమాజం ఖండించడం అభినందనీయం. యావత్ ప్రపంచం ఈ ఉగ్రవాద చర్యలను నిరసించి పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టడానికి ముందుకు రావాలి. పాకిస్తాన్‌ను టెర్రరిస్ట్ దేశంగా గుర్తింపచేయడానికి ఐక్యరాజ్యసమితి మీద ఒత్తిడి తీసుకురావలసి వుంది. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించవలసి వుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు