సబ్ ఫీచర్

విద్యాప్రదాత అబుల్ కలామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వేలాది సంవత్సరాలపాటు ఐ దు నదుల నీరు పంజాబ్‌లో ప్రవహిస్తోంది.. నేడు ఆరవ నది మానవ రక్తంలో ప్రవహిస్తోంది.. నీటి మీద మేము ఇటుక, రాతి, ఉక్కు వంతెనలను నిర్మించాము. ఆరవ నదిపై వంతెన మానవ మృతదేహాలతో నిర్మించబడింది’- అని భారతదేశ విభజన తరువాత మనసు విరిగిన వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆక్రోశంతో, ఆవేదనతో అన్నారు. అబుల్ కలామ్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ప్రముఖ రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా ఆయన దేశానికి చిరపరిచుడు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పరితపించిన వ్యక్తిగా, మతప్రాతిపదికన దేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయుడిగా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచారు. స్వాతంత్య్రానంతరం దేశంలో సాహిత్యం, విద్యారంగం వికాసానికి అహరహం కృషిచేసి, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కిన మహనీయుడు అబుల్ కలామ్. దేశ విద్యావ్యవస్థను పటిష్టపరచేందుకు ఆయన ఎనలేని కృషిచేశారు.
ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు 1888 నవంబరు 11న ఆయన మక్కాలో జన్మించారు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. ‘అబుల్ కలామ్’ అనేది బిరుదు. ‘ఆజాద్’ కలం పేరు. ఆజాద్ బాల్యంలోనే బహుభాషా పాండిత్యం గడించారు. వౌలానా తన ప్రాథమిక విద్యను అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషలలో నేర్చుకున్నారు. గణిత శాస్త్రం, తత్త్వశాస్త్రం తదితర అంశాలను నిపుణులైన అధ్యాపకుల వద్ద దీక్షతో అభ్యసించారు. ఆంగ్ల భాష, ప్రపంచ చరిత్ర, రాజకీయాల గురించి తనకు తాను ఎంతో నేర్చుకున్నారు. ప్రాపంచిక విషయాల పట్ల కడు ఆసక్తిగల ఆజాద్‌కు పనె్నండేళ్లకే ఇంట్లో ప్రత్యేక రీడింగ్ రూమ్, సొంత లైబ్రరీ ఉండేవి. పధ్నాలుగేళ్ళకే ‘మక్‌జన్’ అనే సాహిత్య పత్రికకు వ్యాసాలు రాసేవారు. తనకంటే పెద్దవాళ్ళైన విద్యార్థులకు సైతం తరగతులు నిర్వహించేవారు. కొందరు మిత్రులతో కలిసి 1899లో ‘నయిరంగ్-ఇ-ఆలమ్’ అనే పత్రికను నడిపారు.
భారతీయులలో విప్లవ జ్వాలలను రేకెత్తించడానికి ఆజాద్ 1912లో ‘ఆల్-హిలాల్’ వార పత్రికను ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం తమ విధానాలకు భంగకరంగా భావించి 1914లో ఈ వారపత్రిక మీద నిషేధం విధించింది. కొన్ని నెలల తరువాత వౌలానా ఆజాద్ ‘‘ఆల్-బలగ్’ పేరిట కొత్త వారపత్రికను ప్రారంభించారు. వౌలానా ఆజాద్ రచనలపై నిషేధం విధించటంలో బ్రిటీష్ ప్రభుత్వం విఫలమైంది. చివరకు 1916లో ఆజాద్‌ను కలకత్తానుంచి బహిష్కరించాలని నిర్ణయించింది. ఆయన బిహార్ వెళ్ళినపుడు పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉం చారు. డిసెంబరు 31, 1919వరకు ఈ నిర్బంధం కొనసాగింది. జనవరి 1, 1920న విడుదలైన తర్వాత ఆజాద్ రాజకీయ వాతావరణానికి అలవాటు పడి మరలా స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. జైలునుంచి విడుదలైన తరువాత రచనలను తిరిగి ప్రారంభించారు.
స్వాతంత్య్రానంతరం నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాల పాటు బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారు. ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్’(యుజిసి)ని వౌలానా ఆజాద్ స్థాపించారు. సాంకేతిక విద్యకు ప్రోత్సాహకంగా ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ను స్థాపించారు. మనస్తత్వ శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు వౌలానా కృషిచేశారు. అటు విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల వికాసానికి ఇటు స్ర్తి విద్యాభివృద్ధికి కృషిచేస్తూనే, కళారంగం పట్ల తన ఆసక్తిని ప్రదర్శించారు. సంగీత, సాహిత్యాలను అమితంగా అభిమానించే ఆజాద్ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ వంటి సంస్థలను స్థాపించారు. ‘లలిత కళా అకాడమీ’ను స్థాపించినపుడు దానికి భవనం లేకపోవటంతో తన నివాసంలో కొంత భాగాన్నిచ్చారు. 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. మరణానంతరం- కేంద్ర ప్రభుత్వం ‘్భరతరత్న’ పురస్కారాన్ని ఆయనకు 1992లో ప్రకటించింది. ఏటా నవంబర్ 11న వౌలానా ఆజాద్ జయంతిని ‘జాతీయ విద్యాదినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్రం 2008లో నిర్ణయించింది. నిస్వార్థతతో, నిబద్ధతతో సమాజ ఉద్ధరణకు సేవ చేసిన అబుల్ కలామ్ వంటి వ్యక్తుల జీవితం మార్గదర్శకమైనది. విద్యను విస్తరించడానికి ఆయన చేసిన కృషిని గుర్తించి నేటి యువతరం నేర్చుకోవలసింది ఎంతైనా వుంది. ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని దేశంలోని యువకులందరూ సార్వజనీన సహోదరత్వం, దేశభక్తితో కృషిచేసి జాతిని ఉన్నత స్థితికి చేర్చడానికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
*
(రేపు అబుల్ కలామ్ వర్ధంతి)
*

-నాగలక్ష్మి దామరాజు