సబ్ ఫీచర్

విప్లవవీరుడి త్యాగానికి విలువేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి జాతి యావత్తు అహింసే పరమధర్మమని ప్రగాఢంగా విశ్వసించి ఉన్న తరుణంలో దానికి భిన్నంగా సర్వశక్తి సంపన్నులైన బ్రిటిష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. విశాఖ, గోదావరి ఏజెన్సీ ఏరియాల్లో నాగరికతకు దూరంగా, బతుకుతున్న ఆదివాసీలను సంఘటితపరచి వారిలో దేశభక్తిని రగిల్చి సాయుధులుగా తీర్చిదిద్ది బ్రిటిష్ ప్రభుత్వంపై సమరశంఖాన్ని పూరించిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు.
గుండెబలం తప్ప, అమాయక గిరిజనంతోడు తప్ప రాజుకు ఆయుధ సంపత్తి లేదు. అహింసామూర్తులనుంచి నైతిక స్థైర్యమూ కొరవడింది. బలమైన శత్రువును ఎదురొడ్డి నిలవడం కష్టమని తెలిసినా రెండున్నరేళ్లపాటు బ్రిటిష్‌వారిపై అవిశ్రాంత పోరాటం చేసి వారికి కంటిమీద కనుకు లేకుండా చేసిన ఆసాధారణ మహాశక్తి అల్లూరు సీతారామరాజు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామం. 1897 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి సూర్యనారాయణమ్మ చాలా కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. సీతారామరాజు ఫోర్త్ఫారం మధ్యలోనే చదువు ఆపేశాడు. ఆ సమయంలో రాజు కుటుంబం తునిలో ఉండేది. 17 ఏళ్ల వయసులోనే మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి జయపురం, బస్తరు మన్యప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఈ అధ్యయన యాత్రలోనే ఆయనలో విప్లవ బీజాలు మొలకెత్తాయి. ఏజెన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనులు పరాయి పాలనలో పడుతున్న పాట్లను చూసి చలించిపోయాడు రామరాజు. అంతే పిన్నవయసులోనే అసమాన లక్ష్యాన్ని తలకెత్తుకున్నాడు. కనీస సదుపాయాలు లేని మన్యం ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు. తల్లికి చెప్పకుండా ఇల్లు వదలి దేశాటన చేశాడు. హరిద్వార్, హృషీకేష్, బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి కీకారణ్యాలగుండా వందలాది మైళ్ల నడక సాగించాడు. కాశీ పుణ్యక్షేత్రంలో ఏడాదిపాటు సంస్కృతం నేర్చుకున్నాడు. ఉత్తరభారతదేశంలోని పలు నగరాల్లో పర్యటించాడు. గుర్రపుస్వారీ నుంచి ఆయుధ ప్రయోగం వరకు పలు విద్యల్లో ఆరితేరాడు.
విశాఖజిల్లా కృష్ణదేవిపేట దగ్గర 1917లో గ్రామస్థుల సహకారంతో శ్రీరామ విజయనగరం గ్రామాన్ని నిర్మించి తల్లి, తమ్ముడితో అక్కడే స్థిరపడ్డాడు. పోలీసులు, అటవీ అధికారుల దౌర్జన్యాలతో తల్లడిల్లుతున్న మన్యం ప్రజలను నెమ్మదిగా సమాయత్తపరచడం ప్రారంభించాడు. ఎవరినీ తొందరగా నమ్మని అమాయక గిరిజనానికి అనతికాలంలోనే రాజంటే దైవదూత అనే పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క బ్రిటిష్‌వారితో పోరాటం చేస్తూనే మరోపక్క మన్యం ప్రజల్లో మద్యపానం వంటి దురలవాట్లను రూపుమాపడంలో విజయం సాధించాడు. ప్రభుత్వ న్యాయాస్థానాల గడప తొక్కవద్దని చెప్పి, పంచాయతీ కోర్టు కేంద్రాలను అయిదారు గ్రామాల్లో నెలకొల్పి రోజుకో కేంద్రానికి వెళ్లి అక్కడ వ్యాజ్యాలను విచారించి స్థానికుల సమక్షంలో తీర్పు చెప్పేవాడు. ఆయన వాక్కును వేదవాక్కుగా మన్యం ప్రజలు శిరసావహించేవారు. ఆయన పోలీస్ స్టేషన్లపై దాడి జరిపి ఆయుధాలను స్వాధీనం చేసుకునేవాడు తప్ప, ఎవరికీ ప్రాణహాని తలపెట్టేవాడు కాదు. తాను దాడి చేయాలనుకున్న ప్రాంతాన్ని మిరపకాయ టపాలద్వారా ముందే ప్రకటించి కార్యరంగంలోకి దిగేవాడు.
రాజును ప్రలోభపెట్టడానికి అడ్డతీగలకు సమీపంలోని పైడపుట్ట గ్రామంలో 50 ఎకరాల సర్కారీ భూమిని రామరాజుకు బ్రిటిష్ ప్రభుత్వం ఇనాంగా కట్టబెట్టింది. కుటుంబం నివసించడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేసింది. పాడికోసం ఆవులను, వ్యవసాయం నిమిత్తం రెండు జతల ఎడ్లను కూడా, కుటుంబానికి కావలసిన ఆహార పదార్ధాలను అడ్డతీగల తహసీల్దారు సమకూర్చాడు. వీటిని తిరస్కరిస్తే నిర్బంధం ఎక్కువవుతుందని తలచి తొలినాళ్లలో వాటిని స్వీకరించినట్టు నటించి, ఐదు నెలల తర్వాత వాటిని త్యజిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశాడు. దీంతో ప్రభుత్వం 700 మందికి పైగా సైన్యాన్ని 30 మంది అధికార్లను రంగంలోకి దించింది. ఫలితం లేకపోవడంతో రూథర్‌ఫర్డ్ అనే కర్కశ అధికారిని, అస్సాం రైఫిల్స్‌కు చెందిన మేజర్ గుడాల్‌ను నియమించింది. వీరుభయులు మన్యం ప్రాంతంలో భయోత్పాతం సృష్టించారు. చివరకు 1924, మే 27న అల్లూరి సీతారామరాజు పట్టుబడ్డాడు. ఏవిధమైన విచారణ జరపకుండానే గుడాల్, రాజును కాల్చి చంపాడు. ఆవిధంగా 27 ఏళ్లకే అల్లూరిసీతారామరాజు నేలకొరిగాడు.
అయితే అల్లూరి సీతారామరాజుకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆనాటి కాంగ్రెస్ నేతలే రాజును బందిపోటుగా, పితూరిదారుగా ప్రచారం చేసి కించపరిచారు. సీతారామరాజును కేవలం ఏదో ఒక ప్రాంతానికో కులానికో చెందిన నాయకుడిగా ప్రచారం చేసి చూడడం సమర్ధనీయం కాదు. నిద్రాణమైన ఉన్న తెలుగుజాతిని జాగృతం చేసి తట్టిలేపాడాయన. 1977లో అప్పటి ప్రభుత్వం ఆయన శతజయంతి ఉత్సవాలను నామమాత్రంగా జరిపి చేతులు దులుపుకున్నది. రామారాజుతో ముడివడిన అనేక ప్రాంతాలు, స్మారకాలు తీవ్ర నిరాదరణకు గురవుతున్నాయి. భావితరాలకు స్పూర్తి కలిగించేందుకు రామరాజు చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి. పార్లమెంట్ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నెలకొల్పాలి. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలి. పాలకులు విస్మరించినా సీతారామరాజు ప్రజల గుండెల్లో ఈనాటికీ చిరంజీవే. దేశమాతకోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి త్యాగం చేసిన ఆయన ధన్యజీవి.

-పెన్మత్స శ్రీహరిరాజు సెల్: 9848054455