సబ్ ఫీచర్

భలే భలే.. బాలరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముగ్గురు మరాఠీలు’ సూపర్ హిట్టయ్యింది. చిత్ర దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనసు ఉప్పొంగిపోయింది. తనుతీసిన జానపదానికి జనం తొడిగిన కిరీటం చూసుకొని ఆయన మురిసిపోయారు. మళ్లీ తీస్తే జానపదమే తీయాలనుకున్నారు. అనుకోవడమే కాదు, సముద్రాల రాఘవాచార్యను పిలిపించారు. మంచి జానపద కథ ఉంటే చూడమన్నారు. ఆయన చకచకా బాలరాజు కథ సిద్ధం చేశారు. కథ వినగానే బలరామయ్య కళ్లముందు నిలిచింది -ముగ్గురు మరాఠీలు చిత్ర హీరో అక్కినేని. బాలరాజు పాత్రకు అక్కినేని ఓకే. మరి కథానాయిక?

మాయలోకం, పల్నాటి యుద్ధం తదితర సినిమాల్లో కథానాయికగా చేసిన ఎస్ వరలక్ష్మి మంచి పేరు తెచ్చుకున్నారు. బాలరాజులో అక్కినేనికి ఆమే సరిజోడని భావించారు. అలాగే మిగతా తారాగణం ఎంపిక కూడా పూరె్తైంది. ఆ రోజుల్లో తారలంతా తమ పాటలు తామే పాడుకునేవారు. అలా అక్కినేని, ఎస్ వరలక్ష్మి, కస్తూరి శివరావు, సీతారాం తమ పాటలు తామే పాడుకున్నారు. అంజలీదేవికి మాత్రం వక్కలంక సరళ పాడారు. పాటల రికార్డులన్నీ బొంబాయిలోనే తయారీ కాబట్టి, షూటింగ్‌కన్నా ముందే పాటల రికార్డింగ్ పూరె్తైంది. ఈ చిత్రంలో ‘చెలియా కనరావా’ పాటను తొలుత అక్కినేని పాడేశాడు. తర్వాత ఆ పాటను అక్కినేని కోరికమేరకు ఘంటసాలతో పాడించారు. ఇందులో ‘చాలురా వగలు’ పాట చాలా చిన్న పాట. ఆ పాటను అక్కినేని ఆలపించారు. సినిమా షూటింగ్ మొత్తం న్యూటోన్ స్టూడియోలోనే జరిగింది. 1948 ఫిబ్రవరి 26న విడుదలైన బాలరాజు చిత్రానికి 70 వసంతాలు నిండాయి.
ప్రేమైక జీవులుగా.. ప్రేమే సర్వస్వంగా భావిస్తూ దేవలోకంలో ఎవరినీ పట్టించుకోకుండా సంచరించే యక్షకన్య, యక్షుడి వ్యవహార శైలికి దేవేంద్రుడు కోపిస్తాడు. వారిని భూలోకంలో పుట్టమని శపిస్తాడు. యక్షకన్య భూలోకంలో జన్మించినా గత ప్రేమను మరువలేక విలవిల లాడేలా.. యక్షుడు బాలరాజుగా పుట్టి పాత స్మృతులను మరిచిపోయేలా శపిస్తాడు.
నాగేటిచాలులో దొరికిన సీత (ఎస్ వరలక్ష్మి) పురుషలోకం గురించి తెలియకుండా ఒంటిస్తంభపు మేడలో పెరుగుతుంటుంది. అనుకోకుండా బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు)ను చూసి గత జ్ఞాపకాలలో తమ ప్రేమ గురించి అతనికి వివరించినా నమ్మడు. కానీ, ఆమె రూప లావణ్యాలు ఆకర్షించి ప్రేమలో పడతాడు. ఎలాగో దంపతులౌతారు. కుబేరుడు (నారాయణరావు) ఈ జంటను చూసి అసూయతో శపించటంతో వాళ్లు విడిపోతారు. ముని శాపంవల్ల తన భర్త సర్పంగా మారాడని గ్రహించి, ఆ సర్పంతో పుణ్య తీర్థాల్లో తిరుగుతుంది సీత. ఆమె భక్తి ప్రపత్తులకు సర్పం కాస్తా బాలరాజుగా మారతాడు. గతం గుర్తుకొస్తుంది. కుబేరుడు, అగ్నిదేవుడు (ఎన్ క్రిష్ణయ్య) చిత్రంలో ఉన్నారు. ఇంద్రుడు (డి సదాశివరావు)ని సీత శపించాలని అనుకుంటుంటే శివుడు (ఎ ఆదిశేషయ్య) ప్రత్యక్షమై కథను సుఖాంతం చేస్తాడు. ప్రేమను ఎవరూ నాశనం చేయలేరని తెలిపే చిత్రమిది. ఈ చిత్రం 10 ప్రింట్లతో విడుదలై అనూహ్య విజయం సాధించింది. అప్పట్లో శత, రజితోత్సవ, స్వర్ణోత్సవాలు జరుపుకొంది.
ప్రతిభావారి- ‘బాలరాజు’ చిత్రం తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాన్ని సృష్టించింది. అమాయకంగా -చెలియా కనరావా అంటూ అక్కినేని పాడుతూ చూపించిన నటన ప్రేక్షకులను మైమరపింపజేసింది. ఈ సినిమాతో చాలామంది అక్కినేనిని బాలరాజు అనే పిలిచేవారు. బాలరాజుతో ఆబాలగోపాలం ఆనందసాగరంలో మునిగి తేలేవారు. రసికులు, విమర్శకులు, పెద్దలు, యువకులు హీరో అక్కినేనిని వేనోళ్ల కొనియాడేవారు. అక్కినేని బాలరాజుగా అఖిలాంధ్రుల అంతరంగాల్లో చెరగని శిలాక్షరంగా, తరగని నటకునిగా పేరుపొందారు.
బాలరాజు చిత్రం విడుదలైన ప్రతి సెంటర్లో అదేపనిగా ఆడటం మొదలైంది. శత దినోత్సవాలు, రజితోత్సవాలు దాటింది. సామాన్యమైన సెంటర్లలో కూడా ప్రదర్శనలు 30 వారాలు దాటాయి. ఆ చిత్రం ఆడినట్టు ఏ సినిమా ఆడలేదని, వసూళ్లలోనూ బాలరాజును మరే చిత్రం అధిగమించలేదని, నిర్మాత బలరామయ్యకు బండ్లమీద ధనరాసుల్ని తెచ్చిపెట్టిందని ఆనాటి సినిమా పెద్దలు చెబుతారు. ఆ రోజుల్లో ఈ చిత్రానికి అపూర్వ స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి అనేక ఊళ్లలో కొత్త థియేటర్లు కూడా నిర్మించారు. ఎడ్లబళ్లు కట్టుకుని మరీ సినిమా చూడటానికి కుటుంబాలు కుటుంబాలు మళ్లీ మళ్లీ వెళ్ళేవి. ఈ చిత్ర శతదినోత్సవ అభినందన సభలు 1948 జూన్ 4 నుంచి 7 వరకూ -జైహింద్ (విజయవాడ), మినర్వా (రాజమండ్రి), రత్నహాల్ (గుంటూరు), రామకృష్ణ షిఫ్టింగ్ థియేటర్ (ఏలూరు)లలో జరిగాయి. అక్కినేని, అంజలీదేవి, కస్తూరి శివరావు, బలరామయ్య తదితరులు హాజరయ్యారు.
జానపద చిత్రాల్లో బాలరాజు ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చింది. పేరుకు జానపదమే అయినా, ఇందులో ప్రేమ కథే ప్రధాన ఇతివృత్తం. ‘ప్రేమ సర్వాంతర్యామి. ప్రేమికుల్ని ఎవరూ విడదీయలేరు’ అనే అంశాన్ని ఆకాలంలో ఆకట్టుకునే విధంగా తీశారు. ఆ తర్వాత నిర్మాత బలరామయ్య తీసిన చాలా ప్రేమకథలకు ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. ప్రేమ ప్రధాన ఇతివృత్తం కావటంతో నాటి యువతను ఈ సినిమా బాగా ఆకట్టుకోగలిగింది. నిస్వార్థ ప్రేమికులు స్వర్గసుఖాలను సైతం లెక్క చేయక, కష్టాలకు వెరవక ఒకరికొకరు జీవిస్తారనీ, జీవించాలనీ, బాలరాజు సందేశాన్ని ఇచ్చింది. బాలరాజు అనూహ్య విజయం సాధించడంతో ఇందులో పనిచేసిన వారందరికీ పేరొచ్చింది. నటీనటుల పారితోషికాలు పెరిగాయి. ప్రత్యేకించి కస్తూరి శివరావుకు డిమాండ్ ఏర్పడింది. అప్పటివరకూ చిన్నవేషాలు వేస్తూ వచ్చిన శివరావు -బాలరాజుతో స్టార్ అయిపోయాడు. పాపులర్ హాస్య జంట నల్లరామ్మూర్తి, సీతారామ్‌ల్లో ఒకరైన సీతారామ్ ఇందులో కాపలదారు రాములు వేషంవేసి -చూడ సక్కని సిన్నది ఆ మేడ గదిలో ఉన్నది అనే పాట పాడారు. ప్రసిద్ధ నటీమణి అంజలీదేవి ఇందులో కనిపిస్తారు.
ఈ పాటకు దైవలోకంలో మోహినిగా నాట్యం చేసిన అంజలీదేవికి ఎంతో పేరొచ్చింది. ఎల్లమందగా నటించి తన హాస్యంతోనూ కస్తూరి శివరావు పాడిన -దేముడయ్యా దేముడూ మాయదారి దేమూడూ, -నా సామిరంగా వరాలకూన నిన్ను పాటలతో పెద్ద హాస్య నటుడైపోయి తన పారితోషికం స్థాయిని తదుపరి చిత్రాలకు పెంచేసాడు. యక్షిణిగా, సీతగా నటించిన యస్ వరలక్ష్మి అందచందాలు, పాడిన పాటలు, ప్రదర్శించిన నటన పెద్ద కథానాయికగా మార్చాయి. -ఓ బాలరాజు, ఎవరినే నేనెవరినే పాటలకూ పేరొచ్చింది. ఈ చిత్రంలో 20 పాటలున్నాయి. జి రామయ్య, బి సీతారాం, జి సుబ్బారావు, ఎఎల్ నారాయణ, ఆదిశేషయ్య, రామమూర్తి, కెవి సుబ్బారావు, వెంకటేశ్వరరావు, లింగం సుబ్బారావు, సీతారామయ్య, నారీమణి, సి రాజరత్నం, బి సీతారామమ్మ అనసూయ ఈ చిత్రంలోని మిగతా పాత్రధారులు.
‘బాలరాజు -పాత్ర పోషణలో పెద్దగా కష్టపడకున్నా అభిమానుల ఆరాధనతో స్టార్‌నయ్యాను’ అన్నారొకసారి అక్కినేని. బాలరాజు సినిమా చూసిన కొల్లిపర్ల నారాయణరావు కుమార్తె అన్నపూర్ణ అక్కినేనిపై అభిమానం పెంచుకుని, అది ప్రేమగా మార్చుకుని పట్టుబట్టడం వల్లనే అక్కినేని- అన్నపూర్ణల వివాహం జరిగింది.
దర్శకుడు ఘంటసాల బలరామయ్య ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో ఈ చిత్రం 69 కేంద్రాల్లో వంద రోజులు, 24 కేంద్రాల్లో రజితోత్సవము, 13 కేంద్రాల్లో 200 రోజులు, నాలుగు కేంద్రాల్లో 250 రోజులు, రాజమండ్రి మినర్వా థియేటర్‌లో 336 రోజులు, విజయవాడ జైహింద్ టాకీస్‌లో ఏడాది ఆడింది. ఏలూరు గోపాలకృష్ణలో 245 రోజులు, కాకినాడ మెజిస్టిక్‌లో 259 రోజులు, మదనపల్లి మధుసూదన థియేటర్‌లో 224 రోజులు, సత్తెనపల్లి, జగ్గయ్యపేట, పాయకరావుపేట లాంటి చిన్న కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకొని శత దినోత్సవాల్లో రికార్డు నెలకొల్పింది.
ఎస్ వరలక్ష్మి అందచందాలు, గానం, నటన, యక్షిణిగా అంజలీదేవి నృత్యాలు, కస్తూరి శివరావు యలమందగా హాస్యం పలికించిన తీరు, ప్రేమ తెలియని అమాయకుడిగా అక్కినేని నటన -ఈ చిత్రం విజయానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. మోహినిగా అంజలీదేవి నాట్యం ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. సముద్రాల కథ, మాటలు, పాటలు రాసిన బాలరాజుకి సంగీతం గాలిపెంచల నరసింహారావు (గాలి పెంచలకి ఘంటసాల, సిఆర్ సుబ్బరామన్ సహకరించారు). ఛాయాగ్రహణం సి శ్రీ్ధర్, సౌండ్ వి మీనాక్షి సుందర్, కళ ఎస్‌విఎస్ రామారావు, కూర్పు టిఎల్ లాల్, నృత్యాలు వేదాంతం రాఘవయ్య సమకూర్చారు. ప్రొడక్షన్ చీఫ్ ప్రతిభాశాస్ర్తీ, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, ప్రయాగ నరసింహశాస్ర్తీ, సముద్రాల రాఘవాచార్య కలిసి ఈ చిత్ర కథను సమకూరిస్తే మల్లాది, సముద్రాల కలిసి పాటలు రాశారు.

-కె శ్రీనివాసరావు