సబ్ ఫీచర్

కడుపు‘కోత’లెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి తర్వాత దంపతులు సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఆ కల నెరవేరి కడుపులో ఓ నలుసు పడగానే బిడ్డ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కాన్పు జరిగే క్షణం దగ్గరపడుతున్న కొద్దీ తల్లికి ఒత్తిడి ఎక్కువవుతుంది. కారణం తనకు సాధారణ కాన్పు అవుతుందా? లేదా? అనే ఆలోచన అనుక్షణం ఆమెను వేధిస్తుంది. ఈ బెంగకు తోడు నేటి డాక్టర్లు కూడా ‘ఉమ్మనీరు తక్కువగా ఉందనో, ఎక్కువగా ఉందనో, కడుపులో బిడ్డ కదలికలు సరిగా లేవనో సిజేరియన్ చేయాలని చెబుతారు. పైగా ఈ రోజుల్లో అందరూ సిజేరియన్ డెలివరీలనే ఆశ్రయిస్తున్నారు. కారణం సాధారణ కాన్పులో భరించలేని నొప్పి ఉంటుంది. సిజేరియన్‌లో అలాంటి నొప్పులు ఏమీ ఉండవు. మీరు చదువుకున్న వారు కదా.. అందుకే ఆధునిక పద్ధతిని ఎంచుకోవచ్చు కదా.. అని చెబుతుంటారు. ఈ మాట విన్న తల్లిదండ్రులు సిజేరియన్‌కే ఓటు వేస్తున్నారు. కానీ సాధారణ కాన్పు జరిగే పరిస్థితులు ఉండి కూడా సిజేరియన్లు ఎందుకు?
సిజేరియన్ల తరువాత కోలుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. అదే సాధారణ కాన్పు అయితే త్వరగా కోలుకోవచ్చు. సిజేరియన్ల వల్ల ఒక్కోసారి చాలా రక్తం పోతుంది. అలాంటప్పుడు బాగా నీరసపడిపోవడం, తల్లి పాలు తయారవ్వకపోవడం, డిప్రెషన్‌కు లోనవ్వడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంతేకాదు.. ఆపరేషన్ తర్వాత విపరీతంగా ఒళ్ళు రావడంతో పాటు డయాబెటిస్ బారినపడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ‘కేవలం మా పని తేలికవుతుందని, డబ్బుకోసం సిజేరియన్లు చేస్తున్నామని డాక్టర్లపై చాలా సులువుగా ఆరోపణలు చేస్తారు. కానీ ఇది నిజం కాదు. చాలామంది మహిళలు వజైనల్ డెలివరీలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి సిద్ధపడరు. మహిళలే.. సిజేరియన్ చేయమని మమ్మల్ని కోరుతుంటారు. అంతేకాదు చాలామంది కాన్పుకు ముహూర్తాలు చూసుకుని వస్తుంటారు. వాళ్లకు నచ్చినతేదీ, ఘడియల్లోనే కాన్పు కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు సి-సెక్షన్ తప్ప మాకు మరోమార్గం ఉండదు. కొందరు తల్లుల వయసు ఎక్కువగా ఉండటం, ప్రసవానికి ముందు సరిగా వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు కూడా సిజేరియన్‌కు దారితీస్తాయని’ డాక్టర్లు అంటున్నారు. మారుతున్న జీవనశైలే ఈ పరిణామానికి ఓ ప్రధాన కారణం. ఈ రోజుల్లో అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు. వ్యాయామాలు కూడా చేయట్లేదు. ఇలాంటి సమయాల్లో సాధారణ కాన్పు కష్టమేనట. తల్లి.. బిడ్డను పుష్ చేయలేకపోయినా, లేదా తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అనిపించినా సిజేరియన్ చేయక తప్పదు అని చెబుతున్నారు డాక్టర్లు.
నిజానికి సిజేరియన్లు అంత మంచివి కాకపోయినా భారతదేశంలో సహా అనేక దేశాల్లో ఈ ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది. అందుకే, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ), చైల్డ్ బర్త్ గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులను సూచించింది. దీనిని ‘ఇంట్రాపార్టమ్ కేర్ ఫర్ ఎ పాజిటివ్ చైల్డ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్’ అని పిలుస్తారు. ‘సాధారణ కాన్పుకు ఎక్కువ సమయం పడుతుంది. సిజేరియన్ అయితే త్వరగా అయిపోతుందని.. అందుకే డబ్ల్యూహెచ్‌ఓ గైడ్‌లైన్స్‌లో ‘మహిళల ప్రసవానికి ఎక్కువ సమయం కేటాయించాలి’ అన్న విషయం చేర్చారని డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఆఫీసర్ డా. ఒలుఫిమి ఒలాడాపో అన్నారు. అన్ని ప్రసవాలకూ ‘వన్ సెంటీమీటర్ రూల్’ వర్తించదు అని కూడా ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఆ రూలేంటంటే..
ప్రసవ సమయంలో ప్రతి గంటకు బిడ్డ ఒక సెంటీమీటర్ కిందకు జరుగుతుంటుంది. దీన్ని మెడికల్ భాషలో ‘వన్ సెంటీమీటర్ రూల్’ అంటారని డాక్టర్లు చెబుతారు. నేషనల్ ఫామిలీ అండ్ హెల్త్ సర్వే ప్రకారం 1992-2016 వరకు నమోదైన డేటాను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 18 శాతం జననాలు సిజేరియన్ ద్వారానే నమోదవుతున్నట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి. ఎన్నో అధునాతనమైన ఆరోగ్య సదుపాయాలున్నప్పటికీ బ్రిటన్‌తో సహా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో భారతదేశంతో పోలిస్తే సిజేరియన్ల సంఖ్య చాలా తక్కువ. 2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఇంగ్లండ్‌లో 11 శాతం, ఇటలీలో 25 శాతం, నార్వేలో కేవలం 6 శాతం మాత్రమే సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయి. ఎంతో ఎమర్జన్సీ అయితే తప్ప వారు సిజేరియన్ ఆపరేషన్ల జోలికి వెళ్లరు. ఇక ఏమాత్రం సాధారణ కాన్పు సాధ్యం కాదని తెలిశాక తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందనుకుంటే తప్ప వారు సిజేరియన్స్ జోలికి వెళ్లరు. గతంలో సిజేరియన్‌కు సంబంధించిన నిర్ణయం డాక్టర్లు మాత్రమే తీసుకునేవారు. ఎవరైనా మహిళ సిజేరియన్ కావాలని అడిగినా, డాక్టర్లు ఒప్పుకునేవారు కాదట. కానీ 2011లో ఈ నియమాన్ని సడలించారు. ఎవరైనా సిజేరియన్ చేయమని అడిగితే డాక్టరు ఒప్పుకోవాలి. కానీ సిజేరియన్ కోరిన మహిళలకు దాంట్లో ఉన్న కష్టనష్టాలను పూర్తిగా వివరించాల్సిన బాధ్యత డాక్టర్లపైనే ఉంటుంది. వీలైతే సాధారణ కాన్పుకు ఒప్పించగలగాలి. ప్రసవానికి ముందు స్ర్తిలకు అనేక రకాల భయాలుంటాయి. దీన్ని ‘టోకోఫోబియా’ అంటారు. ఆ భయం వల్ల సిజేరియన్ చేయమని అడగొచ్చు. అలాంటి భయాలు పోగొట్టి పేషెంట్‌ని సాధారణ కాన్పుకు ఒప్పించడం డాక్టర్ బాధ్యత.
మనదేశంలో కన్నా బ్రిటన్‌లో భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆధునిక వైద్య సదుపాయాలు తక్కువైనప్పటికీ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, వేలసంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టుకురావడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది అంటారు డాక్టర్లు. సిజేరియన్ జరిగాక కోలుకోవడానికి సమయం పడుతుంది. ఆపరేషన్ అయ్యాక లేచి తిరగడానికి కొంత సమయం కావాలి. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రులు లాభపడతాయి. ఖరీదైన సిజేరియన్‌కు తోడు పేషెంట్ ఎక్కువకాలం ఉంటే గది భోజనం వంటి వాటికి కూడా డబ్బులు కట్టాలి కదా.. ఇంతా చెప్పుకున్నా మహిళల కడుపు‘కోత’ ద్వారా లాభం పడుతున్నది ఎవరు? అంటే అందరూ తెల్లముఖాలు వేసుకుని ఒకరినొకరు చూసుకోవడం తప్ప సమాధానం మాత్రం రాదు.

- సన్నిధి