సబ్ ఫీచర్

నడిచే సినిమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ఓ కల. నిజం చేసుకోడానికి నిబద్ధత, అకుంఠితదీక్ష కావాలి. ఒక్కోసారి అదృష్టం అందలమెక్కిస్తుంది. అక్కడనుండి కిందపడకుండా -మరో మెట్టేక్కేందుకు చేసే ప్రయత్నమే కన్న కలకు సార్థకత చేకూరుస్తుంది. అటువంటి కర్మయోగిగా కనిపిస్తాడు సీనియర్ జర్నలిస్ట్, వెయ్యి చిత్రాలు పూర్తిచేసిన నటుడు ఏచూరి చలపతిరావు. ఎప్పుడో ఎనభైయేళ్ల క్రితం మండపేటలో పుట్టడంతో మొదలైన ప్రస్థానం అనేక దశలుగా సాగింది. హైస్కూల్ చదువు సాగేటప్పుడే సినీ పరిశ్రమకు సహకారాన్ని అందించాడు. అలా వెయ్య సినిమాల అనుబంధంతో నడిచే సినిమా అయ్యాడు. అతని కథే -ఈ వారం వెనె్నల ముచ్చట.

అప్పట్లో ఓ రిక్షాకు పోస్టర్లు అంటించి, ఊళ్లో ప్రచారం చేసేవాళ్లు. ‘రండి! నేడే చూడండి! ఆలసించిన ఆశాభంగం! మంచి తరుణం మించిన రాదు. టక్కు టమార గోకర్ణ విద్యలతో దిమ్మదిరిగే బొమ్మలాట. రండి.. చూడండి.. మీ అభిమాన థియేటర్‌లో’ అంటూ అప్పటి సినిమా ప్రచారం సాగేది. ఆ బండితోపాటుగా సినిమాకు సంబంధించిన కరపత్రాలు గాల్లోకి ఎగరేసేవారు. అవి అందిపుచ్చుకోడానికి చిన్న పిల్లలు రిక్షా వెనుకే పరిగెత్తేవారు. ఎవరెన్ని అందుకుంటే అంత గొప్ప. థియేటర్‌కు వెళ్తే పాటల పుస్తకాలు అమ్మేవారు. ఇంటికొచ్చి పాటలు మననం చేసుకునే ప్రయత్నాలు సాగేవి. పాత పాటలన్నీ అపురూపమైనవే కనుక ఒక్కసారి వింటే నోటికొచ్చేసేవి. అలా 1953 నుంచీ సినిమా పబ్లిసిటీలో పాలుపంచుకుంటూ, ఆయా సినిమాలకు కామెంట్రీ చెప్పేవాడు ఏచూరి. సాయంత్రం థియేటర్‌కు వచ్చాక యజమాని ఒకింత టిఫిన్, టీ ఇప్పించి సినిమాను ఉచితంగా చూపేవారు. అలా ఉచిత సినిమాను చూసీ చూసీ అందులోని తప్పొప్పులు ఎంచేంతగా ఎదిగాడు ఏచూరి. తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఆయనను పిలిచి తమ సినిమాలకు ప్రచారం చేయమనేవారు. అలా చేస్తూనే పత్రికలకు మనసులోని సినిమా మాట చెప్పేవాడు. అలా భానుమతి- ఏఎన్నార్ నటించిన లైలా-మజ్ను సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో, తరువాత విడుదలైన దేవదాసు విజయవంతమవుతుందని ముందుగానే చెప్పాడు. ఎందుకంటే లైలా- మజ్ను విషాదాంతం కనుక దేవదాసు కూడా అదే ముగింపు ఉండటంతో తప్పక హిట్టవుతుందని చెప్పగలిగా అంటాడు ఏచూరి.
1953 తరువాత కాకినాడకు మకాం మారింది. కాకినాడలో సినిమా వీధిలో దాదాపు ఏడు థియేటర్లు ఉండేవి. థియేటర్లకు సంబంధించిన పబ్లిసిటీ ఇన్‌ఛార్జిగా పనిచేయడం మొదలెట్టాడు. అదే సమయంలో అన్ని చిత్రాలకు సంబంధించిన పాటల పుస్తకాలు సేకరించడం ప్రారంభించాడు. అలా ‘దాదాపు అన్ని చిత్రాలకు సంబంధించిన పుస్తకాలు సేకరించి చివరికి నిర్మాత నాగిరెడ్డి అడిగితే కాదనలేక ఇచ్చేశాను’ అంటాడు ఏచూరి. ఇలా సినిమా ఇన్‌ఛార్జిగా చేస్తూ, వాహిని విజయ సంస్థలు రూపొందించే చిత్రాలకు సమీక్షలు రాస్తూ పబ్లిసిటీ ఇన్‌ఛార్జిగా పని చేసేవాడు. ఆయా సంస్థలు ఆయనకు ఓ పాస్ ఇచ్చాయి. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో వున్న ఏ థియేటర్‌లోనైనా ఫ్రీగా సినిమా చూడొచ్చు. అలా ప్రతి సినిమా వదలకుండా అనేకసార్లు చూడటంతో ఆయా సినిమా డైలాగులు కంఠతా వచ్చేసేవి. ఎవరెవరు ఎలాంటి కథలతో సినిమాలు తీస్తున్నారు? కార్బన్ కాపీ కథలు ఎవరినుంచి వస్తున్నాయి అంటూ మొహమాటం లేకుండా రివ్యూలు రాసేవాడు. కార్బన్ కాపీ సినిమాలని ఓ టైటిల్ కూడా పెట్టేవారు. అలా ఏచూరి సమీక్షలకు మంచి పేరు రావడంతో అప్పట్లోని ఐదారు సినిమా పత్రికలలో ఏచూరి పేజీ అంటూ ప్రత్యేకంగా వచ్చేది. ఏచూరి లేఖ, ఏచూరి చిటపట, ఏచూరి సమీక్ష, ఏచూరి పేజీ.. ఇలా ప్రతి పత్రిక ఆయన రివ్యూ కోసం ఎదురుచూసేది. అప్పట్లో కాగడా అనే పత్రిక వుండేది. 2 లక్షల సర్క్యులేషన్. అయితే డబ్బులున్నప్పుడు మాత్రమే ప్రింట్ చేసేవాళ్లు. ఆయన రాసిన సమీక్షలను కలకత్తానుంచి వచ్చే స్క్రీన్‌లాంటి ఇంగ్లీషు పత్రికలు తర్జుమా చేసి మరీ ప్రచురించేవి. మద్రాసులో సినిమా పత్రికలన్నీ కేంద్రీకృతమవడంతో అన్ని పత్రిలకు రాసే పని పెట్టుకున్నారు. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్యలాంటి హీరోలు వెలుగుతున్నారు. కొత్త హీరో మరొకరు వస్తే బాగుండేదంటూ హరనాథ్ గురించి రాసేవారు. అలాగే శోభన్‌బాబు గురించి రాసేవారు. ఏ స్టూడియోకి వెళ్లినా రాజమార్గంలోనే వెళ్లి అందరి విషయాలు తెలుసుకునేవారు. ‘ఒక్కోసారి శోభన్‌బాబులాంటి వారికే స్టూడియోలోకి ప్రవేశం లేకపోతే, నా వెనుక తీసుకెళ్లిన రోజులున్నాయి’ అని గుర్తు చేసుకుంటాడు ఏచూరి.
1959లోనే శోభన్‌బాబు పెద్ద నటుడవుతాడని రాశారు. ఎందుకంటే ఆయన జీవితంలో కొన్ని నియమాలు పాటించేవాడు. ఆ నియమాలే ఆయనను పెద్ద హీరోని చేస్తాయని నమ్మారాయన. షూటింగ్‌కు వెళితే అందరు తారలు అభిమానంతో అక్కున చేర్చుకునేవారు. అలా రాజనాల, ఆర్ నాగేశ్వరరావు, సత్యనారాయణ, కృష్ణ, గుమ్మడి, సారథి లాంటివాళ్లతో మాట్లాడి, వాళ్ల ఇళ్లలోనే ఉంటుండేవారు. మాడా వెంకటేశ్వరరావు, రాజ్‌బాబు మండపేటలో ఆయన సహాధ్యాయులు. వారి గురించీ అనేక వ్యాసాలు వ్రాసేవారు. అలా చిత్ర పరిశ్రమ అంతా ఏచూరిని గుర్తుపట్టి పలకరించే స్థాయికి ఎదిగారు. ఎంత పేరొచ్చినా ఆర్థికంగా ఏవిధమైన అభివృద్ధి లేకపోవడంతో నటుడిగా మారాలనుకున్నారు. సినిమా పత్రికలు ఫుడ్ పెట్టవు కనుక, మళ్లీ ఇంటికెళ్లే ప్రసక్తే లేదు కనుక ఒకే ఒక్క ప్యాంటు, ఒక చిరుగుల చొక్కాతో మద్రాసులో ఉండటం కష్టం కనుక, ఏదోక పాత్రలో నటించి నాలుగు రాళ్లు సంపాదించాలనుకున్నారు.
అప్పట్లో మోడరన్ థియేటర్స్ సేలంలో చిత్రాలు రూపొందించేది. కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 150 చిత్రాలు నిర్మించారు. వారి కార్యాలయం మాత్రం మద్రాసులో ఉండేది. ఆ కార్యాలయం మెట్లకింద తలదాచుకుంటూ సినిమా వేషాల కోసం తిరిగేవాడిని. అలా తిరుగుతూనే తెలుగు పత్రికల కార్యాలయాలకు వెళ్లి కొన్ని ఆర్టికల్స్ అందించేవాడిని. అలా మోడరన్ థియేటర్స్ చిత్రాలపై రాసిన వ్యాసం టిఆర్ సుందరానికి నచ్చడం ఓ మేలి మలుపు. ‘ఏమయ్యా! మెట్లక్రింద ఎన్ని రోజులుంటావ్. అక్కడొక గది వుంది. ఆ గదిలో వుండు’ అని మోడరన్ టైమ్స్ అధినేత టిఆర్ సుందరం చెప్పినా, ఏదైనా పని ఇస్తేనే ఉంటానని మొండికేసిన రకం ఏచూరి. మా గురించి ఎన్నో రాశావు గదా, ఇంకేం అంటూ అభిమానించేవారు. సినిమా పత్రికలు పెరిగాయి. చాలా సినిమా ఆఫీసులు మూసేశారు. ఆర్టిస్టుగా ఎదగాలనుకుంటున్న సమయంలోనే శోభన్‌బాబు ఇచ్చిన ఆదరణతో ఆయన ఇంటి ఔట్‌హౌస్‌లో ఉంటూ వేషాలు వెతుక్కున్నానంటున్నారు. అలా విఠలాచార్య రూపొందించిన అన్ని చిత్రాల్లో పనిచేశారు. ఆయనకు తెలుగు చదవడం రాదు కనుక ఏచూరి చేత చదివించుకునేవారు. ఆయన లైబ్రరీలో వున్న అనేక చందమామలాంటి పత్రికల్లో వుండే కథలనే చదివి సినిమా కథకు పనికివచ్చేవాటిని ఎంపిక చేయమనేవారు. అలా ఆయనతోవుంటూ నెలకి 500 రూపాయల జీతంతో ప్రతి సినిమాలో వేషం ఇచ్చేటట్లుగా, సినిమా పూర్తయ్యాక 5 వేల రూపాయలు ఇచ్చేటట్టుగా అవకాశాలు ఇచ్చారు. ఈలోపు బయటి చిత్రాలు చేసుకునే అవకాశం కూడా ఉండటంతో షూటింగ్ లేనినాడు ఆఫీసుకొచ్చేవారు. అలా గిడుతూరి సూర్యం, కమలాకర కామేశ్వరరావు, ముత్యాల సుబ్బయ్య, టి కృష్ణ, దాసరి నారాయణరావులాంటి ఎందరో దర్శకులతో పనిచేసి వెయ్యి చిత్రాలు పూర్తి చేశారు.
హాస్యనటుడు, కామెడీ విలన్, దొంగ, జడ్జిలాంటి పాత్రలు ఎన్నో వరించాయి. వాటిల్లో ప్రత్యేకమైనది ఏదని అడిగితే- బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ చిత్రంలో అల్లు రామలింగయ్య ముందే ఆయన పాత్రలో నటించడం అంటాడు ఏచూరి. కొబ్బరికాయల సుబ్బారాయుడిగా అల్లు రామలింగయ్య నటిస్తే, ఆయన్ను టీజ్ చేస్తూ హీరో చిరంజీవి పాడే ‘కొలువైనాడే కోట్ల విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడు’ అన్న పాటలో ఏచూరి అల్లు రామలింగయ్యలా నటించారు. ఈ పాత్రకోసం బాపు అనేకమందిని చూశారట. చివరికి అల్లు రామలింగయ్య మేనరిజమ్ బాగా పలికే ననే్న ఎంపిక చేశారంటూ చెప్పుకొస్తాడు ఏచూరి. కురుక్షేత్రం, దానవీర శూరకర్ణ పోటాపోటీగా రూపొందించి విడుదలైనప్పుడు కురుక్షేత్రం గురించే గొప్పగా వ్రాయడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చింది. మళ్లీ ఆయన పుట్టిన రోజుకు ప్రత్యేకంగా వేసిన ఓ పత్రికలో దాదాపు ఆరు పేజీల వ్యాసం ఎన్టీఆర్‌మీదే వ్రాశా. అప్పుడు ఎన్టీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు. రాజకీయాల్లోకి వెళితే ఖచ్చితంగా మంత్రి అవుతారని చెప్పేవాణ్ణి. తిరుపతిని అభివృద్ధి చేస్తానంటూ అప్పటినుంచే ఎన్టీఆర్ చెప్పేవారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లాక హైదరాబాద్ రమ్మన్నారు. కానీ నేను పోలేదు. అక్కడికి వెళితే అర్థ రూపాయికి నటించమంటారని భయపడ్డాను. ఇక్కడైతే 500 ఇస్తున్నారు అంటూ ఆగిపోయాను. చివరగా ఇవివి సత్యనారాయణ కుమారుడు నరేశ్ ప్రత్యేకంగా పిలిచి ‘సుడిగాడు’ చిత్రంలో పాత్ర ఇస్తే నటించాను. ఒకప్పుడు ఎవరికి డూప్‌గా నటించాలన్నా ననే్న పిలిచేవారు. శంకరాభరణం చిత్రంలో శంకరశాస్ర్తీ పాట పాడుతుంటే మోర్సింగ్ వాయిస్తూ కనిపించింది నేనే. అలా పెళ్లిళ్ల పేరయ్యగా, డాక్టర్‌గా, జడ్జిగా, కాంపౌండర్‌గా ఏ పాత్రైనా చేసుకుంటూ వెళ్లా.
ఇప్పటి సినిమాలు ఎలా ఉన్నాయంటే, అప్పటి సినిమాలకు దాదాపు వంద పేజీల డైలాగులుండేవి. ఇపుడు డైలాగ్ వర్షన్ తగ్గిపోయింది. హీరో కూడా రెండు మాటలు మాట్లాడి ఫైట్ చేస్తున్నాడు. ఆకాశానికి ఎగురుతున్నాడు. స్పీడ్ ఎక్కువైంది. థియేటర్‌కెళ్లి సినిమా చూడాలంటే డిటిఎస్‌లాంటి శబ్ద కాలుష్యాలు వచ్చాక భయంగా ఉంటోంది. చంటిపిల్లలు దడసుకుంటున్నారు. కేవలం టీనేజ్ కుర్రాళ్లు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. అభిమాన సంఘాలు వేలంవెర్రిగా ప్రవర్తిస్తున్నాయి. శోభన్‌బాబు అభిమాన సంఘాలను ఎప్పుడూ ప్రోత్సహించేవారు కాదు. అభిమాని అని ఎవరొచ్చినా ‘అయ్యా, నా సినిమా నచ్చితే మరోసారి చూడండి. కానీ వేరే హీరో సినిమాలను తక్కువ చేసి మాట్లాడకండి’ అని చెప్పేవారు. ఇపుడు జరుగుతున్నదంతా ఇలానే ఉంది. అలా అభిమాన సంఘాలు పెట్టకుండా శోభన్‌బాబు చెప్పినట్టుగా బాగా చదివి వృద్ధిలోకి వచ్చిన ఎంతోమంది యువత నాకు తెలుసు. వాళ్లందరూ అనేక దేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ నాకు టచ్‌లోనే ఉంటారు. శోభన్‌బాబు పోయినా ఆయన అభిమానులు ఇప్పటికీ వర్థంతులు నిర్వహిస్తున్నారంటే వాళ్లున్న స్థితి అలాంటిది. అదే ఇప్పటి హీరోల అభిమానులు జీవితంలో స్థిరపడిన దాఖలాలు చాలా తక్కువగా కన్పిస్తాయి అంటూ ముగించారు.

-సరయు శేఖర్, 9676247000