సబ్ ఫీచర్

ఐక్యరాజ్యసమితి ఏం చేస్తున్నట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, పాకిస్తాన్‌లు స్వాతంత్య్రాన్ని పొంది 72 సంవత్సరాలు గడిచినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇప్పటికీ వైరం కొనసాగడం సరికాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ భారత్‌లో తరచూ పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తోంది. పుల్వామాలో ఇటీవల పాక్ ప్రేరిత ఉగ్రవాదులు మన సిఆర్‌పీఎఫ్ జవాన్లను భారీ సంఖ్యలో హతమార్చడం దారుణం. ఎదురు నిలిచి పోరాడే ధైర్యం లేకనే పాకిస్తాన్ ఇలా భారత్‌ను దొంగచాటుగా దెబ్బతీస్తోంది. కశ్మీర్‌లో కొందరు యువకులు ఎందుకు సంఘ విద్రోహక శక్తులుగా మారుతున్నారు? పాక్ సైనికులు ఎందుకు భారతీయ జవాన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు? భారత్ గనుక ఒక్కసారి కనె్నర్ర జేస్తే పాక్ ఆనవాలు ఉంటాయా? ఏళ్ల తరబడి పాక్ దుశ్చర్యలు సాగుతుంటే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నట్లు? ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంఘ విద్రోహక శక్తులను అణచివేసేందుకు ఐరాస చర్యలు తీసుకోదా? ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే ఏ దేశంతోనైనా మిగతా దేశాలన్నీ సంబంధాలను తెంచుకోవాలి. శాంతికి విఘాతం కలిగించే దేశాన్ని ఏకాకిగా చేయాలి. ఈ విషయమై కఠిన నిబంధనలు రూపొందించకపోతే ప్రపంచానికి ముప్పు వాటిల్లక తప్పదు.
పాకిస్తాన్ చెప్పుచేతల్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడి వల్ల భారీ సంఖ్యలో మన జవాన్లు అమరులయ్యారు. ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు ఏర్పడి, యావత్తు దేశం శోక సముద్రంలో మునిగింది. అమర జవాన్ల కుటుంబాలను ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకుంటాయోమో గానీ, వారు లేని లోటును ఎవరు తీర్చగలరు? ఉగ్రదాడికి బలైపోయిన సైనికుల్లో ఒక్కొక్కరి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుంటే పగవాడు సైతం కంట నీరు పెట్టాల్సిందే. ఒకరు సైన్యంలో చేరి రెండేళ్లయితే, రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళిచేసుకున్న వారు సైతం ఉన్నారు. మరొకరు త్వరలోనే పెళ్ళిచేసుకోబోతుంటే, ఇంకో జవాను సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయాలని ఆశపడడం.. ఇలాంటి విషయాలు ఎవరినైనా చలించి వేస్తాయి.
దేశమంతా అనునిత్యం రైతులకు, జవాన్లకు రుణపడి ఉంటుంది. ఒకరు పంటలు పండించి మన కడుపు నింపుతుంటే, మరొకరు సరిహద్దుల్లో పగలూ రాత్రీ కాపలా కాస్తూ దేశానికి భద్రతనిస్తున్నారు. కానీ నేడు వీరి జీవితాలకు ఎలాంటి భరోసా లేకుండాపోయింది. రాత్రనక పగలనక ఎంతటి వేడినైనా, చలినైనా తట్టుకుంటూ, బరువైన బ్యాగులను తమ శరీరాలపై వేసుకొని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ సైనికులు దేశాన్ని కాపలా కాస్తుంటే దేశంలో మనం క్షేమంగా మనుగడ కొనసాగిస్తున్నాము. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు ఏం ఇచ్చి సత్కరించుకున్నా ఋణం తీర్చుకోలేనిది. ఉద్యోగంలో చేరిన మరు క్షణం నుండి దేశం కోసం తమ ప్రాణాల్ని అంకితమిచ్చేందుకు సైనికులు సిద్ధపడతారు.
కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కశ్మీర్ సమస్యకు పరిష్కార మార్గం చూపలేకపోతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఏటా ముఖ్యమైన పట్టణాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నా- భద్రతను మరింత కట్టదిట్టం చేసి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ముష్కరులను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు నిఘా వ్యవస్థ మరింతగా రాటుదేలాలి. ప్రపంచ దేశాల సహకారంతో ఐక్యరాజ్య సమితిలో చర్చించి, ఉగ్రదాడులు అనే మాట వినిపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దాడులు జరగకుండా రాజకీయ విభేదాలకు అతీతంగా నాయకులు కృషి చేయాలి. రక్షణ విషయంలో ఓట్ల రాజకీయం చేయడానికి వీలులేదు. మిలటరీ దళాలు తగిన నిర్ణయాలు తీసుకొనేలా పూర్తి స్వేచ్ఛనిస్తూ, అత్యాధునిక వనరులను సైనికులను సమకూర్చవలసి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఊరేగింపులు జరపడం, నినాదాలు ఇవ్వడం దేశభక్తి అనిపించుకోదు. ఉగ్రదాడులు జరిగినపుడు జవాన్లకు మద్దతుగా నిలబడాలి. అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండటానికి ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా స్వార్థపూరితంగా ఆలోచిస్తూ, అంతర్లీనంగా పాకిస్తాన్‌కు మద్దతునిస్తూ ప్రపంచంపై ఆధిపత్యం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థలో అత్యధిక భాగం భారతదేశం పైనే ఆధారపడి ఉంది. చైనా వస్తువులను భారత్ నిషేధిస్తే ఆ దేశానికి గుణపాఠం వస్తుంది. చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా కుంటుపడుతుందో భారతీయులకు తెలుసు. స్వాతంత్య్ర సంగ్రామంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ ఎలా ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. పాకిస్తాన్‌తో జతకట్టి కవ్వింపు చర్యలకు చైనా పాల్పడితే తగిన గుణపాఠం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను గమనిస్తూ, ఇవి పునరావృత్తం కాకుండా- ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించాలి. 130 కోట్ల జనాభా కలిగిన భారతావని సహనాన్ని పరీక్షించదలిస్తే పూర్తిగా నష్టపోయేది పాక్ మాత్రమే. ప్రతి భారతీయుడూ ఒక సైనికునిగా మారడానికి ముందుకు వస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు అంచనా వేయలేని విధంగా ఉంటాయి. పరిస్థితిని అంతవరకూ తీసుకురాకుండా సంఘ విద్రోహక శక్తులను పెంచి పోషించే దేశాలపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రపంచంలోని అన్ని దేశాలపైనా ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమర జవాన్ల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు చొరవ చూపాలి. సైనిక సంక్షేమం కోసం జరిగే కార్యక్రమాల్లో ప్రజానీకం సైతం పాలుపంచుకోవాలి.

-డా. పోలం సైదులు 94419 30361