సబ్ ఫీచర్

ఐటీ రంగంలో వినూత్న విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం పరుగులు పెడుతోంది. దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నేడు అనేక అంతర్జాతీయ సంస్థలు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి క్యూ కట్టాయి. రాష్ట్ర విభజన నాటికి 99 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. కేవలం ఒక్క శాతం.. అది కూడా చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఏపీలో ఉండేవి. ఈ కారణంగా పలువురు నిపుణులు ఏపీకి ఐటీ రంగాన్ని ఆహ్వానించడమే వృథా అన్నారు. ఐటీ రంగానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు ఉండగా కంపెనీలు పెట్టేందుకు ఏపీకి వచ్చేదెవరన్న ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలో సరైన విధానాలు, సత్వర అనుమతుల ద్వారా కంపెనీలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించాయి. పలు వినూత్న విధానాలను రూపొందించాయి. ఫలితంగా నేడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఐటీలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఐటీ అభివృద్ధికి పాలసీలను రూపొందించడమే కాదు.. వాటి అమలులోనూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి తిరుగులేని విజయాలు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ‘డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ’ని కొత్తగా తీసుకొచ్చారు. ఐటీ కంపెనీలకు తగిన స్పేస్ ఇవ్వడం, అటు రియల్ ఎస్టేట్‌కు ఊతం ఇచ్చేందుకు ఈ విధానం తోడ్పడింది. అద్దెలో సగం ఐటీ శాఖే చెల్లించడం ఈ విధానంలో కీలకం. ఫార్చ్యూన్-500 కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో‘ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ-2017-2020’ని తీసుకొచ్చారు. కొత్త సాంకేతికతల వైపు ఇప్పటి నుంచే బాటలు వేసేందుకు సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్ పాలసీని రూపొందించారు. దేశంలో ఉన్న అతిపెద్ద గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్ కంపెనీలను ఆకర్షించేందుకు ఒక విధానం తీసుకొచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను ఒకేచోట కాకుండా వికేంద్రీకృత అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పనిచేశారు.
అన్ని ఉన్నచోట ఎవరైనా అభివృద్ధి చేస్తారు. ఏమీ లేనిచోట కూడా ప్రగతికి బాటలు వేయగలిగినప్పుడే నాయకుడిలోని సమర్థత బయటపడుతుంది. సరిగ్గా దీన్ని ఆచరణలో చేసి చూపించారు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు మొదలు రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఆయన పలు దేశాలకు కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. ఏపీలో కంపెనీలు పెడితే ఎటువంటి రాయితీలు ఇచ్చేది, ఎలాంటి సౌకర్యాలు కల్పించేదీ వివరించి కంపెనీలను ఆకర్షించారు. ఫలితంగా అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కొలువుదీరాయి.
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖను ‘బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి సెంటర్’గా మార్చడంలో విజయం సాధించారు లోకేష్. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాన్‌డ్యుయెంట్, ఏఎన్‌ఎస్‌ఆర్, గూగుల్ ఎక్స్ లాంటి భారీ కంపెనీలు వచ్చాయి. విశాఖలో ఒకప్పుడు ఖాళీగాఉన్న హిల్-1, హిల్-2 ఇప్పుడు ఐటీ కంపెనీలతో నిండిపోయాయి. మిలీనియం టవర్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. కాపులుప్పాడలో ఐటీపార్కు ఏర్పాటుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటైంది. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న గన్నవరం మేథా టవర్స్ ఐటీ కంపెనీలతో పూర్తిగా నిండిపోయింది. మంగళగిరి ప్రాంతం మినీ ఐటీ హబ్‌గా రూపొందుతోంది. ఏపీఎన్‌ఆర్‌టీతో కలిసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలోని ఇండ్‌వెల్ టవర్స్, మేథా టవర్స్, కే విజినెస్ స్పేస్, పై కేర్, ఎన్నార్టీ టెక్ పార్కుల్లోకి పదులకొద్దీ కంపెనీలు వచ్చాయి. బెంగళూరులోని కంపెనీలను ఆకర్షించేందుకు అనంతపురంలో బెంగళూరు ప్లస్ ప్లస్ పేరుతో ఐటీ పార్కు ఏర్పాటైంది. బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీల్లో ముందుకెళ్ళేందుకు విశాఖలో ఫిన్‌టెక్ వ్యాలీని ఏర్పాటుచేశారు. ఏపీ ఫైనాన్షియల్ కేపిటల్ అయిన విశాఖను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి సెంటర్‌గా మార్చడంలో విజయం సాధించారు లోకేష్. ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటయిన హెచ్‌సీఎల్‌ని విజయవాడకి రప్పించారు. హెచ్‌సీఎల్ రాక అమరావతిలో ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసింది. హెచ్‌సీఎల్‌కి ఏపీ 18 ఎకరాలు కేటాయించింది. ఎకరం స్థలంలో ఏర్పాటయ్యే కంపెనీల్లో కనీసం వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
కొలువుల జాతర..
ఐటీ శాఖ లక్ష్యంగా పెట్టుకున్న లక్ష ఉద్యోగాలు రావాలంటే కోటి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కావాలి. ఇందుకోసం డిటిపి పాలసీ ద్వారా ప్రపంచ స్థాయి వౌలిక వసతులతో ఆఫీస్ స్పేస్ ఏర్పాటు కాబోతోంది. ఒకప్పుడు ఐటీ కంపెనీలకు ఆఫీస్ స్పేస్ అంటే సంవత్సరం పట్టేది. ఇప్పుడు 50 రోజుల్లో అన్ని అనుమతులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో 21 రోజుల్లోనే ఆఫీస్ స్పేస్‌తోపాటు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతమంచి పాలసీలు రూపొందించినా రాయితీలు కల్పించినా వాటికి తగినంతగా ప్రచారం చేయాలి. ఆ ప్రచార బాధ్యతను తీసుకున్న మంత్రి లోకేష్ అమెరికా, దావోస్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, ముంబై సహా పలుచోట్ల పర్యటించారు. వివిధ కంపెనీలతో ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో ఇప్పటివరకు ఐటీ కంపెనీల ద్వారా 36,583 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని, భూ కేటాయింపులు పూర్తయి, పనులు ప్రారంభమైన కంపెనీల ద్వారా 27,500 ఉద్యోగాలు రాబోతున్నాయి. మరో 40వేల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి.
ఎలక్ట్రానిక్ హబ్..
రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ తయారీ లేనే లేదు. దీనిపై ప్రత్యేక కసరత్తు చేసిన మంత్రి లోకేష్ ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీని పెద్దఎత్తున ప్రచారం చేసారు. దేశవ్యాప్తంగా తిరుగుతూ అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ప్రతినిధులు, అధిపతులతో భేటీ అయ్యారు. చెన్నై, బెంగళూరు కారిడార్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటూ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. విశాఖపట్నంలో మెడికల్ ఎలక్ట్రానిక్స్, అనంతపురం జిల్లా గుడిపల్లివద్ద డిఫెన్స్, ఏరోస్పేస్, పిసిబి తయారీ క్లస్టర్ల ఏర్పాటు చర్యలు చేపట్టారు. నెల్లూరు శ్రీసిటీ వద్ద, రేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1,2లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుద్వారా పెద్దఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూముల కేటాయింపులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. భూముల కేటాయింపు పూర్తిఅయిన తరువాత కావాల్సిన రోడ్లు, తాగునీటి సదుపాయం, 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నారు.
రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సెల్‌ఫోన్ కూడా తయారుకాలేదు. కానీ ఇప్పుడు దేశంలో తయారవుతున్న 10 ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్నాయి. కేవలం సెల్‌ఫోన్లు మాత్రమే కాదు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీలు రాష్ట్రంలో జరిగేందుకు తీసుకున్న చర్యల ఫలితంగా ఫాక్స్‌కాన్, సెల్కాన్, డిక్సన్, కార్బన్ ఫోన్ల తయారీ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీతో నారా లోకేష్ జరిపిన చర్చలు ఫలించాయి. రాష్ట్రానికి పెద్దఎత్తున రిలయన్స్ పెట్టుబడులు రానున్నాయి. రిలయన్స్ సంస్థ వివిధ దశల్లో రూ.15వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. రోజుకి 10 లక్షల జియో ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు రిలయన్స్ తయారుచెయ్యబోతుంది. దీనిద్వారా ఒకేచోట 25వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, తయారీ పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-2020 రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వచ్చే మూడేళ్ళలో 30వేల కోట్ల పెట్టుబడులు, 60వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-2020’ రూపొందింది. ఎలెక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ వ్యవస్థల ఏర్పాటుకు కూడా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.

-మురళి.జి