సబ్ ఫీచర్

సంకల్ప భీ’మేశ్వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గానసభలో..
ఓంకారునాదాను సంధానవౌ గానమే.. శంకరాభరణమూ -అంటూ శంకరశాస్ర్తీ గంధర్వగానం సాగుతోంది. అప్పుడే -కామకళాపిపాసకుడైన ఓ జమీందారు గానసభలోకి ప్రవేశించాడు. ముందువరుసలో కూర్చున్న వెలయాలితో కబుర్లుచెబుతూ, గానామృతాన్ని ఆస్వాదిస్తున్న ఆమె కూతురు తులసి అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. సభా మర్యాదను విస్మరించిన జమీందారు అనుచిత ప్రవర్తన -నాదామృత భక్త్భివంలో లీనమైన శంకరశాస్ర్తీకి కోపంతెప్పించింది. వేదికనుంచి గంభీరంగా నిష్క్రమించాడు.
***
వెలయాలి ఇంట్లో..
ఆగిన చోటినుంచే శంకరశాస్ర్తీ గానామృతాన్ని రికార్డు ప్లేయర్‌లో ఆస్వాదిస్తూ తానూ గొంతు కలిపింది తులసి. మల్లెచెండు చేతికి చుట్టుకొని కామోద్రేకంతో అక్కడికి వచ్చాడు జమీందారు. తన్మయత్వంలోవున్న తులసిని బలాత్కరించాడు. కోరిక తీరాక, శంకరశాస్ర్తీని అవహేళన చేస్తూ ఫొటోను కాలితో తన్నాడు. మానభంగం చేశాడన్న బాధకన్నా, గురుతుల్యుడైన శాస్ర్తీని కాలితో తన్నినందుకు బాధితురాలికి కోపమొచ్చింది. పగిలిన గాజుపెంకుతో జమీందారు ప్రాణం తీసింది.
శంకరాభరణం చిత్రంలోని ఈ సీక్వెన్స్ సన్నివేశాలు పండటానికి ప్రధాన కారణం -జేవీ సోమయాజులో, మంజుభార్గవో కాదు. ప్రేక్షకుడి కోపం కట్టెలు తెంచుకునేంతగా విలనిజాన్ని ప్రదర్శించిన నటుడి గొప్పతనం. అతనే - భీమేశ్వర్రావు. నిజానికి భీమేశ్వరరావుకు అది రెండో చిత్రం. మొదటి చిత్రం ‘తుఫాన్ మెయిల్’. శంకరాభరణంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న భీమేశ్వర రావు -తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో కనిపించి మెప్పించాడు.
**
గుంటూరు జిల్లా చేబ్రోలువాసి భీమేశ్వర్రావుకు -నాటకం ఓ ఆలంబన. అమ్మమ్మ ఇంట అల్లారుముద్దుగా పెరిగిన ఆయన -పట్ట్భద్రుడు. 1974లో తండ్రి కాలం చేయడంతో వ్యవ’సాయానికి ఉపక్రమించి రైతయ్యాడు. గుంటూరు హిందూ కాలేజీలో చదివేటప్పుడే మైథలాజికల్ ఫోక్‌లోర్, సాంఘిక నాటకాలు వేసిన అనుభవంతో -దుర్యోధనుడి ఏకపాత్రాభినయంలో ఆరితేరాడు. ‘దుర్యోధనుడిగా (భారతంలో విలన్) స్టేజీమీద నిలబడితే చూసేవాళ్లు కన్నార్పేవారు కాదు’ అంటూ అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు భీమేశ్వర రావు.
1977 తుఫాన్ -దివిసీమనే కాదు, భీమేశ్వర్రావు పొలాలనూ ముంచేసింది. నిజానికి అదే ప్రకృతి సంకల్పం. రైతు ఉపాధి దెబ్బతినడంలో -అతనిలోని కళాకారుడు మేల్కొన్నాడు. జీవన’కళపై మక్కువతో పరిశ్రమకు వచ్చిచేరాడు. ‘ఇష్టమున్నచోట కష్టానికి తావుండద’న్న నమ్మకాన్ని మనసులో నింపుకుని -ఏదోకరోజున కళామతల్లి ఆశీస్సు దొరుకుతుందన్న ఓర్పుతో ప్రయాణం మొదలెట్టాడు. 1978 చివరిలో దర్శకుడు, డ్యాన్స్ డైరెక్టర్ కెఎస్ రెడ్డి రూపొందించిన ‘తుఫాన్ మెయిల్’ చిత్రంలో పోలీస్ అధికారిగా తెరంగేట్రం చేశారు. తరువాత వేషాల కోసం వెతికి వేసారినా అవకాశాలు ఆదుకోలేదు. కాని -తొలి సినిమా దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో నిరుత్సాహాన్ని అధిగమించాడు. ‘దర్శకులను కలవడమే తన వ్యాపకం అన్నంత సుదీర్ఘ ప్రయత్నం -కళాతపస్వి కె విశ్వనాథ్ వద్దకు తీసుకెళ్లింది. అప్పుడాయన -శంకరాభరణాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఎలాంటి వేషాలూ లేవని తెగేసి చెప్పేసిన విశ్వనాథ్ -బాడీ లాంగ్వేజ్‌కు తగిన పాత్ర వుంటే పిలుస్తాలేనని హామీ మాత్రం ఇచ్చారు’ అంటూ తన బయోగ్రఫీలోని కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటాడు భీమేశ్వరరావు.
**
‘ఒక తలుపు మూసుకుపోతే -మరెక్కడో మరో తలుపు తెరుచుకుంటుంది’ అన్నది పెద్దల మాట. భీమే’శ్వరరావుకూ అదే జరిగింది. శంకరాభరణంలో జమీందారు పాత్రకు విశ్వనాథ్ ముందనుకున్న ఆర్టిస్ట్ -గోకిన రామారావు. షూటింగ్ సమయానికి ఆయన రాలేదు. రెండో షెడ్యూల్‌లో భీమేశ్వర్రావుకు పిలుపెళ్లింది. అలా తెరుచుకున్న తలుపు మళ్లీ మూసుకుపోకుండా జాగ్రత్తపడ్డాడు భీమేశ్వర రావు. రాజమండ్రిలో నిర్మాత ఆకాశం శ్రీరాములు స్నేహితుడైన ఓ లాయర్ ఇంట్లో షూటింగ్ జరిగింది. ‘మంజుభార్గవి తన్మయత్వంతో పాడుతుండగా, వీణను లాక్కుని పక్కన పడేసి, ఆమెను పక్క గదిలోకి లాకెళ్తాను. గ్రామ్‌ఫోన్ రికార్డు చివరికంటా వచ్చేసి నొక్కులుపడుతుంటే -ఆ టైంలో తలుపు తీసినప్పుడు నేను చూపించిన ఎక్స్‌ప్రెషన్ విశ్వనాథ్‌కు బాగా నచ్చడం నా అదృష్టం. సంతృప్తి కలిగిన ఫీలింగ్ ముఖంలో చూపించాలని ఆయన చెప్పినట్టే చేశానంతే’ అంటాడు భీమేశ్వర రావు.
‘చిత్రసీమలో నాకెవ్వరూ గాడ్‌ఫాదర్స్ లేకపోవడం, ప్రతివారిని కలిసి గొప్పలు చెప్పే భజన చేయలేకపోవమే తనకు అవకాశాలు తక్కువగా రావడానికి కారణ’మంటూ ఇప్పటి పరిస్థితిని అన్వయించి చెబుతున్నారు ఆయన. దానికితోడు తనను ఇష్టపడే దర్శకులు టి కృష్ణ, రచయిత ఓంకార్‌లు లేకపోవడం కూడా మరో లోటన్నది ఆయన భావన. శంకరాభరణం తరువాత చిన్న చిన్న పాత్రలైనా చేసుకుంటూ వెళ్లి -దాదాపు 300 చిత్రాలు పూర్తి చేశాడు భీమేశ్వర రావు. సినిమాలు ఎన్ని చేసినా -అన్నింటిలోనూ హీరోయిన్ తండ్రి.. లేకపోతే విలన్లలో ఒకడిగా.. లేదంటే జడ్జి/ లాయర్ పాత్రలే ఎక్కువ దక్కాయి ఆయనకు. కొత్తదంపతులు చిత్రంలో దర్శకుడు బి వాసు పూర్తి నిడివివున్న పాత్ర ఇచ్చారు. కానీ అదే టైమ్‌లో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో, ఆ సినిమా వచ్చిందన్న విషయమే ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. టి కృష్ణ దర్శకత్వంలో ప్రజాస్వామ్యం, ప్రతిఘటన, రేపటిపౌరులు తదితర చిత్రాల్లో మంచి పాత్రలే చేశారు. వెంకటేష్ హీరోగా రూపొందిన అగ్గిరాముడు చిత్రంలో సత్యనారాయణ, చలపతిరావు, నర్రా వెంకటేశ్వర్రావులతో ఓ విలన్‌గా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనూ అనేక చిత్రాల్లో నటించారు. ‘కెఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో మంచి పాత్రలు పడ్డాయి. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. అందుకే మంచి పాత్రలు ఇచ్చారు’ అని గుర్తు చేసుకున్నారు. ‘కె విశ్వనాథ్ దర్శకత్వంలోనూ తరువాత సాగర సంగమం చిత్రంలో నటించాను. నటుల్లో శోభన్‌బాబుతో నటించే సందర్భాల్లో ఆయన ఇంటికి వెళ్లిన సందర్భాలున్నాయి. సహనటునిగా ఆయన చూపించిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను’ అంటాడాయన. చిన్ననటులు పెద్ద నటులన్న భేదం ఆయనకు ఉండేది కాదని భీమేశ్వర రావు గుర్తు చేసుకున్నాడు.
‘రామినీడు రూపొందించిన రాజ్‌కుమార్ చిత్రంలోని ఓ సీన్ కోసం దాదాపు ఐదారు టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది. అదే మరో పెద్ద హీరో అయితే ఇలాంటి టేక్‌లు తీసుకునేవాళ్లని ఎందుకు తీసుకొచ్చారని విసుక్కునేవారు. కానీ ఆయన టేక్ ఓకె అయ్యాక నాకు ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద స్టార్లే టేక్‌లు తీసుకుంటారు. అలాంటివి మనసులో పెట్టుకోవద్దంటూ వెన్నుతట్టారు. అలాంటి సంఘటనలు నా కెరీర్‌లో కొల్లలు. అనుబంధంలో రాధిక తండ్రిగా, ఎవడబ్బసొమ్ము చిత్రంలో ఓ విలన్‌గా, దర్శకుడు వేజెండ్లతో ఓటుకు విలువివ్వండి, జార్జి ప్రసాద్ దర్శకత్వంలో కులమా? గుణమా? అనే చిత్రాల్లో మంచి పాత్రలు చేశాను’ అంటున్నాడు. నాంపల్లినాగు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నేనూ మా ఆవిడ లాంటి చిత్రాలు కూడా ఆయన కెరీర్‌లో గుర్తింపు తెచ్చినవే. వంశీ తొలి చిత్రం మంచుపల్లకిలో ఓ పాత్రకి తనను చెన్నైనుండి హైదరాబాద్ పిలిపించి మరీ చేయించారని, అలాగే కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో శ్రీ సంతోషిమాతా వ్రత మహత్మ్యం, దాసరితో ఎమ్మెల్యే ఏడుకొండలులో పొలిటికల్ లీడర్‌గా మంచి పాత్రలు చేశానని గుర్తు చేసుకున్నారు. కట్టా సుబ్బారావు పుణ్యంకొద్దీ పురుషుడు, డి రామానాయుడు రూపొందించిన ‘సంఘర్షణ’ కూడా ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలే. మోహన్‌గాంధీ-ఏఎన్నార్ కాంబినేషన్‌లో ప్రాణదాత, రెండు రెళ్లు ఆరులో జంధ్యాల దర్శకత్వంలో సుత్తి వీరభద్రరావుతో చేసిన కామెడీ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుందని, కృష్ణతో పరశురాముడు, జమదగ్ని, ఆరాధన, జైలుపక్షి లాంటి చిత్రాలు చేశారు. దాదాపు 200 ఫీట్ల లాంగ్‌సీన్ ఒకే టేక్‌లో చేసిన అనుభవం ఇప్పటికీ ఆనందాన్నిస్తుందన్నది ఆయన మాట. విసు దర్శకత్వంలో రూపొందిన ఇల్లు ఇల్లాలు పిల్లలు చిత్రంలో శారద సోదరుడిగా, విసు కాంబినేషన్‌లో కుర్చీ, స్టూల్ సన్నివేశం ఒకటుంది. అది ఫస్ట్ షాట్‌లోనే ఓకె అయింది. దొంగపెళ్లి, రావుగారింట్లో రౌడీ, బాలగోపాలుడు, కర్తవ్యం, జస్టిస్ రుద్రమదేవి, తల్లిదండ్రులు, ఏడుకొండలస్వామి, కలికాలం, ప్రయత్నం, పచ్చని సంసారం, మెకానిక్ అల్లుడు తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భీమేశ్వర్రావు. శోభన్‌బాబుతో దొరగారికి దొంగపెళ్లాం, శరత్ దర్శకత్వంలో జైలర్‌గారి అబ్బాయి, బాలకృష్ణ పినతండ్రిగా భైరవద్వీపం, మాతో పెట్టుకోకు, నాగ, శంకర్‌దాదా జిందాబాద్, పిస్తా లాంటి చిత్రాలను చేశారు. రెమ్యూనరేషన్ గురించి అడిగితే అప్పట్లో యావరేజ్‌గా ఇచ్చేవారని, మనం ఏదో డిమాండ్ చేస్తే మళ్లీ అవకాశాలు తక్కువగా వస్తాయన్న ఉద్దేశ్యంతో ఉండేవాడినని అంటారు.
‘బి విఠలాచార్య దర్శకత్వంలో మదనమంజరి చిత్రంలో నటించాను. హీరోయిన్ తండ్రిగా షూటింగ్ పూర్తయ్యాక నాకు ఇవ్వాల్సిన పారితోషికం ప్రొడక్షన్ మేనేజర్‌తో ఇంటికి పంపించారు. అది ఆయన గొప్పతనం. ఆయనను వేషాలు అడగటానికి వెళ్లినపుడు ముందు కూర్చోమంటారు. టీనో, కాఫీనో తాగించి తరువాత వచ్చిన పని చెప్పమంటారు. అది ఆయన సౌహార్దహృదయానికి నిదర్శనం. ఎప్పుడూ షూటింగ్‌లో నాపై కంప్లైంట్స్ రాలేదు. ఎవ్వరితోనైనా కలిసి నటించగలిగాను. సినిమా వేషాలు తగ్గాక -సీరియల్సూ చేశా. రాడార్ ప్రొడక్షన్స్ తరఫున ఇది కథ కాదు, ఈనాటి రామాయణం, కలవారి కోడలు, కల్యాణం లాంటి సీరియల్స్ చేశాను. ఇందులో పూర్తినిడివి పాత్రలు నటించడం ఆనందాన్నిచ్చింది’ అంటారాయన.
2016లో పెరాల్సిస్ రావడంతో భీమేశ్వరరావు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. కూర్చొని నటించే పాత్రలేవైనా సరే ఇప్పటికీ నటించగలనని చెబుతున్నారు. అదీ కళపట్ల -ఆయనకున్న మమకారం. భీమేశ్వరరావు సంకల్పం.

-సరయు శేఖర్, 9676247000