సబ్ ఫీచర్

5జీతో సమాజం ‘రీ డిజైన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రిలయన్స్ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ 2018 సంవత్సరంలో రూ.437 కోట్లు వెచ్చించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని, ఆ రకంగా ఆయన అగ్రస్థానంలో నిలిచారని చైనాకు చెందిన సంస్థ ‘హ్యూరన్ ఇండియా’ ఇటీవల పేర్కొన్నది. ముకేశ్ వియ్యంకుడు అజయ్ పిరమాల్‌కు చెందిన పిరమాల్ గ్రూప్ రూ.113 కోట్ల నిధులను దాతృత్వం కింద ఇచ్చింది. విప్రో సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, గోద్రేజ్‌కు చెందిన ఆది గోద్రేజ్, శివ్‌నాడార్, షాపూర్ పల్లోంజీ మిస్ర్తి, గౌతమ్ అదానీ.. ఇలా అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వందలాది కోట్ల రూపాయలను విద్య,వైద్యంతోపాటు గ్రామీణాభివృద్ధి, పోషకాహారం, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో ఖర్చుచేస్తున్నారు. 39 మంది దాతల్లో మంజు డి.గుప్తా అనే మహిళ సైతం ఉన్నారు. సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి, విద్య-ఆరోగ్యానికి ఖర్చుచేయడం వల్ల మానవ వనరులను మెరుగుపరచుకోగలుగుతున్నాం. వర్తమానంలో కావలసిందే ఇది.
ప్రభుత్వాలు చేరని చోటుకు దాతృత్వ సంస్థలు చేరి పేదలను, నిరుద్యోగులను ఆదుకుంటున్నాయి. ఇలా ఖర్చుచేస్తున్న ధనం కైనటిక్ శక్తిగా పనిచేస్తోంది. ఏ సమాజంలోనైనా ఈ ప్రక్రియను ఆహ్వానించాలి. కైనటిక్ శక్తి కారణంగానే సమాజం ముందుకు పరుగులు తీస్తుంది.
ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా రూపాంతరం చెందుతున్నదో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ సంస్థ ఇటీవల నిరూపించింది. ఆ సంస్థ మడతపెట్టే స్మార్ట్ ఫోన్‌ను రూపొందించింది. కొత్తదనాన్ని కోరుకునే వినియోగదారులకిది ఎంతో ‘కిక్’ ఇస్తోంది. ‘గెలాక్సీ ఫోల్డ్’గా పిలిచే ఈ ఫోన్ 5జిను సపోర్టు చేయడం విశేషం. ఈ శ్రేణిలో పనిచేసే తొలి స్మార్ట్ ఫోన్‌గా దీనికి గుర్తింపు లభించింది. తాజాగా చైనాకు చెందిన హువావే సంస్థ సైతం మడతపెట్టే స్మార్ట్ఫోన్‌ను తయారుచేసింది. ఇదికూడా 5జి సేవలను అందిస్తుంది. అటు శామ్‌సంగ్, ఇటు హువావే పోటాపోటీగా మడతపెట్టే స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి వచ్చే జూన్-జూలై నెలల్లో మార్కెట్లో లభ్యమవుతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతమున్న 4జి నెట్‌వర్క్ కన్నా 5జి వ్యవస్థతో 50 నుంచి 100 రెట్లు ఎక్కువ వేగంగా డేటాను బదిలీ చేయవచ్చు. ఈ వేగమే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వేగం కృత్రిమ మేధ, (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత టెక్నాలజీకి చాలా అవసరం. చోదకులు లేని కార్లు రోడ్లపై పరుగెత్తడానికి సైతం ఈ 5జి టెక్నాలజీ కీలకపాత్ర పోషించనున్నది. ప్రజలు ఎక్కడినుంచైనా పనిచేయడానికి సౌకర్యం మరింత మెరుగవుతుంది. దీంతో అనేక సమస్యలు సర్దుమణుగుతాయి. కాలుష్యం సైతం తగ్గుతుందని భావిస్తున్నారు. మొత్తం వ్యవస్థ-వ్యవహారాలు రీ డిజైన్ అవుతాయని ఆశిస్తున్నారు.
ఆర్థిక, సామాజిక వ్యవస్థ రీ డిజైన్ అవనున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీపై పట్టుకోసం అమెరికా-చైనా దేశాలు పోటీపడుతున్నాయి. ఆధిపత్యం కోసం అహరహం ఆరాటపడుతున్నాయి. ఇందులో భాగంగా వాణిజ్యపోరు కొనసాగుతోంది. అధిక సుంకాలతో వాణిజ్యాలను దెబ్బతీసే వ్యూహాలను అటు అమెరికా-ఇటు చైనా రచిస్తున్నాయి. ప్రపంచం ఎటువైపు కదులుతున్నదో ఈ ఒక్క పరిణామం సూచిస్తోంది. భవిష్యత్ అంతా ఈ పరిజ్ఞానం పర్యావసనాలపై ఆధారపడి ఉంటుందని ఊహించవచ్చు. ప్రపంచమంతటా విస్తరించనున్న ఈ టెక్నాలజీని అందుకోవడంలో ఆలస్యం జరిగితే వెనుకబడటం తథ్యం. ఈ విషయాన్ని గ్రహించిన భారతదేశం సైతం 5జి టెక్నాలజీ వైపు చూపు నిలిపింది. ఈ సంవత్సరమే ఆ ప్రణాళికలను చేపట్టనున్నది. 5జి స్పెక్ట్రమ్ వేలం త్వరలో జరగనున్నదని తెలుస్తోంది. ఇందుకు హువావే, ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్ తదితర సంస్థలు పాలుపంచుకోవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వరంగ సంస్థ అయిన బి.ఎస్.ఎన్.ఎల్. సైతం తనను తాను ఉన్నతీకరించుకుంటోంది.
5జి టెక్నాలజీ విస్తృతి చెందడంతో కొత్త ఉద్యోగాల సృష్టి జరగనున్నది. లక్షలాది మందికి ఉపాధి లభించగలదని ఆశిస్తున్నారు. 2జి యుగాన్ని యూరప్ ప్రారంభిస్తే, అది సందేశాలను మార్చుకునేందుకు బాటలు పరిచింది. 3జిని జపాన్ అభివృద్ధి చేస్తే అంతర్జాలం (ఇంటర్నెట్)తో అనుసంధానమైంది. వేగం పెరిగింది. అమెరికా 4జిని ఉన్నత దశకు తీసుకెళ్ళగా కొత్త ద్వారాలు బార్లాతెరుచుకున్నాయి. ప్రపంచం నూతన అంచులను తాకింది. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ లాంటి కంపెనీలు ఇప్పుడు 5జిని ఆవిష్కరించినా ఆ టెక్నాలజీని చైనా అందిపుచ్చుకుని అగ్రభాగానికి ఎగబాకేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో మేధో హక్కుల చోరీ లాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి.
2జి, 3జి టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం కన్నా ఏకంగా 5జి టెక్నాలజీని ఆహ్వానించడం మేలన్నది నిపుణుల భావన. ఈ టెక్నాలజీ స్థాపనకు, విస్తరణకు భారీగా నిధులు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఉపగ్రహాలు కావాలి, కొత్త టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు రూపొందించాలి. నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరచాలి. ఇదంతా ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవస్థ. చైనా అందుకు సిద్ధపడింది. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ సంస్థ రూపొందించిన చిప్స్‌తో చైనా 5జి హ్యాండ్ సెట్లను తయారుచేస్తోంది. దీని ఆధారంగా చైనా సంస్థ హువావే అనేక దేశాలలో 5జి వ్యాపారం సాగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల మడతపెట్టే స్మార్ట్ఫోన్‌ను ఆవిష్కరించింది.
అమెరికా కంపెనీల సహకారంతో దక్షిణ కొరియా సంస్థ శామ్‌సంగ్ మడతపెట్టే 5జి ఆధారిత స్మార్ట్ఫోన్ తయారుచేసి తన సత్తాచాటినా, చైనా చౌకగా ఆ ఫోన్లను తయారుచేసి మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. దాంతో చైనా ఆర్థికవ్యవస్థ ఊపందుకోవచ్చునని భావిస్తున్నారు. మొత్తం సమాజాన్ని రీ డిజైన్ చేయగల శక్తిసామర్థ్యాలున్న ఈ టెక్నాలజీపై, 5జి స్మార్ట్ఫోన్‌పై అమెరికా తన ఆధిపత్యం నిలుపుకొనేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తోంది. వాణిజ్య యుద్ధాలకు పాల్పడుతోంది. తన ఆర్థిక స్థితికి దెబ్బతగలకుండా చూసుకునేందుకు దౌత్యపరమైన ఎత్తులను వేస్తోంది. ఇప్పటికే అనేక 5జి మూల పేటెంట్లు అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ వద్దనే ఉండటం ఆ దేశానికి ఎంతో ధీమా కలిగిస్తోంది.
ఇలా నూతన సమాజ అవతరణ సంధ్యా సమయంలో ముతక ధోరణిలో మావోయిస్టులు సుదీర్ఘకాల సాయుధ పోరాటం నినాదంతో ప్రజల ముందుకు రావడమంటే ఏమిటి అర్థం?
సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేయకుండానే, సమాజాన్ని ప్రభావితం చేస్తున్న డైనమిక్స్‌ను పరిశీలించకుండానే, మానవ పరిణామక్రమంపై ఎటువంటి అంచనా లేకుండానే అంతర్యుద్ధం కోసం ఆరాటపడటం ఆహ్వానించదగ్గ అంశమవుతుందా? వర్తమాన సమాజం 5జి వైపు వేగంగా పరుగిడుతుంటే మావోయిస్టులు మాత్రం ప్రజల్ని దండకారణ్యం వైపు తరలించి కాలం చెల్లిన పద్ధతులను ఆదర్శంగా చూపుతూ- ‘అలా జీవిద్దాం రండి...రారండి’ అని ఊదరగొడితే అది పురోగమనమవుతుందా?... తిరోగమనమవుతుందా?. ప్రజల్ని శతాబ్దం క్రితం నాటి వాసనలతో బతకమని, బతకాలని ఫత్వాలు జారీచేస్తే, హుకుం చలాయిస్తే, తుపాకులు పేలిస్తే, మందుపాతరలు అమరిస్తే సమాజం ఊర్ధ్వం వైపు పరుగులిడుతుందా?... ఈ వౌలిక ప్రశ్నను ఎవరు విస్మరించినా వారు క్షమార్హులు కారు. ముఖ్యంగా మావోయిస్టులు ఈ సంధ్యా సమయంలో తమ మేధకు పదునుపెట్టాలి. తమనితాము ‘రీ డిజైన్’ చేసుకోవాలి. చైనా మార్గం అనుసరించాలి... సిద్ధాంతం కాదు, ప్రజలు ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగాఉన్న పేద ప్రజలు, వారి భవిష్యత్ కీలకమని గుర్తెరగాలి. ఈ అంశాన్ని గాలికొదిలేసి ఊరేగితే ప్రజలకు ‘ఉరి’ బిగుస్తుందని గ్రహించాలి.

-వుప్పల నరసింహం 99857 81799