సబ్ ఫీచర్

అనిత’రసాధ్యురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెపేరు-
స్క్రీన్‌మీద కనిపించే ఆర్టిస్టుల లిస్టులో ఎక్కడో ఓమూల కనీకనిపించకుండా ఉంటుంది. తెరమీద కనిపించే చాలామంది ఆర్టిస్టుల్లో ఆమె ఒకరిగా కనిపిస్తుంటుంది. లీడ్ రోల్ కాకున్నా -ఆ లీడ్ రోల్‌కు ప్రాణం పోసేది ఆమె ‘సపోర్టే.
ఆమె స్టార్ హీరోయినా? -కాదు.
ఇప్పుడున్నట్టున్న స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టా? -అస్సలు కాదు.
మరి, ఆమెకున్న స్టార్ ఏంటి? -అలాంటిదేదీ లేనే లేదు.
స్క్రీన్ మీద కనిపించినంత కాలం ఆమెకు ఎలాంటి స్టార్లూ లేవు. కాకపోతే, బిహైండ్ ద స్క్రీన్, ఆమెలాంటి ‘స్టార్’లు ఎవ్వరూ ఉండరేమో. పాత్రపరంగా తెరమీద అతిసామాన్యంగా కనిపించే ఆమె -సినిమాలపరంగా ఆయా పాత్రలకు ప్రాణం పోసే అత్యంత ప్రతిభావంతురాలు. ఆమె కనిపించినంతసేపూ నటి అన్న ఆలోచన మనకు రాదు. నిజ జీవితంలో మనకు తారసపడే అక్కో, అత్తో, అమ్మో, పక్కింటి పిన్నో.. అక్కడుందన్న భావనలో ఉండిపోతాం. అలాగని ఆమె -సామాన్యురాలు కాదు. అనిత’ర సాధ్యురాలు. ఎందుకంటే -పరిశ్రమలోని నాలుగు జనరేషన్లు ఆమెతో ప్రయాణం చేశాయి మరి. ఒకప్పటి చిత్తూరు నాగయ్య నుంచి ఈనాటి హీరో శ్రీకాంత్ వరకూ -ఆమెతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నోళ్లే. అదే -ఆమె సాధించిన అతి పెద్ద స్టార్. అటు రీల్ లైఫ్‌లోనూ ఇటు రియల్ లైఫ్‌లోనూ మనకు కనిపించే ఏకైక స్టార్ -అనిత. ఆమెతో ఈవారం వెనె్నల ముచ్చట్లు.

నిండు సంసారం, ఆదర్శ కుటుంబం, కత్తికి కంకణం, గండర గండడు, నాటకాల రాయుడు, ధర్మదాత, రైతు కుటుంబం, దేవుడుచేసిన బొమ్మలు -ఇలా ఆమె నటించిన చిత్రాలు ఎన్నని చెప్పాలి. దాదాపు 63ఏళ్ల క్రితంనాటి స్టేజి ఆర్టిస్టులు వాణీబాల, నందన్‌రావుల ముద్దుల పుత్రిక -అనిత. బందరు (మచిలీపట్నం)లో పుట్టి పెరిగింది. ఆమెకు తమ్ముడు, చెల్లెలు. ఫస్ట్ఫారమ్ చదువుతున్న టైంలోనే నటి నిర్మలమ్మ భర్త జీవీ కృష్ణారావు ఆమెలోని ‘కళ’ను గుర్తించారు. ఆ ‘కళే’ ఆమెకో చరిత్ర సృష్టించగలదని నమ్మారు. తండ్రికి స్నేహితుడైన కృష్ణారావు.. అలా -సినిమా చాన్స్‌లు తెచ్చాడు. కిశోరబాలిక వయసున్న అనితకు -జీవించే కళను ప్రదర్శించే అనుభవం రాలేదనుకున్నారు తల్లిదండ్రులు. కాలం గడిచింది. కొద్దిరోజుల తరువాతే -మళ్లీ సిఎస్ రావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘నిండు సంసారం’ చిత్రంలో ఓ అమాయక అంగవికలురాలైన పాత్రకోసం జరిపిన అనే్వషణలో ‘అనిత’ ప్రస్తావన వచ్చింది. సినిమాల్లో నటిస్తావా? అని జీవీ కృష్ణారావు అప్పుడే స్కూలునుంచి వచ్చిన అనితను అడిగారు. ‘వద్దు’ అన్న సమాధానం నాన్న నందన్‌రావునుంచి వచ్చింది. ‘పోనీండి, ఒక్క సినిమాయే కదా’ అన్న సముదాయింపు అమ్మనుంచి వినిపించింది. అలా అనిత -మద్రాసు రైలెక్కింది.
‘‘తొలి సినిమాకే మంచి పాత్ర. ఎంతో అనుభవం. షూటింగ్ పూరె్తైంది. మద్రాస్‌లో ప్రివ్యూ వేశారు. సినిమా అయిపోయాక ఎన్టీఆర్ బైటికొచ్చి ‘ఈ సినిమా ఆడితే, ఈ అమ్మాయివల్లే ఆడుతుంది. ఆమె అమాయకత్వానికి ఆడియన్స్ కనెక్ట్‌కాకుంటే -సినిమా పోతుంది’ అనేశారు. సినిమా విడుదల రోజు భయంతో వణికిపోయా. ఆడుతుందో లేదోనని బెంగ. ఓ గదిలో ఉండిపోయి అన్నం, నీళ్లు లేకుండా బిగుసుకుపోయాను. ఎన్టీఆర్ మాటలు తప్ప మరేం గుర్తుకురావడం లేదు. మ్యాట్నీ అయిపోయింది. ఫస్ట్ షో టైంకి వంద రోజుల సినిమాగా కితాబు వచ్చింది. దాంతో భయమంతాపోయి ఆ రోజు శుభ్రంగా తినేసి నిద్రపోయా’ అంటూ నవ్వేశారు అనిత.
తరువాత -ఏఎన్నార్ ‘ఆదర్శ కుటుంబం’లో అవకాశం. షూటింగ్ టైంలో మీగడతో అన్నం తింటున్న నన్ను చూసి ‘మీగడ పొట్ట’ అని పేరు పెట్టేశారు ఏఎన్నాఆర్. మాది బందరు కనుక ‘బందరు లడ్డూ’ అంటూ ఆట పట్టించేవారు. షూటింగ్ టైంలో మాత్రం ఆయన దగ్గర చాలా స్వేచ్ఛ ఉండేది. ఎన్ని టేకులు తీసుకున్నా ఏమీ అనేవారుకాదు. ఓపికగా నిరీక్షించి మరీ సీన్ ఓకె అయ్యేలా చేసేవారు. తరువాత ‘గండర గండడు’, ‘కత్తికి కంకణం’ చిత్రాల్లో కథానాయిక అవకాశాలు వచ్చాయి. హీరో కాంతారావుతో ఆ చిత్రాలు చేశాను.
**
ఇంట్లో అమాయకమైన చెల్లెలి పాత్ర అంటే ఖచ్చితంగా అనిత ఉండాల్సిందే. స్వర్ణయుగంలో మహానుభావులతో నటించడం ఇప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోయింది’ అంటారామె. ‘ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. ఆ ఆప్యాయతలు, ప్రేమలు, అభిమానాలు, అటువంటి వ్యక్తులు, గొప్ప కళాకారులు.. మేం ఆస్వాదించాం. ఈకాలం పిల్లలకు అలాంటివి దొరుకుతున్నాయో లేదో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనిత. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులాంటి వారు ఏనాడూ హీరోయిజమ్ చూపలేదు. అప్పట్లో కెమెరామెన్, దర్శకులు కూడా గొప్ప విజన్‌తో ఉండేవారు. సావిత్రి, రేలంగి, పద్మనాభం, జమున, రంగారెడ్డి, షావుకారు జానకి, రాజశ్రీ, గీతాంజలి, జయలలిత, కృష్ణకుమారిలాంటి ఎందరో నటీనటులతో కలిసి నటించడమనేది అద్భుతం అనిపిస్తుంటుంది. అంజలిదేవి కూతురు అంటే ఖచ్చితంగా అనిత ఉండాలనేవారు. అన్ని సినిమాల్లో ఆమెకు నేను కూతురిని. అలా ఎన్ని చిత్రాలు చేశామో గుర్తు లేదు. రైతుకుటుంబం, మల్లెల మనసులు, మాతృమూర్తిలాంటి చిత్రాలు, ఎస్వీ రంగారావుతో కత్తుల రత్తయ్య, కొత్తకాపురం లాంటి చిత్రాలు మరిచిపోలేని తీపిగుర్తులు. కొత్తకాపురంలో మొదట గుమ్మడి పాత్రలో ఎస్వీఆర్ నటించారు. చాలా షూటింగ్ పూర్తయ్యాక ఎస్వీఆర్ అనారోగ్యం కారణంగా ఆ పాత్రకు గుమ్మడిని ఎంపిక చేసి మళ్లీ రీ షూట్ చేశారు. కాల్షీట్లు లేకపోయినా సినిమా బాగా రావాలన్న సంకల్పంతో సర్దుబాటుచేసి నటించాను. ఆ షూటింగ్ చాలా వేగంగా జరిగింది. ఎందుకంటే, ఓసారి చేసిన సన్నివేశాలే కదా! అందరు ఆనాటి తరం నటీనటులతో నటించడంవల్ల నన్ను కూడా ఆనాటి తరానికి సంబంధించిన వ్యక్తిగా అందరూ భావిస్తారు. అప్పట్లో నటీనటులంటే కొత్తా పాతా, చిన్నా పెద్దా అన్న తేడా లేదు. అందరినీ ఓ కుటుంబంలా చూసేవారు. ముఖ్యంగా సారథి స్టూడియోస్ అంటేనే నవ్వుల వర్షం గుర్తుకొస్తుంది. షూటింగ్ గ్యాప్‌లో అందరూ గుండ్రంగా కుర్చీలు వేసుకుని ఎవరికి తోచిన విద్యలు వాళ్లు ప్రదర్శించేవాళ్లం. ముఖ్యంగా పద్మనాభం, ఏఎన్నార్‌లు చేసే హంగామా అంతా ఇంతా ఉండేది కాదు. తొలిసారిగా సూర్యకాంతంతో నటించాల్సి వచ్చినపుడు -‘గయ్యాళి గంప’ అన్న పేరు గుర్తుకొచ్చి భయపడిపోయాను. అలాగే ఉంటారనుకున్నా. కానీ ఆమెతో పరిచయమయ్యాక, ఆమె నిజమైన వ్యక్తిత్వాన్ని చూశాక భయంపోయింది. వెన్నలాంటి మనసు కనిపించింది. ఛాయాదేవీ అంతే. ఓసారి విజయ బాపినీడు దర్శకత్వంలో ‘విజయ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అపుడు ‘వితవుట్ బ్రేక్’తో షూటింగ్ జరుగుతోంది. నాకు చాలా ఆకలిగా వుంది. ఈ విషయాన్ని ఛాయాదేవికి చెబితే, వెంటనే అన్నం కలుపుకువచ్చి గ్యాప్‌గ్యాప్‌లో ముద్దలు నోట్లో కుక్కేది. మా అమ్మ కూడా అలా చేసేది కాదేమో -ఆ జ్ఞాపకంతో అనిత కళ్లు చెమ్మగిల్లాయి.
నన్ను బాగా ప్రభావితం చేసిన పాత్ర ‘దేవుడు చేసిన బొమ్మలు’లో దొరికింది. చాలా బాగా చేశాననిపిస్తుంది. కానీ ఆ సినిమా విడుదల సమయంలో తుపాను రావడంతో ఫ్లాపైంది. బ్యాడ్‌లక్! నిను విన నాకెవ్వరు, బొమ్మలు ఈ మనుషులు అంతా బొమ్మలు.. ఆ దేవుడు చేసిన బొమ్మలు, దేవుడున్నాడా... అన్న పాటలు నాకు చాలా ఇష్టమైనవి. అలా ఎన్ని చిత్రాలు చేశానో గుర్తులేకుండా చేస్తూనే పోయాను. ఇప్పటికీ నాకు ఇన్ని సినిమాలు చేశానన్న గుర్తులేదు. ఎప్పుడైనా టీవీ చానెల్స్‌లో పాత సినిమాలు వస్తుంటే, అరే.. ఈ సినిమాలో నేను నటించానా? అనిపిస్తుంది. ‘మంగమ్మగారి మనవడు’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాను. తరువాత కూడా ఎన్నో చిత్రాలు చేశాను. స్వాతిముత్యంలో సుత్తి వీరభద్రరరావు భార్యగా ఒక్క డైలాగ్ లేకుండా హాస్యాన్ని పండించడం కత్తిమీద సాములాంటిది. అది దర్శకుడి అభిరుచిమేరకే తెరపై అలా ఆవిష్కరింపబడింది.
ఇప్పటితరాన్ని విశే్లషించే గొప్ప అర్హత ఉందని అనుకోను. కాకపోతే అడిగారు కనుక చెబుతున్నా. ప్రతివారూ గోల్డెన్ స్పూన్‌తో పుట్టినట్టుగా మాట్లాడటం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒక్క సినిమా విడుదలైతే చాలు తామే గొప్పవారన్న భావన ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివాళ్లంతా ఓలాంటి స్వభావంగల వాళ్లైపోయారు. పరిశ్రమలో చాలా తేడాలొచ్చాయి. ఆ యుగంలో పేరు తెచ్చుకున్నా. ఈ యుగంలో మర్యాదగా తప్పుకోవాలనుకున్నా. నాకు నేనుగానే సినిమాలు విరమించుకున్నాను. ఏ ఒక్కరోజూ షూటింగ్‌కు పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది నా కెరీర్‌లో లేవు.
1997లో చివరిసారిగా థియేటర్‌కు వెళ్లాను. 2002నుండి కొన్ని సీరియల్స్ చేశాను. కెరీర్ మొదట్లో షూటింగ్ చేసి రైల్లో వెళ్తున్నా. విజయవాడలో ఆపేశారు. బైటికి వచ్చేదాకా కంపార్ట్‌మెంట్‌పై రాళ్లు విసురుతూనే ఉన్నారు అభిమానులు. బయటికొస్తే ఎక్కడ రాళ్లు విసురుతారోననే భయం. చివరికి అందరినీ శాంతింపజేసి ఓ నమస్కారం పెట్టా. తరువాత నుంచి ఏనాడూ రైలెక్కలేదు. ఎక్కడికెళ్లినా, కాస్త ఖరీదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చేది’ అంటూ అప్పటి మధురానుభూతులను నెమరువేసుకుంటూ ముగించారు సహజ నటి అనిత.

-సరయు శేఖర్, 9676247000