సబ్ ఫీచర్

ఏదీ ప్రజలకంటే ముఖ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏసామాజిక సిద్ధాంత మైనా, విధాన మైనా ప్రజాహితం కోసమే ఏర్పడుతుంది. అయితే, ఫలితం దానిననుసరించవలసిన ప్రజల యొక్క నిజాయితీ, నిబద్ధతల మీద ఆధారపడుంటుంది. ఇంచుమించు ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజాస్వామ్య విధానమే అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్యమే మంచిదని ఎందుకనుకుంటారంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల చేత, ఆ ప్రజలకోసమే ప్రభుత్వం నడుస్తుంది కనుక!
ప్రజాస్వామ్యానికి తల్లి ఇంగ్లాండు అంటారు. ఎందుకంటే, అక్కడే మొదట ప్రజాస్వామ్యమేర్పడిందని! ఆసక్తికరమైన దేమిటంటే, ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న ఆ దేశంలో రాజు లేక రాణి ప్రభుత్వాధినేతగా వుంటారు. అయితే, ఈరాజకుటుంబానికీ, పార్లమెంటుకూ ఎప్పుడూ ఘర్షణ వుండదు. ఎవరి పరిధుల్లో వారుంటారు. వారి క్రమశిక్షణ లాంటిదే అగ్రదేశమైన అమెరికాలో కూడా ప్రజాస్వామ్యమే వుంది. అక్కడ దేశాధ్యక్షుడ్ని నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు. సెనేట్ సభ్యులను (పార్లమెంటు లాంటిది) ప్రజలే ఎన్నుకుంటారు. ఇంగ్లాండులో హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ వుంటాయి. మన లోక్‌సభ, రాజ్యసభ లాగా. ‘కామన్’ సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు.
అయితే, ఈ రెండు దేశాల్లో కూడా ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు, తాము ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీచేసి గెలిచారో, ఆ పార్టీలోనే చివరివరకూ వుంటారు. మధ్యలో వారు పార్టీలు మారరు, మన దేశంలో లాగా! పత్రికలు చదివేవారికెవరికైనా ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే, ఎన్నికైన తర్వాత మారితే, కోట్లమంది ప్రజల ఓటు హక్కును హరించినవారవుతారు. ఈ నిబద్ధత వారికుంది. కాని, మన దేశంలో ఒక పార్టీ తరఫున పోటీచేసి నెగ్గినా మరో పార్టీ అధికారంలోకొస్తే దానిలో చేరిపోతున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. పదవులకోసం గాని, ప్రలోభాలతో కాని అలా చేరిపోతున్నారు. అలాగున కోట్ల మంది ప్రజల ఓటు హక్కును హరించి వేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనంత మాత్రాన, ఇష్టమైన పార్టీలో చేరే ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఆ ప్రతినిధికి లేదా? అని అడుగుతున్నారు కొందరు నాయకులు. కోట్ల మంది ప్రజల భావస్వేచ్ఛను హరించివేసే కొద్దిమంది ప్రజాప్రతినిధుల చర్యను ‘ప్రజాస్వామ్య స్వేచ్ఛ’ అంటారా? అలా ప్రజానిర్ణయానికి విరుద్ధంగా పార్టీ మారుతున్నా ప్రజా ప్రతినిధుల మీద అనర్హతవేటు వేసేందుకు (యాంటీ డిఫెక్షన్ యాక్ట్) పార్టీ మార్పు నిరోధక చట్టం వుంది. కాని, అలా మారిన వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం, ఆ చట్టప్రకారం, స్పీకరుకుమాత్రమే వుంది. అధికార పార్టీవారే స్పీకరవుతారు కనుక, ఆయనలాంటి వారిపై ఏ చర్య తీసుకోవడంలేదు. అందువలన చట్టం ప్రయోజనం నెరవేరడం లేదు. కోర్టులకెళితే, చట్టరీత్యా ఆ అధికారం స్పీకరుకే వుంది కనుక, తాము కలుగచేసుకోలేమని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నాయకత్వమూ కలుగచేసుకోకుండా చూస్తూ వుండి పోతున్నారు. రాష్టప్రతి కూడా కలుగచేసుకోవడంలేదు. ప్రజాస్వామ్యంలో అతి ప్రధానమైన ప్రజల ఓటు హక్కును వీరెవరూ కాపాడకపోతే, ప్రజలేం చేయాలి?
రాజ్యాంగంలో పేర్కొన్న మూడు ప్రధాన అంగాలైన శాసన వ్యవస్థ (లెజిస్లేచర్), పాలనా వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్), న్యాయ వ్యవస్థ (జ్యుడీషియరీ) లతో మొదటి రెండూ విఫలమైనపుడు, మూడవదైన న్యాయవ్యవస్థ క్రియాశీలకమై ప్రజల రాజ్యాంగ హక్కులను రక్షించాలి. ఎందుకంటే, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించవలసిందీ, పరిరక్షించవలసిందీ సుప్రీంకోర్టు! ఆనాటి రాజ్యాంగ రచయితలు డా.రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, డా.అంబేద్కర్, సర్దార్ వల్లభాయిపటేల్ మొదలైన వారు ఈనాడుంటే, ఇదే చెప్పి వుండేవారని మనం భావించవచ్చును. ఎందుకంటే, రాజ్యాంగంలోని ప్రతి అధికరణకూ కూడా, మొత్తం రాజ్యాంగ స్ఫూర్తినే అన్వయించి అమలుచేయాలని ‘ప్రియాంబిల్’లో డా.అంబేద్కర్ వ్రాసారు.
ఆనాడు రచించిన రాజ్యంగమంతటా కూడా లిబర్టీ (స్వేచ్ఛ), ఈక్వాలిటీ (సమానత్వం), ఫ్రెటర్నిటీ (సౌభ్రాతృత్వం) అనే భావాల స్ఫూర్తి నిండి వుంది! అంతే కాకుండా, దేశంలోని ప్రతి పౌరునికీ భావ ప్రకటన స్వేచ్ఛను కలిగించింది. ఎవరికిష్టమైన మతాన్ని వారనుసరించవచ్చును. తమకిష్టమైన సామాజిక భావజాలాన్ని నమ్మవచ్చును, ప్రకటించవచ్చును. ఈ విషయంలో దేశ పౌరులకు కుల, మత తేడాలు అడ్డురావు. అయితే, ఇతర మతాల గురించి ద్వేషపూరితంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే, అది భావ స్వేచ్ఛకు భంగమే అవుతుంది.
కాని, ఈ భావ ప్రకటనా స్వేచ్ఛ దేశ భద్రతకు, దేశ గౌరవానికీ వ్యతిరేకమైన చర్యలను, ప్రకటనలనూ అనుమతించదు. ఎందుకంటే దేశమంటే ప్రజలు! ప్రజావ్యతిరేక చర్యలను ఏ జాతీ సహించదు. అయితే, కొందరు మేధావులు దేశభద్రతకు భంగం కలిగించే విధంగా చెప్పేవి, చేసేవీ కూడా భావ ప్రకటనలోనివే అంటున్నారు. ఈ వాదనను ఇతర మేధావులూ, సాధారణ ప్రజలూ కూడా అంగీకరించరు. అటువంటి పోకడలను నిరోధించవలసిందే. ఏ దేశమైనా నిరోధిస్తుంది! పార్లమెంటులోనూ, అసెంబ్లీలలోనూ జరగవలసిన చర్చకు బదులు, ఇపుడు జరుగుతున్న ‘రచ్చ’కూడా భావప్రకటనా స్వేచ్ఛ కాదు. అక్కడ వాడవలసిన భాష కూడా అభ్యంతరకరంగా వుండకూడదు. కాని ఇపుడు అందుకు విరుద్ధంగానే జరుగుతోంది. వ్యక్తిగత దూషణలూ, కొన్నిసార్లు అశ్లీల భాషా వినిపిస్తున్నాయి. స్పీకరును చుట్టుముడుతున్నారు.
శాసన వ్యవస్థ యొక్క స్వతంత్రతనూ, మర్యాదనూ కాపాడడానికి, దాని మీద న్యాయ వ్యవస్థ యొక్క అజమాయిషీ కూడా లేకుండా ఆనాడు రాజ్యాంగంలో నిర్దేశింపబడింది. అయితే, ఆనాటి ప్రజలు, నాయకులూ వేరు. ఈనాటి ప్రజలు, నాయకులూ వేరు. ఇపుడు ఏదో రకమైన అజమాయిషీ శాసన వ్యవస్థ మీద వుంటేనే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ప్రజల శ్రేయస్సు కంటే, శాసన, న్యాయ, పాలనా వ్యవస్థలు ముఖ్యం కాదు! ఆఖరుకు రాజ్యాంగం కూడా కాదు! రాజ్యాంగం ప్రజాశ్రేయస్సు కొరకే వ్రాయబడింది!

- మనె్న సత్యనారాయణ