సబ్ ఫీచర్

‘తుపాకీ సంస్కృతి’తో మారణ హోమం ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతోన్మాదులు, జాత్యహంకారుల పాశవిక హత్యలతో పాశ్చాత్య ప్రపంచం మృత్యు బీభత్సాన్ని ఎదుర్కొంటోంది. నాగరిక సమాజం- విపత్కర తుపాకీ సంస్కృతితో భీతిల్లుతోంది. అమెరికా వంటి సంపన్న దేశాలలో దశాబ్దాల తరబడి వేళ్ళూనిన ‘తుపాకీ లాబీ’ ప్రభుత్వాలను శాసిస్తోంది. 1791లో అమెరికా రాజ్యాంగం ఆ దేశ పౌరులకు ప్రసాదించిన ఆయుధ హక్కు శ్రుతిమించి రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తోంది. తుపాకులతోనే తమ ప్రాణాలకు రక్షణ అన్న ప్రగాఢ విశ్వాసంతో నేటి పాశ్చాత్య పౌర సమాజం జీవిస్తోంది. దీనికితోడు మతోన్మాదం పెచ్చుపెరిగి ఉగ్రవాదంగా విష సంస్కృతి జడలు విప్పి, విచక్షణా రహితంగా నిర్దాక్షిణ్యంగా నిస్సహాయులను కాల్చిచంపటం నిత్య ఘాతుకమైంది. పాశ్చాత్య ప్రపంచంలో విస్తరిస్తున్న మతోన్మాద విష సంస్కృతి శాంతియుతంగా జీవిస్తున్న పౌర సమాజాలలోకి చొచ్చుకొని పోతోంది.
తాజాగా న్యూజిలాండ్‌లో క్రిస్ట్ చర్చి, మసీదులలో సామూహిక తుపాకీ కాల్పుల సంఘటనలు అటువంటివే. ఈ ఘటనలపై న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్ట్రెన్ మాట్లాడుతూ- కాల్పులకు పాల్పడిన దుండగుడు ‘ఎ కేటగిరీ’ గన్ లైసెన్సును 2017 నవంబరులో పొంది, ‘సెమీ-ఆటోమేటిక్’ ఆయుధాలు ఉపయోగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని , తమ ప్రభుత్వం తుపాకీ చట్టాలపై నియంత్రణ చర్యలు ఇక విధిస్తుందని ప్రకటించారు.
‘ట్రిగ్గర్ హేపీ’ దుష్టత్వ గన్ కల్చర్‌పై ఆధారపడి జీవిస్తున్న అగ్రదేశాల పౌర సమాజాలు తుపాకులపై ఆంక్షలు, నియంత్రణలను ఆమోదించటం లేదు. ప్రతి పౌరుడూ తన చేతిలో తుపాకీ వుంటేనే తమకు రక్షణ అని భావించటంతో ఆయా దేశాలలో తుపాకుల ఉత్పత్తి, పంపిణీ, అమ్మక కొనుగోళ్ళ వ్యాపారం బడా పరిశ్రమగా విస్తరిల్లి రాజకీయ ఆధిపత్యం కూడా దాసోహం అనే దశకు చేరుకొంది. ఒక సర్వే ప్రకారం అమెరికా జనాభా 30 కోట్లు పైబడి వుండగా పౌరుల దగ్గర 31కోట్ల తుపాకులున్నాయి. ఏటా సుమారు 14 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ‘గన్ ఇండస్ట్రీ’ ఆ దేశం వారికి గర్వకారణం. తల్లిదండ్రుల ఆయుధాలు పిల్లలకు ఆట వస్తువులు కావటంతో నిరంతరం మారణకాండలు పొంచి వుంటున్నాయి. గన్ ఓనర్‌షిప్ కారణంగా స్కూల్, హాస్పిటల్, చర్చి, థియేటర్.. ఇలా ఎక్కడైనా ఉన్మాదులు బాహాటంగా సామూహిక కాల్పులు జరిపే సంఘటనలు సంభవిస్తున్నాయి. గన్స్ వినియోగంపై నియంత్రణ లేదు. సంస్కరణలు, కొత్త చట్టాలు అమెరికన్లు అంగీకరించరు. గత 7 సంవత్సరాలలో న్యూమెక్సికో, వాషింగ్టన్, కాలిఫోర్నియా, సౌత్ కరోలినా, కొనె్నక్టకట్, వర్జీనియా,బ్లాక్స్‌బర్గ్, కొలరాడో పలు ప్రాంతాలలోని 273 స్కూళ్లలోని బాలబాలికల గుండెల్లోకి తూటాలు దూసుకుపోయాయి. తరగతి గదులలో, పాఠశాలల ప్రాంగణాలలో టిఫిన్ బాక్స్‌లు, స్కూల్ బ్యాగ్‌లు రక్తసిక్తమై నిస్సహాయంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ‘గన్ ఫ్రెండ్లీ దేశం’ లోని పార్క్‌లాండ్‌లోని ఫ్లోరిడా డగ్లస్ హైస్కూలులో గత ఫిబ్రవరిలో 19 ఏళ్ళ నికొలస్ ఎఆర్-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను చట్టబద్ధంగా కొని, 17 మందిని కాల్చి చంపటం తుపాకుల స్వైర విహారానికి అద్దం పడ్తోంది.
మతోన్మాదం ఉగ్రవాదంగా...
ప్రపంచంలో మతోన్మాదం ఉగ్రవాదంగా పడగ విప్పి మారణాయుధాలతో రక్తపాతం సృష్టిస్తోంది. దైవ విశ్వాసం పగ, ప్రతీకారంగా మారిపోయి నిస్సహాయులు, అమాయకుల జీవితాలను బలిగొంటోంది. ఆయుధ స్వేచ్ఛ మరింతగా వెర్రితలలు వేస్తోంది. ఎవరి చేతిలో తుపాకీ తూటాల వర్షం కురిపించి- ఎందరికి మృత్యుపాశం అవుతుందో ఊహించలేని, అరికట్టలేని ఘాతుకాలు చోటుచేసుకొంటున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులతో అతలాకుతలమవుతోంది. ఆ విష సంస్కృతి చాపకింద నీరులా ప్రపంచమంతటా పాకుతోంది. ఫెడరల్ గన్ చట్టాలను నియంత్రించలేని అమెరికా దేశపు హింసాప్రవృత్తి మన దేశంలో కూడా సామూహిక మృత్యు బీభత్సం, ఉన్మాదాలను సృష్టిస్తోంది.
ప్రవాసులపై జాత్యహంకారం...
ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ విశ్వమే గ్లోబల్ విలేజ్‌గా అవతరించటంతో భారతదేశ జీవన విధానంలో పెనుమార్పులు చోటుచేసుకొన్నాయి. ప్రవాస భారతీయుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. అణు శాస్ర్తియ, సాంకేతికతలతో ప్రపంచ సంగ్రామాల స్థానంలో ప్రచ్ఛన్న యుద్ధాలు రగులుతున్నాయి. మానవాళి ఎంత ఐహిక సంపన్నతతో తులతూగినా జాత్యహంకారం, మతోన్మాదం ఆరని కాష్ఠాలుగా అగ్నిగుండాలు సృష్టిస్తున్నాయి. భయానక మృత్యుఛాయలు సర్వత్రా విషాదం ప్రసరిస్తున్నాయి. జాతి, మత విద్వేషాల కారణంగా విశృంఖల నేరాలు విచ్చలవిడిగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవటానికి తరలి వెళ్తున్న ప్రవాస భారతీయులు అక్కడ స్థిరపడటానికి ఎంత మేధాసంపన్నులైనా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తోంది. కొందరికి విపత్కర దుస్థితి ఎదురవుతోంది. కొన్ని దుర్ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తల్లిదండ్రులకు, సన్నిహిత బంధువులకు తీరని ఆవేదన, విషాదం, కడుపుకోత మిగిలుస్తున్నాయి. జాతి విద్వేషంతో ప్రవాసులపై కిరాతకుల కాల్పులకు, విషాద మరణాలకు అసలు కారణం అక్కడ తుపాకులు గురిపెట్టడానికి ప్రభుత్వం ప్రసాదిస్తున్న అంతులేని స్వేచ్ఛ. అతి స్వల్పమైన కారణాలతో సాధారణ నిస్సహాయ విదేశీయులను సునాయాసంగా కాల్చి చంపే ఉన్మాదం అమెరికాలో ప్రబలుతున్నా అక్కడి ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.
2015 జనవరిలో సౌత్ కరోలినాలో పర్చూరి బాలగోపాల్, జూన్‌లో మియామీ ఫ్లోరిడాలో సాయికిరణ్ గౌడ్, 2017 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో వంశీచందర్ రెడ్డి, 2007 డిసెంబరులో లూసియానాలో చంద్రశేఖరరెడ్డి కొమ్మా, కిరణ్‌కుమార్ అల్లం, 2009 అట్లాంటాలో సుధీర్‌కుమార్ 2017 ఫిబ్రవరిలో కన్సాస్ సిటీలో శ్రీనివాస్ కూచిభొట్ల, 2010 జూన్‌లో డిట్రోయిట్‌లో కట్టమంచి వెంకట సుబ్బారెడ్డి, 2011 ఏప్రిల్‌లో న్యూజెర్సీలో అర్జున్‌రెడ్డి వంటి ఎందరో యువకులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. జాత్యహంకార విద్వేషానికి అమాయకులు బలి అవుతున్న దుర్ఘటనలు అత్యంత విషాదం సృష్టిస్తున్నాయి.

-జయసూర్య