సబ్ ఫీచర్

అదో టైమ్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం ఎవరిని ఎప్పుడెలా
పరిగెత్తిస్తుందో ఎవ్వరికీ తెలీదు.
అదో చిత్రమైన శత్రువు.
పరిగెడుతున్న వాళ్లకు
-కాళ్లు అడ్డంపెట్ట్టి ఆపేస్తుంది.
టైమ్ -అంతకుమించిన మిత్రుడు కూడా.
పరుగుకు అడ్డొచ్చే కాళ్లను విరగ్గొట్టి
-వెన్నుతట్టి
వెంటపడి మరీ పరిగెత్తిస్తుంది.
ఏం జరిగినా
-కాలంతో నడవడం, పరిగెత్తడమే
మనిషి చేయాల్సిన, చేయగలిగిన పని.
నావల్ల కాదనుకున్నా,
కదల్లేమని అక్కడే కూర్చున్నా
కాలం నిర్దయగా వెళ్లిపోతుంది.
ఇది -ఎవరి జీవితంలో వాళ్లకు అనుభవైక పాఠం.
అలాంటి పాఠానికి ఈ వారం సాక్ష్యం
-శ్రీనివాసవర్మ.

స్టార్ కావాల్సిన నటుడిని కాలం కనికరించలేదు. పరిగెత్తే ఓపికవున్నా పరుగెత్తనివ్వలేదు. కళ్లముందుకు అవకాశాలు తెస్తూనే, అందుకునే అవకాశమివ్వలేదు. క్లారిటీ కోసం వెతుక్కుంటూ -కన్ఫ్యూజ్ ఎదురైంది. ‘టైమ్’ గేమ్ అర్థం చేసుకునేసరికి -టైమైపోయింది. అది -ఆ నటుడిని దాటెళ్లిపోయింది. అతనెవరో కాదు ఒకప్పటి చాక్లెట్ బోయ్ -శ్రీనివాస వర్మ. బాలీవుడ్ నుంచి కెరీర్ మొదలెట్టి -సౌత్ సినిమా అన్ని భాషల్లో అవకాశాలు అందుకున్న హీరో. కానీ -టైమ్ గేమ్‌లో మాత్రం ఓడిపోయాడు. ఈ విషయాన్ని మాత్రం ఆయన అంగీకరించడు. అంతెందుకు -చాన్స్ దొరకాలేగానీ ‘యాక్టింగ్ జర్నీ’లో మరింత ముందుకెళ్లే ఓపిక ఉందంటున్నాడు. హీరోగా తనేంటో చూపించలేకపోయినా -ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సత్తా చూపేందుకు ఉద్యుక్తుడవుతున్నాడు. ఆ శ్రీనివాస్ వర్మతో ఈ వారం వెనె్నల ముచ్చట్లు.
****
శ్రీనివాస వర్మ.
ఒకప్పటి సినిమా హీరో.
పుట్టింది భీమవరమైనా, పెరిగింది, చదివిందీ అంతా ముంబయిలో. నాన్నది పాలకొల్లు. అమ్మది భీమవరం. వాళ్లది ఎగుమతి వ్యాపారం. సో, తండ్రితోపాటు చిన్నప్పుడే ముంబయిలో అడుగుపెట్టాడు వర్మ. అక్కడే డిగ్రీ పూర్తి చేశాడు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ కనుక ఆలోచించకుండా -పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పడ్డాడు. కట్‌చేస్తే -డిప్లొమా ఇన్ యాక్టింగ్. కోర్స్ పూర్తి చేసి, స్క్రీన్స్‌ను వెతకడం మొదలెట్టాడు. ఆ ప్రయత్నంలో -ఇప్పటి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌తో అనేక కార్యక్రమల్లో పాల్గొన్నాడు. ‘అప్పటికి అమీర్ కూడా అప్‌కమింగ్ హీరో’ అంటూ నవ్వేశాడు వర్మ. ‘నువ్వు కూడా హీరోగా ఎందుకు ప్రయత్నించకూడదు’ అన్న ప్రశ్న అమీర్‌నుంచి ఎదురైంది. నిజానికి అది ప్రశ్న కాదు, ప్రోత్సాహక సలహా. దానికి సరైన సమాధానం వెతుక్కుని ఉండివుంటే -ఈ కథ ఇలా ఉండేది కాదేమో. మాతృభాష తెలుగు కనుక, ఆ భాష రాకున్నా అక్కడే (అప్పటికి ముంబయిలో ఉన్నా కనుక) హీరో అవ్వాలనుకున్నా. అనాలోచితంగా చెన్నై రైలెక్కేశా. 1991లో సురేష్ ప్రొడక్షన్స్ ఓ కొత్త హీరోని వెతికే పనిలో పడ్డారు. దినతంతి దినపత్రిలో వచ్చిన ప్రకటన ఆధారంగా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసుకు వెళ్లాను. ఇంటర్వ్యూ ఇచ్చాను. తరువాత పిలుపొచ్చింది. అది -శోభన్‌బాబు, రోజా ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న ‘సర్పయాగం’ చిత్రం. అందులో నెగెటివ్ షేడ్స్‌వున్న హీరో పాత్ర దక్కింది. నిజానికి రోజాకు, నాకు ఆ సినిమా ఓ టర్నింగ్ పాయింట్’ అంటూ గుర్తు చేసుకున్నాడు శ్రీనివాస్ వర్మ.
-నాలో పాతతరం హీరో హరనాథ్ పోలికలున్నాయని చాలామంది అనేవారు. మరీ చిత్రమేమంటే -ఆయన కొడుకేనని భ్రమపడినోళ్లూ ఉన్నారు. సర్పయాగం తరువాత -మీనా హీరోయిన్‌గా ప్రయత్నం; ఎస్‌పి బాలు, శారద, ఐశ్వర్య తారాగణంతో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘పెళ్లంటే నూరెళ్ల పంట’ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. హరిబాబు డైరెక్షన్‌లో మాస్టర్ తరుణ్‌తో రూపొందించిన ‘తేజ’లో నేనే హీరో. ‘నా మొగుడు నా యిష్టం’ చిత్రంలో యువ హీరోగా, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో ‘ప్రియమైన శ్రీవారు’, బి విఠలాచార్య దర్శకత్వంలో ‘కరుణించిన కనకదుర్గ’, మైథలాజికల్ స్టోరీతో రూపొందిన ‘సాయిభక్తి -క్షుద్రశక్తి’ చిత్రాల్లో నా స్టామినాను అటు హీరోగా, ఇటు నెగెటివ్ షేడ్స్ చూపించగలిగే డిఫరెంట్ హీరోగా నిరూపించుకున్నా. విజయ్‌కాంత్‌తో తమిళంలో ‘మూండ్రి ఎడిత్తిల్ ఎన్‌ముచ్చ ఇరుక్కుమ్’, కన్నడ కథానాయకుడు విష్ణువర్థన్‌తో ‘సంసారో అదృ బ్రహ్మచారి’, ఐవి శశి దర్శకత్వంలో మలయాళంలో ‘పూమర తనలిల్’లాంటి చిత్రాలతో సౌత్ సినిమాకు విస్తరించే అవకాశం దక్కింది. 1991నుంచి 97 వరకు రొమాంటిక్ హీరోఅన్నా, చాక్‌లెట్ బాయ్ హీరో అన్నా గుర్తువచ్చేది నేనే అన్నట్టుగా కెరీర్ సాగింది.
ఆ తరువాతే ‘టైమ్’ గేమ్ ప్లే చేసింది.
సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చేసే టైమ్. తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉండటంతో నేను చెన్నైలోనే ఉండిపోయా. మాతృభాషలో హీరో అవ్వాలన్న ఆశ, ఆసక్తి, ఆలోచనతో మొదలైన నా జర్నీ -చెన్నై దగ్గరే ఆగింది. టైమ్ కూడా నన్ను వెన్నుతట్టి ఇటువైపు వచ్చేలా పరిగెత్తించలేదు. నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన పరుచూరి బ్రదర్స్ అయితే హైదరాబాద్‌కు వచ్చెయ్యమని గట్టిగానే చెప్పారు. కానీ వినే పరిస్థితిలో లేను. కారణం -కమిట్‌మెంట్స్. సో, టైమ్ కలిసిరానప్పుడు గేమ్‌లో ఓటమి తప్పదు. నాకూ అదే ఎదురైంది అంటాడు వర్మ. అలా పరుగుపందెంలో వెనుకపడ్డాడు. 2000లో చెన్నైలోని కమిట్‌మెంట్స్ రౌండాఫ్ చేసేసి, హైదరాబాద్ వచ్చేశాడు. అదే టైంలో ఇక్కడ శాటిలైట్ మూవీస్ రాజ్యమేలుతున్నాయి. రెండుమూడు రోజుల షూటింగ్‌లతోనే సినిమా మొత్తం పూర్తిచేయడం, యూట్యూబ్‌లో విడుదల చేయడంతో సరైన సినిమాలను ఎంచుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. 2002లో లవ్ లెటర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. తరువాత యంగ్‌స్టర్స్‌తో లవ్ సబ్జెక్టులే ప్రధానాంశంగా చిన్న సినిమాలను రూపొందించే ట్రెండ్ వచ్చింది. అందులోనూ వర్మకు చోటు దక్కలేదు. తరువాత అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో గౌతమ్ ఎస్‌ఎస్‌సి చిత్రంలో నటించారు. అప్పుడు ఆ దర్శకుడి సలహా మేరకు -క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాలనుకున్నాడు శ్రీనివాస్ వర్మ. అధికశాతం క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని ముంబయి, చెన్నైనుంచి తెస్తున్న తరుణంలో గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయనుకున్నాడు. అలా బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన ‘లయన్’లో చోటుదక్కింది. అండర్ వరల్డ్ డాన్‌గా మంచి పెర్ఫార్మెనే్స ఇచ్చాడు. ‘మూండ్రామ్ పారవై’లో యంగ్ ఫాదర్‌గా మరో రోల్ పోషించాడు. నెగెటివ్ షేడ్స్‌తోవున్న పాత్రగాని, అన్న పాత్రలు, బావ బావమరుదుల పాత్రలుంటే ఇపుడు చేయడానికి సిద్ధమేనన్నది శ్రీనివాస్ వర్మ మాట. ఎక్కడెక్కడి ఆర్టిస్టులనో తెచ్చుకునేకంటే, తెలుగువారికి అవకాశాలు కల్పించే విషయంలో దర్శకులు ఒకింత పెద్ద మనసుతో ఆలోచించాలంటాడు శ్రీనివాస్ వర్మ.
నిజానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లిన కేసులే ఎక్కువ ఉంటాయి. కానీ -శ్రీనివాస్‌వర్మ తెలుగువాడిగా ముంబయి జీవితం మొదలెట్టి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇటీవలే కళానిలయం తరపున శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న వర్మ, ఆనాటి అనుభవాలను ముచ్చట్లుగా గుర్తు చేసుకున్నాడు.
అరకులో సర్పయాగం షూటింగ్. పాట చిత్రీకరణ. నేనప్పుడు తెలుగు మాట్లాడలేకపోయే వాడిని. ఓసారి లంచ్ బ్రేక్‌లో -నటుడు చలపతిరావు వచ్చారు. తెలుగు అందరితో మాట్లాడటం నేర్చుకోమని చెబుతూ, ‘అన్నం బాగా దొబ్బి తిన్నావా’ అని హీరోయిన్‌ని అడగమన్నారు. నాకు తెలీక అడిగేశాను. అక్కడున్నవారంతా పగలబడి నవ్వేశారు. అదీ అప్పటి నా తెలుగు పరిస్థితి. అప్పట్లో అందరు టాప్ హీరోయిన్లతో నటించా. బి విఠలాచార్య దర్శకత్వంలో అవకాశం రావడం పెద్ద అదృష్టం. ‘కరుణించిన కనకదుర్గ’లో హీరో పాత్ర. విఠలాచార్య వీల్‌ఛెయిర్‌లో ఉన్నారు. అసిస్టెంట్లే పాత్ర గురించి చెప్పేవారు. ఓసారి మండే చేతులతో ఫైట్ చేయాలి. ఫైట్ మాస్టర్ హార్స్‌మెన్‌బాబు విలన్ బాలాజీకి, నాకూ మండుతున్న గ్లౌజెస్ తగిలించారు. అలా గ్లౌజ్ మంటలు పంచెకంటుకుంది. వీల్‌ఛెయిర్‌లో ఉన్నాగానీ విఠలాచార్య వెంటనే నాపై నీళ్లుపోసి ఆర్పేశారు. అది ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అలాంటి గొప్ప వ్యక్తులతో పనిచేయడం గర్వంగా భావిస్తా. ఇప్పటికీ అటువంటి అరుదైన దర్శకులు అనేకమంది ఉన్నారు. వారందరితోనూ పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నా -అంటూ ముగించాడు శ్రీనివాస వర్మ.

-సరయు శేఖర్, 9676247000