సబ్ ఫీచర్

బౌద్ధం దుఃఖాన్ని దూరం చేస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలోని దుఃఖాన్ని, బాధలను తొలగించేందుకు సిద్ధార్థుడు రాచరికాన్ని ‘త్యాగం’ చేశాడని, సకల సౌకర్యాలను త్యజించాడని చెబుతారు. మానవాళి కోసం ఆయన గొప్ప మార్గాన్ని ఏర్పరచారని కూడా అంటారు. సిద్ధార్థుడు తన అంతఃపురం నుంచి వెళ్ళిపోయి అంతకుముందు తాను చూసిన ఓ రోగి, ఓ వృద్ధుడి బాధకు, దుఃఖానికి, మరణానికి మందు కనుక్కొనేందుకు ప్రయత్నించాడు. లోకంలో జరామరణాలకు పరిష్కారం కనుక్కోవాలని తీవ్రంగా తపన పడ్డాడు.
విచిత్రమేమిటంటే.. ఆ పరిణామాలు సహజసిద్ధమైనవి. వాటికి మందు లేదు. మనిషి జీవితంలో అవి అంతర్భాగాలు. మనిషన్నాక రోగం వస్తుంది.. కాలం గడిచాక వృద్ధాప్యం వస్తుంది.. అనంతరం మరణం సంభవిస్తుంది. ఇవి అత్యంత సహజమైన దశలు.. సంఘటనలు. మరి వీటి నివారణకు పరిష్కారమార్గాలు కనుక్కుంటానని బయలుదేరడంలో ఏమైనా అర్థం ఉందా? కాని సిద్ధార్థుడు ఇదే సంకల్పంతో అంతఃపురాన్ని వీడాడు. దీన్ని ‘త్యాగం’ అం టారా? ‘జ్ఞానం’ కోసం తల్లడిల్లడమంటారా? ఈ వౌలిక ప్రశ్నను వేసుకోకుండానే రెండున్నర వేల సంవత్సరాలు గడిచిపోయాయి. బుద్ధుడు భగవంతుడని, గొప్ప త్యాగశీలి అని, ‘పంచశీల’ను ప్రతిపాదించాడని, మానవాళికి సరికొత్త మార్గాన్ని చూపాడని, ఆయన తనకు కలిగిన ‘జ్ఞానోదయా’న్ని ఎన్నో కష్టాలకోర్చి ప్రజలవద్దకు చేర్చాడని కొందరు మురిసి మూర్చనలు పోవడం విడ్డూరం.
శిశువు జననం.. పెరిగి పెద్దయి... వృద్ధాప్యంలో మరణించడం ప్రకృతి ధర్మం. మధ్యలో కలిగే కష్టాలు, నష్టాలు, బాధలు, బంధాలు, వియోగాలు మానవ జీవితంలో అంతర్భాగాలు. ఇది సాధారణ వ్యక్తికి సైతం అవగతమవుతుంది. కాని కపిలవస్తు యువరాజైన సిద్ధార్థునికి అర్థం కాలేదు. అదో విచిత్రంగాక ఏమవుతుంది? క్షత్రియరాజు నేర్వాల్సిన విద్యలన్నీ సిద్ధార్థుడు నేర్చాడని, కత్తిసాము, గుర్రపుస్వారీ, మల్లయుద్ధం వంటి మరెన్నో విద్యలలో ఆరితేరాడని, అంతేగాక తర్కం, తత్వశాస్త్ర అధ్యయనం చేశాడని చెబుతారు. ఎంతో చురుకైన, తెలివైన యువరాజుగా కొనియాడబడ్డాడని కూడా అంటారు. చివరికి ‘స్వయంవరం’లో మిగతా రాజకుమారులను ‘ఓడించి’ యువరాణి యశోధరను పరిణయమాడాడు. రాజ్యపాలన గూర్చి, రాజ్యాల మధ్య ఉండే వైరుధ్యాల గూర్చి, ఆయా రాజ్యాల ప్రత్యేకతల గూర్చి ఆయనకు మంచి అవగాహన ఉందనే అంటారు. అందువల్లనే పోటీలో నెగ్గి అందమైన యశోధరను ‘సొంతం’ చేసుకున్నాడు. ఈ క్రమంలో బాల్యం, కౌమారం, యవ్వనం.. తదితర మానవుని దశల గూర్చి సంపూర్ణ అవగాహన తప్పక ఉండే ఉంటుంది. కాని సిద్ధార్థుని తండ్రి శుద్ధోదనుడు తన కొడుకుని ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పెంచాడని, తన కొడుక్కి ‘వైరాగ్యం’ తెప్పించే సన్నివేశాలేవీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారని, చివరికి ఎండుటాకులు.. పండుటాకులు సైతం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా రాజ్యకాంక్ష, అందమైన స్ర్తిల సాంగత్యం.. ఆ మోహంతో సిద్ధార్థుడు కాలం గడిపేలా ప్రణాళికలు రచించి పెంచాడని ఓ కథ ప్రచారంలో ఉంది. సకల శాస్త్రాలు చదువుకున్న సిద్ధార్థుడిని - తర్కం, తత్వం శాస్త్రం అధ్యయనం చేసిన యువరాజును-కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సిద్ధార్థుడు పెరిగాడన్న కథకు మధ్య ‘‘వైరుధ్యం’’ కనిపిస్తోంది. ఏది విశ్వసనీయమో?
ఏది ఏమైనా తనకో అందమైన కుమారుడు రాహులుడు పుట్టాక తనను తొలిచేస్తున్న లోకంలోని దుఃఖం, బాధ, జనన-మరణాల చక్రం లోతులను తెలుసుకోవాలని, వాటికి పరిష్కారం కనుక్కోవాలని లోక సంచారానికి బయలుదేరడం విడ్డూరం. ఎందుకంటే మూడుపదుల వయసొచ్చాక శాస్త్రాలను, పలు విద్యలను అధ్యయనం చేశాక, అందులోనూ తర్కం, తత్వం గూర్చిన ప్రాథమిక అంశాలు అవగాహనకొచ్చాక ‘శోధన’కై ఆసక్తికనబరచడం ఆశ్చర్యకరం. అంతేగాక లోకంలోని దుఃఖానికి, బాధకు పరిష్కార మార్గం కనుక్కోవాలనుకోవడం పూర్తిగా అమాయకత్వం, అసహజత్వం. వాస్తవానికి తనను తొలిచేస్తున్న అంశాలకు సరైన పరిష్కార మార్గమేమిటో తెలియనితనంతో కొట్టుమిట్టాడుతున్న సిద్ధార్థుడికి లోకంలోని అసంఖ్యాక ప్రజల దుఃఖాన్ని- బాధను పరిసమాప్తం చేసే మార్గం ఒకటి ఉంటుందనుకోవడం విడ్డూరం.
సిద్ధార్థుడు ఆ భావనకొచ్చాడంటే అతనికి సరైన విద్య, శాస్త్ర అధ్యయనం లభించలేదనే అర్థం. ఎందుకంటే విభిన్నమైన తెగలు.. సమూహాలు.. వృత్తులు.. మానసిక చిత్తప్రవృత్తులు గలవారి దుఃఖం, బాధ, కష్టాలు-కన్నీళ్లు ‘ఏకరూపత’తో ఉండవు. ఆయా వ్యక్తుల కష్టాలకు, బాధలకు హేతువు ఒక్కటే కాదు. కారణాలు సైతం ఒకే రకమైనవి కావు. మరలాంటప్పుడు ప్రజల దుఃఖం, బాధకు పరిష్కార మార్గం ఎలా సూచిస్తారు? అదెలా అందరికీ ఉపయుక్తమవుతుంది? ఇది చాలా చాలా వౌలిక ప్రశ్న. దీన్ని దాటేసి పట్టించుకోకుండా, కప్పగంతులేసినట్టు ముందుకెళ్ళడంలోనే ఆయన ఆలోచనల ‘అపజయం’ కనిపిస్తోంది.
సిద్ధార్థుడు అప్పటికే అందుబాటులో ఉన్న అనేక ధోరణులను, వివిధ మార్గాలలో బోధిస్తున్న యోగ మార్గాలను పరిశీలించాడని, అధ్యయనం చేశాడని, ప్రజలకు ముక్తి-విముక్తి కల్పించేది ఏదీ తనకు కనిపించలేదని అసంతృప్తితో చాలా ప్రాంతాలను సందర్శించాడంటారు. దూర ప్రాంతాలకు సైతం వెళ్ళాడు. చివరికి తనదైన పద్ధతిలో తపస్సు చేసి, ‘మార్గం’ కనుగొనేందుకు కఠిన నియమాలతో సాధన చేసి ఓ నిండు పున్నమినాడు తనకు ‘జ్ఞానోదయం’ జరిగిందని తనకుతానే ప్రకటించుకున్నాడు. ఆ మార్గమేమిటయ్యా అంటే ‘అష్టాంగ సాధన మార్గం’. ఆ పద్ధతిలో సాధన చేస్తే చిత్తం ప్రశాంతంగా ఉంటుందని, కోర్కెలు గుర్రాల్లా పరుగెత్తవని, సాత్వికంగా యోచించే వాతావరణం ఏర్పడుతుందని, కోర్కెలను అదుపులో పెట్టుకోవడం ద్వారా దుఃఖాన్ని, బాధను, క్లేశాన్ని నియంత్రించవచ్చు అన్నది దాని సారాంశం, తాత్పర్యం. ఈ సంగతి కనుగొన్నందుకే సిద్ధార్థుడు కాస్త బద్ధుడయ్యాడు. అనంతరం అందరూ కలిసి ఆయనను భగవంతుడిని చేశారు, బుద్ధుడు అందరిలో ఓ ‘మానసిక పరివర్తన’ తీసుకొచ్చాడని ఆయన శిష్యులు ప్రకటించారు. వాస్తవానికి ఆయన సూత్రాలు, సిద్ధాంతాలు ఆమోదించినవారికి భిక్షాపాత్ర- కాషాయ వస్త్రాలను సరఫరా చేశాడు. ‘సంఘం’గా ఏర్పాటుచేసి, ‘కట్టు’తప్పకుండా తగుచర్యలు తీసుకున్నాడు. ఇదీ టూకీగా సిద్ధార్థుని ప్రస్థానం.
ఈ ప్రయాణంతో లోకంలోని దుఃఖం, బాధ మటుమాయమైందా?... రోగాలు రాకుండా పోయాయా?... వృద్ధాప్యం స్తంభించిపోయిందా? మరణాలు లేకుండా ఆగిపోయాయా?... మరణించినవారి ఆప్తులు శోకించకుండా, దుఃఖించకుండా ఉన్నారా?... ఆహారం దొరక్క ఆకలితో అలమటించేవారి బాధ మంత్రం వేసినట్టు ఆవిరైపోయిందా?... సిద్ధార్థుని జ్ఞానోదయానికి ముందున్న సమస్యలు జ్ఞానోదయం అనంతరం పరిష్కారమయ్యాయా? ఏదీ పరిష్కరింపబడలేదు! మరి ఆ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం? బుద్ధునికి పూర్వం ఉన్న సమస్యలు, బుద్ధుని కాలంలోని సమస్యలు, అనంతరం అలాగే కొనసాగుతున్నాయి. జనన మరణాల చక్రం గిర్రున తిరుగుతోంది. మరి బుద్ధుడు సాధించిందేమిటి? ఇది అప్పుడు, ఇప్పుడు కోటి రూకల ప్రశ్నగానే మిగిలిపోయింది. అలాంటప్పుడు విఫల శాక్యమునిని ఆకాశానికెత్తి శతాబ్దాలపాటు ఆరాధించడం సబబుగా ఉందా? బౌద్ధ అభిమానులే కాదు సాధారణ ప్రజలు సైతం ఈ విషయాన్ని లోతుగా పరిశీలన చేయాలి. అప్పుడే ‘ప్రగతి చక్రం’ ముందుకు కదులుతుంది.

-వుప్పల నరసింహం 99857 81799