సబ్ ఫీచర్

అంగీకరించడమే ఉత్తమం!( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చినది ఎవరో, ఏమిటో తెలియాలంటే తలుపు తియ్యక తప్పదు. కొత్తది ఏదీ మీ నుంచి ఉద్భవించదు. ఎందుకంటే, అది మీలోని భాగం కాదు. ఎక్కడో ఆవలి తీరంనుంచి అది వస్తుంది. మీ గతమంతా పణంగా పెట్టబడినదే. ఎప్పుడూ మీ దగ్గర లేనిదే కొత్తది. అందుకే అదంటే మీరు భయపడతారు. మీరు ఒక రకంగా ఆలోచిస్తూ జీవించారు. అలా మీరు మీ నమ్మకాల నుంచి సౌకర్యవంతమైన జీవితాన్ని ఏర్పరచుకున్నారు. ఎప్పుడో ఏదో కొత్తది మీ తలుపు తడుతుంది. దానిని మీరు లోపలికిరానిస్తే అది మిమ్మల్ని మార్చేస్తుంది. అపుడు మీరు గతంలో మాదిరిగా ఉండరు. దానితో మీ గత విధానాలన్నీ చెల్లాచెదురవుతాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే అది చాలా ప్రమాదకరం. తెలిసిన విషయం ఎప్పుడూ పాతదే అవుతుంది.
ఎందుకంటే, చాలాకాలం మీరు దానితో కలిసి జీవించారు. అందువల్ల దాని గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. కానీ, కొత్తదాని గురించి మీకు ఏమీ తెలియదు, తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే, మీ తలుపులు మూసి ఉన్నాయి. వాటిని తెరిస్తేనే వచ్చినదానిగురించి తెలుస్తుంది. కానీ ‘ఎవరికి తెలుసు?’ అది మీకు మిత్రుడు కావచ్చు లేదా శత్రువు కావచ్చు. అందుకే తలుపులు తెరవాలంటే మీరు భయపడతారు. అయినా మీరు తలుపులు తియ్యకుండా ఉండలేరు. ఎందుకంటే, ఇంతవరకు పాతది మీకు కావలసినది ఇవ్వలేదు. అది ఊరికే మీకు అనేక వాగ్దానాలు చేస్తోందే కానీ, ఇంతవరకువాటిలో ఏదీ నెరవేర్చలేదు. అందుకే దాని నుంచి మీకు కావలసినది దక్కలేదు.
పాతది మీకు బాగా తెలిసినదే. కానీ, అది చాలా బాధాకరమైనది. అందుకే, ఒకవేళ కొత్తది కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ, దాని నుంచి మీకు ఎంతో కొంత ఆనందం లభించే అవకాశం ఉండవచ్చు. అందుకే మీరు దానిని వ్యతిరేకించలేక, అంగీకరించలేక అనేక అవస్థలు పడుతూ ఉంటారు. అదెప్పుడూ అంతే, అలాగే జరుగుతుంది. ఎందుకంటే అది సహజం. అంతేకానీ, అది తప్పుకాదు.
కొత్తగా కనిపించేదానిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో అందరూ కొత్తగా కనిపించాలని తాపత్రయపడేవారే. అందుకోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతారు. వారు ఆ అనే్వషణలోనే ఉంటారు. ఎందుకంటే, పాతవాటితో ఎవరికీ తృప్తి దక్కలేదు, దక్కదు కూడా. ఎందుకంటే, వాటి సంగతి తెలిసిపోయింది. కాబట్టి, వాటితో ఉండాలంటే చిరాకుగా ఉంటుంది. అంతేకాదు, వాటినుంచి బయటపడాలనిపిస్తుంది. అయినా కొత్తది మీ తలుపు తట్టగానే భయంతో మీరు వెనుకంజ వేసి, పాత నీడలో దాక్కుంటారు. జరుగుతున్న గందరగోళమంతా ఇదే.
‘‘మనం కొత్తగా ఎలా కనిపించాలి?’’ అనేదే అందరి కోరిక. అందుకు చాలా ధైర్యం కావాలి. మామూలు ధైర్యం సరిపోదు. ఎందుకంటే, ప్రపంచంలో అందరూ పిరికివారే. అందుకే ఎవరూ ఎదగలేదు. మీరు పిరికివారైతే ఎలా ఎదుగుతారు? ఎన్ని అవకాశాలు వచ్చినా వెనుకంజ వేస్తూ కళ్ళు మూసుకునే మీరు ఎలా ఎదుగుతారు. ఎదగరు. కానీ ఎదిగినట్లుగా నటిస్తారు. అంటే మీ బ్యాంకులో నగదు నిల్వలు పెరుగుతాయి. అదే మీ ఎదుగుదలకు ప్రత్యామ్నాయం. అలాంటి ఎదుగుదలకు ఎలాంటి ధైర్యంతో పనిలేదు. మీ పిరికితనంతో అది చాలా చక్కగా సర్దుకుపోతుంది. బ్యాంకులో మీ నగదు నిల్వలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. దానితో సమాజంలో అందరూ మిమ్మల్ని ఎక్కువగా గౌరవించడం ప్రారంభిస్తారు. అలా మీ పేరు, ప్రతిష్ఠలు పెరుగుతూ ఉంటాయి.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.
==============================================================