సబ్ ఫీచర్

ఇదెక్కడి వైపరీత్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపచారం, మహాపచారం, దేశంలోనే కనీ వినీ ఎరుగని అపచారం, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారంచేసి ఆ తరువాతనే సినిమాలలో నటించే ఎన్.టి.రామారావు, శ్రీ రామకృష్ణాది వేషాలను ధరించి జనాన్ని భక్తి తన్మయులను చేసి, ఓ కృష్ణునిగా దేవాలయాలలో ఆరాధించబడిన ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పాలిస్తున్న తరుణంలో, మనసుతో కూడా ఊహించడానికి వీలుకాని అపచారం ఆంధ్రప్రదేశం నడిబొడ్డున విజయవాడలో జరిగింది. ఇలా జరుగుతుందని కలలో కూడా వినరు, ఊహించరు.
విదేశీయులో ఇతర మతాలవారో దేశాన్ని ఆక్రమించి హిందు ధర్మంపైన ద్వేషంతో చేసిన పని కాదు. పాలకుడు హిందువు, పాలితులలో అధిక సంఖ్యాకులు హిందువులు. వారిచే ఆరాధింపబడే దేవాలయాలను కూల్చివేసి ఆ విగ్రహాలను ఓ పక్కన పడేసారు.
పవిత్రమైన కృష్ణా పుష్కరాలలో భక్తులకు సహాయం చేయడం కోసం ఉదారమైన హృదయంతో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి సౌకర్యా లు కలిగించడం కోసం తలపెట్టడమేమిటి! ఆ పుష్కర సమయంలో ప్రజలు దర్శించవలసిన ఆలయాలను కూల్చేసి విగ్రహాలను పక్కన పడేయడమేమిటి? ఎవరిదీ దారుణమైన ఆలోచన? ఒకటా రెండా నలభైనాలుగు ఆలయాలను కూల్చేశారనే వార్తలు వస్తున్నాయి.
ఒక ఆలయం కట్టడానికి ఓ దమ్మక్క లాంటి భక్తురాలు, ఓ రామదాసు లాంటి భక్తుడు ఎన్ని కష్టాలు పాలై నిర్మాణం చేసారో వీరూహించారా? అది రోజూ ఎంతమంది భక్తులు పూజలు చేయించి సుఖశాంతులు పొందడానికి స్థానమో ఆలోచించారా?
ఓ ఆలయ నిర్మాణానికి ఎన్ని విధి విధానాలు, శిల్పకారుని నైపుణ్యం, మేస్ర్తిల కృషి, ఆగమ శాస్త్ర పద్ధతులు, ఎన్నిరకాల అర్చనలు, ఎన్నివేల హృదయాల భక్తిమయ స్పందనలు, ఎంత ఖర్చు జరిగిందో ఆలోచించారా? అవన్నీ విస్మరించి ఓ అర్ధరాత్రి బుల్ డోజర్లతో కూల్చేసి విగ్రహాలను పక్కన పడేయడమేనా కృష్ణా పుష్కర సేవలంటే!
ఓ ఆలయం నిర్మించినవారు ఇష్ట దేవలోకాన్ని చేరతారు. వాళ్ల పితృదేవతలు తరిస్తారు. దానాలకంటే సంకీర్తనలకంటే దేవాలయ నిర్మాణం వల్ల అధిక పుణ్యం పొందుతారు. దేవాలయం నిర్మించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ ఘనకార్యం అంతులేని పుణ్యం కలిగిస్తుంది. దేవాలయ నిర్మాణం ప్రారంభం చేస్తేనే ఏడురోజుల పాపం నశిస్తుంది. దేవాలయ నిర్మాణం చేసినవారు నూరు తరాలు దేవలోకాన్ని పొందుతారు.
ఇసుకతో ఆడుకునే బాలకుడు కూడా ఆటకోసం ఇసుకతో ఆలయం నిర్మించినా అది కూడా పుణ్యాన్ని కలిగిస్తుంది. భక్తితో విధి విధానంగా ఆలయ నిర్మాణం చేస్తే ఆ ఆలయంలో ఎన్ని ఇసుక రేణువులు వున్నాయో అన్ని యుగాలు పుణ్యలోకాల్లో ఉంటారు.
ఆలయం మనస్సులో నిర్మించినట్టు భావన చేసినా వంద జన్మల పాపం పోతుంది. ఆలయ నిర్మాణం చేసేవారిని అనుమోదించిన వారికి కూడా పాపాలు పోతాయి అని ధార్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
వీటిపై విశ్వాసంతో దాతలు తమ తను, ధన, మనశ్శక్తులను వెచ్చించి శ్రద్ధాసక్తులతో నిర్మించిన ఆలయాలను కూల్చి పడవెయ్యడమే నా?ఈ మహాపాపాన్ని నివారించేవారే లేరా?
పనిగట్టుకుని తాలిబన్లు బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసారు. తరువాతి వారి గతి ఏమయ్యింది! ఈ ఆలయాన్ని కూల్చిన అధికారులు ఈపాటి ఆలోచించలేకపోయారా! దేహానికి ప్రతీక దేవాలయం. హృదయంలో చైతన్యానికి ప్రతీక గుడిలో దేవుడు. దేవాలయాన్ని ధ్వంసం చేసి దేవ విగ్రహాన్ని పీకిపడవెయ్యడం వినాశనాన్ని ఆహ్వానించడమే.
ఒకవేళ ఒక ఆలయం ఆ ప్రదేశంలో వుండడానికి వీలులేని పరిస్థితులుంటే దాన్ని తరలించడానికి విధి విధానాలున్నాయి. నిత్యం పూజలు జరిగే దేవుని విగ్రహాలలో భగవత్కళలను ఆకర్షణం చేసి ఆ తరువాత వేరే చోట విధి విధానంతో ప్రతిష్ఠ చేయాలి. దానికి ఆగమ గ్రంథాలున్నాయి. వాటిని అధ్యయనం చేసిన పండితులున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది. దానికి ఆగమ సలహాదారులున్నారు. అవన్నీ పక్కనపెట్టి నిలువునా కూల్చివేయడం ఎంత దారుణం!
శుభమా అని నూతన రాజధానిని నిర్మించుకుని ఆంధ్రప్రదేశ్‌ని వైభవోపేతంగా చేయాలనే సత్సంకల్పంతో గొప్ప కృషి జరుగుతున్న తరుణంలో ఆదిలోనే హంసపాదన్నట్టు దేవాలయాలు కూల్చడమా!
ఈ ఘోర పాప ఫలం ఎవరికి చుట్టుకుంటుందో! ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ ఘోర కార్యాల్ని వెంటనే నిరోధించడానికి అధికారులు పూనుకోవాలి. దేవతల ఆగ్రహానికి గురైతే ఎవరాపగలరు? ఎన్ని కోట్ల భక్తుల హృదయాలు ఈ ఘోర కృతాన్ని విని కలత పడుతున్నాయో ఆలోచించండి.
తమ ఆరాధ్య మూర్తుల ఆలయాల శిథిలాలను, భక్తితో ఆరాధించే ఆ మూర్తులు ఓ మూల పడి ఉన్న దృశ్యాలు చూసినా తలచుకున్నా ఎంత గుండెలు కుమిలిపోతాయో! భగవంతుడా! ఈ దుందుడుకు తనానికి క్షమించు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించు.

-డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ సెల్: 09963455584