సబ్ ఫీచర్

వామన వీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముల్లోకాల రక్షణ కోసం మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు. అది ఆధ్యాత్మికత. మూడు తరాల్లోని మరుగుజ్జుల్లో ఆత్మస్థయర్యం నింపేందుకూ ఓ వామనుడు పుట్టాడు. ఇది బతుకు కథ.

సృష్టికార్య నిర్వహణలో అప్పుడప్పుడూ దేవుడు చేసే కొన్ని పొరబాట్లను మనిషి సరి చేస్తుంటాడట. ఆ సరిచేసే శక్తిని మాత్రం రూపమిచ్చిన దేవుడే ఇస్తాడట. ఇది పొట్టివీరయ్య చెప్పే గట్టిమాట. నిజానికి ఇతని పేరు పొట్టి వీరయ్య కాదు, గట్టు వీరయ్య. దేవుడిచ్చిన ఆకారాన్ని చూసి అంతా ఆప్యాయంగా అలా పిలుచుకున్నా.. అతని లైఫ్ జర్నీ మాత్రం సామాన్యుడు లెక్కించలేనంత పెద్దది.
రూపంలో నన్ను వామనుడినే చేసినా హనుమంతుడిలా ఎదగగలిగే కామరూప సంకల్ప శక్తి మాత్రం ఆ దేవుడిచ్చిందే. ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఒకటి తక్కువ చేసినా ఇంకోటి ఎక్కువిస్తాడు. మొత్తానికి ఎవరికి అందాల్సింది వాళ్లకు అందుతుంది. చేయాల్సిందల్లా మన డ్యూటీ మనం సిన్సియర్‌గా చేయడమే అని చెప్పే వీరయ్య -ఈ వారం వెనె్నల అతిథి

దైవం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానులే. అయితే ఒక్కోసారి ఆయన పొరపాట్లవల్ల ఎగుడుదిగుడు, అవకతవకలు జరుగుతాయి. దానివల్ల దేవుడికేం నష్టంలేదు కానీ, అలా పుట్టిన మనుషులే ఇబ్బందులు పడతారు. అవి గమనిస్తాడో ఏమో అలాంటి వ్యక్తులకు తానెప్పుడూ వెనె్నంటి ఉండి అన్నివిధాలా సహకరిస్తుంటాడు. అందరి ప్రేమనూ అతనిపై కుమ్మరిస్తుంటాడు. అలాంటి అదృష్టవంతుల్లో -పొట్టి వీరయ్య కూడా ఉంటాడు.
పాత చిత్రాలు చూసేవారికి పొట్టి వీరయ్యను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అసలు పేరు గట్టు వీరయ్య. కేవలం మూడడుగులు మాత్రమే ఉన్నాడు కనుక పొట్టి వీరయ్య అన్నారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం పనిగిరి నుంచి చెన్నైకి ఏదైనా పని చేసుకుందామని వచ్చినవాడాయన. హెచ్‌ఎస్‌సి దాకా సూర్యాపేటలో చదివాడు. చదువు వంటబట్టలేదు. అమ్మ గట్టు నర్సమ్మ, నాన్న సింహాద్రయ్య, అక్క ఆండాలమ్మలను ఏదైనా చేసి సాకాలనుకున్నాడు. ఉద్యోగం కోసం వెళ్తే టేబుల్ అంత ఎత్తులేవు, ఏం ఉద్యోగం చేస్తావు అని నిరాశపర్చినోళ్లే ఎక్కువ. ఆ నిరాశ నుంచే ఒక ఆశపుట్టింది. స్కూల్ డేస్‌లో స్టేజీ ఆర్టిస్టుగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన తనకు నటుడవ్వాలనే కోరిక కలిగిందంటాడు వీరయ్య. అందులోనే తన జీవితాన్ని వెతుక్కోవాలనుకున్నాడు. పాసైతే హైదరాబాద్, ఫెయిలయితే మద్రాస్ అనుకున్నట్టుగానే చెన్నై బండి ఎక్కేశాడు. సూర్యాపేట వాస్తవ్యుడు మంగలి గోపాల్ వడపళనిలో పూల దుకాణం నడుపుతుంటే, అందులో పనికి కుదిరాడు. గోవిందన్ ఫ్లవర్ షాప్ చూడటానికి చిన్నదైనా, లక్షల వ్యాపారం చేసేది. సినిమా స్టూడియోలకు కావలసిన అన్నిరకాల పూలను సరఫరా చేసేది. అలా పూలను తీసుకువెళుతూ స్టూడియోలలోకి ప్రవేశాన్ని పొందాడు వీరయ్య. అక్కడ ఏం పనీ దొరకదని అర్థమైన తరువాత ఓ లోదుస్తులు (బనియన్ల) కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. తనకిందవున్న కట్టర్, ట్రైలర్, సేల్స్ మేనేజర్‌లను అదుపులో పెట్టడమంటే సామాన్యమైన విషయం కాదు. యజమాని చెప్పిన విధంగా ఏ పనైనా చేసుకుంటూ వెళ్లాడాయన. కానీ ఏదో వెలితి. ఖాళీ సమయాల్లో స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. ఓసారి హీరో శోభన్‌బాబును కలవగా, ఓ సలహా ఇచ్చారు. సాంఘిక చిత్రాల్లో నీకు అవకాశాలు రావు. కనుక బి విఠలాచార్య, ఎస్ భావన్నారాయణలాంటి దర్శకులు రూపొందించే జానపద చిత్రాల్లో ప్రయత్నించమని చెప్పడంతో ఆవైపుగా ప్రయత్నాలు చేశారు. చిక్కడు-దొరకడు షూటింగ్ జరిగే ఫ్లోర్‌కు వెళ్లి విఠలాచార్యను కలిశాడు. ఎవరెలాంటివారైనా వారు పరిశుభ్రంగా ఉంటే నమస్కారం పెట్టడం వీరయ్య అలవాటు. అలా కలిసిన విఠలాచార్య, నువ్వేం చేస్తావ్ అని అడిగారు. ఇంత పొట్టిగా ఉన్నావు కనుక గుర్రం ఎక్కగలవా, అక్కడినుంచి దూకగలవా అని అడిగారు. ఓ దూకేస్తా అన్నాడు. చచ్చిపోతావ్ అన్నారు. చచ్చినా పర్లేదు అన్నాడు వీరయ్య. అలా వీరయ్యలోని తెగువను, ఏ సన్నివేశాన్నయినా పండించాలనే ఉత్సాహాన్ని గమనించారు విఠలాచార్య. త్వరలో పిలుపు వస్తుందన్నారాయన. కానీ రాలేదు. పూల దుకాణంలో మళ్లీ పని. తలవని తలంపుగా విఠలాచార్య మేనేజర్ వీరయ్యను వెతుక్కుంటూ వచ్చారు. రేపు తెల్లారితే అగ్గిదొర చిత్రం షూటింగ్. ఓ పాత్ర ఉందన్నారు. ఇక ఆ రోజు రాత్రి తెల్లవారడం గగనమైంది. అదొక అనుభవం. ఆ చిత్రంలో అగ్గిదొరకు బదులుగా ‘దొడ్డదొర’ పాత్ర లభించింది. సినిమా పూర్తయింది. తొలి చిత్రంతోనే వాల్‌పోస్టర్‌లో తన బొమ్మ పడింది. అది చూసుకుని ఎంత మురిసిపోయాడో. అసలా పోస్టర్లను అంటించిన గోడనుంచి పీకేసి ఇంట్లో దాచిపెట్టుకోవాలని ఎంత ప్రయత్నించాడో. దారిపొడవునా ఎక్కడెక్కడ తన పోస్టర్లు అంటించారో చూసుకుంటూ వెళ్లాడు కోడంబాకమ్ బ్రిడ్జిదాకా. చివరికి ఒక్కచోట 15 పోస్టర్లు అంటించారు. అవన్నీ చూసుకున్న వీరయ్యకు ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆనందం కలిగింది. తొలి షాట్ కూడా తీయడానికి మూడు రోజులు పట్టింది. రోజూ షూటింగ్‌కు రమ్మంటున్నారు కానీ షూటింగ్ చేయటంలేదు. దర్శకుడు విఠలాచార్య మాత్రం రేపు తప్పకుండా నీ సీన్ ఉంటుందన్నారు. చివరికి మూడో రోజు కాంతారావు కాంబినేషన్‌లో సీన్. బాగా చెప్పగలవా డైలాగ్ అన్నారు. చెబుతానని చెప్పి అందరికీ నచ్చేలా నటించి చూపారు. దేవుడి దయవల్ల సినిమా బాగా వచ్చింది. ప్రివ్యూ వేస్తున్నారు. కుర్చీలో కూర్చుంటే సినిమా కనపడదు కనుక తెర దగ్గరకు వెళ్లి క్రింద కూర్చున్నాడు. సినిమా చూస్తున్న వీరయ్య భుజంపై చెయ్యి పడింది. నువ్వు కింద కూర్చోటానికి వీల్లేదు, పద అంటూ దర్శక నిర్మాతలిద్దరూ వారిమధ్యలోవున్న కుర్చీలో కూర్చోబెట్టారు. వీరయ్య ఆనందానికి అవధులే లేవు. అలా ఏ చిత్రంలో అయినా వీరయ్య వున్నాడు అంటే అదొక ప్రత్యేకతగా ఉండేది. చిన్న చిన్న పాత్రలు హాస్యపాత్రలు ఎలాంటివైనా వీరయ్యనే వరించేవి. 1967లో మొదలైన ఆ ప్రస్థానం అగ్గివీరుడు, తాతా-మనవడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్ సుందరి లాంటి అనేక చిత్రాలు చేస్తూ దాదాపు 500 మైలురాయి దాటాడు.
దెయ్యాలు, భూతాలు సినిమాలు అంటే ఖచ్చితంగా వీరయ్య ఉండాల్సిందే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషలన్నింటిలో వీరయ్య సుపరిచితులే. తాత-మనవడులో కల్లు కొండయ్య దగ్గర వుండే సహ పాత్ర. రాధమ్మ పెళ్లిలో చేసిన హిజ్రా వేషం మాడా వెంకటేశ్వరరావుకన్నా ముందే వేసి మెప్పించాడు వీరయ్య. ‘ఓరకంగా దాసరి నారాయణరావు ఆ పాత్ర నాకోసమే రాశారంటారు. పరిశ్రమలోవున్న పెద్ద పెద్ద సినీతారలు అందరూ నన్ను ప్రేమతో చూసేవారు. ముఖ్యంగా కృష్ణ, కాంతారావు, శోభన్‌బాబు, రాజబాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీకాంత్, శివాజీ గణేశన్, జయలలిత, వాణిశ్రీ, షావుకారు జానకిలాంటి గొప్ప తారలందరూ నన్ను వారి బిడ్డలా చూసేవారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. రాధమ్మ పెళ్లిలో పాత్రకోసం అనేకమంది పోటీపడినా చివరికి దర్శకుడి పంతంతో ఆ పాత్ర ననే్న వరించడం మర్చిపోలేని విషయం అంటారాయన. ముఖ్యమంత్రులైన ఎంజిఆర్, ఎన్‌టిఆర్, జయలలితలతో కలిసి పనిచేసిన అనుభవం నాది అంటారాయన. హీరో హీరోయినే్ల కాదు, సపోర్టింగ్ యాక్టర్లు కమెడియన్స్ అందరూ ప్రేమతో చూసేశారు.
అగ్గివీరుడు చిత్రంలో రెండు ఎలుక పాత్రలుంటాయి. అందులో ఒకటి నేను చేశా. శరీరం బరువుగా వుండటం కోసం మేకప్ చేస్తే, ఆ బరువును మోయలేక నేను పడిపోయాను. అప్పుడు నేను పొట్టివాడిగా ఎందుకు పుట్టానా? అని బాధపడ్డాను. ఆ తరువాత ఎప్పుడూ బాధపడలేదు. భలేమొనగాడులో చిట్టిదెయ్యం మేకప్ తీయడానికి ఇబ్బందిపడి జ్వరం తెచ్చుకున్నా. ఎలుగుబంటి వేషం ఒకసారి వేశా. కనీసం చూడటానికి కూడా కళ్లులేకుండా మేకప్ చేసేవారు. ఆ మేకప్‌తో యాక్షన్ చేయడం చాలా కష్టమయ్యేది. కృష్ణ, శోభన్‌బాబుల వ్యక్తిత్వాలు నాకు నచ్చుతాయి. ఎన్‌టిఆర్, ఎస్వీఆర్‌లు పోటీపడి నటిస్తుంటే రెండు పొట్టేళ్ళు యుద్ధంచేసినట్లు ఉండేది. నేరం నాది కాదు ఆకలిది చిత్రంలో ఎన్టీఆర్ ముఖాన నేను తాగిన బీడీని విసిరికొట్టాలి. అలా కొట్టడంలో ఇబ్బంది పడ్డాను. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా బ్రదర్ నాతో కలిసి నటించారు అనేవారు. సంసారం సాగరం చిత్రంకోసం కాబూలీవాలా వేషంలో ఎస్వీఆర్‌ను కొట్టాలి. అలా కొట్టేస్తే ఎన్నాళ్లనుంచి నామీద కోపం ఉందిరా అంటూ నవ్వేశారాయన. ఎంతోమంది నటీనటులతో నటించినా, పిల్లా-పిడుగా చిత్రంలో హెలెన్‌తో నటించడం మర్చిపోలేనిది. వదినగారి గాజులు చిత్రంకోసం పాత్ర అడిగితే ప్రత్యేకంగా వంటమనిషి మొగుడి పాత్ర సృష్టించారు విజయనిర్మల. అలా ప్రతీ ఒక్కరూ నన్ను ప్రేమతో చూసి ఆదరించేవారు. దేవుడు ఒకటి తక్కువచేసినా అందరి ప్రేమను మాత్రం నాకు జతచేయడం ఆనందాన్నిస్తోంది అంటూ ముగించారాయన.

-సరయు శేఖర్, 9676247000