సబ్ ఫీచర్

ఆదివాసి బాలిక ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమస్యలను సహనంతో ఎదుర్కొంటే ఈ విశాల విశ్వంలో సాధించలేనిదంటూ ఏమి ఉండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఆదివాసి బాలిక నీలూ కుమారిని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల ప్రభావిత రాష్టమ్రైన జార్ఖండ్‌లో ఉన్న వేలాది గ్రామాలలో ‘కర్మటండ్’ ఒకటి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ రికార్డులలో తప్ప ఈ గ్రామం పేరు ఎవరికీ తెలియదు. అటువంటి కుగ్రామంకు నీలూకుమారి ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. చదువుకోవాలనే లక్ష్యం కోసం ఆమె ప్రతిరోజు 25 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేయడం గమనార్హం.
జార్ఖండ్‌లోని లటేహర్ జిల్లాలోని కర్మటండ్ అనేది ఒక కుగ్రామం. ఇది అటవీ ప్రాంతం కావడంతో, మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. దీంతో ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కర్మటండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే, దట్టమైన అటవీ, రాళ్ళు రప్పలతో కూడిన రహదారి గుండా ప్రయాణం చేయాలి. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఐదవ తరగతి చదివిన తరువాత గ్రామస్తులు ఎవరూ తమ ఆడపిల్లలను ఆరవ తరగతి చదవడానికి పంపించేవారు కాదు. దీనికి కారణం హైస్కూల్‌కు వెళ్లాలంటే అడవి గుండా 12.5 కిలోమీటర్లు ప్రయాణించి ‘పుల్పు’ అనే చోటకు వెళ్లాల్సి రావడమే. అయితే నీలుకుమారికి చదువుకోవడం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఆమె తల్లి భాగియదేవి, సోదరుడు ఫల్గుణ్ గంజులు ఆమెను ప్రోత్సహించారు. జార్ఖండ్ ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ళను అందచేస్తుంది. ఇది ఆమెకు బాగా కలిసివచ్చింది. ప్రతిరోజూ పాఠశాల ప్రారంభం అయ్యే సమయం కన్నా రెండు గంటలు ముందుగా నీలు తన సైకిల్‌పై పుల్పులోని ఉన్నత పాఠశాలకు బయలుదేరేది. పాఠశాల అయిపోయిన తరువాత, అక్కడే తన హోంవర్క్ పూర్తిచేసుకొని, ఇంటికి తిరిగి వచ్చేది. ఆ విధంగా ఆమె చదువుకోవడం కోసం ప్రతిరోజు 25 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసేది. ఇటీవల
జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించిన మెట్రిక్యులేషన్ ఫలితాలలో ఆమె 48.2 శాతం మార్కులతో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అయింది. నీలు కుమారి సాధించిన విజయంతో స్ఫూర్తిని పొందిన 17 మంది కర్మటండ్‌కు చెందిన బాలికలు, తాము కూడా చదువుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం కర్మటండ్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసింది. ఎంచుకొన్న లక్ష్యంపట్ల నిబద్ధత ఉంటే, సాధించలేనిది ఏమీ ఉండదనడానికి నిదర్శనం నీలూ కుమారి. ఆమె భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశిద్దాం.

- పి.హైమావతి