సబ్ ఫీచర్

కునారిల్లుతున్న ప్రాథమిక విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొఠారి కమిషన్ మొదలు నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యావ్యవస్థ పురిటినొప్పులు పడుతూనే ఉంది. కేంద్రం దేశమంతా అమలుచేస్తున్న నిర్బంధ ప్రాథమిక విద్యలో భాగంగా 1 నుంచి 5 తరగతుల వరకు ఆపై ఏడవ తరగతి వరకు విద్యాహక్కు చట్టం చట్టం కింద ఆయా వయసుల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకోవాల్సిందే. అయితే ఈ క్రమంలో పాఠశాలలను బలోపేతం చేయాల్సిందిపోయి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను బలహీనపరిచే కార్యక్రమాలకు తెలిసో తెలియకనో శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే తక్కువ విద్యార్థులున్న, విద్యార్థుల్లేని పాఠశాలలను మూసివేసి ఆయా విద్యార్థులను అక్కడికి దగ్గరలో ఉన్న మరో పాఠశాలకు పంపాలనే ఆలోచన వల్ల ప్రైవేట్ పాఠశాలలు బలోపేతమవుతాయ. ఎందుకంటే, ఒక గ్రామంలో అందరూ కలసి ఒక గుడి నిర్మించుకున్నారనుకుందాం. మొదట్లో ఆ గుడికి జనాలు రావడం, పూజలు జరగడం బాగానే ఉంటుంది. వర్షాలు పడినపుడు గ్రామస్తులంతా పనీపాటలకు వెళ్ళిన రోజుల్లో గుడికి జనం వెళ్లడం బాగా తగ్గుతుంది. కొన్ని రోజులు, నెలలు పాటూ కొందరైతే అసలు గుడివైపు కూడా చూసే వీలులేక బాగా పనుల్లో ఉంటారు. అంత మాత్రాన ఆ గ్రామంలో తనకు పూజలు జరగలేదని వాపోతూ దేవుడు మరో గ్రామానికి వెళ్ళిపోతాడా..? లేదా గ్రామంలో పూజలకు ఎవరూ సక్రమంగా వెళ్లడంలేదు కాబట్టి ఆ గుడిని మరో ఊరికి తరలిస్తారా..? గుడిలాగే బడి కూడా కదా!
గుడి.. బడి లేని ఊరు ఎందుకూ కొరగాని అడవిలాగా మిగులుతుందనే శతకకారుని నీతి కూడా ప్రభుత్వానికి తెలియదా..? ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా అదే జరుగుతోంది. రాష్ట్రంలో 20కు లేదా అంతకంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపడం భారమని, తక్కువ సంఖ్య విద్యార్థులకు పాఠాలు బోధించేకంటే, ఆయా విద్యార్థులను మరో ఎక్కువ విద్యార్థులున్న బడికి తరలించి ఆయా ఉపాధ్యాయులను బదిలీ చేయడం అనే అర్థంపర్థంలేని విషయాన్ని పట్టుకుని ప్రాథమిక విద్యాశాఖ గిరికీలు కొడుతోంది. ఇంతకు ఇంత అసంబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోడానికి విద్యాశాఖ ఎవరి అనుమతి తీసుకుందో అర్థంకాని విషయం. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన విద్యావేత్తల, ఉపాధ్యాయుల సలహాలను తీసుకోకుండానే క్లస్టర్ పాఠశాలల విధానాన్ని అమలుచేసేయడంతో రాష్ట్రంలో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి. గ్రామాలలో మూతపడిన సరస్వతీ నిలయాలు మరికొంతకాలానికి శిథిలమైపోవడం ఖాయం. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు ఇలా మూతబడిపోతుండడంతో గ్రామస్తులు తెల్లబోతున్నారు.
పనీపాటకు వెడితే తమ పిల్లలకు గ్రామబడులలో విద్యతోపాటూ రక్షణ, భోజనం సదుపాయం ఉంటుందనే భావనతోనే ప్రభుత్వ బడులలో చదివిస్తున్నామని, ఇపుడు మరో గ్రామానికి వెళ్లడంతో పిల్లలకు రక్షణ కరువవుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో పది మంది పిల్లలున్న బడిని ప్రభుత్వం మూసివేసింది. ఆ పిల్లలను ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరంలోని మరో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపాలని ఆదేశించినప్పుడు ఈ మార్పు అర్థంకాని తల్లిదండ్రులు కొంతకాలంగా అలాగే మరో గ్రామానికి పంపారు. బడికి రాకపోకల మధ్యలో పిల్లలు కొందరు ఘర్షణపడడం, ఆకతాయి పనులకు పాల్పడడం, ఈతకొట్టడం, చెట్లెక్కడం వంటి చర్యలకు దిగి కొందరు మృత్యువాడపడగా, మరికొందరు గాయాలపాలయ్యారు. దీంతో తల్లిదండ్రులు వారిని బడులకు పంపడం ఆపివేశారు. ఈ పరిణామంతో కొందరు బడులకు దూరం కాగా, మరికొందరు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను మార్గంగా ఎంచుకున్నారు. ఎంచక్కా తమ గ్రామానికే వచ్చే ప్రైవేట్ పాఠశాల బస్సులో తమ బిడ్డలను పంపడానికి అలవాటుపడుతున్నారు.
ఇలా గ్రామాలలో విద్యార్థులు తక్కువున్నారనే కుంటిసాకుతో ప్రభుత్వం బడులను మూసివేయడం వెనుక దాగిన విద్యావ్యాపార ఎత్తుగడ అర్థంచేసుకున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎవరో గొంతులు నొక్కేసినట్లు మూగనోము పట్టడం దారుణం. ఈ అత్యంత దారుణమైన నిర్ణయం వెనుక కార్పొరేట్ పాఠశాలల హస్తం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడౌతోంది. నేడు రాష్ట్రంలో మద్యం విక్రయాల తరువాత అత్యంత లాభసాటి వ్యాపారమేదైనా ఉందా అంటే అది విద్యావ్యాపారమే. రెండు దశాబ్దాల క్రితం వరకు చిన్న చిన్న పాఠశాలలతో తమ వ్యాపారాన్ని నిర్వహించేవారు నేడు రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యావ్యవస్థకు తలుపులు తెరిచిన ప్రభుత్వం ఒకవైపు ఉత్తమ ఫలితాలు కావాలని ఉపాధ్యాయుల పీకమీద కూర్చుంటూనే మరోవైపు ప్రైవేట్ విద్యావ్యాపారాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సబబని పేద తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం ఇంత దారుణ వ్యవస్థ లేదు. అమెరికాలో పది తరువాత రెండేళ్ళు కూడా ప్రభుత్వ విద్య మాత్రమే అందుబాటులో ఉంది. అంటే 98 శాతం మంది విద్యార్థుల ప్రభుత్వ విద్యాశాఖ కనుసన్నలలోనే చదువుతారు. అక్కడ రెండు మూడు శాతం మాత్రమే ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుమతి ఉంది. ఈ విధానం తరువాత తన బాధ్యత పూర్తయినట్లు ప్రభుత్వం విద్యార్థులను ఉన్నత విద్యకోసం వారి స్వేచ్ఛకు అవకాశమిస్తుంది. ఇంటర్మీడియెట్ వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విద్య చాలా చవక. ఎందుకంటే అంతవరకు విద్యార్థుల విద్యాబాధ్యత ప్రభుత్వానిదే కావడం కారణం. కానీ భారతదేశంలో అందునా మన రాష్ట్రంలో ఈ బాధ్యతకు ప్రభుత్వం తిలోదకాలిచ్చేస్తోంది. దీనికి నిదర్శనమే ఈ విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో వేలాది ప్రైవేట్ పాఠశాలలకు చిన్నచిన్న గ్రామాల్లో అనుమతి లభించడం. ఇలా చిన్న చిన్న గ్రామాలలో సైతం ప్రైవేట్ పాఠశాలలు ఏర్పడడంతో రానున్న కాలంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థ చిన్నాభిన్నం కాబోక తప్పదు.
ఇప్పటికే రాజీవ్ విద్యామిషన్ గత ఒకటిన్నర దశాబ్దంగా కొత్త ప్రయోగాల పేరుతో ఎక్కడో ఏసి గదులలో కూర్చుని డిజైన్ చేసే పాఠ్య పుస్తకాలు, బోధనా పద్ధతులు, విద్యావిధానంలో మార్పులు, శిక్షణల పేరుతో ఉపాధ్యాయులకు నరకం చూపడం వంటి విషయాలు ప్రాథమిక విద్యను దారుణంగా దిగజార్చాయి. ముప్ఫైఏళ్ళ అనుభవమున్న ఉపాధ్యాయులకు కూడా పునశ్చరణ తరగతుల పేరిట ఎలా బోధించాలి..? ఏమి బోధించాలని చెప్పాలని ప్రయత్నించడం అవివేకం కాదా..? అ.. ఆ.. ఇ.. ఈ లను బోధించవద్దని ఒకేసారి 3పలక2.. బలపం.. పడవ.. పనస వంటి పదాలను ఒకటో తరగతిలోనే నేర్పాలని ఇపుడున్న జనరేషన్ పిల్లలు ఇలానే నేర్చుకుంటారని ఎవరో ఇచ్చిన సలహా పట్టుకుని నాలుగేళ్ళుగా పాఠశాలల్లో అ.. ఆలు పక్కనపెట్టి పలక.. పడవ.. పనస.. వంటి పదాలు నేర్పిన తరువాతనే అచ్చులు నేర్పమనే దారుణం సాగుతోంది.
అసలు పునాదులు వేయక పిల్లర్లు నిలబెట్టి భవన నిర్మాణం చేస్తే ఏమవుతుంది..?? ఆ నిర్మాణం కాస్తా మధ్యలోనే విరిగిపోతుంది. పలక బలపం నేర్చుకుంటే పెద్దయితే వారికి అవే గుర్తుంటాయి కానీ, అచ్చులు... హల్లులు వంటివి ఉన్నాయని జ్ఞాపకమే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళుతెరచి ఒకే గొడుగుకింద పాఠశాలలనే పనికిరాని అంశాన్ని వదిలిపెట్టి, మూసివేసిన బడులలో పది మందికైనా సరే ఒక ఉపాధ్యాయుడిని నియమించి పిల్లలున్న గ్రామంలోనే వారికి చక్కగా శ్రమలేని విద్యను అచ్చమైన తెలుగు విద్యనందించేందుకు సిద్ధపడాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే నష్టమేమిటీ...? మనమంతా చిన్నతనంలో ఒకే అయ్యవారి వద్ద్ద చదవలేదా...? ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో పీనాసి, పిసినారితనాన్ని వదిలి మరింతగా ఖర్చుపెట్టాలి. లేనిపక్షంలో ప్రాథమిక విద్యావ్యవస్థ కూలిపోయే ప్రమాదం లేకపోలేదు.

- పరాంకుశ