సబ్ ఫీచర్

మహాబోధి విద్యాలయాధిపతి.. గద్దర్ కొత్త అవతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనపై కేసుల సంఖ్య పెరిగిందని ‘విప్లవ గాయకుడు’ గద్దర్ ఇటీవల అల్వాల్ (వెంకటాపురం)లో వాపోయారు. 22 ఏళ్ల క్రితం తనపై జరిగిన తూటాల దాడిలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతవరకు మార్క్స్ సిద్ధాంతాలు, ఫూలే భావాల పాటతో పయనమయ్యానని ఇక ఇప్పుడు అంబేద్కర్ అడుగుజాడల్లో ‘జ్ఞానయుద్ధం’ చేస్తానని ప్రకటించారు. అంబేద్కర్ ఆహార్యమైన ‘‘సూటు-బూటు’’ ధరించి గద్దర్ తన ‘మహాబోధి విద్యాలయం’లో కొత్త అవతారమెత్తారు. అంబేద్కర్‌ను అనుసరిస్తానని, ఆహార్యంతోనూ ఆకర్షిస్తానని గద్దర్ చెప్పకనే చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన పరిస్థితి నెలకొందని గుర్తుచేశారు. పాట మాధ్యమంగా తాను ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తానన్నారు.
ఇంత చెప్పిన గద్దర్ తనపై పెరిగిన ఆ కేసుల వివరాలను చెప్పలేదు. గతంలో మావోయిస్టుల ‘వౌత్ పీస్’గా ఉన్నప్పుడు కేసుల సంఖ్య పెరిగిందంటే అర్థం ఉండేది. ఆ పార్టీ నుంచి బహిష్కృతుడయ్యాక, నైరాశ్యంతో సంవత్సరాలపాటు తిరిగాక అధికార పార్టీకి అవసరమైనప్పుడు ‘తాళం’ వేశాక, ఎన్నికల సంఘం పేర్కొన్న సందేశాన్ని మోస్తూ ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిశాక అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్- సేవ్ డెమొక్రసీ’అన్న నినాదంతో పల్లె పల్లె తిరుగుతానని ప్రతిజ్ఞచేశాక, ఓ ఫోరం ఏర్పాటుచేసి దానికి కన్వీనర్‌గా పనిచేస్తూ సమాజంలో ప్రభావశీలురైన వారిని కలుస్తూ, ఆహ్వానిస్తూ, అల్పాహార విందులు జరుపుతూ, సూటు-బూటు వేసుకుని తిరుగుతూ, అవసరమైనప్పుడు కర్రకు రంగుల గుడ్డ పీలకలు కట్టుకుని వేదికలపై తన ఆట-పాట ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ, ‘పంచ్’లు వేస్తూ పొద్దుపుచ్చే వ్యక్తిపై ఏ రకమైన కేసులు పెరిగాయి..? సానుభూతి సంపాదించడానికి ఇట్లాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం విడ్డూరం. ఏడు దశాబ్దాలు పైబడిన గద్దర్ స్థిత ప్రజ్ఞత ప్రదర్శిస్తే ఆయన జ్ఞాన యుద్ధంలో నిజాయితీ తొంగి చూస్తుంది. అలాగాక కేసులు పెరిగాయని ‘గాలి’కి అనేస్తే అదెలా ఆహ్వానించదగ్గ అంశమవుతుంది?
తన కనుసన్నల్లో నడిచే ‘శబ్దం’ కళాకారులు, రచయితల ఐక్యవేదిక, అంబేద్కర్ విద్యానికేతన్, జజ్జనక కళామండలి, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటి, సేవ్ డెమొక్రసీ.. ఇలా పలు వేదికలు- సంఘాలు- సంస్థల ఆధ్వర్యంలో ఓ సదస్సు నిర్వహించి అతిశయపుమాటలను అనర్గళంగా ప్రవహింపజేయడం అవసరమా?.. అన్న ప్రశ్న ఉదయిస్తుంది. రాజకీయ- ఆర్థిక- సామాజిక విప్లవం కోసం దశాబ్దాలపాటు పాటను పాశుపతాస్త్రంగా చేసుకుని పయనించిన గాయకునికి ఇలాంటి అతిశయపు మాటలు శోభిల్లవు కదా! ప్రజాజీవితంతో మమేకమై, ప్రజల్ని కదలించకపోతే ఆయన ప్రయాణాన్ని ప్రశ్నించే అవసరం, అవకాశం ఉండేది కాదు. కాని నాలుగు దశాబ్దాలకు పైగా నక్సలైట్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, పదివేల మంది యువతీ యువకులను అడవులకు పంపిన వ్యక్తి మాటలు.. పాటలు.. ఆటలు గాడి తప్పితే, వక్రమార్గం పడితే ప్రశ్నించే, నిలదీసే హక్కు పౌరులందరికీ వుంటుంది.
ప్రజాజీవితంలోని ప్రతివారు ఏ వెలుగులకీ ప్రస్థానం? అన్న ప్రశ్న నిరంతరం వేసుకోవాలసిన అవసరం ఉంటుంది.. ఉండాలి. ఆ కొలమానంతో చూస్తే- గద్దర్ ప్రతి కదలికను ప్రశ్నించడంలో తప్పులేదు, ఉండకూడదు.
‘‘అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ’’ లాంటి సంస్థల వెనుక ఉండి పనిచేస్తున్నప్పుడు అతని ప్రతి చేష్ట.. ప్రతి పని భూతద్దం క్రిందకు రావలసిందే! విచిత్రమేమిటంటే తెలుగు సమాజంలో ‘ప్రముఖ వ్యక్తులు’గా ముద్ర పడినాక ఆ వ్యక్తి ఏం చేసినా ప్రశ్నించడానికి ‘జంకే’ మనస్తత్వం విశృంఖలంగా ఉంది. జంకు-్భయం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు, మరింత కష్టం, నష్టం తప్ప. పారదర్శకతకు పాతర వేసి ప్రవర్తించినా కిమ్మనకుండా ఉండటం వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం ఇసుమంత కూడా కనిపించదు.
పారదర్శకత గద్దర్ జీవితంలో కనిపించదు. ‘రహస్య పార్టీ’లో చాలాకాలం గడపడం వల్లనో, మరేమిటో గాని పారదర్శకతకు గద్దర్ ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వలేదు. ఆ పారదర్శకత ఉన్నట్టయితే పీపుల్స్‌వార్ పార్టీ నుంచి గాని, మావోయిస్టు పార్టీనుంచి ఆయనను వెలివేయడం జరిగేది కాదు. వరవరరావు లాంటి కవులు, తోటివారు గద్దర్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యేవారు కాదు. అంతిమంగా ఏ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని, ఏ వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలని, ఏ వ్యవహారాలను కాలరాయాలని పిలుపునిచ్చి అగ్గిబరాటాలా చెలరేగిన వ్యక్తి ఇప్పుడు వాటిని కాపాడేందుకు, వాటిని రక్షించేందుకు, ఆ వ్యవస్థలో అంతర్భాగమై, ఆ ‘సంస్కృతి’కి తలొగ్గి సూటు-బూటు వ్యవహారంతో ‘సేవ్ డెమొక్రసీ... సేవ్ కానిస్టిట్యూషన్’ అంటూ తిరగడం స్థిత ప్రజ్ఞత అవుతుందా? ఎన్నికల కమిషన్ చేసిన, చేస్తున్న పనిని గద్దర్ చేసేస్తే దానిలో కొత్తదనమేముంది? ఓటు వేయడం అందరి ధర్మం.. కర్తవ్యం అని ఎన్నికల కమిషన్ మొదలుకుని ప్రజాస్వామ్య చైతన్యం గల ప్రతి వ్యక్తి ఇస్తున్న నినాదమే, దానికి గద్దర్ చేకూర్చే ‘అదనపు విలువ’ ఏముంది?
గద్దర్ కన్నా ప్రభావశీలురులైన, వివిధ రంగాలలో సేవలందించిన అనేక మంది ప్రముఖులు, పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలని అవసరమొచ్చినప్పుడు కోరుతూనే ఉన్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచార- ప్రసార మాధ్యమాల్లో వాటిని అందరూ చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తదితరులు సైతం ఓటర్లను ఓటు వేసేందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏడు దశాబ్దాలుగా ఈ తంతు కొనసాగుతూ ఉంది. ఏదైనా సాంకేతిక కారణంతో ఓటు వేసేందుకు అధికారులు నిరోధిస్తే పౌరులు ‘శివతాండవం’ చేసిన సందర్భాలు గతంలో ఎన్నో చూశాము. అంటే ఏమిటి అర్థం?... ఓటు హక్కు తమ ప్రాణంతో సమానమన్న భావన చాలామందిలో ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో గద్దర్ దక్షిణాది రాష్ట్రాల ఓటర్లను చైతన్యపరిచి ‘ఓట్ల విప్లవం’ తీసుకొస్తానని గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో 150కు పైగా గల పార్లమెంట్ స్థానాల్లో ‘తన’ ప్రభావం ఉంటుందని, ఆ రకంగా ప్రధాని ఎవరన్న విషయంలో తామే కీలకమవుతామని గద్దర్ చిరకాలంగా చెబుతూ ఉన్నారు.
ఇలా పగటి కలలు కంటూ ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికల సందర్భాల్లో ప్రకటనలు గుప్పిస్తూ ఆయన విదూషక పాత్రను తలపిస్తూ ఉంటారు. పారదర్శకత లేదని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను ప్రభావితం చేసే శక్తి-యుక్తి గద్దర్‌లో ఉన్నాయా? ఉంటే ఇంతకాలం కేవలం మాటలకే ఎందుకు పరిమితమవుతున్నారు? మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్లు తెలంగాణను దాటనప్పుడు ఇలాంటి ప్రకటనలు గుప్పించడం భావ్యమా?
ఏడు పదుల వయసు అనంతరం కూడా ఈ రకమైన గిమ్మికులు గద్దర్‌కు అవసరమా? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. పక్షం రోజులకోసారి పత్రికల్లో ప్రముఖంగా కనిపించేందుకు ఆరాటపడటం ఆయనకు అంతగా నప్పని అంశం. తన పాఠశాలకు ‘మహాబోధి విద్యాలయం’ అన్న పేరు పెట్టుకున్నారు. బుద్ధుని పటాన్ని, ప్రతిమను పూజిస్తాడు. వర్తమానంలో బుద్ధుని భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని తపన చెందుతారు. అటు మార్క్స్, ఇటు అంబేద్కర్, ఫూలే, బుద్ధుడు, కాన్షీరామ్... కార్పొరేట్‌శైలి వ్యవహారం... అన్నీ వైరుధ్యాలే. ఎక్కడా స్పష్టత- పారదర్శకత కనిపించదు. సెక్యూలర్ (లౌకిక) రాజ్యాంగాన్ని కాపాడాలంటూ బౌద్ధమత వ్యాప్తికి, విస్తృతికి పాటుపడతారు. గద్దర్‌లో ఇంత గందరగోళమా?.. అని ఆశ్చర్యమేస్తుంది. గాడి తప్పిన ఆలోచనల స్రవంతితో గద్దర్ తన అభిమానులను అయోమయంలో పడేయరాదు కదా?

-వుప్పల నరసింహం 99857 81799