సబ్ ఫీచర్

బౌద్ధంతో అంబేద్కర్ ఆశించిన ‘సమత’ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో బౌద్ధ్ధర్మాన్ని పునరుద్ధరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పూనుకున్నారు. 1956 అక్టోబర్ 14న పూణెలో దాదాపు ఐదు లక్షల మంది దళితులతో కలిసి ‘సమత’ను ఆశించి ఆయన బౌద్ధ్ధర్మాన్ని స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం దళితులను ఉత్తేజితుల్ని చేసింది. ‘హిందూ ధర్మాన్ని వీడి బౌద్ధ్ధర్మాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను.. నేనిప్పుడు స్వేచ్ఛాజీవిని, ఇక శేషజీవితాన్ని బౌద్ధ్ధర్మం కోసం కేటాయిస్తాన’ని బౌద్ధసన్యాసుల ముందు ఆయన ప్రతిజ్ఞచేశారు. హిందూ దేవుళ్ళను ఇకపై పూజించనని కూడా శపథం చేశారు.
అంతకుముందు 1955లో బీబీసీ రేడియోకు అంబేద్కర్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ బౌద్ధం భారత సంస్కృతిలో ఒక భాగమని, బాల్యం నుంచే తనకు బౌద్ధంపై అనురక్తి ఉందని తెలిపారు. తాను హిందువుగా జన్మించినా బౌద్ధ్ధర్మాన్ని ఇష్టపడ్డానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం బౌద్ధ్ధర్మాన్ని అక్కున చేర్చుకుంటుందని కూడా ఆయన జోస్యం చెప్పారు.
సనాతన హిందూ ధర్మంలోని కులవ్యవస్థ అంబేద్కర్‌ను తీవ్రంగా కలచివేసింది. తాను ఎదుర్కొన్న అవమానాలు ఇతర దళితులెవరూ ఎదుర్కోకూడదన్న బలమైన సంకల్పంతో బౌద్ధ్ధర్మాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు. దాంతో తనకు, తన తోటివారికి సంకెళ్లు తొలగిపోయాయని భావించారు. ఋగ్వేదంలోని సమాజ విభజనను ఆయన పూర్తిగా తప్పుపట్టారు. దాని అవశేషాలు తన కాలంలో కనిపించడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో హిందూ మతంపై, ధర్మంపై తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. దాని పర్యవసానమే బౌద్ధ ధర్మ (మత) స్వీకరణ.
కులరహిత సమసమాజం కోసం ఆయన కలగన్నారు. వేల సంవత్సరాల అణచివేత.. అస్పృశ్యత.. బానిసత్వం ఇంకానా ఇకపై చెల్లదని రణన్నినాదం చేశారు. ‘అన్హివేషన్ ఆఫ్ కాస్ట్’ (కుల నిర్మూలన) అన్న పత్రాన్ని రాశారు. వాస్తవానికి అంబేద్కర్, అతనికన్నా ముందు జ్యోతిబా ఫూలే, మరికొంతమంది దళితులు అగ్రకులాలుగా భావించే బ్రాహ్మణుల సహాయ సహకారాలు అందుకున్నవారే, మార్గదర్శనం పొందినవారే. నిజానికి ‘అంబేద్కర్’ అనే పేరు ఓ బ్రాహ్మణ ఉపాధ్యాయుడిది. బ్రహ్మజ్ఞానం గలవాడు బ్రాహ్మణుడు అన్న భావన సమాజంలో ఉంది. అలాగే కులం కన్నా గుణం గొప్పదన్న అభిప్రాయం అనాదిగా వినిపిస్తోంది. మహారాష్ట్ర, సతారా ప్రాంతాలలోని ఓ ప్రాథమిక పాఠశాలలో బాల భీమ్‌రావ్ చేరినప్పుడు ఆ పాఠశాల బ్రాహ్మణ ఉపాధ్యాయుడు మహదేవ్ అంబేద్కర్ భీమ్‌రావుపై వాత్సల్యం, ప్రేమ కురిపించాడు. భీమ్‌రావు దళితుడని తెలిసినా, మహర్ సామాజిక వర్గానికి చెందినవాడని విన్నా, అప్పటికీ అస్పృశ్యత, అంటరానితనం భయంకరంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ ఆ బ్రాహ్మణ ఉపాధ్యాయుడైన మహదేవ్ అంబేద్కర్... భీమ్‌రావ్ చురుకుదనాన్ని ఇష్టపడి, చేరదీసి చివరికి పాఠశాలలో తన పేరు (అంబేద్కర్)ను జతచేసి ‘్భమ్‌రావ్ అంబేద్కర్’గా నమోదు చేయించాడు. అంబేద్కర్ అనే పేరు అప్పటికి-ఇప్పటికీ ఓ బ్రాహ్మణుని ఇంటి పేరు. దీంతో నాణేనికి మరో పార్శ్వం కూడా ఉంటుందని అందరూ గ్రహించాలి. ఆ బ్రాహ్మణ ఉపాధ్యాయుడు మహాదేవ్ అంబేద్కర్ అస్పృశ్యతను పాటించలేదు. దళిత భీమ్‌రావుని ఆదరించాడు. బ్రాహ్మణుడిగా తన జ్ఞానాన్ని ధారపోశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాన్ని స్వయంగా రికార్డు చేశారు.
బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ అగ్రవర్ణాలకు చెందినవాడే అయినా భీమ్‌రావు ప్రజ్ఞను పెంచి ప్రయోజకుడిని చేయాలని తలచి విదేశాల్లో చదివించేందుకు ఆర్థిక సహాయం చేశాడు. ఒకవేళ అస్పృశ్యుడికి ఎందుకు సహాయం చేయాలని ఆ అగ్రకుల మహారాజు అనుకుని ఉంటే, నిరాదరణకు గురిచేస్తే, వర్ణ్ధర్మం పాటిస్తే.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఎవరూ చూసేవారు కాదు. ఆ రకంగా అప్పటి సమాజంలో కేవలం చిన్నచూపు, అస్పృశ్యత, నిరాదరణ, అణచివేతనేగాక ఆప్యాయత- అక్కున చేర్చుకుని ఆదరించే ఆదర్శగుణం కూడా సమాజంలో కనిపిస్తోంది. దాన్ని జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌లు దండిగా అందుకున్నారు, అనుభవించారు.
అంబేద్కర్ రెండవ భార్య శారదా కబీర్ (సబిత- సవిత) ఓ సారస్వత బ్రాహ్మణ మహిళ. ఉన్నత చదువు చదువుకున్నది. డాక్టర్ వృత్తిలో ఉంది. మరి ఆ బ్రాహ్మణ మహిళ అంబేద్కర్‌ను అంటరానివాడిగా చూసిందా? అస్పృశ్యునిగా భావించిందా? తన దేహాన్ని అర్పించి అర్ధాంగిగా నిలిచిందా? అన్ని సమయాల్లో కొండంత అండగా నిలిచి అర్థనారీశ్వరిగా మెలిగిందా? అత్యున్నత మానవీయతను ప్రదర్శించిందా?
ఉపాధ్యాయుడు మహదేవ్ గాని, సాయాజీరావు గైక్వాడ్ గాని, విదేశాల్లో చదివేప్పుడు సహకరించిన అగ్రవర్ణాలవారు గాని, ఆఖరికి తన భార్య శారదాకబీర్ (సవిత)గాని హిందూ ధర్మాన్ని ఆచరించినవారే, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ భీమ్‌రావుని ఆదుకున్నవారే. వారినుంచి అనూహ్యమైన ఆదరణ, ఆర్థిక సాయం, సౌఖ్యం, సహానుభూతి అందుకోవడమేగాక ఓ గొప్ప మేధావిగా ఎదిగేందుకు, న్యాయశాస్త్ర నిపుణుడిగా రాణించేందుకు అవి దోహదపడ్డాయి. అంటే హిందూ ధర్మమాచరించే వారందరూ ముఖ్యంగా బ్రాహ్మణులు నిందనీయులు, అమానవీయులు అన్న నిర్ధారణకు రాకూడదు కదా? దురదృష్టవశాత్తూ భీమ్‌రావ్ హిందూ ధర్మంపై కసి, ద్వేషం పెంచుకున్నారు. ‘హంస’ చేయాల్సిన పని చేయకుండా, పూర్తిగా దళిత పక్షపాతిగా నిలిచేందుకే సిద్ధమయ్యారు. స్వతంత్ర భారతంలో ఆయనకా స్వేచ్ఛ ఉంది. ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. చాలామంది స్వాగతించారు. గౌరవించారు. మొత్తం మానవాళిని ప్రభావితం చేయగల ప్రజ్ఞ ఉన్న వ్యక్తి ఓ పరిమిత చట్రంలో ఇమిడిపోవడం విచారకరం.
1891 ఏప్రిల్ 14న జన్మించిన భీమ్‌రావు చురుకుదనం, జ్ఞానతృష్ణ, ఎదగాలన్న కాంక్ష ఆయనను అమెరికా, బ్రిటన్‌లో చదువుకునేలా చేశాయి. భీమ్‌రావు సమకాలీన దళితుల్లో గాని ఆ తరువాత తరంలో గాని అంత ఉన్నత స్థాయికి ఏ దళిత బిడ్డ ఎదగలేక పోవడంలోని ‘‘రహస్యం’’ పసిగట్టి, విడమరిచి విశే్లషించి అంబేద్కర్ చెప్పగలిగి ఉంటే దేశంలోని బడుగు- బలహీన, దళిత వర్గాలకు గొప్ప మేలు చేసినవాడుగా మిగిలేవాడు. కాని దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. కేవలం హిందూ ధర్మంపై ‘్ఫకస్’ పెట్టడంతో లక్షలాది మంది నిరక్షరాస్యులుగానే ఉండిపోయారు. అవిద్య నుంచి అజ్ఞానం, మిగతా రుగ్మతలు పొటమరించాయి. దీన్ని విశదీకరించకుండా పైపై పూతగా ఎన్ని మాటలు మాట్లాడినా.. ద్వేషం వెళ్ళగక్కినా, విషం కక్కినా, దూషణలకు పాల్పడినా ఏమిటి ప్రయోజనం?
అగ్రవర్ణాల ఆదరణ లభించకపోతే భీమ్‌రావు ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తిగా, న్యాయ కోవిదుడిగా గుర్తింపు పొందేవాడా? నిష్పక్షపాతంగా ఆలోచిస్తే లేదనే సమాధానమొస్తుంది. కాబట్టి భీమ్‌రావు అంబేద్కర్ హిందూ ధర్మంలోని రెండవ పార్శ్వాన్ని చూసేందుకు పూర్తిగా విముఖత ప్రదర్శించి, కఠిన పదజాలంతో విమర్శించి బౌద్ధాన్ని అక్కున చేర్చుకోవడంతో దళితుల సమస్యలు తీరాయా? ఇది అప్పుడు- ఇప్పుడు కోటి రూకల ప్రశ్నగానే మిగిలిపోయింది. హిందూ ధర్మంలో పుట్టడమే తప్ప నిష్క్రమణ అనే మాట లేదని విజ్ఞులు అంటారు. బౌద్ధం హిందూ సంస్కృతిలో ఓ భాగమని స్వయంగా భీమ్‌రావు ప్రకటించినప్పుడు మరి సనాతన హిందూ ధర్మం నుంచి ‘విముక్తి’పొందినట్టు ఎట్లా అవుతుంది? కొంతమంది దళితులను ‘ఇస్లాం’లోకి చేర్పించినా ‘విముక్తి’ లభించినట్టు ఎట్లా అవుతుంది? మతమన్నది ఓ మానసిక స్థితి. కమ్యూనిస్టు దేశాల్లో మతాన్ని నిషేధిస్తే ప్రజలు బతకలేదా? ఆ విషయం అంబేద్కర్‌కు తెలుసు. తాను చదివిన అమెరికా, బ్రిటన్ దేశాల్లో మతాన్ని అంతగా పట్టించుకోని మేధావులు ఎందరో కనిపిస్తారు, నాస్తికులు అనేకులు అగుపిస్తారు. బహుశ అంబేద్కర్‌కు వారి పరిచయం కలిగే ఉంటుంది! అలాంటి మిత్రుల ఆలోచనల వెనుక వేల సంవత్సరాల శాస్ర్తియ జ్ఞానం గూడుకట్టుకుని ఉన్న విషయం సైతం గుర్తించే ఉంటారు. అలాంటి విద్యాధికుడు, న్యాయశాస్త్ర, పరిపాలనా శాస్తక్రోవిదుడు అమాయకులకు సరైన మార్గం సూచించక భావోద్వేగాల ఆధారంగా మత మార్పిడికి సిద్ధమవడం ఆయన పరిణతకు అద్దం పట్టలేదు.
విచిత్రమేమిటంటే బౌద్ధ్ధర్మం స్వీకరిస్తే ‘సమానత’ సాధ్యమవుతుందని ఆశపడటం. అది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానతా? లేక మరొకటా? అన్న అంశంపై స్పష్టత లేదు. సమానత అనేది ఎప్పుడూ ‘సాపేక్షిక’ పదమే తప్ప నిర్దిష్ట పదం కాదు. ఆ విషయం అంబేద్కర్‌కు తెలియదనుకోవాలా?...
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం సమాజం, ప్రపంచం సమూల మార్పుల ఒత్తిడికి గురైన మాట విస్మరించి వేల సంవత్సరాల ‘వర్ణసమాజం’ అంతే చిక్కగా కొనసాగుతోందని భావించడం ‘హ్రస్వదృష్టి’ తప్ప మరొకటి కాదు. భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతూ అంబేద్కర్ ఇలాంటి సామాజిక ఆవేశాన్ని ప్రదర్శించడం వల్ల బడుగు, బలహీన, దళిత, మైనార్టీలకు సరైన మార్గదర్శనం చేయలేదనిపిస్తోంది. మతమార్పిడి ఎప్పు డూ ఉజ్వల భవిష్యత్‌ను అందించదు. జ్ఞాన మార్పిడి వల్ల అది సాధ్యమవుతుంది. అందుకు ఉదాహరణ అంబేద్కర్, ఫూలేలు.
1956లో అంబేద్కర్‌తోపాటు బౌద్ధమతాన్ని స్వీకరించిన లక్షలాది దళితుల బతుకులు ఉజ్వలంగా వెలిగిపోయాయా? సమానత సాధించారా? లేదే! అరవై సంవత్సరాల అనుభవం తరువాతనైనా సరైన జ్ఞానదిశను ఎంచుకోవడంతోనే బడుగు-బలహీన వర్గాలకు ఉజ్వల భవిష్యత్ ఆవిష్కారమవుతుంది. అంతే తప్ప బౌద్ధంపై ఆధారపడితే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది! కొసమెరుపు ఏమిటంటే.. బౌద్ధమతాన్ని అంబేద్కర్ స్వీకరించినా హిందూ పేరును త్యజించలేదు.
(నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి)

-వుప్పల నరసింహం 99857 81799