సబ్ ఫీచర్

ఠీవి, నిజాయితీల మేలుకలయిక పూసపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనా దక్షతతో బాధ్యతలను నిర్వర్తించి, రాజనీతి కుశలతను ప్రదర్శించి, ఒరిస్సా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించి రాజపాళయ తెలుగు రాజవంశస్థుల గరిమను ప్రపంచానికి చాటిన రాజకీయవేత్త కుమారస్వామి రాజు.
పూసపాటి కుమారస్వామిరాజు 1949 ఏప్రిల్ 6న ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. 1952 ఏప్రిల్ 10వరకు ఈ పదవిని అలంకరించారు. 1954నుండి 1956వరకు ఒరిస్సా గవర్నరుగా నియమితులయ్యారు. శ్రీమతి ముత్తమ్మాళ్, శ్రీ సంజీవిరాజా దంపతులకు 1898 జూలై 8న రాజపాళయంలో కుమారస్వామి రాజా జన్మించారు. వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా పూసపాడు గ్రామానికి చెందినవారు. బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు కుమారస్వామి రాజా. ఆయన పితామహి లక్ష్మమ్మగారు ఆయన సంరక్షణ బాధ్యతను వహించారు.
1913నుండి 1919వరకు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నత విద్యనభ్యసించిన కుమారస్వామిరాజా అనిబిసెంట్, సత్యమూర్తి మొదలైన స్వతంత్ర యోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నారు. వారి రచనలకు ప్రభావితుడై హోమ్‌రూల్ ఉద్యమంలోనూ, తరువాత భారత స్వాతంత్య్రోద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1918లో విద్యార్థిదశలో కాంగ్రెస్ సభ్యునిగా చేరి 1921లో ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా సేవలందించారు. పాఠశాల విద్యానంతరం రాజపాళయం సమితి ప్రెసిడెంటుగా, పంచాయితీ బోర్డు ప్రెసిడెంటుగా, రామనాధపురం జిల్లా ప్రెసిడెంటుగా, జిల్లా విద్యాకేంద్ర ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టారు. తన మొదటి భార్య మరణించగా 1920లో ఆమె సహోదరి రుక్మిణీమణిని పునర్వివాహం చేసుకున్నారు. 1919లో గాంధీజీని మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు. ఆయన జీవితంలోని సంఘటనలనుండి స్ఫూర్తి పొందారు. 1924లో పూసపాటి చిన్నయ్యరాజు కుమారుడైన రామస్వామిరాజుతో కలిసి భూపతిరాజా సహకార బ్యాంకును ప్రారంభించారు. అనేక బ్యాంకులకు డైరెక్టరు, అధ్యక్ష పదవులను చేపట్టి సహకార ఉద్యమానికి పాటుపడ్డారు. 1925లో నగర కాంగ్రెస్ కార్యదర్శిగా తాలూకా కాంగ్రెస్ కార్యదర్శిగాను బాధ్యతలను నిర్వర్తించారు. 1932లో శాసన ధిక్కారంచేసి జైలుపాలయ్యారు. 1934లో రౌలట్ చట్టాన్ని నిరసించి ప్రజలను సత్యాగ్రహానికి జాగృతం చేసేందుకు రాజపాళయం విచ్చేసిన మహాత్మాగాంధీని దర్శించి, ఆయన ఆకర్షణ శక్తికి మంత్రముగ్ధులయ్యారు. 1927లోనూ, 1934లోనూ గాంధీజీ తన గృహాన్ని పావనం చేసినందుకు కుమారస్వామిరాజా ఎంతో గర్వించేవారు. 1934లో కామరాజర్, ఆర్.కృష్ణస్వామినాయుడు మొదలైనవారు ఇచ్చిన ప్రోత్సాహంతో కుమారస్వామిరాజా మదురై, తిరునల్వేలి, రామనాధపురం జిల్లాలలో కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఘన విజయం పొందారు. 1936 అక్టోబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన సతీమణి కమలానెహ్రూ కుమారస్వామిరాజా ఆహ్వానంపై రాజపాళయం వచ్చి ప్రజలనుద్దేశించి ప్రసంగించి, వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. పుస్తక పఠనం అంటే ఆయనకు అమితాసక్తి, అభిరుచి. పంజాబ్ కేసరిగా ప్రఖ్యాతి గడించిన లాలా లజపతిరాయ్ వ్రాసిన ‘యంగ్ ఇండియా’ అనే పుస్తకంలో 1915 పూర్వార్థంలో దేశీయ ఉద్యమ పరిస్థితులను గురించి, అంతకుపూర్వం గడిచిన చరిత్రను గురించి సవిస్తరంగా వివరించబడింది. ఈ పుస్తకం ఇంగ్లాండులో ప్రచురించబడింది. బ్రిటీష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని బహిష్కరించడమేకాక భారతదేశంలోనికి రాకుండా నిషేధించింది. భారతీయులు జరిపిన కఠిన పోరాటాల అనంతరం 1936లో ఈ నిషేధాన్ని తొలగించింది బ్రిటీష్ ప్రభుత్వం. ప్రముఖ పాత్రికేయుడు కల్కి ఆర్.కృష్ణమూర్తితో తమిళంలో ‘యువభారతం’ పేరిట అనువదింపజేసి తానే స్వయంగా ప్రచురించి వెలుగులోకి తీసుకునివచ్చారు.
ఈయన 1937లో సి.రాజగోపాలాచారి మంత్రిత్వశాఖలో ఎమ్.ఎల్.ఏగా నియమించబడ్డారు. 1937లో శ్రీవిల్లిపుత్తూర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కొంతకాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కుమారస్వామి రాజా టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో వ్యవసాయ మరియు సహకార మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. కుమారస్వామిరాజా ఏప్రిల్ 1949లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధానిగా ఆ తరువాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి, 1952 వరకూ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యనిర్వహణ వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్) నుండి న్యాయవ్యవస్థను విడదీయాలని దృఢంగా ప్రతిపాదించి, దాన్ని సాధించారు కుమారస్వామిరాజా. మద్యపాన నిషేధం, ఖాదీ ప్రచారం, ఆలయ ప్రవేశ చట్టం ఆయన విజయాలు. ఆ తర్వాత ఫిబ్రవరి 1954లో ఒరిస్సా రాష్ట్రానికి గవర్నరుగా నియమితులయ్యారు. తన ధనాన్ని పేద ప్రజల అభివృద్ధికోసం, కాంగ్రెస్ పార్టీ వృద్ధికోసం ధారాళంగా వెచ్చించేవారు.
1952లో జరిగిన ఎన్నికల తరువాత రాజపాళయానికి తిరిగివచ్చి విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో రాజపాళయంలో కళలను ప్రోత్సహించడానికి ఒక కేంద్రం ఏర్పాటుచేయాలని సంకల్పించారు. ఎందరో మహానుభావులు పావనంచేసిన తన స్వగృహమే తగినదని భావించారు. మహాత్మాగాంధీ పేర ఈ కళానిలయాన్ని (గాంధీ కలైమన్రం) ప్రారంభించారు. తనకు అత్యంత ఆత్మీయులు, అనుయాయులు అయిన ఆర్. కృష్ణస్వామి నాయుడు, ఎ.ఎ.సి. రామస్వామి రాజాలతో కలిసి 1953 డిసెంబరు 20న అళగప్ప చెట్టియార్ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక సంస్థ శంకుస్థాపన చేశారు. రాజేంద్రప్రసాద్ మొదలైన దేశీయ నాయకుల సమక్షంలో ఈ గాంధీ కళాసమితిని ప్రారంభించి భారతజాతికి అంకితం చేశారు. కళాసమితి నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్న సమయంలో బెంగుళూరులో ప్రభుత్వ భవనంలో ఉన్న ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమారస్వామి రాజాను ఒరిస్సా గవర్నరుగా నియమించాలని నిర్ణయించారు. 1954 మార్చి 19న పదవీ స్వీకారంచేసి రాజపాళయానికి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. కొంత కాలానికి అనారోగ్య కారణంగా గవర్నరు పదవికి రాజీనామా చేసి తన సమయాన్ని పూర్తిగా కళాసేవకు, సాహితీ సేవకు కేటాయించారు. 1957 ఫిబ్రవరిలో ఆంధ్రదేశంలోని తన ఆత్మీయులందరిని కలుసుకున్నారు. హైద్రాబాద్ వెళ్ళి నాటి ముఖ్యమంత్రి, గవర్నర్, న్యాయమూర్తుల ఆతిథ్యాన్ని స్వీకరించి మద్రాసు చేరుకున్న కుమారస్వామిరాజా అస్వస్థతకు గురయ్యారు. 1957 మార్చి 15న మద్రాస్ జనరల్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు. వీరి గౌరవార్థం భారత తపాలాశాఖ 1999 జూలై 8న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. కళాసమితి కార్యక్రమాలను వారి బంధువులు కొనసాగిస్తున్నారు. ఇక్కడి లైబ్రరీలో 40వేలకు పైగా ఇంగ్లీషు, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, సంస్కృత భాషా పుస్తకాలు భద్రపరచబడ్డాయి.
రాజ గాంభీర్యం, ఠీవి, నిజాయితీ, నిష్కపటం, సమగ్రత, ధార్మిక చింతన, దృఢ మనస్తత్వం, నిర్మల హృదయం, విధి నిర్వహణ, సమయపాలన, ధారణశక్తి, హాస్యప్రియత్వం, దాతృత్వం, నిరాడంబరం మొదలైన సద్గుణాలు మూర్త్భీవించిన మహనీయుడు కుమారస్వామి రాజా. నిస్వార్థంగా ప్రజాహిత కార్యక్రమాలకై, క్రియాశీలక కార్యక్రమాలకై తన జీవితాన్ని అంకితంచేశారు. రాజపాళయం పారిశ్రామిక కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం.
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)
*

- డా. పి. సుమబాల