సబ్ ఫీచర్

వాఙ్మయ బ్రహ్మ ‘దివాకర్ల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటావధానిగారు తూర్పుగోదావరి జిల్లా యండగండిలో 1913 జూలై 29న గురుపూర్ణిమ నాడు దివాకర్ల వంశంలో జన్మించి అవధాన పండిత కుటుంబమైన దానికి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టారు. ఆయనది తాతగారి పేరు. తిరుపతి వేంకటకవులలో ఒకరైన తిరుపతి శాస్ర్తీగారు వీరి పినతండ్రి. ఉండి హైస్కూలులో పాఠశాల ఉన్నత విద్య, బందరు హిందూ కళాశాలలో ఇంటరు, విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎ.,ఆనర్స్, ఎం.ఎ.,ఆనర్సు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. బందరులో కళాశాల విద్యలో విశ్వనాథవారు గురువులు కాగా, పింగళి లక్ష్మీకాంతంగారు విశ్వవిద్యాలయంలో గురువులు. అక్కడ పాటిబండ మాధవశర్మగారు, యర్రోజు మాధవాచార్యులవారు దివాకర్లవారి సహాధ్యాయులు. దివాకర్లవారు తొలుత విశాఖపట్టణం మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాలలో అధ్యాపకులుగా పద్ధెనిమిది సంవత్సరాలు పనిచేసి 1951లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చారు.
అవధానిగారు విశాఖపట్టణంలో ‘ఆంధ్ర నాటక పితామహా’ ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారిపై పరిశోధన గ్రంథం రాసి ఎం.ఎ., ఆనర్సు,. ‘ప్రాఙ్మన్నయ యుగము నన్నయభట్టు’ అన్న అంశంపై పరిశోధన చేసి 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు. అవధానిగారు అధ్యాపకులుగా గొప్ప కీర్తి గడించారు. ఏ కళాశాలలో తెలుగు అధ్యాపకులైనా దివాకర్లవారి శిష్యులే. అదొక తామర తంపర. అవధానిగారి అసాధారణ ధారణాశక్తి ఇంట ఉన్న అవధాన సాహిత్య ప్రక్రియను తానూ నిర్వహించి సార్థక నామధేయులై వంశానికి కీర్తి తెచ్చారు. అవధానిగారి ఉపన్యాస వైభవానికి యువభారతివారి వేదిక నిదర్శనం. అవధానిగారి సాహిత్య ప్రచార సాధనం సాహిత్య రూపకాలు. అందులో భువనవిజయం అఖండ కీర్తినార్జించింది.
అవధానిగారు ఈ సాహిత్య రూపకాలు రాష్టమ్రంతటా, రాష్ట్రేతర ప్రాంతాలలో ప్రదర్శించి ఆంధ్ర దేశానికి వెలలేని కీర్తిని వెలయించారు. భువన విజయంలో మహాకవి గుంటూరు శేషేంద్రశర్మగారు రాయల పాత్ర ధరించి తన రూప లావణ్యంతో హావభావాలతో ఆ పాత్రకు ఎంతో వైభవం చేకూర్చారు. తరువాత నేను ధరించిన కృష్ణ పాత్రను చూసిన అవధానిగారు జి.వి.సుబ్రహ్మణ్యంగారిని నా దగ్గరకు పంపించి నన్ను కృష్ణదేవరాయలుగా వేయమన్నారు. రవీంద్రభారతిలో 1974లో రైల్వే ఆంధ్ర లలిత కళాశాలలో వారి భువన విజయాన్ని మొదటిసారి భద్రుకా కాలేజీలో ప్రదర్శించినప్పుడు మన ప్రధాని పి.వి.నరసింహారావుగారు రాయల వేషం వేయగా నేను చూశాను.
దివాకర్లవారు కనకాభిషేకంలో శ్రీనాధుడు, కవిబ్రహ్మలో తిక్కన, ఆంధ్ర భారతావతరణంలో నన్నయభట్టు, ఇందిర మందిరంలో చేమకూర వేంకటకవి పాత్రలు ధరించేవారు. రసజ్ఞుల కోరిక మేరకు దివాకర్లవారు అప్పుడప్పుడూ అవధానాలు కూడా చేసేవారు. 1939లో విక్రమదేవవర్మగారు ‘కవిభూషణ’ బిరుదునిచ్చి సత్కరించారు. దివాకర్లవారు సంస్కృతాంధ్ర ఇంగ్లీషు భాషలు బాగా ఎరిగినవారు. ఆయన రాజ సందర్శనము, మధువనము, పరివర్తనము, త్రిశతి, కవి పరాజయము పద్యకావ్యాలు కౌముదీ మహోత్సవము, నాగానందము నాటకాలు, కిరాతార్జునీయం, కాదంబరి, ప్రకృతి విజయము వచన రచనలు చేశారు. ఆంధ్ర వాఙ్మయ చరిత్ర, సాహిత్య సోపానాల ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథాలు రాశారు. ఇంతటి మహనీయుడు తూర్పున పుట్టి 1986 అక్టోబర్ 21న పడమర బొంబాయి నగరంలో అస్తమించి సాహితీ లోకాన్ని దుఃఖాంబుదిలో ముంచి పోయారు. అవధానిగారి లాంటి సాహితీ ప్రతిభామూర్తి అరుదు. ఆయనకు ఆయనే సాటి.

- అయ్యదేవర పురుషోత్తమరావు