సబ్ ఫీచర్

గాంధార దేశంలో బుద్ధ విగ్రహాలు ధ్వంసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన బలియాన్ లోయ.. గాంధార దేశం (అఫ్ఘనిస్తాన్)లో ఎన్నో అపురూప అంశాలకు అది నిలయం.. ‘సిల్క్ రూట్’లోని ఆ లోయ ఎన్నో సంస్కృతులను, సంప్రదాయాల్ని, ఉత్థాన పతనాలను చవిచూసింది. దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం ఈ బలియాన్ వ్యాలీలో కొండలను తొలిచి గాంధార శిల్పశైలిలో భారీ బుద్ధ విగ్రహాలను రూపొందించారు. ఒక్కొక్కటి 500 అడుగుల ఎత్తు గలవి. ఆ కొండలను తొలచి ఎలా చెక్కారబ్బా? అని అవి విస్తుగొల్పుతాయి. ఆ బుద్ధ విగ్రహాలను, గాంధార శైలి శిల్పాలను 2001 సంవత్సరంలో అక్కడి తాలిబన్లు డైనమైట్లు, మందు పాతరలు పెట్టి పేల్చేశారు. బీభత్సం సృష్టించి ప్రపంచమంతా నివ్వెరపోయేలా చేశారు. వారసత్వ సంపదగా భావించే ఆ అపురూప విగ్రహాల ఆనవాలు లేకుండా చేశారు. ఆ ప్రాంతాన్ని అంద వికారంగా మార్చారు. బౌద్ధ్ధర్మ ఆరాధకులెవరూ ఆ విధ్వంసకాండను ఆపలేకపోయారు.
ఒకప్పటి బౌద్ధ ధర్మ ప్రేమికులు కుషానులు, సంచార తెగలవాళ్ళు, గిరిజన తెగలవాళ్ళు, యవనుల తదితర స్థానిక సమూహాల వారసులు. వారి రక్తం పంచుకుని పుట్టిన తాలిబన్లు 2001 సంవత్సరంలో ఆ బుద్ధవిగ్రహాలను ద్వేషించి నేలకూల్చారు. ఎవరి విన్నపాలను పట్టించుకోలేదు. నగరాలకు, గ్రామాలకు దూరంగా, సుదూరంగా పర్యాటక ప్రాంతంగా ఆదాయ వనరుగా వెలసిన బమియాన్ వ్యాలీలో తాలిబన్లు ఆ విగ్రహాలపై విరుచుకుపడ్డారు. బౌద్ధం ఆ రకంగా అక్కడ నేలమట్టమైంది.
1970 దశకంలో చైనా కమ్యూనిస్టులు టిబెట్‌లో బుద్ధ విగ్రహాలను, చిహ్నాలను, ఆరామాలను, ఛత్రాలను, ఆరాధనా స్థలాలను, బౌద్ధమత అధ్యయన కేంద్రాలను, గ్రంథాలయాలను ధ్వంసం చేసినట్టుగానే గాంధార దేశం (అప్ఘనిస్తాన్)లో తాలిబన్లు మరింతగా రెచ్చిపోయి బౌద్ధ చిహ్నాలను- ఆ సంస్కృతి- సంప్రదాయానికి సంబంధించిన అనేక పురాతన కట్టడాలను శిథిలాలుగా మార్చేశారు. విచిత్రమేమిటంటే చైనా నుంచి ప్రారంభమైన ‘సిల్క్ రూట్’ పొడవునా బౌద్ధ్ధర్మం విస్తృతికి ఆనాటి పాలకులు-వ్యాపారులు తదితరులు విశేషంగా కృషిచేశారు. ఆ ధర్మం- మధ్య ఆసియా, యూరప్, రోమ్ లాంటి సుదూర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు అరబ్బు దేశాలుగా పిలుస్తున్న పర్షియా దేశాలన్నింటా బౌద్ధమత ఆచరణకు ఆసక్తిని కనబరిచారు. వర్తకులు, వ్యాపారులు ఈ కొత్త ధర్మాన్ని గాంధార దేశం నుంచి, చైనా నుంచి మోసుకెళ్ళారు. మరి సర్వకాలాల్లో, సర్వావస్థల్లోనూ అద్భుతమైన, అమోఘమైన ధర్మం బౌద్ధం అని బాకాలు ఊదితే ఇప్పుడు ఆ పరిస్థితి టిబెట్, అఫ్ఘాన్‌లో ఏమైంది? కాలమాన పరిస్థితులను విస్మరించి గుడ్డిగా అదే పనిగా బౌద్ధాన్ని ఆకాశానికెత్తితే అది కాస్త తలలపై జారిపడిన దృశ్యం మధ్య ఆసియా, తదితర దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఒకప్పుడు బుద్ధవిగ్రహాలను గాంధార శిల్పం రీతిలో చెక్కించిన వారి వారసులే ఇప్పుడు వాటిని నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయేలా చేశారు. అరబ్బు దేశాలన్నిటా బౌద్ధం గాక మరో మతం పరిఢవిల్లింది. దీన్ని నిశితంగా పరిశీలిస్తే ఆయా కాలాల్లో ఆయా ధర్మాలు వికసిస్తాయి. విచ్ఛిన్నమవుతాయని అర్థమవుతుంది. గ్రీకు-రోమ్ లాంటి సుదూర ప్రాంతాలకు సైతం బౌద్ధప్రచారం జరిగినా అక్కడ నిలువలేదు. అశోక చక్రవర్తి ప్రపంచమంతటికీ బౌద్ధాన్ని తన శక్తికిమించి, తన వనరుల పరిధిని దాటి అత్యుత్సాహంతో బౌద్ధ మత ప్రచారకులను (ఎక్కువమంది బ్రాహ్మణులే!) పంపినా అక్కడ అది శాశ్వతంగా నిలువలేదు. ఆరోజుల్లో బౌద్ధమతం సునామీలా అన్ని దేశాలను చుట్టేసినా అనంతరం పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవం, ఇస్లాం ఆవిర్భవించడంతో బౌద్ధం ఆయా దేశాల్లో కలికానికైనా కానరాకుండా పోయింది. ‘సిల్క్ రూట్’ద్వారా ప్రపంచవ్యాప్త వ్యాపారం విరివిగా కొనసాగిన నాటి పరిస్థితికి యవనుల దండయాత్రలు పెరిగిన సమయానికి స్పష్టమైన తేడా కనిపించింది.
అలెగ్జాండర్ దండయాత్ర చేసే సమయానికి బౌద్ధం ‘హిందుకుష్’ ప్రాంతంలో బలీయంగా ఉన్నప్పటికీ అంతటా యుద్ధాలే..దుఃఖమే, బాధనే, ఆందోళన, అస్థిరత, ఆకలి తాండవించింది. అంటే ‘బౌద్ధం’ ఆచరణ సాధ్యం కాని ఆలోచన అని అప్పటికే రుజువయినట్టు కదా? దుఃఖం పెరిగిందే తప్ప తరగలేదని. మానవ ఆకాంక్షలు, అభిరుచులు, ఆలోచనలు పట్టుకోకుండా ‘్ధ్యనం’లో మెరిసిన మెరుపులకు ప్రాధాన్యతనిస్తే దానివల్ల ప్రపంచం దినదిన ప్రవర్ధమానమవుతుందని ఊదరగొడితే, ఆ స్థాయిలో ప్రచారం చేస్తే అది వాస్తవ రూపం దాలుస్తుందా? లేదని ఆనాటి యుద్ధాలు, వ్యాపార దోపిడీలు, దొమీలు, వాటిని అంటిపెట్టుకుని ఉండే అవలక్షణాలు అన్నీ యథాతథంగా కొనసాగాయి... కొనసాగుతూ ఉన్నాయి. మనిషి తన డిఎన్‌ఏ ప్రేరకం ఆధారంగా అడుగులేస్తూ ఉన్నాడు. అందులో భాగమే గాంధార దేశంలో తాలిబన్ల చర్య. వాస్తవానికి వారు వేరే గ్రహం నుంచో, వేరే ఖండం నుంచో ఊడిపడినవారు కాదు. తరతరాలుగా, శతాబ్దాలుగా మధ్య ఆసియా మొదలుకుని గాంధారం వరకు జీవనోపాధి కోసం సంచారం చేసిన తెగల సంతానమే. ఆ డిఎన్‌ఏ గల వారే బౌద్ధాన్ని ఆరాధించారు. కొండలను తొలచి గాంధార శిల్పశైలిలో బుద్ధవిగ్రహాలను రూపొందించారు. వందల ఏళ్ళ క్రితం ఆ ‘సాంకేతిక నైపుణ్యం’ వారికెలా అబ్బిందో తెలియదు. రాతిని.. బండరాతిని కోయడం అపురూపం.. అద్భుతం. కళాత్మక, సృజనాత్మక, ఆ సౌందర్యోపాసకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పిడికిట పట్టి ఆ కొండలను తొలిచి 500 అడుగుల ఎత్తు విగ్రహాలను మలిచిన వైనం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
బహుశ ఆ సాంకేతిక పరిజ్ఞానానే్న అజంతా-ఎల్లోరా గుహల్లోనూ ఉపయోగించారనిపిస్తోంది. కేవలం ఉలి, సుత్తితో రూపొందించిన విగ్రహాలు కావవి. ఎల్లోరాలోని కైలాష్ మందిరమైతే గొప్ప సాంకేతిక నైపుణ్యం ఆధారంగానే కొండను తొలచి ఏక శిలలో చెక్కారు. ఆ సాంకేతికత బౌద్ధ్భావనల విస్తృతికి అటు గాంధార దేశంలోనేగాక ఇటు దక్షిణాపథాన ఎల్లోరాలో సైతం పెద్దఎత్తున ఉపయోగపడింది. పెద్ద కొండ లోపల అంతస్తుల భవనాలను తీర్చిదిద్దడం, అలాగే భూగృహాలు (అండర్‌గ్రౌండ్ సిటీ) నిర్మించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇదంతా బౌద్ధ్ధర్మం నుంచి ఉద్భవించింది కాదు. ‘విశ్వకర్మ’ రోజుల నుంచి అనుచానంగా కొంత, అనుకరణతో కొంత, కొత్తతరాల కొత్త ఆవిష్కరణల సృజనతో కొంత కొలువుదీరింది.
ఇచ్ఛ, తృష్ణ, కోర్కె, ఆశ.. ఇవి లేనట్లయితే ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వందల సంవత్సరాల క్రితం ఎలా పరిఢవిల్లేది? ఎలా అది వివిధ ప్రాంతాలకు విస్తరించేది? వెయ్యేళ్ళ క్రితం కాకతీయ సామ్రాజ్యంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, ఇసుక పునాదిగా నైపుణ్యంతో ఎలా మందిరాలను నిర్మించేవారు? ఎల్లోరాలోని కైలాష్ మందిరం, వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి... ఈ వారసత్వ సంపద, గర్వించి తల ఎగరేసి చెప్పుకునే పూర్వీకుల మేధో సంపద, నైపుణ్యం, కళాతృష్ణ.. ఉత్సుకత, ఉబలాటం, ఆరాటం... ఇవన్నీ మానవ సహజాతాలు. ఇవన్నీ పక్కకు పెట్టడం వల్ల ‘్ధ్యనం’తో గొప్ప ‘జ్ఞాన విప్లవం’ వస్తుందని ఆశించడం అంతగా నప్పని భావన. సమంజసమనిపించని, మనిషిని అర్థం చేసుకోలేని వ్యాఖ్యానం.
బుద్ధునికి పూర్వం వేల సంవత్సరాల నాగరికత ఉంది. భూగోళానికి అటువైపు మరింత విశిష్టమైన, వినూత్నమైన నాగరికత ఉంది. అబ్బురపరిచే సాంకేతిక నైపుణ్యంతో పిరమిడ్లు కట్టిన వారున్నారు. మాయా నాగరికత ఉంది. వాటి పరిచయం ఆయా దేశాల వ్యాపారుల-యాత్రీకుల ద్వారా అందరికీ అప్పటికే తెలుస్తోంది. అంతేగాక నలంద లాంటి భారత దేశ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చిన విదేశీయుల ద్వారా అవగతమైంది.
పురివిప్పిన నెమలిలా జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచం నలుమూలలా విప్పారిన ఛాయలు, జాడలు కనిపిస్తున్న తరుణంలో బుద్ధగయలో బోధి వృక్షం కింద ‘్ధ్యనం’ చేసి మనిషి దుఃఖానికి, బాధకు, క్లేశానికి కారణం కోర్కెలు, అత్యాశ...తృష్ణ... అని తీర్మానించి ప్రతిపాదిస్తే అదెలా మానవాళిని ముందుకు నడిపే భావజాలమవుతుంది? గ్రీకు-రోమ్ ప్రాంతాల్లో అప్పటికే చోటుచేసుకుంటున్న స్వేచ్ఛ-స్వాతంత్య్రాల ఆకాంక్షకు, హేతువుకు, తార్కికతకు పెద్దపీట వేసి మానవ జీవనాన్ని మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న కృషికి, బుద్ధుడి అష్టాంగ మార్గ సిద్ధాంతానికి, ప్రతిపాదనకు ఏమైనా పొంతన కుదురుతున్నదా? ఆ భావనకు- ఈ ప్రతిపాదనకు హస్తిమశకాంతరం కనిపిస్తోంది. మరి అలాంటి భావజాలాన్ని ఎలా తలపై పెట్టుకుందాం?... ఇంకెంతకాలం తలకెత్తుకుందాం?

-వుప్పల నరసింహం 99857 81799