సబ్ ఫీచర్

బతుకు తెలిసిన మొండిఘటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగుపెట్టగానే ఆర్టిస్ట్ అవుతున్న వాళ్లను ఇప్పుడు చూస్తున్నాం. ఆర్టిస్ట్ అవ్వడానికి జీవితానే్న ఫణం పెట్టినోళ్లు ఒకప్పుడుండేవారు. అలాంటివాళ్లలో ‘కాకరాల’లాంటి వాళ్లనే ఇప్పుడు చూడగలుగుతాం. కాకరాల. ఇంటిపేరులో ఎంతందమో, ఆయన వంటిపేరులో అంత మొండిదనం. అందుకే -కాకరాల ఓ స్పెషల్.
ఆయనే ఈరోజు వెనె్నలకు అతిథి.

ఏటికెదురీదేవాడే శివం.. లేదంటే శవం -రష్యా విప్లవయోధుడి మాటిది.
కాకరాల శివమే. కారణం -ఏటికెదురీదినందుకు కాదు, అంతకుమించి ఎదిగినందుకు.
పౌరోహిత్య కుటుంబంలో పుట్టాడు. వామపక్ష భావాలతో ఎదిగాడు. పూర్తిపేరు కాకరాల వీర వెంకట సత్యనారాయణ. జీవితంలో ఎత్తుకు ఎదుగుతాడనే -అమ్మానాన్నలు అంత పెద్ద పేరు పెట్టారు. వీరభద్రం, కనకమహాలక్ష్మి- ఆయన అమ్మానాన్నలు. డిసెంబర్ 18, 1937న తణుకు పక్కనున్న ఖండవెల్లిలో కన్నారు. ‘అమ్మనుగన్న అమ్మ ఊరేగానీ, ఆ వూరితో అంతటి అనుబంధమైతే నాకు లేదు’ అంటాడు కాకరాల. రాజమండ్రిలోనే చదువు సంధ్యలుసాగాయి. తూ.గో -ఆద్యపురం హైస్కూల్లో ఐదో తరగతి, ప.గో -కాకరపర్రులో 8వ తరగతి వరకూ చదివారు. రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్లో టెన్త్ పూర్తి చేశారు. తెలిస్తున్న వయసులో తోలుబొమ్మలాట ఆకర్షించింది. తెలుసుకునే సరికి అదే జీవితమైంది. చిన్నప్పుడు -‘తొలుబొమ్మలాట ఆసక్తిగా చూసేవాణ్ని. ఇంటికొచ్చి అలాంటి బొమ్మలే తయారు చేసి గోడమీద ఆడించేవాణ్ని. నవరాత్రి ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు, సప్తాహాలు, సమారాధనల్లో వినోద కార్యక్రమాలు నన్ను ఆకర్షించేవి. దానికితోడు పగటి వేషగాళ్ళు, మాలదాసర్లు, కాటిపాపలు, గారడీలు.. తదితర రూపాలూ నాలో తెలీని ఓ కదలికి తీసుకొచ్చాయేమో’ అంటారు కాకరాల. ఆయనలో నిబిడీకృతమైన ఆలోచన స్రవంతి నటనవైపే మళ్లించింది. అందుకే -రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాస్టర్ సత్యమూర్తి కథానాయకుడిగా ‘జయంత జయపాల’ అనే జానపద పద్య నాటకాన్ని పదేళ్ల ప్రాయంలోనే ప్రదర్శించారు.
‘తండ్రి పర్యవేక్షణలో తెలుగు, లెక్కలు నేర్చుకున్నా. బతుకు లెక్కలకు మాత్రం స్నేహితులే అంకెలయ్యారు’ అంటారు కాకరాల. కానీ -తండ్రికివున్న నాటక అభినివేశం మాత్రం ఆయనలోకీ ప్రవహించింది. పాండవోద్యోగం నాటకాన్ని తండ్రి ఆధ్వర్యంలో అనేక సమాజాలు ప్రదర్శించేవి. అలా నాన్న అడుగుల్లో అడుగులేశారు. కానీ -‘సమాజంలో కనిపించే పలు రూపకాల నుంచి అందిన ప్రేరణతో -నాన్ననే తొడిమకు నన్ను దూరం చేసింది. స్వయంప్రతిభ చాటుకునే ప్రయత్నంలో అనేక రూపకాలు ఆసరాఅయ్యాయి. అవే నటించాలన్న సంకల్పాన్ని బలపర్చాయి. నాలో ఆ కోరిక పుట్టడమే ఓ చిత్రం. నాన్న ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి నటనే నాకొక మార్గమైంది. చదువు అంతంత మాత్రం. మార్కులు బొటాబొటీ. తండ్రి అదుపాజ్ఞల్ని ఎదిరించలేక రంగస్థలానే్న జీవితం చేసుకోడానికి ఆరోజుల్లోనే నిర్ణయించుకున్నా’ అంటారు నిజాయితీగా. అమ్మమ్మ ఇంటిపక్కనున్న దిబ్బమీద ఫ్రెండ్స్‌తో కలిసి నాటకాలు వేసేవారు. వాటికి దర్శకుడు -కాకరాల. ‘నాలో నటనకు సంబంధించిన ప్రతిభ ఉందని నాన్న గుర్తించలేదు. హైస్కూల్లోనే వేదుల సూరి మాస్టర్ కాళిదాసుగా ఓ నాటకం, ఒథెల్లో నాటకానికి తెలుగీకరణ ‘సౌదామిని’ నాటకాలను ఫోర్త్ స్టాండర్డ్‌లోనే ప్రదర్శించాను. ఆ టైంలో సినిమా పెద్ద క్రేజ్. అక్కడ నటించాలన్న కోరిక పుట్టనే పుట్టింది. ఏదేమైనా సరేనని ఓ స్నేహితుడిని తీసుకుని మద్రాసుకు బయలుదేరారు, జేబులో డబ్బుల్లేవు. ఏలూరు చేరేసరికి స్నేహితుడు జారిపోయి ఇంటిదారి పట్టాడు. నేనూ ఇంటికి పోవాల్సి వచ్చింది. మళ్లీ చదువు... ’ అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కాకరాల. స్కూల్లో క్రాప్ట్ మాస్టర్ చర్ల సత్యనారాయణ తనకు నటన పిచ్చి వదిలించాలని నుదుటిమీద ‘స్టూడియో మాన్’ అని రాయించి స్కూలంతా తిప్పారు. ‘మళ్లీ అదే నా కోరిక పదునెక్కడానికి వేదికైంది. ఎప్పటికైనా ఆయన మాటలు నిజం చేస్తూ స్టూడియోమెన్‌గా మారాలనుకున్నా. నాన్న సుతారంగా వేయించే గోడకుర్చీ, శొంటిపిక్కలాంటి శిక్షలు పెద్దవిగా అనిపించేవి. వాటినుంచీ పారిపోవాలన్న కసి. అందుకే ఎవరేమన్నా నాటకాలు వేస్తూ ఆనందాన్ని పొందేవాణ్ని’ అంటారు కాకరాల. లాభంలేదని తండ్రి తొర్రేడు స్కూల్లో చేర్చారు. అక్కడి టీచర్ భయంకరుడు. టేబుల్‌పై చేతులు పెట్టి కొట్టేవారు. ఇక లాభం లేదని కడుపునొప్పి అంటూ బండ ఎత్తువేసినా అసలు విషయం నుంచి తప్పుకోలేకపోయాను. చదవడమే కష్టమైంది. అది గమనించిన అమ్మమ్మ ప్రేమతో -కోట ఆదినారాయణ వద్ద ప్రైవేట్ పెట్టించింది. ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ అత్తెసరు మార్కులతోనే నెట్టేశారు. ఇక చదవడం తనవల్ల కాదనుకున్నారు. తండ్రితో ఎస్‌ఎస్‌ఎల్‌సి చదవడానికి రాజమండ్రి వచ్చారు. పిల్ల కాలువలో నుండి గోదారిలో పడ్డ చిన్న చేప ఎంత ఆనందిస్తుందో అంత ఆనందించానంటారు అప్పుడు. తన ఊరిలో కనిపించే రంగస్థల ప్రదర్శనలకన్నా రాజమండ్రిలో మరింత అభివృద్ధి చెందిన ప్రదర్శనలు ఉండేవని, తండ్రితో ఎంత కోల్డ్‌వార్‌వున్నా నాటకాలు వేయడం, సినిమాలు చూడటం మానలేదని గుర్తుచేసుకున్నారు. 16వ ఏట సూర్యకాంతంతో పెళ్లి. తండ్రి బయటికి వెళ్లమంటే ఎలా బతకాలో తెలీదు. అందుకనే ఆయనకి ఎదురుచెప్పేవారు కాదు. ఓరే.. ఇక నిన్ను కొట్టనురా. కానీ కొట్టే పరిస్థితి మాత్రం కల్పించకు అని తండ్రి వేడుకున్నాడు పెళ్ళయ్యాక. అలా ఆయన చెప్పినా నాటకలాడుతూనే ఉండేవారు. 1953 నుండి 57 దాకా తండ్రితో విభేదిస్తూనే తనకు నచ్చిన విధంగా నాటకాలు వేసేవారు. గౌతమి లైబ్రరీలో రిహార్సిల్స్. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గాసే గంగా’ చదివాక నాలో చాలా మార్పు వచ్చిందంటారాయన. సమాజంలో అనేక వివక్షలున్నాయని, ముఖ్యంగా స్ర్తి పురుష వివక్ష తనకు బలంగా కన్పించేదని అంటారాయన. బలహీనులెప్పుడూ బలవంతలుగా మారాలని ఆశిస్తే, బలవంతులకెప్పుడూ అటువంటి ఆలోచన ఉండదని అరిస్టాటిల్ చెప్పినట్లుగా ఆ కథల్లో తనకు కొత్తదనం కన్పించేదని అంటారాయన. ముఖ్యంగా ప్రవాహంలో కథ తన జీవితానికి ప్రేరణ ఇచ్చిందంటారు.
‘రాజమండ్రిలో డాక్టర్ గరికపాటి రాజారావు నాటక సమాజంలో నాటకాలు చూస్తూ అప్పుడప్పుడూ ఆడుతుండేవాడిని. ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. నటించాలన్న కోరిక బలంగా మారడంతో చిత్తూరు వి నాగయ్యకు తన కోరికను తెలుపుతూ ఉత్తరం రాశారు. అందుకాయన తొందరపడొద్దని, అవకాశం ఉన్నప్పుడు ఉత్తరం రాస్తానని బదులిచ్చారు. ఇదే విషయం గరికపాటి రాజారావుకు చెబితే, ఆయనకూడా ఇదే సమాధానమిచ్చారు. ఇక లాభంలేదని హౌరా మెయిల్ టిక్కెట్ లేకుండా ఎక్కేశారు మద్రాసుకు. మధ్యలో దించేస్తే నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడ నాగయ్యను కలిశారు. నవ్వులు పువ్వులు పత్రికకి విలేఖరిగా ఉండమన్నారు గరికపాటి రాజారావ్. పార్క్‌లాండ్‌లో భోజనం టిక్కెట్లు, రాజారావు ఇంట్లో మకాం. ఎన్టీఆర్ వుండే షేర్‌ఖాన్ గార్డెన్‌కు దగ్గరలో ఉండేవారు. మోడరన్ థియేటర్ అధినేతను కలిసి అవకాశాలను అడిగారు. వారు సేలం రమ్మన్నారు. అక్కడ స్ట్ఫా ఆర్టిస్టుగా తీసుకున్నారు. నెలకు 100 రూపాయల జీతం. అలా 1960లో రూపొందించిన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలోని అనేక పాత్రల్లో నటించారు. ఏమోయ్ దశావతారాలు.. అన్ని పాత్రల్లో కన్పిస్తావు కదూ అంటూ రాజనాల ఆటపట్టించేవారు. ఆ తరువాత ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ఎస్‌డి లాల్ అవకాశమిచ్చారు. విఠలాచార్య రూపొందించిన ‘అన్నాచెల్లెలు’ చిత్రంలో నటించారు. గరికపాటి రాజారావు రచించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకాన్ని 90సార్లు ప్రదర్శించారు. అలా నాటకాలు, రేడియో నాటకాలు, డబ్బింగ్‌లు.. ఇలా నాలుగు రకాల పనులు చేస్తూ జీవితాన్ని సాగించారు.
ఓ దర్శకుడి దగ్గరకు నాలుగైదు నెలలు తిరగ్గా తిరగ్గా అవకాశమిస్తానని చివరికి కసురుకున్నాడాయన. ఇక లాభం లేదని తానెవ్వరి దగ్గరికీ పోకూడదని నిర్ణయించుకున్నారు కాకరాల. తెలిసినవారి ద్వారానే నాటకానుభవంతోనే అవకాశాలను అందిపుచ్చుకోసాగారు. అలా అసోసియేట్ సివి రమణ ద్వారా బిఎన్ రెడ్డి రూపొందించే ‘రంగులరాట్నం’లో అవకాశం వచ్చింది. 1956లో షూటింగ్ మొదలైన ఆ చిత్రానికి కమెడియన్ విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. విశేషమేమిటంటే మేకప్ టెస్ట్‌కు వెళ్లినపుడు చంద్రమోహన్ కూడా అప్పుడు వచ్చారంటారాయన. ఆ తరువాత బిఎ సుబ్బారావు రూపొందించిన పెద్దక్కయ్య, కెఎస్ ప్రకాశరావు ప్రేమ్‌నగర్, బాపు బంగారు పిచ్చిక, అందాల రాముడు, ముత్యాలముగ్గు, తూర్పువెళ్లే రైలేకాక, బంగారు పంజరం, నిలువుదోపిడీ చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. అడవిరాముడులో కాకరాల కన్నీరుపెట్టించే పాత్రలో కన్పిస్తారు. గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో మాభూమిలో పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే దేవుడుచేసిన పెళ్లి కూడా. రావికొండలరావు రచించిన పట్టాలు తప్పిన బండి నాటకానికిగాను బెస్ట్ కమెడియన్‌గా ఎన్నికయ్యారు. ఒక్క చూపుతోనే పేజీల డైలాగును కను కదలికలతో చూపించేవారే నిజమైన మహానటులని అంటారాయన. అలాంటివారు ఎస్‌విఆర్, గుమ్మడి, జి వరలక్ష్మి, సావిత్రిలని అభిప్రాయం వ్యక్తం చేశారాయన. కేవలం స్వరంతోనే పాత్రను పండించేవారు జగ్గయ్య. ఆయన ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా చిన్న కళాకారుల కోసం అనేక సేవలందించారని గుర్తు చేసుకున్నారు కాకరాల. క్రెమ్లిన్ గంటలు (క్రెమ్లిన్ చైన్స్) నాటకంలో లెనిన్‌గా నటించిన కాకరాలను చూసి మహాకవి శ్రీశ్రీ పొడుగు లెనిన్‌గా అభివర్ణించడం విశేషం. దక్షిణ భారతదేశంలో లెనిన్ పాత్రలో నటించింది తొలిసారిగా తానేనని, అది శ్రీశ్రీ పొగడ్తలకు నోచుకోవడం తన జీవితంలో మర్చిపోలేని విషయమని గుర్తు చేసుకున్నారు కాకరాల.