సబ్ ఫీచర్

తన్ను తాను సమీక్షించుకోవాలి (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్యానం చేస్తున్నప్పుడు మీలోని జీవం మెల్లమెల్లగా నూతన నాణ్యతతో కూడిన సౌందర్యాన్ని, తెలివితేటలను సంతరించుకుంటున్నట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది మీలో ఎదుగుతున్నదే తప్ప, ఇతరులనుంచి ఎరువుతెచ్చుకున్నది కాదు. ఎందుకంటే, దాని మూలాలు మీ ఉనికిలోనే ఉన్నాయి. మీరు పిరికివారు కాకపోతే కచ్చితంగా అది మీలో పుష్పించి, ఫలిస్తుంది.
కేవలం ధైర్యం, సాహసం, తెగింపు ఉన్నవారుమాత్రమే ధార్మికులవుతారు. అంతేకానీ, చర్చిలకు, దేవాలయాలకు, మసీదులకు వెళ్ళే క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు ఏమాత్రం ధార్మికులు కారు, కాలేరు. ఎందుకంటే, వారందరూ తమ అవాస్తవ వ్యక్తిత్వాన్ని మరింత సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తూ, అనే్వషణను వ్యతిరేకించే పిరికివారు.
ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మీరు అత్యద్భుతమైన సున్నితత్వంతో కూడిన చైతన్యంతో నిండిన జీవంతో జన్మించారు. ఏ పసిపాపను చూసినా అది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, అది సమాజమందించిన అవాస్తవ వ్యక్తిత్వం ముసుగులో మూసుకుపోయింది. అయినా మీరు భయపడవలసిన పనిలేదు. మీరు తలచుకుంటే, మీ అవాస్తవ వ్యక్తిత్వాన్ని మీరు పోగొట్టుకోగలరు.
అది మీదగ్గర ఎంత ఎక్కువకాలముంటే అంత ఎక్కువగా అది బలపడుతుంది. రేపు ఏమవుతుందో ఎవరికీ ఏమాత్రం తెలియదు. కాబట్టి, మీ అస్తిత్వ వాస్తవాన్ని మీరు తెలుసుకోకముందే మరణించకండి. దానిని తెలుసుకుని జీవించినవారు, దానితో మరణించిన వారు మాత్రమే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే, వారికి జీవితం శాశ్వతమని, అందులో మరణం ఒక చిన్న కట్టుకథ లాంటిదని తెలుసు.
అంకెల రాజకీయాలు:
సమాజం ఎప్పుడూ మీరు అందరిలాగే ప్రవర్తించాలని ఆశిస్తుంది. అలా కాకుండా, మీరు ఏ కాస్త వ్యత్యాసంగా ప్రవర్తించినా, సమాజానికి మీరు చాలా వింతగా కనిపిస్తారు. ఎందుకంటే, వింత మనుషులకు అందరూ భయపడేవారే. అందుకే బస్సుల్లో, రైళ్లల్లో, పార్కుల్లో- ఇలా ఎక్కడైనా పక్కపక్కనే కూర్చున్న ఇద్దరు అపరిచితులు ఏదీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోలేరు. ‘‘మీరెవరు, ఏంచేస్తారు?’’అంటూ మాటలు కలుపుతారు. అప్పుడేవారికి కాస్త సౌకర్యంగా ఉంటుంది. అలాగే అందరూ తమ మనస్తత్వానికి సరిపోయే గుంపులోనే ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. మీరు తేడాగా ప్రవర్తించిన మరుక్షణం ఏదో తప్పు జరుగుతోందని పసిగట్టిన గుంపు మిమ్మల్ని అనుమానిస్తుంది. ఎందుకంటే, దానికి మీరేమిటో, మిమ్మల్నిమీరు అంగీకరించక మునుపు, అంగీకరించిన తరువాత మీరు ఎలా ఉన్నారో చాలా స్పష్టంగా తెలుసు. అందుకే అది మీలో వచ్చిన మార్పును వెంటనే పసిగట్టగలదు.
ఈ సమాజంలో అందరూ తమని తాము దండించుకునేవారే తప్ప, తమని తాము అంగీకరించుకునేవారు ఎవరూ లేరు. ‘‘మిమ్మల్ని మీరు దండించుకోండి’’ అంటుంది సమాజం. అలా చెయ్యకుండా మిమ్మల్ని మీరు అంగీకరించుకునే పక్షంలో మీరు సమాజంనుంచి బయటపడినట్లే. దానిని సమాజం ఏమాత్రం భరించలేదు. ఎందుకంటే, అంకెల రాజకీయాలపైనే అది జీవిస్తుంది. దానిని ఎంత ఎక్కువ మంది అనుసరిస్తే అది అంత ఎక్కువగా సంబరపడుతుంది. ఎందుకంటే, అంతా సవ్యంగానే ఉందని, తప్పుజరిగే అవకాశం ఏమాత్రం లేదని భావించేవారి మద్దతు ఆ సమాజానికి పుష్కలంగా ఉన్నట్లు లెక్క. కానీ, ఎవరైనా తమనిజము తెలుసుకుని సమాజంనుంచి బయటపడితే, వెంటనే సమాజం ‘‘నేను సరిగా లేనేమో, ఇలా అందరూ వెళ్ళిపోతారేమో’’అనే సందేహాలతో భయపడుతుంది.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.